ఎనభై ఆరేళ్ళ లలితా రాందాస్ జీవన ప్రస్థానంలో.. రాజకీయంగా, సామాజికంగా, విద్యావ్యవస్థలో వచ్చిన పరిణామాలు పాఠకులకు అవగాహనకు వస్తాయి. బాల్యంలో సహచరులిద్దరి జీవితాలలో జరిగిన సశీఘటనలు.. భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ దేశాల శాంతి సయోధ్యకు పనిచేసేలా చేసాయి. ఇండియన్ నేవీ కుటుంబాలకు ఉండే హై సెక్యూరిటీ సిస్టం పెట్టని కోటగోడ లాంటిది.
అలాంటి పరిస్థితులలో ఇండియన్ నేవీలో ఉన్నత స్థాయిలో పని చేసిన రాందాస్ కటారి గారి కూతురుగా, లక్ష్మీ నారాయణ రాందాస్ గారి సహచరిగా ఆ పరిధుల్లో నుంచే సామాజిక మార్పు కోసం, శాంతియుత సమాజం కోసం ఆమె చేసిన కృషి అభినందనీయం. ఆ వివరాలు ఆమె మాటల్లోనే భూమిక పాఠకుల కొరకు..
ప్ర. నమస్తే మేడమ్! నేను గిరిజ పైడిమర్రి. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను.
జ. రండి, గిరిజా! కూర్చోండి. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను అక్కా! అని పిలవండి. ఈ పిలుపులో ఆత్మీయత, అనుబంధం ఉంటుంది. మేడమ్ అనే పిలుపులో అధికారం, హోదా, హెచ్చు తగ్గులుంటాయి. లేదంటే, సింపుల్ గా లలితా! అని పిలవండి.
ప్ర. మీరు చెప్పింది అక్షరాల నిజం అక్కా! మీరు తెలుగులో మాట్లాడగలరా?
జ. ఇంగ్లీష్, హిందీ, కొంచం తెలుగులో మాట్లాడుకుందాం.
ప్ర. మీరు ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. నేను ఫిబ్రవరి 4న 1940లో కలకత్తాలో జన్మించాను. అమ్మ పేరు ధనరత్నం. ఆమె గృహిణి. కానీ బోటింగ్ , క్రీడల్లో చాలా నైపుణ్యం ఉంది. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎం ఏ ఇంగ్లీష్ చేసింది. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ ఛాన్స్‌లర్‌గా ఉండేవారు. నాన్న పేరు రాందాస్
కటారి. హైదరాబాదు స్వస్థలం. మద్రాసు ప్రెసిడెన్సీలో ఇంజినీరుగా పనిచేసేవారు. స్వాతంత్య్ర భారతదేశానికి మా నాన్న 1958లో మొట్టమొదటి నావెల్ చీఫ్ అయ్యారు. అప్పుడు మా నాన్న వయసు 37 యేళ్ళు. 1947లో స్వాతంత్య్రం వచ్చాక వయసూ అనుభవం రెండూ తక్కువ కావడం వల్ల మా నాన్న వెంటనే అంత పెద్ద బాధ్యత తీసుకోడానికి అంగీకరించలేదు. అందువల్ల బ్రిటిష్ వాళ్ళే నేవీ కమాండర్ చీఫ్‌గా ఒకరి తర్వాత ఒకరు పనిచేసారు. నాకొక తమ్ముడు. పేరు రవి. 1944లో మహారాష్ట్రలోని ఖండాలాలో పుట్టాడు. ఇలా మేమిద్దరం మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే జన్మించాము.
