మగవాళ్ళంటే దూకుడుగా, హింసాత్మకంగా ఇతరులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, కోపం, ఉద్రేకం, పోటీతత్త్వం తప్ప ఇతర భావోద్వేగాల్ని పైకి కనపర్చకుండా ఉండాలనే అత్యంత మూసపోసిన ధోరణిని విషమయ మగతనంగా స్త్రీవాద చర్చల్లో వర్ణిస్తున్నారు. ప్రపంచాన్ని గత కొన్ని దశాబ్దాలలో వివిధ దేశాల్లో మగ వాళ్ళ హక్కుల ఉద్యమాల నుండి పుట్టిన ఈ ధోరణిలో ఆడవాళ్ళ, అణచివేతకు గురయ్యే కుల, జాతి సమూహాల పట్ల, సమలైంగికులు, ట్రాన్స్ వ్యక్తుల పట్ల అత్యంత చులకనా భావం ఉంటుంది.
మగవాళ్లందరూ జన్మతః ఆడవాళ్లు, ఆడ మనుషులు, సీస్ మగవాళ్ళు కానివాళ్ళ కంటే, అన్ని వేళల్లో, అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో పుట్టుకతోటే మేధలో, శారీరకంగా, మానసికంగా అధికులని వీళ్ళు నమ్ముతారు. ఆడవాళ్లు ఇంటికీ, వంటకీ, మగవాళ్ల సేవకే పరిమితమవ్వాలని, అది కూడా మగవాళ్ల పర్యవేక్షణలో జరగాలని మనసా వాచా భావిస్తారు.
ప్రపంచంలో వుండే ఆధిక్యత, అసమానత ప్రకృతి సహజంగా వస్తుందని, సనాతన, పాత ప్రపంచంలో అసమానతలకి వుండిన గౌరవం సరైందని, ఆధునిక ప్రపంచం తలకిందులుగా ఉందని, మనం ఎన్ని ఆధునిక గాడ్జెట్లు పెట్టుకున్నా తిరిగి పాత ప్రపంచానికి వెళ్లటమే సరైందని వీరి భావన. అణగారిన సమూహాల సామాజిక ఉద్యమాలన్నా, అవి ప్రతిపాదించే మార్పులు, ఆ రాజకీయాలు అన్నా, వాటిని నమ్మే మనుషులన్నా చిన్నచూపు ఉంటుంది. ఈ ధోరణి కలిగినవాళ్ళు ఆయా ఉద్యమ రాజకీయాలని తమ వ్యక్తిగత అంతర్లీన బలహీనతల్ని కప్పి పుచ్చుకోవటానికి ఆయా వ్యక్తులు వాడే ముసుగుల్లాగా అర్ధం చేసుకుంటారు. ప్రధానంగా వీళ్లు సామాజిక అసమానతల గురించి మాట్లాడటాన్ని ఒక బలహీనతగా, అసలు ఏ బలహీనతయినా ఒక ఆడ లక్షణం గానూ అర్ధం చేసుకుంటారు. అటువంటి బలహీనతల్ని అంటే ఇతరులతో సహానుభూతిని తమలోంచి సమూలంగా పెకిలించి బయట పడేసిన వాళ్ళు మాత్రమే అసలు సిసలయిన మగవాళ్ళని నమ్ముతారు.
