కొన్యాక్ పచ్చబొట్లు: జ్ఞాపకాల పటాలు – సర్వజయ భట్టాచార్య / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

నాగాలాండ్‌కు చెందిన కొన్యాక్ ఆదివాసీ సముదాయపు సంస్కృతిలో పచ్చబొట్ట్లు ఒక విడదీయరాని భాగంగా ఉండేవి. ఆ పచ్చబొట్లను మహిళలే వేసేవారు. 1970లలో వాటిని నిషేధించిన తర్వాత, వాటిని వేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు.

ఆర్హెన్ తన గ్రామంలో మిగిలివున్న చిట్టచివరి, ఒకప్పటి పచ్చబొట్టు కళాకారిణి. సంప్రదాయ పద్ధతిలో, గడ్డి కప్పుతో నిర్మించిన పొడవాటి కొన్యాక్ గుడిసె బయట కూర్చొని వున్న ఆ ఎనభై ఏళ్ళ వృద్ధురాలు తాను చిన్నతనంలో నేర్చుకున్న పాటను పాడుతున్నారు. ఆ పాటను పచ్చబొట్లు వేసేటప్పుడు పాడతారు.
రెన్-అమ్ మన్యు నౌ హంగ్?ఖు తొ
గొలింగ్ నిహ్
ఫొన్ కాత్ తఖా, చిలమ్? గాంపో మి నియుహే
(ప్రియమైన రెన్-అమ్ మన్యు
తన అంకభాగాన పచ్చబొట్టు వేసుకునే రోజున
బయటికి, క్షేత్రాలలోకి వెళ్ళవద్దు
చిలమ్‌లో విశ్రాంతి తీసుకో)
ఈ పాట రెన్-అమ్ మన్యు అనే యువరాణి పచ్చబొట్టు వేయించుకోవడం గురించినది. చిలమ్ అనేది మరంగ్ (పురుషుల సంప్రదాయ సమావేశ స్థలం) పేరు.
నాగాలాండ్‌లో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన కొన్యాక్ ప్రజలకు, వారి జీవితంలోని వివిధ దశలలోను, వేర్వేరు సందర్భాలలోను పచ్చబొట్లు వేయించుకోవడమనేది – 1960లు, 1970ల నాటికి నెమ్మదిగా కనుమరుగయ్యే వరకు – వారి సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగంగా ఉండింది. ఈ ఆచారం మరో దశాబ్దం పాటు కొనసాగిన తర్వాత, 1970లలో ఈ నిషేధం పూర్తిగా అమల్లోకి వచ్చింది. క్రైస్తవ మతం ప్రవేశించడం, కొన్యాక్ విద్యార్థి సంఘం ప్రభావం వల్లనే ఈ ఆచారం క్షీణించి, చివరకు అంతమైంది.
అయితే అప్పటి వరకు, కొన్యాక్ తెగకు చెందిన అమ్మాయిలందరూ తమ విద్యలో భాగంగా పచ్చబొట్లు వేయడం నేర్చుకున్నారని అతని తల్లి ఇంకా పాటను పాడుతూనే ఉండగా – అలోహ్ నోవాంగ్ చెప్పారు. అతను ప్రస్తుతం శియాంఘాచింగ్న్యు గ్రామానికి అంఘ్ (గ్రామ పెద్ద)గా ఉన్నారు. ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న అర్హెన్, 1967-68లో తన చివరి పచ్చబొట్టును ఈ గ్రామంలోనే వేశారు.
అర్ధ శతాబ్దం తర్వాత, ఒక వెచ్చని ఏప్రిల్ ఉదయాన, మొన్ జిల్లాలోని ఎగువ ప్రాంతంలో ఉన్న శియాంఘాచింగ్న్యు గ్రామంలో నివసిస్తోన్న అర్హెన్, ఇతర పచ్చబొట్టు కళాకారులను PA=I కలిసింది. ఈ గ్రామం భారతదేశం, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
గ్రామంలో నివాసముండే సుమారు 5,000 మంది కొన్యాక్ ప్రజలు ఆరు రోజుల పాటు జరిగే ఆయోలియాంగ్ పండుగను జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ పండుగను ప్రతి ఏడాదీ వసంతకాలంలో జరుపుకుంటారు. కొత్త ఝూమ్ పొలాల్లో విత్తనాలు నాటిన తర్వాత, మంచి పంట రావాలని ప్రార్థిస్తూ, దేవుళ్ళ ఆశీర్వాదాన్ని పొందడం కోసం ఈ సముదాయపు ప్రజలు ఇక్కడ చేరతారు. నాగాలాండ్‌లో ఈ సముదాయాలు ఇప్పటికీ ఝూమ్ (పోడు వ్యవసాయం) పద్ధతినే ఆచరిస్తున్నాయి.