ప్ర. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. మా నాన్న ఉద్యోగ బదిలీల కారణంగా నా చదువు నిలకడగా ఒకచోట సాగలేదు. అందువల్ల డాక్టరు కావాలని ఉన్నా కాలేకపోయాను. మహారాష్ట్రలోని లోనావాలాలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో మూడో తరగతి వరకు చదువుకున్నాను. అక్కడి నుంచి మా నాన్నకు ఢిల్లీకి బదిలీ అయింది. అక్కడ నేను కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ హైస్కూల్‌లో, 1949లో ఐదో తరగతిలో చేరాను. తర్వాత ఒక ఏడాది ఊటీలోని సెయింట్ నాజరస్ హైస్కూల్‌లో చదివాను. ఫ్యామిలీ ప్యాకేజీ ఇచ్చి 1953లో నాన్నను ఇంగ్లాండుకు బదిలీ చేసారు. అక్కడ ఒక ఏడాది చదువుకున్నాను. అక్కడి మిత్రులు ఇప్పటికీ నాతో మాట్లాడుతూ వుంటారు. 1954 మళ్ళీ ఢిల్లీకి వచ్చాము. నేను ఇంతకు ముందు చదివిన కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ స్కూల్‌లోనే చేరాను. 1955లో సీనియర్ కేంబ్రిడ్జ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసాను. ఇది ఎసఎస్‌సి లాంటిదన్న మాట. 1960లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆనర్స్, ఇంగ్లీషు సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసాను.
ప్ర. మీ స్కూల్ ఫైనల్ కు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పండి
జ. ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్ కొరకు ప్రత్యేకమైన బోర్డులు లేవు. విశ్వవిద్యాలయంలో భాగంగానే నేను చదువుకున్న స్కూల్ కూడా ఉండేది. ఇప్పుడు ఉనికిలో వున్న ఐసి ఎస్ సి, సి బిఎస్ సి, ఎస్ ఎస్ సి లాంటి బోర్డులు కొఠారి కమిషన్ సిఫారసుల వల్ల 1964 – 66లో ఏర్పడ్డాయి.
ప్ర. మీ మీద తీవ్రంగా ప్రభావం వేసిన బాల్య సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
జ. స్వాతంత్య్రోద్యమం జరుగుతున్న రోజులవి. నేను లోనావాలాలోని సెయింట్ పీటర్ హైస్కూల్‌లో చదువుతున్నాను. నాకు ఒక ముస్లిం అమ్మాయి స్నేహితురాలిగా ఉండేది. ఆమె పేరు నిగార్. బడి నుంచి ఇంటికి వెళుతుండగా షాపులు మూసేస్తున్నారు. వీధులన్నీ కోలాహలంగా వున్నాయి. జనం హడావుడిగా అటు ఇటూ తిరుగుతున్నారు. అంతా గందరగోళంగా వుంది. కారణం గాంధీజీని హత్య చేసారట. అది తెలిసి నేను నా ఫ్రెండు నేలమీద పడి ఏడుస్తూ దొర్లుతున్నాము. ఏడుపు ఆగలేదు. బాల్యంలోని ఈ సంఘటన నా మీద చాలా ప్రభావం వేసింది.
ప్ర. చిన్నపిల్లలు, మీరిద్దరే ఇంటికి వస్తున్నారు కాబట్టి భయంతో ఏడ్చారా?
జ. కాదు, భయం కాదు. ఆ కాలంలో చిన్నపిల్లలమైన మాకు గాంధీజీ చేసే గొప్ప పనులు తెలిసి ఆయనంటే గౌరవం. ప్రేమ. ఒక్కమాటలో చెప్పాలంటే హీరో. అలాంటి వ్యక్తిని ఎవరో చంపేసారని తెలిసి దుఃఖం ఆగలేదు. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన ఒక సంఘటన నా సహచరుడు రాము బాల్యంలో కూడా జరిగింది. అది ఆయన భవిష్యత్తు మీద ప్రభావం వేసింది. ఇవి మా యిద్దరి సాహచర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా కలిసి జీవిస్తూ సమాజమార్పు కోసం నేను ఎన్నో కార్యక్రమాలు చేయడానికి పునాది అయ్యాయి.
ప్ర. రాందాస్ గారి బాల్యంలో జరిగిన సంఘటన గురించి చెప్పండి.
