అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
12. కారంచేడులో దళితుల రక్తంతో ఎరుపెక్కిన పొలాలు
ఇబ్రహీంపట్నంలో పని చేస్తున్నప్ప్పుడు భూస్వాముల దురహంకారం ఎంత దారుణంగా ఉంటుందో చూసి వున్నప్పటికి 1985లో కారంచేడులో జరిగిన ఘోరాన్ని తట్టుకోలేకపోయాను. 18 జులై 1985 నాటి దినపత్రికలో ‘కారంచేడులో ఆరుగురు దళితులను వెంటాడి గొడ్డళ్లతో నరికివేత’ అన్న వార్త చదివి ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యాను.

ప్రకాశం జిల్లా, చీరాల తాలూకా లోని అతిపెద్ద గ్రామాల్లో కారంచేడు ఒకటి. అది ఎన్.టి. రామారావు కూతురు దగ్గుబాటి పురందేశ్వరి మామ దగ్గుబాటి చెంచురామయ్య స్వస్థలం. పురందేశ్వరి 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆతర్వాత 2014లో బీజేపీలో చేరారు. కారంచేడు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కమ్మ కులస్తులదే ఆధిపత్యం. వారిలో చాలామంది దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకూ, కొత్తగా సాగులోకి వస్తున్న ప్రదేశాలకూ, నగరాలకూ వలసపోయినప్పటికీ కోస్తా ఆంధ్రలో అత్యధిక భూములను కలిగివున్నందువల్ల అక్కడి వ్యవసాయ రంగాన్ని వాళ్లే శాసిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ, ఆర్థిక రంగాలలో కీలకమైన స్థానాల్లో తిరుగులేని స్థితిలో వున్నారు. రాష్ట విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్టాల్లో వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఆరోగ్యం, సినిమాలు, టెలివిజన్, పత్రికలు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో కూడా కమ్మ ఆధిపత్యమే కొనసాగుతోంది.
16 జులై 1985న దళితులు మంచినీళ్ల కోసం ఉపయోగించే చెరువు మెట్ల మీద పోతిని శ్రీను అనే కమ్మ యువకుడు తన గేదెను కడుగుతూ చెరువులోని నీళ్లను మురికి చేయసాగాడు. అది చూసి కత్తి చంద్రయ్య అనే దళిత యువకుడు ‘ఇది మేం మంచినీళ్లకోసం వాడుకునే చెరువు, ఇక్కడ గేదెలను కడగొద్దు’ అన్నాడు. అంతే, అతడ్ని చర్నకోలతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు శ్రీను. అదేసమయంలో మంచినీళ్ల కోసం కుండ పట్టుకుని వచ్చిన సువార్తమ్మ అనే దళిత మహిళ ‘అతణ్ని ఎందుకలా కొడుతున్నావు?’ అని నిలదీసింది. దానికే శ్రీను రెచ్చిపోయి ఆమె మీదకు కూడా చర్నకోల ఝళిపించాడు. దెబ్బల నుంచి కాపాడుకునేందుకు ఆమె నీళ్లకుండను పైకెత్తి అడ్డుగా పెట్టుకుంది. ఆ చిన్న ప్రతిఘటనను కూడా అతను సహించలేక పోయాడు. మరి కాసేపటికే ఊళ్లోని కమ్మ కులస్తులంతా ఒక్కటై వచ్చి మాదిగవాడ మీద అన్ని వైపుల నుంచి దాడి చేశారు. మాదిగల ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పారిపోతున్న వారిని వెంబడించి కర్రలతో, గొడ్డళ్లతో, బరిసెలతో దారుణంగా విరుచుకుపడ్డారు.