విషమయ మగతనం ఆయా మగవాళ్ళని భావోద్వేగ పరంగా ఎదగనివ్వకుండా, ప్రపంచంతో, జీవిత భాగస్వాములతో, ఇతరులతో అర్ధవంతమైన సంబంధాలని ఏర్పర్చుకోకుండా నియంత్రిస్తుందని స్త్రీవాదులు ఎత్తిచూపారు. ప్రతి సంప్రదాయ సమాజంలో స్త్రీ పురుష సంబంధాల్లో ఎన్ని వైవిధ్యాలున్నప్పటికీ ఆధునిక రాజకీయార్థిక ప్రపంచంలో కనీసం ఇంట్లో ఆడవాళ్ళ పైన ఆధిక్యత కలిగుండటం మగ తనానికి ఒక ప్రధాన లక్షణంగా మారింది. అయితే ఇట్లా ఆధునికత మగతనానికి ఏర్పర్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ వూతం 20వ శతాబ్ద చివరికి వివిధ కారణాలవల్ల తగ్గుతూ వచ్చింది. 21 వ శతాబ్దంలో స్త్రీల సామాజిక స్థాయిలో మార్పుల వల్ల కుటుంబాల్లో వివిధ వర్గాల మగవాళ్ళు తమ సంప్రదాయ ఆధిపత్య స్థానం నిలుపుకోలేకపోతున్నారు. అనేక మంది మగవాళ్ళు సంప్రదాయ ఆధిపత్య మగతన నమూనాలోకి ఇమడలేకపోతున్నారు. మగవాళ్ళతో అభద్రత పెరుగుతున్న చారిత్రక సందర్భంలో ఈ విషమయ మగతన సమర్ధన చాలా మంది మగవాళ్ళకి ఒక ఊతంగా మారింది.
తెల్ల జాతి ఆధిక్యతని, జాత్యహంకారాన్ని, మార్కెట్ పోటీ తనాన్ని సమర్ధించే ఇలాన్ మాస్క్ లేదా ఆండ్రూ టేట్ వంటి విషమయ మగవాళ్లకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని జాతుల్లో, వర్గాల్లో భక్తులు, అనుచరులు తయారవటం యాధృచ్చికం కాదు. కొత్త ఉదారవాద ప్రపంచీకరణ ఒక దగ్గరికి తెచ్చిన అంతర్జాతీయ సోషల్ మీడియా ప్రపంచంలో వివిధ దేశాల మనుషులు తమ సంస్కృతి, పెంపకం, కుటుంబాల గురించి ఒక పక్క విషయాలు పంచుకుంటుంటే, మరో పక్క విషమయ మగతన ధోరణులు కూడా ఒకరి నుండి మరొకటి పరస్పర స్ఫూర్తి పొందుతున్నాయి. అమెరికాలో నల్ల జాతి సమూహాలని, ఇతర జాతుల వారిని, తమ జాతి ఆడవాళ్ళతో పోలిస్తే ఆయా సమూహాల స్త్రీలని (‘లూజర్స్’) అత్యంత హీనంగా చూస్తే, మన దేశంలో ప్రధానంగా తమని తాము అగ్ర కులాలుకునే రాజపుట్లు, బ్రాహ్మలు, రెడ్లు, కాపులు, భూమిహార్లు తమ కంటే క్రిందివిగా భావించే వారిని, ఆయా సమూహాల స్త్రీలని అత్యంత చులకనగా, అసహ్యంగా చూడటం మామూలు. ఆయా స్త్రీల రంగు గురించి, ఆకర్షణ లేమి గురించి, శరీరాల గురించి లేకి కామెంట్లు పాస్ చెయ్యటం ఆయా సోషల్ మీడియా సర్కిల్స్‌కి ఒక ప్రధాన లక్షణం.
సోషల్ మీడియాలో వీరికి మానోస్పియర్ అనే పేరుంది. వివిధ సినిమా హీరోల, రాజకీయ నాయకుల, పార్టీల ఫాన్లు, మగవాళ్ల హక్కుల సంఘాలు, కుల సంఘాలుగా మసిలే వీళ్ళని ఐక్యం చేసేది మాత్రం పురుషాధిక్యత, స్త్రీద్వేషం. మగస్వామ్యాన్ని, అసమానతలని, కుల పితృస్వామ్యాన్ని, ప్రపంచంలో సాధారణీకరించిన ఏ ఆధిపత్యాన్నయినా ప్రశ్నిస్తూ తమదంటూ స్వంత అభిప్రాయం, వ్యక్తిత్వం వ్యక్తం చేసే స్త్రీలంటే ఈ విషమయ సమూహాలకు అత్యంత కోపం, ఆవేశం, ఉద్రేకం వచ్చేస్తాయి. ఆడవాళ్లు ఇలా తమ ‘ఇష్టానుసారంగా’ ప్రవర్తిస్తే తమ నియంత్రణ పోతుందనే అభద్రతకు గురవుతారు కూడా. మహిళా జర్నలిస్టులు, ఆక్టివిస్టులు, సోషల్ మీడియాలో స్వతంత్ర అభిప్రాయాలు వ్యక్తం చేసే స్త్రీలని వెంట పడి, వేధించటం వీరి ప్రధాన యాక్టివిటీ. జన్మతః వచ్చే మగ, కుల, జాతి ఆధిక్యతలని ప్రశ్నించే అన్ని గొంతుకలనీ నొక్కటం వీటి లక్ష్యం.