జ. ఇండియా పాకిస్తాన్ విభజన సందర్భం. 1947లో అనుకుంటాను. మా మామ గారు చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బెంగాల్ కాలనీలో ఉండేవారు. ఆయన సహోద్యోగి గులాం మహ్మద్ మంచి మిత్రులు. అది ఇండియా పాకిస్తాన్ విభజన సందర్భం. 1947లో అనుకుంటాను. హిందువులు ముస్లిం కుటుంబాల మీద దాడి చేస్తున్నారు. ఆ సందర్భంలో గులాం మహమ్మద్ కుటుంబానికి మా మామగారు తమ ఇంట్లో ఆశ్రయం కల్పించారు. అల్లరి మూకలు వచ్చి వాళ్ళను బెదిరించారు. “వాళ్ళు మా మిత్రులు. ముందు మమ్మల్ని దాటి వాళ్ళను అటాక్ చేయండి.” అన్నారట. అప్పుడు మా అత్తగారు బ్రాహ్మణ స్త్రీ కనుక పెద్ద బొట్టుతో సాంప్రదాయకమైన చీరకట్టులో ఉన్నారు. అది చూసి అల్లరి మూకలు తిరిగి వెళ్లి పోయాయి. పాత ఢిల్లీ నుంచి సైకిల్ మీద వచ్చిన పదిమూడేళ్ళ రాము కంగారుగా ఇదంతా చూశాడు. వాళ్ళ నాన్న రాముతో “మనం చేసేపని ధర్మబద్ధమైతే మనం దేనికీ భయపడ వద్దు. ఎవరికీ తలవంచ వద్దు.” అని చెప్పాడట. ఆ సంఘటన, వాళ్ళ నాన్న చెప్పిన మాటలు రాము మనసులో స్థిరంగా ముద్ర వేశాయి.
ప్ర. మీది ప్రేమ పెళ్ళా? ఆ విశేషాలు చెప్పండి.
జ. మా ప్రేమను ఆమోదించి పెద్దలు చేసిన పెళ్ళి. రాము మా నాన్నగారి దగ్గర ఏ డి సి గా వున్నారు కాబట్టి తరచుగా మా ఇంటికి వచ్చేవారు. మా మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. వాళ్ళు తమిళులు. విషయం తెలిసిన మా నాన్న గారు ఏ డి సి నుంచి రామును తన సొంత పోస్టుకు పంపించారు. ఆ తర్వాత మా పెళ్ళి 1961లో జరిగింది. రాము పూర్తి పేరు లక్ష్మినారాయణ రాందాస్ నేవీలో లెప్టినెంట్ క్యాడర్‌లో పనిచేసేవారు. వయసు 28 సంవత్సరాలు. నా వయసు పెళ్ళి నాటికి 21 యేళ్ళు.
ప్ర. ప్రేమంటే మీ అభిప్రాయం?
జ. ప్రేమ చాలా పవర్ ఫుల్. డిగ్రీ పూర్తి చేశాక నాకు అమెరికా వెళ్ళి ఉన్నత విద్య చదువుకోవాలని ఉండేది. జర్నలిజం, ఎడ్యుకేషన్ సబ్జెక్టులతో అప్లై చేసాను. అమెరికాలో అడ్మిషన్ కూడా వచ్చింది. ఆర్థిక పరిస్థితి అను కూలించక పోవడంతో నేను ఉద్యోగం చేసి డబ్బు పోగు చేసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందుకని పగలు ఒక ప్రైమరీ స్కూలులో పని చేస్తూ రాత్రి ఆల్ ఇండియా రేడియోలో ఎక్స్‌టర్నల్ సర్వీసెస్‌లో అనౌన్సర్‌గా పార్ట్ టైం ఉద్యోగం చేసేదాన్ని. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా బదిలీల కారణంగా ఒక చోట స్థిరంగా ఉండలేదు. అందుకని బదిలీలు తక్కువుగా వుండే, ఒక చోట స్థిరంగా వుండగలిగే ఉద్యోగస్తుణ్ణి పెళ్ళి చేసుకొని ఒకేబోట స్థిరంగా ఉండాలనుకునేదాన్ని. రాము ప్రేమ ముందు నా ఈ రెండుకోరికలు చిన్నవిగా అనిపించాయి. అందుకే ప్రేమ శక్తివంతమైనదని నమ్ముతాను.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. నాకు ముగ్గురు ఆడపిల్లలు 1962లో కవిత ఢిల్లీలో పుట్టింది. 1964లో సాగరి హైదరాబాదులో పుట్టింది. మల్లిక 1965లో కొచ్చిన్ లో పుట్టింది. కవితకు, మల్లికకు ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఆరేళ్ళ వయసులో కవితకు ఒక కిడ్నీ తీసేసారు. మల్లికకు హార్ట్ సమస్య ఉండేది. ఇప్పుడు అందరూ బాగున్నారు. అందరూ ఉన్నత విద్యావంతులు. వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. ముగ్గురు పిల్లలూ మూడు మతాల వాళ్ళను పెళ్ళి చేసుకున్నారు. అది నేను గర్వంగా ఫీల్ అవుతాను. కవిత పాకిస్తాన్ ముస్లిం అబ్బాయిని పెళ్ళి చేసుకొని అమెరికాలో స్థిరపడింది.