కారంచేడు ఘటన గురించి వినగానే మేము బొజ్జా తారకం ఇంటికి వెళ్లాం. అక్కడ ఫోన్ ద్వారా ప్రత్యక్ష సమాచారం తెలిసింది. కారంచేడు దళితులంతా ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని చీరాల పట్టణానికి పారిపోయి ఒక చర్చిలో తల దాచుకున్నారు. స్థానిక దళితులు వారికి అన్నం పెట్టారు. స్థానికుడొకరు తారకంకు ఫోన్ చేసి జరిగిందంతా వివరించాడు. అందరికంటే ముందు పొన్నూరు నుంచి కత్తి పద్మారావు చీరాలకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆ ఊచకోత జరిగిన రెండో రోజో మూడో రోజో నేనక్కడికి వెళ్లాను. అదొక హదయవిదారక అనుభవం. తారకం, సిరిల్ మరికొందరు అక్కడ ఒక ఇంట్లో తలుపులు వేసుకుని కేసును ఫైల్‌చేసేందుకు బాధితులతో చర్చిస్తున్నారు. కారంచేడు బాధిత జనమంతా విశాలమైన ఆ చర్చి ఆవరణలో వున్నారు. మరికొందరు దగ్గరలోని తమ బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. నేను ఎవరినైనా ప్రశ్నించేందుకు అది సరైన సమయం కాదు. దళిత పురుషుల్ని చంపారు. ఒకరినైతే పొత్తికడుపులో బరిసెను గుచ్చి మెలిపెట్టి మరీ హత్యచేశారు. దళిత స్తీలపై లైంగిక దాడులు చేశారు. అనేకమంది దళితులను అమానుషంగా కొట్టారు. జనమంతా గుంపులు గుంపులుగా కూర్చుని చర్చించుకుంటూ అప్పుడప్పుడు మౌనం వహిస్తూన్నారు. కొన్ని సమూహాల్లోంచి రోదనలు వినిపిస్తున్నాయి. నేను చర్చి రోడ్డు వైపు వున్న గేటు వద్దకు వెళ్లాను. బియ్యం తదితర సరుకులను తీసుకుని ఒక లారీ వెనక మరొక లారీ అక్కడికి చేరుకుంటున్నాయి. వారిలో ఒకరిని అడిగితే తెలిసింది ఆ లారీల్లోని వాళ్లంతా దళితులే అని. వాళ్లు చుట్టు పక్కల గ్రామాల నుంచీ, పట్టణాల నుంచీ వచ్చారు. రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినవారు కూడా కొందరున్నారు. వాళ్లకి కారంచేడు దళితులెవరూ పరిచయం లేదు. అయినా సరే వారికి సంఘీభావంగా బియ్యం, ఇతర సరుకులను తీసుకొచ్చారు. వామపక్ష సంఘీభావం ఎలా వుంటుందో నాకు తెలుసు. అది ఒకరకం సాంస్కతిక సంఘీభావం. దళితులది జన్మతా వచ్చిన సంఘీభావం. మొట్టమొదటి సారిగా నాకు అంబేడ్కర్ ఉద్యమం దళితులలో ఎలాంటి ప్రేరణను కలిగిస్తోందో అర్థమయింది.