సమీప గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అంఘ్ నివాసానికి సమీపంలో ఉన్న మైదానానికి పోటెత్తారు. వారిలో చాలామంది, ముఖ్యంగా ప్రదర్శనలు ఇవ్వబోతున్నవారు, కొన్యాక్ సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. సంబరాలు ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ, స్వచ్ఛమైన వసంతగాలి సంగీత ధ్వనులతో నెమ్మదిగా ఉత్సాహభరితంగా మారుతోంది.
నాగాలాండ్‌లోని అనేక కొన్యాక్ గ్రామాల మాదిరిగానే, శియాంఘాచింగ్న్యు కూడా ఒక కొండపైనే ఉంది. శత్రువును దూరం నుండి గుర్తించగలిగేలా శతాబ్దాల క్రితమే ఈ ఏర్పాటు జరిగింది. ఒకప్పుడు పురుషుల కోసం మాత్రమే ప్రత్యేకించబడిన సమావేశ స్థలాలైన మరంగుల గోడలు గతకాలపు వేట జ్ఞాపకాలైన జంతువుల పుర్రెలతో అలంకరించబడి, గ్రామ ప్రత్యేకతను సూచిస్తున్నాయి. చెక్క, వెదురులతో కట్టిన విశాలమైన గుడిసెలైన మరంగులలోకి ప్రవేశించడానికి ఇప్పుడు మహిళలకు స్వేచ్ఛ ఉంది. అయితే, యువకులు కొన్యాక్ పురుష జీవన విధానాలను నేర్చుకునే మరంగ్ సంస్కృతి మాత్రం కనుమరుగైంది. ఇప్పుడిది విశ్రాంతి స్థలంగా, జనం కబుర్లు చెప్పుకోవటం కోసం కలుసుకునే ప్రదేశంగా మారిపోయింది.
జిల్లాలోని ఇతర కొన్యాక్ గ్రామాలలో మాదిరిగానే ఈ సముదాయంలో కూడా వంశపారంపర్య గ్రామ పెద్ద వ్యవస్థ కొనసాగుతోంది. ఎన్నికైన సభ్యులతో కూడిన గ్రామ మండలి అనే కొత్త వ్యవస్థ కూడా నడుస్తోంది. కొన్యాక్ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, వారు ప్రధానంగా వరి పంటను పండిస్తారు. సామూహిక యాజమాన్యంలో ఉండే భూమికి ఆంగ్ సంరక్షకుడుగా ఉంటాడు. ప్రజలు ఈ భూమిపై పని చేసి జీవిస్తుంటారు. ఆయోలియాంగ్ పండుగకు వచ్చిన ప్రజలు కొందరు అటూ ఇటూ తిరుగుతుండగా, మరికొందరు నీడలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తన పాటను ముగించిన అర్హెన్, ఇప్పుడిక పచ్చబొట్టు వేసే ప్రక్రియను వివరించడం ప్రారంభించారు. మొదటి దశలో, కొలిమిలో ఒక బొగ్గు ముక్కను వేసి వెలిగించి, దానిపైన ఒక ఖాళీ పాత్రను పెట్టి వేడి చేస్తారు. కొలిమిలోంచి లేచిన పొగ పాత్ర లోపల ఒక మసి పొరను ఏర్పరుస్తుంది. దానిని గీకి తీసి చర్మంపై పచ్చబొట్టు డిజైన్ వేయడానికి ఉపయోగిస్తారు. ఆ తర్వాత, కొన్యాక్ కళాకారులు యింగ్ చెట్టు (స్ట్రోబిలాన్‌థీజ్ పెన్ స్తెమోనైడీజ్) ముల్లును చర్మంపై పొడవడానికి లేదా గుచ్చడానికి ఉపయోగిస్తారు.