ప్ర. రాందాస్ గారికి ‘వీర్ చక్ర’ ఎప్పుడు వచ్చింది?
జ. బంగ్లాదేశ్ విభజన సమయంలో ఆయన షిప్ వార్‌లో పనిచేసారు. 1971లో ‘వీర్ చక్ర’ లభించింది.
ప్ర. మీరు జర్మనీలో కూడా ఉన్నారు కదా? ఆ వివరాలు చెప్పండి.
జ. 1973లో రామును ప్రత్యేక శిక్షణ కొరకు కుటుంబ సమేతంగా జర్మనీకి పంపించారు. అందువల్ల నేను పిల్లలు కూడా జర్మనీకి వెళ్ళాము. అక్కడే మా చిన్నపాపకు హార్ట్ సర్జరీ అయింది. శిక్షణ తర్వాత ముంబైకి వచ్చాము.
ప్ర. పిల్లలతో, నేవీ సర్వీసెస్ కుటుంబ బాధ్యతలతో వున్న మీరు సామాజిక సేవా రంగంలోకి ఎలా వచ్చారు?
జ. 1977లో ముంబై సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో నేను టీచర్‌గా పని చేసాను. అప్పుడు “ఎడ్యుకేషన్ టూ రియాలిటీ” అనే శీర్షికతో పది రోజులు వర్క్ షాప్ జరిగింది. దాని వల్ల నాకు సమాజం అసలు రూపం తెలిసింది. ఆ సంఘటననే సామాజిక మార్పు కొరకు నేను పని చేయడానికి దారి తీసింది.
ప్ర. మీరు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరించండి.
జ. పాత ఢిల్లీలోని ముస్లిం బస్తీల్లోని అమ్మాయిలకు తరగతులు నిర్వహించే వాళ్ళం. అదే సమయంలో మహిళా ఉద్యమాలతో పరిచయమైంది. మధుర రేప్ కేస్‌లో పని చేసాను. సంతకాల సేకరణ చేశాము. రాష్ట్రపతి భవన్ దాకా ఈ కార్యక్రమాలను తీసుకుపోయాము. SUPఔ (sశీcఱaశ్రీశ్రీy usవfuశ్రీ జూతీశీduct wశీతీk) ప్రభుత్వ బడుల్లో, బస్తీ పిల్లలతో చేయించే వాళ్ళం.
ప్ర. అంకుర్ సంస్థను ఎప్పుడు స్థాపించారు ?
జ. 1981లో ఏడుగురు మిత్రులం కలిసి ‘అంకుర’ సంస్థను స్థాపించాము. వారిలో ప్రముఖ స్త్రీవాది కమలా బాసిన్ ఒకరు. వరకట్న మరణాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాము. అది ఆ రోజుల్లో పెద్ద ఉద్యమంగా మారింది. రేప్ కేసులకు గృహహింసకు వ్యతిరేకంగా పోరాటం చేసాము. stతీవవt tష్ట్రవatవతీ ను ఏర్పాటు చేసి నాటకాలు ప్రదర్శించేవాళ్ళం.