సలహా సంస్థ వారం రోజుల వ్యవధిలో ఒక నిజనిర్ధారణ కమిటీ విచారణకు ఏర్పాట్లు చేసింది. ఆ కమిటీలో నేను కూడా వున్నాను. కారంచేడు ఊచకోత సంఘటన జరిగిన తరువాత మొట్టమొదటి నిజనిర్ధారణ కమిటి ఇదే. మేం వెంటనే మా నివేదికను సమర్పించాం. మా బందంలో స్వతంత్ర రాడికల్ కమ్యూనిస్టు నాయకుడు కొల్లా వెంకయ్య, ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి, శాంతా సిన్హా, ఆర్. అఖిలేశ్వరి వున్నారు. ‘కారంచేడు 1985’ అన్న పేరుతో వెలువడిన పుస్తకమే ఆనాటి ఊచకోతపై వచ్చిన, తొలి సమగ్ర సమాచార నివేదిక. అది అత్యధికంగా ప్రస్తావించబడింది. కొల్లా వెంకయ్య మాతో వుండటం (ఆయన కూడా కమ్మ కులానికి చెందినవారు కావడం) వల్లనే మేం కమ్మకులస్థులతో సైతం చర్చించగలిగాం. ఆ సంఘటన గురించిన వివరాలు తమకు తెలియదన్నారు వాళ్లు. స్థానిక ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్ల్ల డీలర్‌ని కూడా కలిశాం. కారంచేడులో అలాంటి బైకులు మొత్తం నాలుగు వందల వరకూ వుంటాయన్నారు చెప్పారు. కమ్మవాళ్లు అత్యంత సంపన్నులు. అయితే కారంచేడులోని దళితులు కూడా ఇబ్రహీంపట్నం మాదిగలతో పోలిస్తే మరీ అంత పేదవాళ్లేంకాదు. వారిలో ఓ తహశీల్దారు, అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు వున్నారు. హరిత విప్లవం వల్ల విపరీత ప్రయోజనం పొందిన కోస్తా ప్రాంతంలో దళితుల మీద ఇంతటి అసాధారణమైన హింసాకాండ జరగడానికి మూలకారణం ఏమిటి?
ఎన్.టి.రామారావు అధికారంలోకి వచ్చాక కమ్మ కులస్తుల దురహంకారం విపరీతంగా పెరిగింది. ఈ హింసాకాండ జరగడానికి కొంతవరకు అది కూడా ఒక కారణం. ఎన్.టి. రామారావు కారంచేడు బాధితులను పరామర్శించేందుకు పళ్లూ పూలూ పట్టుకుని ఒక ఆసుపత్రికి వచ్చాడు. ఏదో మాట్లాడబోతుంటే దళితులు ఆయనను అడ్డుకున్నారు. తన కొడుకును దారుణంగా కొట్టడాన్ని కళ్లారా చూసిన కారంచేడు మహిళ వీరమ్మ నేరుగా ఎన్.టి.రామారావుతో “అయ్యా, మీరు ముఖ్యమంత్రి అయ్యాకే వీళ్లిలా దాడులకు తెగబడుతున్నారు. ఇవాళ మేమంతా ఆగమైపోయాం, మా కుటుంబాలు నాశనమైపోయాయి, అందరం రక్తం మడుగులో మునిగిపోయాం” అంది.
1960లలో పాత భూస్వామ్య సంబంధాలు అంతరించి ఒక నూతన మార్కెట్ ఆధారిత వ్యవసాయిక కమ్మ సంపన్న వర్గం ఆవిర్భవించింది. వ్యవసాయిక అభివద్ధి ప్రక్రియ సమయంలో అది తనని తాను సుసంపన్నం చేసుకుంది. తద్వారా రకరకాల వ్యవసాయేతర ఆర్థిక కార్యకలాపాలు విస్తత స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఆ వర్గం శ్రామిక కులాల వారు, ప్రత్యేకించి దళితులు ఏమాత్రం ఎదురు మాట్లాడినా, సవాలు చేసినా సహించేవారుకాదు. మరోపక్క దళితులు కూడా ఆర్థికాభివద్ధిలో భాగస్వాములవుతూ రావడం, వాళ్ల పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తుండడం, గ్రామాల్లో మాదిరిగా కుల పట్టింపులు లేని ప్రదేశాలు వారికి పరిచయం అవడం, సామాజిక సంబంధాలలో వస్తున్న మార్పుల కారణంగా వాళ్లు కూడా మునుపటిలా అవమానాలనూ, అవహేళనలనూ భరించలేని స్థితికి చేరుకున్నారు. దళితులలో స్వల్ప అసమ్మతి కనిపించినా సహించని కమ్మలకు అది కంటగింపుగా మారింది. సామాజిక సంబంధాలలో వస్తున్న పెను మార్పులు వారికి మింగుడు పడటంలేదు. అందుకే చిన్న ‘రెచ్చగొట్టే’ మాటకు కూడా భయంకరంగా స్పందిస్తున్నారు.