శివాజీ అనే చిన్న తెలుగు సినిమా క్యారక్టర్ నటుడు తన తోటి నటీమణులని ఉద్దేశించి – వాళ్ళు సినిమాల్లోనూ, బయటా చీర కట్టుకోకపోవటం వల్లే వారిపై దాడులు జరుగుతున్నాయని చేసిన చిల్లర కామెంట్లకి వచ్చిన సపోర్టు, నటి అనసూయ దానికిచ్చిన స్పందనపై జరుగుతున్న దాడి ఇక్కడి నుండి – ఒక మగాడు చెప్పింది వినకుండా, నీ స్వంత అభిప్రాయం ఎట్లా చెప్తావ్ – అనే అహంకారం నుండి వస్తున్నవే. బట్టలకి, దాడులకు ఏ సంబంధం లేదని, శరీరాల్ని లైంగిక వస్తువులుగా చూసే మగ వారి చూపులతో సంబంధం ఉందని మనకి యాభై ఏళ్ల స్త్రీల ఉద్యమం క్రిందటే చెప్పింది. ఆడవారి శరీర భాగాల్లో దేన్నీ లైంగిక అంగంగా చూస్తారన్నది ఎప్పుడూ మారుతుంటుంది కూడా ప్రపంచ చరిత్ర, గత వందేళ్ల భారతదేశ చరిత్ర చూసినా అర్ధమవుతుంది. శతాబ్దాల పాటు జపాన్‌లో, చైనాలో పాదాలని కట్టి పడెయ్యటం వాటిని అన్నిటికన్నా వాటిని లైంగికంగా ఆకర్షణీయమైనవిగా భావించినందువల్లే. 20వ శతాబ్దపు మొదట్లో జాకెట్లు కొత్తగా వచ్చినప్పుడు కేరళలో ఆడవాళ్లు అమ్మలకి, అత్తలకి తెలియకుండా రహస్యంగా భర్తల కోసం వేసుకునే వాళ్ళు అన్నది చదివినప్పుడు మనకి లైంగిక ఆకర్షణ ఎంత చిత్రంగా పని చేస్తుందో అర్ధమవుతుంది. 20వ శతాబ్దంలో ఉత్తర భారత దేశమంతా వెతుక్కుని దాచుకున్న గౌహర్ జాన్ వంటి సెలెబ్రిటీ తవాయిఫ్‌ల ఫోటోలు చూస్తే, ఒక్క ఇసుమంత శరీర భాగం కూడా కన్పించదు. 1980ల తర్వాత తెలుగు సినిమాల్లో నడుముని అత్యంత ఆకర్షణీయ అంగంగా చూయిస్తారు కానీ హాలీవుడ్ లో కాళ్ళని ఆకర్షణీయ అంగంగా చూపిస్తారు. ఆకర్షణ చూపులో, చూపుని దిద్దే దృష్టికోణంలో ఉంటుంది కానీ, శరీరాల్లో కాదు.