అనుభవంలేని చిన్న అమ్మాయిగా ఆ కళలో ప్రవేశించినందున, అర్హెన్ దానిని ప్రయత్నించడానికి చాలా భయపడింది; “నా అన్యా (తల్లి) నాకు నేర్పించింది,” అని 86 ఏళ్ళ అర్హెన్ గుర్తుచేసుకున్నారు. “యింగ్ చెట్టు నుండి నల్ల సిరా వస్తుంది,” పచ్చబొట్టు వేయడంలోని మెళకువలను వివరిస్తూ అర్హెన్ కొనసాగించారు. పచ్చబొట్టు వేయడానికి అవసరమైన ముళ్ళతో పాటు ఆ సిరాను సేకరిస్తారు. ఆ తర్వాత ఆమె ముల్లును సిరాలో ముంచి, గుచ్చడం ప్రారంభించేవారు. “రక్తం, సిరా కలిసి ముదురు రంగును ఏర్పరుస్తాయి,” అని ఆమె చెప్పారు. పచ్చబొట్టు వేసిన చోట తడిపిన మెత్తని గుడ్డతో తుడిచేవారు. సాధారణంగా ఒక పచ్చబొట్టు వేయడానికి రోజంతా పట్టేది.
అర్హెన్ తన భర్త పెద్దగా ఉన్న ఆరు గ్రామాలలో తిరుగుతూ, 140 మందికి పచ్చబొట్లు పొడిచారు. అయితే, ఆమె తాను వేసిన మొదటి పచ్చబొట్లను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. “ఒక అమ్మాయికి కాళ్ళ మీద, ఒక అబ్బాయికి ఛాతీ పైన,” కేవలం జ్ఞాపకంగా మిగిలిపోయిన ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆమె నవ్వారు.
స్త్రీలకు, పురుషులకు వేసే పచ్చబొట్లు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. స్త్రీలు తమ జీవితంలోని వివిధ దశలలో – యుక్తవయస్సుకు చేరుకునే సందర్భంగా, వివాహం చేసుకున్న తర్వాత – పచ్చబొట్లు వేయించుకుంటారు. వారి పచ్చబొట్లలో కొన్ని కుటుంబంలోని పురుష సభ్యుల విజయాల జ్ఞాపకార్థంగా కూడా ఉంటాయి. “ఒక కొన్యాక్ మహిళ జీవితం అనేక మార్పులకు లోనవుతుంది. తన తండ్రి గోత్రంలో పుట్టిన ఆమె, మరొక గోత్రంలో వివాహం చేసుకుంటుంది. అయినప్పటికీ, పెళ్ళికి ముందు ఆమె వేయించుకున్న పచ్చబొట్టు మాత్రమే జీవితాంతం, చివరకు మరణానంతరం కూడా ఆమెతో పాటు ఉండే ఏకైక విషయం. అది ఎప్పటికీ మారని ఒకే ఒక్క గుర్తు, అది ఆమె ఎవరో, ఎక్కడి నుండి వచ్చిందో తెలియజేసే గుర్తు,” అని అమో కొన్యాక్ అంటారు.
మొన్ నివాసి అయిన ఆమె తన తాతయ్య, నానమ్మల మీద పచ్చబొట్లు చూసిన సంగతిని గుర్తు చేసుకున్నారు. “నా చిన్నతనంలో నేను పచ్చబొట్ల గురించి, వాటిని ఎలా వేస్తారో, అది ఎంత బాధాకరంగా ఉంటుందో, వేయించుకున్న తర్వాత జనం ఎంత గర్వంగా భావిస్తారో అనే కథలను తరచుగా వినేదాన్ని. ఎప్పుడూ భక్తిపూర్వక గౌరవంతో చెప్పే ఈ కథలను జానపద కథల మాదిరిగా తరతరాలుగా చెప్తూ వచ్చారు. నాకు, ఈ పచ్చబొట్లు కేవలం వారి చర్మంపైనే కాకుండా, వారి అస్తిత్వపు మూలాల్లోకి చెక్కబడిన జ్ఞాపకాల పటాలలా అనిపించేవి,” అని ఆ 32 ఏళ్ళ పరిశోధకురాలు ఎంతో ప్రేమగా చెప్పారు.