ప్ర. ఇందిరాగాంధి హత్య సందర్భంలో జరిగిన అల్లర్లకు వ్యతిరేకంగా మీరు పోరాడినట్లు తెలిసింది. ఆ వివరాలు చెప్పండి.
జ. 1984 అక్టోబర్ 31న ప్రధాన మంత్రి ఇందిరాగాంధి హత్య జరిగింది. ఆ సందర్భంలో మేము మా ఆఫీసులో ఉన్నాము. మా టీచర్స్‌ను వెంటనే ఇళ్ళకు పంపించాము. వాళ్ళు లాండ్ లైన్‌కు ఫోన్ చేసి “దీదీ! చాలా గొడవలు జరుగుతున్నాయి. మేము ఎలాగో తప్పించుకొని ఇళ్ళకు చేరాము.” అని చెప్పారు. సిక్కు మతస్థులను టార్గెట్ చేసారు. ఎవరు తలపైన పాగాతో (ణastaతీ), గడ్డంతో కనిపిస్తే వాళ్ళను చంపేవారు. అలా వేలాది మంది పురుషులు చనిపోయారు. సిక్కు స్త్రీలను శారీరకంగా హింసించిన, రేప్ చేసిన సంఘటనలు కూడా వున్నాయి. మేము పగలంతా బస్తీలలో స్త్రీలను కలిసి సాయంత్రం అందరం ఒకచోట కూర్చొని ఏ రోజు రిపోర్టు ఆరోజు రాసేవాళ్ళం. అలా ఆ దాడులలో జరిగిన నష్టానికి సంబంధించిన మొత్తం డేటాను “ఔష్ట్రశీ ఱs స్త్రuఱశ్రీt” అనే పేరుతో రిపోర్టు తయారు చేశాము. ఆ సమయంలో మేము బట్టలు, సరుకులు, డబ్బులు, మందులు మొదలైన వాటిని విరాళంగా సేకరించి అందజేసాము. అప్పుడు స్వామి అగ్నివేష్‌తో అందరం కలిసి లజపతి నగర్‌లో శాంతి ర్యాలీలో పాల్గొన్నాము. అక్కడ చాలా సిక్కుల కుటుంబాలు ఉంటాయి. అందులో పి.యు.సీ.ఎల్, పి.యు.డి.ఆర్ సంస్థలు కూడా పాల్గొన్నాయి. ర్యాలీలో ముందు స్వామి అగ్నివేష్, మహిళలు, వెనక వరసలలో పురుషులు ఉన్నారు. త్రిశూలం, కత్తులు, కటార్లు పట్టుకొని ‘జై శ్రీరాం’ అంటూ మాకు ఎదురుగా పెద్ద అల్లరి గుంపు ఒకటి వచ్చింది. దూరం నుంచే దానిని గమనించిన స్వామి “ఏమీ నినాదాలు ఇవ్వకుండా, నిశ్శబ్దంగా నిల్చుండి పొమ్మని” సూచించారు. ఆ క్షణంలో వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారనే అనుకున్నాను. స్వామి అగ్నివేష్ సూచన మేరకు వాళ్ళు దగ్గరకి రాగానే రెండు చేతులు జోడించి నమస్తే చెప్పి నిలబడిపోయాను. మేము శాంతిని కోరుతూ ర్యాలీ తీస్తున్నామని వాళ్ళతో మాట్లాడి పంపించారు. అన్నీ కోల్పోయిన సిక్కు మహిళలే గురుద్వారలలో లంగరు పెట్టి ఆకలి తీర్చారు. ఆ వివరాలు జస్టిస్ రంగనాథ్ మిశ్రా 1984 రిపోర్టులో లభిస్తాయి.
ప్ర. ఆ సందర్భంలో రాందాస్ గారి స్పందన గురించి చెప్పండి.