అయితే ఇక్కడ చర్చ లైంగిక ఆకర్షణ గురించి కానీ కాదు, మగస్వామ్య అధికారం గురించి: ఏ చూపు ఎవరి జీవితాలని ఎలా నియంత్రిస్తుంది, ఎవరి శరీరం ఎవరి కోసం, ఎవరు ఏ దుస్తులు ధరించాలి, ఎవరి శరీర భాగం కనిపిస్తే ఎవరు అనుమతి లేకుండా తాకగలరు, ఎవరు దాడి చెయ్యగలరు అన్నది అధికారానికి, అధిపత్యానికి సంబంధించిన విషయం. వేసుకున్న బట్టల బట్టి తమ అనుమతి లేకుండా, ఇష్టం ఉందో లేదో అడక్కుండా, అపరిచితులు కూడా తమ అధికార చూపుతో ఆ శరీరాన్ని ఏమి చెయ్యాలో నిర్ణయిస్తాం అనే వాదన దీనిలో భాగం. ఇది ఎంత దుర్మార్గమైందో అన్ని వర్గాల ఆడవాళ్ళతో పాటు, ట్రాన్స్ ప్రజలు, సమలైంగికులు, దళిత మగవాళ్ళకి కూడా సుపరిచితమే. మీసాలు పెంచుకున్నాడని దళిత మగవాళ్ళని కొట్టే ఆధిపత్య కుల మగవాళ్ళు, ట్రాన్స్ స్త్రీల చీరలు విప్పి కొట్టే మగ పోలీసులు, సమలైంగిక పురుషులని బ్లాక్మెయిల్ చేసే మగవాళ్ళు ‘మీరందరూ బరి తెగించి పోతున్నారు’ అంటూ ఇలా లైంగిక అధికారాన్ని చెలాయించే వాళ్ళే. మాకు నచ్చినట్లు లొంగి ఉంటే రక్షిస్తాం, లేకుంటే వెంటపడి కొడతాం అనే మగస్వామ్య భావజాల వివిధ రూపాలివి.
మన దేశ మగస్వామ్య నియంత్రణకి, మానోస్పియర్‌లో విషమయ మగతనానికి ప్రత్యేకత – హిందూత్వ భావజాలం 1980ల నుండి పెంచి పోషించిన ముస్లిం ద్వేషం. తమ ఆధీనంలోని ఆడవాళ్ళ బట్టలు, శరీరాలపై వివిధ నియంత్రణ చెలాయించటంతో పాటు, శతాబ్దంన్నర పాటు, తాము వ్యతిరేకించిన సాంఘిక సంస్కరణ ఉద్యమాల ప్రభావంతో చట్ట మార్పులని, అవకాశవాదంతో స్వంతం చేసుకున్న హిందూత్వ వాదులు, 1980లలో ముస్లిం స్త్రీల ఉద్ధారకులుగా అవతరించారు. షా బేనో తీర్పు తర్వాత, ఇస్లాం అన్ని మతాల కంటే పరమ పితృస్వామ్య మతమనీ, దాని నుండి ముస్లిం స్త్రీలని రక్షించాలని కంకణం కట్టుకున్నామని చెబుతూ 2017లో మూడు తలాక్ లని నేరమయం చేసే చట్టాన్ని తెచ్చారు. ముస్లిం పురుషులు అందరికన్నా భయంకరమైన వాళ్ళని అంటూ, వారి నుండి ముస్లిమేతర స్త్రీలని రక్షిస్తామంటూ లవ్ జిహాద్ చట్టాలని తెచ్చారు. ఎక్కడా సరిగ్గా అమలు చెయ్యని బాల్య వివాహ చట్టాలని అస్సాంలో పేద ముస్లిం సమూహాలకు ఆకస్మాత్తుగా అమలు చేసి అప్పటికే పెళ్ళిళ్ళయి, పిల్లలున్న అనేక మందిని జైళ్లల్లో పెట్టారు. ముస్లిం మగవాళ్లపై బహిరంగ దాడులు చేసి చంపినప్పుడు, ఆయా కుటుంబాల స్త్రీల గోడుని ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోలేదు.