కొన్యాక్ ప్రజలు సంప్రదాయకంగా తలలను వేటాడేవారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని సూచించడానికి పురుషుల చర్మంపై పచ్చబొట్లు చెక్కేవారు. ఈ అంశంపైనే దృష్టి పెట్టడం వల్ల కొన్యాక్ పచ్చబొట్ల గురించి చేసిన పరిశోధనలు, కథనాల నుండి మహిళలు తరచుగా విస్మరించబడ్డారని అమో చెబుతున్నారు. ఆమె తన అమ్మమ్మ చెప్పిన పచ్చబొట్ల కథలను గుర్తు చేసుకుంటూ, “ఆ ప్రక్రియ ఎంత బాధాకరంగా ఉండేదో, చర్మం ఎంతలా రక్తస్రావమై వాచిపోయేదో, అయినప్పటికీ ఆ తర్వాత తాను ఎంత గర్వంగానూ, అందంగానూ భావించేదో ఆమె నాకు తరచుగా చెప్పేది,” అన్నారు. అదే గ్రామంలో చాలా కొద్దిదూరంలోనే ప్రస్తుతం డెబ్బైల వయసులో ఉన్న గొన్ఫే ఉంటున్నారు. ఆమె తన అక్క దగ్గర, బంధువుల నుండి పచ్చబొట్టు వేసే కళను నేర్చుకున్నారు, వీరు కూడా ఈ కళను తమ తల్లుల నుండి నేర్చుకున్నవారే. అయితే, ఆమెకు ఎప్పుడూ ఈ కళను ఆచరణలో పెట్టే అవకాశం లభించలేదు ఎందుకంటే అది ‘రాణి’కి – మొదటి భార్యకు – మాత్రమే దక్కే ప్రత్యేక హక్కు. పచ్చబొట్టు వేయటంలో గొన్ఫే ‘రాణి’కి సహాయం – వేసేవారి కోసం ముళ్ళను సేకరించి, వేయించుకుంటున్నవారు నొప్పితో ఎక్కువగా కదలకుండా ఉండేలా వారిని పట్టుకోవటం – చేసేవారు. ఇదంతా చెప్తున్నపుడు గొన్ఫే ముఖం చిట్లిస్తూ, నొప్పిని అభినయించారు. ఆ తర్వాత ఇప్పుడు పాతవైపోయిన ఆ జ్ఞాపకాలను తలచుకొని నవ్వుతారు.
PA=I ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు, ఆమె అంఘ్ ప్రాంగణంలో ఉన్న అనేక వెదురు గుడిసెలలో ఒకదానిలో కూర్చొని
ఉన్నారు. ఆమె చాలా నెమ్మదిగా మాట్లాడతారు, పండుగ ప్రాంగణం నుండి బిగ్గరగా వినవస్తోన్న హర్షధ్వానాల మధ్య కొన్నిసార్లు ఆమె గొంతు వినిపించకుండా పోతోంది. మేం ఆమె ఫోటోలు తీయడానికి అనుమతి కోరినప్పుడు, ఆమె సంతోషంగా లేచి, మరింత లాంఛనప్రాయమైన సంప్రదాయ దుస్తులను, ఆభరణాలను ధరించేందుకు వెళ్ళారు.
ఆమె భుజం, కాలు, చేతులపై ఉన్న పచ్చబొట్లు ఆమె పెళ్ళికి ముందు వేయించుకున్నవి. ఆ పచ్చబొట్లు ఆభరణాల లాంటి వని చెబుతూ ఆమె, “ఆ రోజుల్లో మేం వేసుకునే బట్టలు పొట్టిగా ఉండేవి, కాబట్టి పచ్చబొట్లు మా శరీరాన్ని కప్పుకోవడానికి ఒక మార్గంగా
ఉండేవి,” అన్నారు. గోన్ఫేకు తన భుజంపై ఉన్న పచ్చబొట్టు అంటే చాలా ఇష్టం. “దాన్ని నా తోబుట్టువులలో ఒకరు వేశారు,” ఆమె నవ్వుతూ చెప్పారు. “అందుకే అదంటే నాకు చాలా ఇష్టం.” నాగాలాండ్ లోని మొన్ జిల్లాలో ఉన్న స్వగ్రామమైన లీంఘాలో చాలా చిన్న వయసులోనే ఆమె తన మొదటి పచ్చబొట్టును వేయించుకుంది. “చాలా నొప్పిగా అనిపించింది, నేను ఏడ్చాను,” అన్నారామె.