జ. సాధారణంగా కుటుంబాలలో ముఖ్యంగా నేవీ సర్వీసెస్ కుటుంబాలలో స్త్రీలను ఇలాంటి పనులు చేయడానికి అనుమతి ఇవ్వరు. తంబోల ఆడుకొండి, ఎంజాయ్ చేయండి అంటారు. కానీ మా కుటుంబం అలా లేదు. అప్పుడు రాము సదరన్ నేవల్ చీఫ్ కమాండర్‌గా విశాఖ పట్టణంలో ఉన్నారు. పిల్లల చదువుల నిమిత్తం నేను ఢిల్లీలో ఉండేదాన్ని. ఏ విషయమైనా ముందే చర్చించుకునే వాళ్ళం. కానీ ఈ సంఘటన జరిగిన సమయంలో రాము సముద్రంలో షిప్ మీద ఉన్నారు. ఇప్పటి లాగా ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లాంటివి లేవు. ఇంట్లో ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉండేది. తాను తిరిగి విశాఖపట్టణం చేరుకున్నాక గత నెల రోజుల నుంచి నేను చేసిన పనుల గురించి వివరించాను. నేను ఏదో గురుద్వారాలో మాట్లాడుతున్నప్పుడు టీవీలో చూసారట. దానివల్ల ఆయన ఉద్యోగానికి ఏమైనా ప్రమాదం వస్తుందనే అనుకున్నాను. కానీ ఆయన “నువ్వు చేసింది, చేస్తున్నది న్యాయ పోరాటమే. కనుక నా కెరియర్ గురించి ఆలోచించ కుండా నీ పనిని నీవు కొనసాగించు.” అని నన్ను ప్రోత్సహించారు.
ప్ర. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మీరే మొదటిసారి జరిపారని విన్నాను. ఆ వివరాలు చెప్పండి.
జ. 19875 చీఫ్ సదరన్ నేవల్ కమాండర్‌గా ప్రమోషన్ వచ్చింది రాముకు. ఢిల్లీ నుంచి కొచ్చిన్‌కు బదిలీ అయింది. నేవీ నివాస కాలనీలలో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని సదుపాయాలు అక్కడే ఉండడం వల్ల బయటి ప్రపపంచం తెలియదు. ఆఫీసర్ల భార్యలకు, కింది ఉద్యోగస్తుల స్త్రీలకు మధ్య అంతరాలు కూడా పాటిస్తారు. కింది స్థాయి మహిళలకు మాత్రమే గృహహింస ఉంటుందని అనుకునేవారు. కానీ స్త్రీలందరూ హింసకు గురవుతున్నారనే విషయాన్ని మాట్లాడి ఈ విషయంలో మహిళలందరూ ఒక్కటే అని చెప్పాను ఒక మీటింగ్‌లో.. ఆ తర్వాత ఇద్దరు ఉన్నతస్థాయి మహిళలు నా వెనకాల పరుగెత్తికొనివచ్చి నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలని అన్నారు. వాళ్ళు తమ భర్తలచేత హింసకు గురవు తున్నారని తర్వాత తెలిసింది. అక్కడ నవ్వా ( నేవీ వైఫ్ వెల్ ఫేర్ అసోసియేషన్) కేంద్రా ప్రారంభించాము. అందులో ఆఫీసర్ల భార్యలు, కిందిస్థాయి ఉద్యోగుల భార్యలు కూడా ఉండేవారు. 1992లో నేవీలోకి మహిళలను ఆఫీసర్‌లుగా రిక్రూట్ చేసుకున్నారు. పితృస్వామ్య వ్యవస్థలో నుంచి వచ్చిన ఆఫీసర్లు కొత్తగా వచ్చే మహిళా ఆఫీసర్లను తమతో సమానంగా చూసే విధంగా జెండర్ సెన్సిటైజేషన్ శిక్షణా తరగతులు నిర్వహించాము. అందువల్ల నవ్వా నేవీ వెల్ ఫేర్ అండ్ వెల్ నెస్ అసోసియేషన్‌గా మారింది… దానిలో భాగంగానే మొదటిసారిగా 1988లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదో తేదీన నిర్వహించాము. 1989లో ఈస్టర్న్ నేవీలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాము. తర్వాత జాతీయస్థాయి నేవీలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్ర. మీరు చేసిన ఇతర కార్యక్రమాల గురించి వివరించండి