అయితే ఈ ఉద్ధరణ దృక్పధం, కార్యక్రమంలో ముస్లిం స్త్రీలు గొంతుకకి, స్వతంత్రతకి దీంట్లో ఏ స్థానం లేదు. కేవలం ఉద్ధరింప బడే
వాళ్ళు మాత్రమే. 2019లో దేశం మొత్తం మీద, ఢల్లీి షాలీన్‌బాగ్‌లో ముస్లిం స్త్రీల నాయకత్వంలో లౌకిక పౌరసత్వం కోసం జరిగిన అపురూప పోరాటాన్ని, ‘బిర్యాని పాకెట్ కోసం చేసే పోరాటమని’ అంటూ ప్రచారం నడిపారు. 2021లో ఆ ఉద్యమంలో, ఇతరత్రా ఆక్టివ్‌గా వున్న ముస్లిం స్త్రీలని ఒక హిందూత్వ విషమయ మగవాళ్ల గుంపు ఆన్లైన్ లో వేలంలో పెట్టింది. ఆయా ముస్లిం స్త్రీలు తమ ఉద్ధరణని పట్టించుకోకుండా, స్వంత గొంతులతో ఉండటం వీరికి నచ్చలేదు.
ఈ ప్రచారోద్యమంలో బుర్ఖా, హిజాబ్‌లని అతి భయంకరమైన పితృస్వామ్య సాధనాలుగా చూపెట్టే పాశ్చాత్య ఓరియంటల్ ధోరణిని భారతీయ హిందూత్వవాదులు తమదిగా చేసుకున్నారు. ముస్లిం స్త్రీలపై ముస్లిం పురుషుల అధికారాన్ని నాశనం చేస్తే వచ్చే కిక్ ఒకటయితే, ఆయా స్త్రీలపై ఉద్ధారకులుగా వారిని ముస్లిం చట్టాలు, హిజాబ్/బుర్ఖా నుండి ‘విముక్తి/ఎక్సపోజ్’ చెయ్యటం దీనికి మరొక పార్శ్వము. దాని కోసం ఇప్పటికే హిజాబ్ వలన జరిగే మగస్వామ్య అణచివేత గురించి వున్న స్త్రీవాద, లెఫ్టిస్టు వాదనలని కూడా ఈ బాగా వాడుకుంటున్నారు. బలవంతంగా నైనా సరే ఈ ఉద్ధరణ చెయ్యాలనే వాదనకి సమర్ధన కూడగడుతుంది. 2021లో కర్ణాటకలో అకస్మాత్తుగా తెచ్చిన యూనిఫామ్ రూల్ దీనికి ఒక ఉదాహరణ అయితే, నితీష్ కుమార్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవటానికొచ్చిన ఆయుర్వేదిక్ డాక్టర్ హిజాబ్‌ని బహిరంగంగా లాగటం ఇప్పటి ఉదాహరణ. దీన్ని సమర్ధించే వాళ్ళని పక్కన పెడితే, చర్యని తప్పు పట్టిన వాళ్ళు కూడా, ఆ అమ్మాయి ‘ఈ చిన్న విషయం’ కోసం ఉద్యోగాన్ని వదిలేసుకోకూడదు అనే ‘తార్కిక’ వాదనని చేసేటట్లు చెయ్యటం ఈ హిందూత్వ విషమయ మగస్వామ్య ప్రచార సఫలత్వానికి నిదర్శనం.
స్త్రీల ఆధునిక వస్త్ర ధారణని తప్పు పట్టె శివాజీ వంటి విషమయ మగవాళ్ళు, ఆ మగస్వామ్య అనుచర గణం, మరో పక్క ముస్లిం స్త్రీలని బుర్ఱా నుండి విముక్తి చెయ్యాలనే వాదనని కూడా అంతే సులభంగా ఎత్తుకుంటారు. ఇక్కడ విషయం బట్టలు కాదు, అతి ఎక్కువ మంది స్త్రీలు, వారి ఆలోచనలు, వారి జీవితాలపై మగస్వామ్య నియంత్రణ, దాని వల్ల మానొస్ఫియెర్‌లో కలిగే ప్రయోజనాలు. మన దేశ మానొస్ఫియెర్ కుల, వర్గ మగస్వామ్యంతో పాటు హిందూత్వ పురుష ఆధిక్యతని కూడా వంటబట్టించుకుంది.