వివాహమైన తర్వాత, ఆమె వేయించుకున్న మొదటి పచ్చబొట్టు తొడపై ఉంది. దానిని రాణి, అంటే అంఘ్ మొదటి భార్య, ఆమె సొంత సోదరి అయిన అర్హెన్ వేశారు. సంప్రదాయం ప్రకారం, కొన్యాక్ ముఖ్యుడు ఎక్కువసార్లు వివాహాలు చేసుకోవచ్చు, అయితే సముదాయంలోని మిగిలినవారంతా ఏకపత్నీ వ్రతాన్ని పాటించేవారు.
రెండో భార్య అయినందున, గొన్ఫేకు ఎప్పుడూ టూ (పచ్చబొట్టు) వేసే అవకాశం రాలేదు. శియాంఘాచింగ్న్యులో ఆమె వంటగదిలోనూ, పొలాల్లోనూ పనిచేస్తూ, కుటుంబానికి చెందిన పిల్లలను కూడా చూసుకునేవారు.
నాగాలాండ్‌లోని తమ్లు, కాంగ్‌చింగ్, వాక్‌చింగ్, వాన్‌చింగ్ వంటి గ్రామాలు బాప్టిస్ట్ మిషన్‌తో తొలి పరిచయాన్ని కలిగి ఉన్నాయి. క్రైస్తవ మతం రాక కొన్యాక్ ప్రజల జీవన విధానంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువచ్చింది. కొన్యాక్ సముదాయంలో సంప్రదాయ వైద్య పద్ధతులు సర్వసాధారణంగా ఉన్న ఆ రోజుల గురించి గుర్తు చేసుకుంటూ, “మాకు వైద్యులు ఉండేవారు కాదు, ఆసుపత్రులకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు,” అన్నారు, శియాంఘాచింగ్‌న్యుకు చెందిన రైతు కాయ్?థీ కొన్యాక్. “మా సముదాయంలోనే వైద్యం చేసేవారు ఉండేవారు.” బాప్టిస్ట్ మిషన్ వలన విద్యావంతులైన యువకులతో ఒక కొత్త తరం తయారయింది. 1946లో కొన్యాక్ విద్యార్థి సంఘాన్ని స్థాపించిన వారు, సామాజిక, మతపరమైన కార్యకలాపాలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. తలల వేటతో సంబంధం ఉన్నందున, పచ్చబొట్లను వేయించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్ ఒక దృఢమైన వైఖరిని తీసుకుంది. 1960లో పచ్చబొట్లకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. యానిమిజం (ప్రతి జీవంలోనూ ఆత్మ ఉంటుందనే మతం), వారి ఆరాధనా మార్గం వలె, పచ్చబొట్లను కూడా అన్యజనుల ఆచారంగా గుర్తించారని ఫెజిన్ కొన్యాక్, ద కొన్యాక్స్: లాస్ట్ ఆఫ్ ది టాటూడ్ హెడ్?హంటర్స్ అనే తన పుస్తకంలో రాశారు. ఈనాటి యువతరం కొన్యాక్‌ల సంప్రదాయ నమూనాలను బట్టి కాకుండా సోషల్ మీడియా, ప్రపంచ పోకడలు, వ్యక్తిగత సౌందర్య భావనల నుండి ప్రేరణ పొందిన ఆధునిక, ఫ్యాషన్ టాటూలను వేయించుకుంటున్నారని అమో అన్నారు.
కొన్యాక్ పచ్చబొట్లు ఇప్పుడు ఆ సముదాయంలోని పెద్దల చర్మంపై మాత్రమే కనిపిస్తాయి; ఈ ఆచారం చిన్నతనంలోనే దానిని నేర్చుకున్న అర్హెన్, గొన్ఫే వంటివారి హృదయాలలోను, ఆ బాధాకరమైన ప్రక్రియ తర్వాత విశ్రాంతి తీసుకోమని యువరాణులకు సలహా ఇచ్చే వారి పాటలలోను నిలిచి ఉంది.
ఈ కథనం తయారీలో సహాయం చేసినందుకు సర్ పెయిహాంగ్ వాంగ్‌సా కొన్యాక్, పాంగ్నేయ్ డబ్ల్యూ. కొన్యాక్, లెమొనెయ్ కొన్యాక్‌లకు ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.