జ. తరువాత సఖి సెంటర్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళం. ఏవైనా కేసులుంటే వాటి పరిష్కార దిశగా పనులు జిరిగేవి. ఒకసారి నేను హాస్పిటల్‌కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గదిలో కొంతమంది ప్రత్యేక అవసరాలు (dఱsabశ్రీవd) కలిగిన పిల్లలు కనిపించారు. వాళ్ళందరూ అక్కడ పనిచేసే వారి పిల్లలని తెలిసింది. వాళ్ళను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ సంఘటన వల్ల తర్వాత నేను అలాంటి పిల్లల కొరకు ‘సంకల్ప’ను ఏర్పాటు చేసి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా చేసాము. అది జాతీయ స్థాయిలో పనిచేస్తోంది. తర్వాత ఆఫీసర్ల ఇళ్ళలో పనిచేయడానికి వచ్చే మహిళల పిల్లల కొరకు ‘బాల పాఠశాలను’ ఏర్పాటు చేసి వాళ్ళకు చదువు చెప్పడం మొదలు పెట్టాము. నేనీ వాళ్ళు భవనం ఇచ్చారు. ఆఫీసర్ల కుటుంబాల నుంచి విరాళాలు సేకరించి దానిని నడిపించాము. అక్కడ ప్రైమరీ స్థాయి వరకు చదువుకున్న పిల్లలు తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఈనాడు చాలా చోట్ల ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. అది కూడా ఇప్పటికీ నడుస్తోంది.
ప్ర. విశాఖ పట్టణంలో మీరు చేసిన కార్యక్రమాల గురించి చెప్పండి.
జ. 1989లో విశాఖ పట్టణానికి వచ్చాము. వాతావరణ సమతుల్యత, ప్రకృతి పరిరక్షణ, కాలుష్యానికి వ్యతిరేకంగా పనిచేసాము. అవగాహనా కార్యక్రమాలు చేసాము. వయోజనుల కొరకు ‘అనుభవి’ అనే సంస్థను ఏర్పాటు చేసాము. వాళ్ళు వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండడం కొరకు అది ఈనాటికీ పనిచేస్తోంది. ఇవన్నీ నవ్వా కేంద్రలో భాగంగానే నడుస్తున్నాయి.
ప్ర. మీరు అలీబాగ్‌లో ఎన్నిసంవత్సరాలు ఉన్నారు? అక్కడి విశేషాలు చెప్పండి.
జ. 1993 సెప్టెంబర్‌న రాము రిటైర్డ్ అయ్యారు. వీర్ చక్ర అవార్డు ఇచ్చినప్పుడు అలీబాగ్ తాలూకాలోని ‘భాయిమల’ అనే చిన్న గ్రామంలో కొంత భూమి ఇచ్చారు. అదృష్టవశాత్తు దానిని ఎవరూ ఆక్రమించలేదు.
రాము రిటైర్డ్ అయిన తర్వాత నవంబర్‌లో మేము భాయిమల గ్రామానికి వెళ్ళాము. అది చాలా చిన్న గ్రామం. కరెంటు సౌకర్యం కూడా లేదు. అక్కడ మేము దాదాపు 30 ఏళ్ళు ఉన్నాము. అక్కడ మహిళా సాధికారతకు సంబంధించి చాలా పనులు చేసాము. ఇండియా పాకిస్తాన్ విద్యార్థులకు ఇంటర్ ఎక్సేంజ్ విద్యా కార్యక్రమాలు చేసాము. ఇండియాలో 1988 పోఖ్రాన్‌లో 1988 మేలో పాకిస్తాన్‌లో చగాయి అనే చోట్ల అణు పరీక్షలు జరిగాయి. అది ఇరుదేశాలకు ప్రమాదకరం. అణు పరీక్షలకు వ్యతిరేకంగా మేము పనిచేశాము. అందుకే ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేశాము. ఇండియా పాకిస్తాన్ పీస్ ఫోరంకు రాము అధ్యక్షులుగా ఉన్నారు.
ప్ర. నేవీ సర్వీసెస్ లో ఉన్నత ఉద్యోగంలో ఉన్న వ్యక్తి కూతురు పాకిస్తాన్ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి ఇబ్బందులు ఏమీ రాలేదా?