టాక్సిక్ మగతన భావజాలంలో స్త్రీలని తల్లులు, చెల్లెల్లు, అక్కలుగా భావించి సహానుభూతితో అర్ధం చేసుకోవాలనే భావానికి కూడా చోటు ఉండదు. ప్రపంచంలో మగవాళ్లని స్త్రీవాదం వంటి తప్పుడు భావజాలాలు దెబ్బ తీస్తున్నాయని, మళ్ళా వారి స్థానాన్ని పునరుద్ధరించుకోవటానికి ఆడవాళ్లందరినీ కట్టడి చెయ్యటానికి అంతులేని యుద్ధం చెయ్యాలనీ, దానిలో ఇటువంటి సహానుభూతి చోటు ఉండకూడదని ఇటువంటి వాళ్ళ కామెంటరీలు, సలహాలు, కామెంట్లు వింటున్నప్పుడు అర్ధమవుతుంది. అయితే, మగవాళ్ల కోసం సాటి మగవాళ్ళు పాటు బడే ఈ భావావరణంలో, మగ వాళ్ల ఆధిపత్యంలోనే రక్షణ దొరుకుతుందని భావించే స్త్రీలు కూడా ఈ విషమయ మగతనాన్ని నెత్తికెత్తుకోవటం ఆశ్చర్యకరమేమీ కాదు. స్త్రీవాద ప్రపంచం ఇంకా రాలేదు కాబట్టి, తమ అస్తిత్వం కుటుంబంలోనే వెతుక్కునే స్త్రీలు, స్వంత అస్తిత్వం అవసరం లేదనుకుని మగస్వామ్యంతో రాజీ పడే స్త్రీలు ప్రపంచం నిండా వున్నారు. ఆయా స్త్రీలని మాత్రమే ‘స్త్రీల ప్రతినిధులుగా’ పరిగణించి, వారిని స్వతంత్ర అభిప్రాయాలు వుండి విషమయ మగతనాన్ని ప్రశ్నించే స్ట్రీలతో పోటీ పెట్టి, వారి సాధికారతని దెబ్బతియ్యటం ఈ మానో సఫియెర్ వాడే ఇంకో ఎత్తుగడ. ఇటీవలే ఆల్ట్ న్యూస్ సోషల్ మీడియాలో ఇటువంటి ‘మగస్వామ్యాన్ని’ సమర్ధించే స్త్రీల గురించి చేసిన పరిశీలనలో అవి అబద్ధపు అభిప్రాయాలని తేలింది. (ష్ట్ర్‌్‌జూం://షషష.aశ్ర్‌ీఅవషం.ఱఅ/్‌ష్ట్రవ-సaతీస-బఅసవతీపవశ్రీశ్రీవ-శీట-వశీబ్‌బపవ-అవషం-షష్ట్రaఅఅవశ్రీం-ర్aస్త్రవస-ఙశీఞ-జూశీజూ-జూశ్రీaఅ్‌వస-సవపa్‌వం-తీవషబతీతీఱఅస్త్ర-టaషవం-పjజూ-శ్రీఱఅసం).
విషమయ మగతనం ప్రస్తుతం ఒక ట్రెండ్. హింసకి గురయిన తర్వాత చట్టాలని వాడుకునే ఆడవాళ్ళని, ఇంటి బయట పని చేసే ఆడవాళ్ళపై నిందలు, అపవాదులు వెయ్యటం మామూలు. ఆడవాళ్ళ బట్టలపై, ఆధునిక డ్రెస్ కావచ్చు, బుర్ఖా కావచ్చు – ద్రుష్టి కేంద్రీకరించే దీని చూపు పాత మగస్వామ్య చూపే. ప్రపంచాన్ని ఎదుర్కోలేని మగవాళ్ళు తమ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగం!
