మనలను సోషయానిమల్ అని పిలుచు కున్నాం. కొన్నివేల ఏళ్లుగా రూపాంతరం చెందు తూనే ఉన్నాం. నాగరికతను వీలున్నంతంగా చాటు కున్నాం. బృందాలు, సమూహాలుగా ఏర్పడ్డాం. దానిని బట్టి మన ఉనికిని చాటుకున్నాం. రాజ్యాలు, దేశాలు, ప్రాంతాలు, మతాలూ, కులాలు, సంస్కృతి, భాష ఇలా వర్గవర్గాలుగా ఖండఖండాలుగా కోసేసుకుని ఎవరి ప్రత్యేకతను వారు చాటుకునే బాదరబందీలోకి ఏనాడో వచ్చేశాం.
మనమున్నాం కాబట్టి మనకో ఉనికి ఉంటు ంది. ఆ ఉనికిని తవ్వుతూ పొతే మహు ముఖాలు బయటపడతాయి. మన పూర్వికులో, వారి చరిత్రో, వారి ఆరోగ్యం, జీన్స్ ఇలా ఎన్నెన్నో మనలో
ఉంటాయి. రంగు, రూపంతో పాటే ఆలోచనలు, అభిజాత్యాలు, వేదన ఇలా ఎన్నో ఉంటాయి. కొన్ని ప్రస్ఫుటంగా కనబడతాయి. కొన్ని దోబూచులా డతాయి. కొన్ని అంతర్లీనంగా మనలను బ్యాక్ స్టేజి నుండే ఆడిస్తాయి. ఒక మనిషి గురించి మాట్లాడితే మనం తన వేనవేల అవశేషాల గురించి మాట్లాడుతున్నామని గ్రహించం. మన ఆలోచ నంతా ప్రస్తుతంలోనే ఉంటుంది. చూపు ఎప్పుడూ ముందుకే ఉంటుంది. కానీ మనలో మసలుతున్న పూర్వీకులను వారు సృష్టించే ప్రపంచాన్ని గ్రహించలేము.
ముందుకు ముందుకు పోతున్నాం అనుకో వడం కూడా నచ్చుతుంది. కానీ మనం తయారైన మట్టి, మన చుట్టూ ఉన్న ప్రకృతి, అందులోని మనుషులు, వారి మధ్య బంధాలు, బంధించి ఉంచే విషయాలు, రాజకీయాలు, హెచ్చుతగ్గులు ఇవన్నీ గుర్తించకపోతే ఎలా?
ఈ ఎగువ దిగువ వ్యవస్థలో ఇటువంటి హెచ్చుతగ్గుల మధ్య తరతరాలుగా పెరుగుతూ తరుగుతూ, పుడుతూ చనిపోతున్న శరీరాలు, అవి మోస్తున్న రకరకాల విశేషణాల మధ్య మనకున్న వెసులుబాట్లు, సదుపాయాలు, వెలివేతలు, అడ్డుగోడలు ఎంత, ఎన్ని, ఎంతవరకు? నాగరికత మొదలైన దగ్గరనుంచి ప్రపంచాన్ని ఒడిసిపట్టుకున్న ఈ తరం వరకు, తమలోని ప్రపంచాన్ని ఎంత వరకు తరచి చూసుకున్నారని?
… … …
ఇందాక చెప్పినట్లు మనలో ఉన్న వేలచరిత్రను బట్టే ఈ రోజు మనం ఉన్నాం అనుకుంటే, ఈ రోజు భూమి మీద ఉన్న మనం ఎప్పుడు ఏర్పడ్డ సమాజపు అవశేషాలం. అందులోంచి ఎవాల్వ్ అవుతూ, కొన్ని చెరుపుతూ మాపుతూ కొత్తకొత్తవి అలవరచుకుంటూ ఇక్కడిదాకా వచ్చాము. కానీ మనం కూర్చునే విధానం, మన భాష, మన అభిజాత్యం, బానిసత్వం, మన విలువలు, నమ్మకాలు, భ్రమలు అన్ని మన ఉనికి నుండే వచ్చాయి కదా. అవి గుర్తించుకుంటున్నామా?
… … …
ఇది జరగాలంటే మనకు అవరసమైనవి రెండే. ఒకటి స్వీయాగాహన (self awareness) మరొకటి సమాజంలో మన ఉనికి ఎక్కడ ఉందో గుర్తించుకో వడం (సోషల్ మాపింగ్). ఈ రెండిటి వలన మనం ఎక్కడున్నామో తెలియడమే కాక మన ఈ రోజు ఉనికికి దోహదపడిన అంశాలు ఏమిటో కూడా గుర్తించగలం. మతం, కులం, జెండర్, ప్రాంతం, శరీర సామర్ధ్యం, సంస్కృతి (ethnicity)ని మొదటి సూచికగా తీసుకుంటే సరిపోదు. మన ఉనికి వలన రూపం, ఆరోగ్యం, వివక్ష, చిన్నచూపు, వెసులు బాట్లు, సదుపాయాలు, గౌరవం, అవమానం ఇటు వంటి ఎన్నెన్నో అంశాలు కూడా పరిగణలోకి వస్తాయి. మనం వాడే భాష, ఇతురులతో ప్రవర్తన ఈ ఎగుడు దిగుడులకు అనుగుణంగా మారిపోతుంటాయి.