జ. అది చాలా జటిలమైన సందర్భం. రాము అప్పుడు సదరన్ చీఫ్ నేవల్ కమాండర్‌గా పని చేస్తున్నారు. జల్ఫీకార్ అహమ్మద్, కవిత అప్పటికే కలిసి ఉన్నారు. ఆమె “నేను పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల మీ కెరియర్‌కు ఏమైనా ఇబ్బంది ఉంటుందా?” అని వాళ్ళ నాన్నను అడిగింది. ఆయన అందుకు అంగీకరించి డిఫెన్స్ మినిష్టర్ రాజారమన్న అనుమతి అడిగినప్పుడు .. ఆయన “మీ అమ్మాయి మీ మీద ఆర్థికంగా ఆధారపడి ఉందా? లేనప్పుడు .. ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది.” అని తన అంగీకారం తెలియజేసి ప్రధాన మంత్రి దగ్గరకు వెళ్ళమని సూచించారు. అప్పుడు ప్రధానమంత్రి విపి సింగ్. డిఫెన్స్ మినిష్టర్ వల్ల విషయం తెలుసుకున్న ఆయన అనుమతిచ్చారు. 1990 ఏప్రిల్‌లో కవిత పెళ్ళి జరిగితే 1990 సెప్టెంబర్‌లో “చీఫ్ నేవల్ కమాండర”గా రాము పేరును ప్రకటించారు. అప్పటి రాజకీయ వ్యవస్థ ఎంత నిజాయితీగా, పారదర్శకంగా ఉండేదో తెలియజేయడానికి ఇదంతా చెప్పాను. ఇప్పుడు మాట్లాడే హక్కును కూడా కోల్పోయే పరిస్థితలలోకి నెట్టివేయబడ్డాము.
ప్ర. మీరు బీజింగ్ ఉమెన్స్ కాన్ఫరెన్సుకు వెళ్ళారు కదా.. ఆవిశేషాలు చెప్పండి.
జ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్ అనే సంస్థకు 1994లో ప్రసిడెంట్‌గా నన్ను ఎన్నుకున్నారు. 1995లో బీజింగ్‌లో వుమెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ముంబై వెళ్ళడానికి నాలుగు గంటలు ప్రయాణం చేయాలి. అది ఒక పెద్ద సాహసమే. ఎందుకంటే ఆరోజుల్లో సెల్ ఫోన్లు, ఇంటర్ నెట్, వైఫై సౌకర్యాలు లేవు. ఏషియా సౌత్ పసిఫిక్ బ్యూరో ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ (ఇది చీGO), గవర్నమెంట్ వుమెన్స్ డెలిగేషన్, నుంచి బీజింగ్ వుమెన్స్ కాన్ఫరెన్స్‌కు నేను హాజరయ్యాను. ముప్ఫైయేళ్ళు గడిచిపోయినా పరిస్థితులేమీ మారలేదు.
ప్ర. చివరి ప్రశ్న అక్కా! ప్రస్తుత పరిస్థితుల మీద మీ అభిప్రాయం చెప్పండి.
జ. సైనిక సేవా రంగంలో పని చేసిన మేము రాజ్యంగాన్నే నమ్ముతాము. ఉద్యోగంలో చేరేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఈనాడు రాజ్యాంగాన్ని పక్కకు తోసి మనుస్మృతిని ముందుకు తెస్తున్నారు. మన దేశం భిన్న సంస్కృతుల, భిన్న భాషల ప్రత్యేకమైన సంగమం. దానిని పక్కకు పెట్టి ఒకే మతం కిందకు తీసుకవచ్చే ప్రయత్నాలు జరగడం బాధగానే ఉన్నాయి. మన లాంటి విభిన్నమైన దేశంలో సామాజిక మార్పు ఒక్క రోజులో రాదు. ముందు పితృస్వామ్య వ్యవస్థను కూలదోయడానికి ప్రజలందరూ కలసికట్టుగా ప్రయత్నించాలి. అప్పుడే మన సమాజంలో మార్పు వస్తుంది.