మన అసూయ, ద్వేషం, ఇష్టాయిష్టాలు, విలువలు, బట్టలు, మనం వేసుకునే బట్టల ఎన్నిక వీటివరకు ఈ ఉనికి విస్తరిస్తుంది. మనం ఏది నమ్మలనుకుంటామో, మనం ఎవరికీ మద్దతుగా నిలబడాలనుకుంటామో కూడా ఇదే నిర్ణయిస్తుంది. మనమధ్య ఉదయించే ప్రేమా, హింసకు కూడా ఇవే ఉనికిలు, వాటి ఎగుడుదిగుడులు, హెచ్చు తగ్గులు నిర్ణయిస్తాయి. వీటివలన మనలో ఏర్పడ్డ అభిజాత్యం లేదా భద్రతలను గుర్తించామా? సమాజంలో మనుగడ కోసం పోటీపడుతున్న మనం, ఎదుటివారి వైపు వేలెత్తే ముందు మనలోని దుర్మార్గపు శక్తులను గుర్తించి నాశనం చేశామా?
ఈ అభ్యాసం మన ప్రివిలేజెస్‌ని తెలుపుతూనే మన మార్జినాలిటీస్‌ని తెలియజేస్తుంది. మార్జినలైజ్డ్ అని చెప్పుకునే వారికి కూడా ప్రివిలెజ్లు ఉంటాయని, ప్రివిలేజెడ్ మనుషులలో కూడా మార్జినాలిటీస్ ఉంటాయని గ్రహించడం అవసరం. మనమీద ఒకరు కాలు వేసి తొక్కుతున్నట్లే మనం కూడా మరొకరి పై కాలు వేసి ఉన్నాం అని గ్రహించుకోడమే ఈ అభ్యాస ఉద్దేశం. మనలోనే oppressor ఉన్నారని oppressed మాత్రమే కాదని, మన వలన ఇబ్బంది పడేవారిని గుర్తించుకుని వారికి దారి ఇస్తూ వెళుతున్నామా, లేదా వారి దారిలో మనమే నిల్చుని మన పెద్ద మనసుని అందరు అర్థం చేసుకోవడం లేదని చెబుతున్నామా- ఈ పరీక్షకు మనలను మనం గురిచేసుకోక తప్పదనీ తెలుసుకుందాం.
మన మార్జినాలిటిస్ కూడా జెండర్‌ను, కులాన్ని, ప్రాంతాన్ని, మతాన్ని మాత్రమే కాదు. మన వయసు, సామర్ధ్యం, ఆరోగ్యం, మనపై ఆధారపడ్డవారి ఆరోగ్యం, మనపై ఉన్న చిన్నచూపు, వివక్ష, మనకు అందుబాటులో లేని వనరులు ఇలా ఎన్నెని చోట్ల ఏమేం ఉన్నాయి? అలానే మన సదుపాయాలేంటి?
మనం నమ్మిన విలువలు, లేదా మనవి అను కుంటున్నా విలువలు మనకి అలవోకగా ఒళ్ళో జారిపడ్డాయా, లేక మన మీద రుద్దబడ్డాయా, లేక మనం ఆ మూసలో నుండి అదే ఆకారంతో బయట పడ్డామా? ఈ గజిబిజి అల్లికలో చిక్కుకున్న మనం ఎక్కడ ఉన్నాము? మనం అడక్కుండా అందుకున్న సదుపాయాలేంటి?
సమాజంలో అసమానతలు బైనరీ కావు. అవి నిచ్చెన మెట్లు కూడా కాదు. ఇది ఒక అల్లిక. ఈ అల్లికలో నీ స్థానం ఏమిటో గుర్తించుకుని దానికి అవసరమైన ప్రేమ, దయ, కరుణ, బలం అలవరచుకోవడమే కాక అసూయ, ద్వేషం, పోటీ, ఓర్వలేనితనం – వీటి పై పూర్తిగా నియంత్రణను అందిపుచ్చుకుంటేనే సమ సమాజం వైపు మళ్లగలుగుతాము. అలాకాక ఇవే రాగద్వేషాలతో మార్పులను ఆహ్వానిస్తే కొత్తరకాలైన వేధింపులు, హింసలకు కూడా ఆహ్వానం అందిస్తాము. ఇంతదాకా జరిగింది అదే.
మనం బయటి ప్రపంచాన్ని చూస్తున్నంత స్పష్టంగా మనలను మనం తరచి చూసుకుం టున్నామా? మరొకరిని నిందించే ముందు ఆ పాళ్ళు మనలో కూడా ఉన్నాయని గుర్తించకుండా పొతే మనమనుకునే సమాజం ఎన్నటికీ రాదు. Self Awareness and Self Mapping’ – గుర్తుంచుకోండి. సమాజంపై వ్యాఖ్యానం చేసే ప్రతి ఒక్కరు పూర్తి చేయవలసిన అభ్యాసం ఇది.