కారంచేడు హత్యాకాండ మీద వచ్చిన వార్తలూ, నివేదికలూ కొత్త పుంతలు తొక్కాయి. వాటిలో కేవలం ‘వర్గం’ మాత్రమే కాకుండా ‘కులం’ కూడా ప్రముఖంగా ప్రస్తావించబడింది. తెలుగు పత్రికలు మొట్టమొదటిసారిగా “మాదిగ కూలీలపై ‘కమ్మ’ భూస్వాముల హత్యాకాండ’ అంటూ వార్తలు రాశాయి. కుల సమస్య ప్రధానంగా ముందుకొచ్చింది. శాస్తీయ మార్క్సిస్టు పరిభాషతో కుల సమస్యను పక్కనపెట్టేవారిని నిలదీశారు. పీపుల్స్ వార్ గ్రూపువాళ్లు “కారంచేడు హరిజనులపై భూస్వాముల దాడి” అనే శీర్షికతో ప్రచురించిన కరపత్రం మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
కారంచేడు బాధితులకోసం నాలుగైదు కొత్త శిబిరాలను ఏర్పాటు చేసి చర్చి నుంచి వారిని తరలించారు. దళితుల నిరసనోద్యమానికి ఆ శిబిరాలే కేంద్రాలయ్యాయి. ఆ ప్రదేశానికి బాధితులు అన్న మాటని వాడకుండా విజయానికి సంకేతంగా ‘విజయ నగర’ అని పేరుపెట్టారు. ఆ శిబిరాలు విడివిడిగా వ్యక్తిగత కుటుంబాలకు ఉద్దేశించి కాకుండా అందరూ కలసి సామూహికంగా వుండేందుకు, అరుదైన సంఘీభావాన్ని ప్రదర్శించేందుకు భారీ స్థాయిలో నిర్మించబడ్డాయి. ఒక ఉమ్మడి వంటశాలలో అందరూ కలసి భోజనం చేసేవారు. రాత్రుళ్లు కలసికట్టుగా నిద్రించేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల డిమాండ్లను అంగీకరించి, అందరికీ పునరావాస ప్యాకేజీతో పాటు ఇళ్లను నిర్మించి ఇచ్చేంత వరకూ ఆ భారీ శిబారాలు అలాగే కొనసాగాయి.
తారకం, సిరిల్ విజయ నగర్ శిబిరాలకు తరచూ వెళ్లి వస్తుండేవారు. ఇబ్రహీంపట్నం పనిలో నాకు వెసులుబాటు లభించినప్పడల్లా నేను కూడా వాళ్లతో వెళ్లేదాన్ని. వాళ్లు లీగల్ కేసును తయారు చేయడంలో మునిగి వుంటే నేను శిబిరంలో తిరుగుతూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తుండేదాన్ని. లైంగిక దాడికి గురై, భర్త రమేష్‌ని కూడా కోల్పోయిన దుడ్డు సులోచనను నేను కలుసుకున్నాను. అలాగే ఈ కేసులో కీలక సాక్షి అయిన అలిశమ్మతో కూడా మాట్లాడాను. ఆ తరువాత ఒక ఏడాదికి అలిశమ్మ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తేళ్ల జెడ్సన్ కుటుంబాన్నీ, భగత్ సింగ్‌నీ కూడా కలిశాను. అతను ఆ తదనంతరం దుడ్డు అలిశమ్మను పెళ్లి చేసుకున్నాడు. అంతటి సంక్షోభ సమయంలో కూడా వాళ్లు ఎంతో విశాలహదయాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించారు. వాళ్లు అత్యంత భయంకరమైన శత్రువును bదుర్కొన్నారు. అయినప్పటికీ కించిత్తు కూడా వెనక్కి తగ్గలేదు.
కారంచేడు దళితుల కోసం మేం విరాళాలూ, సరుకులూ సేకరించాం. మా సంఘం సభ్యులు కొందరు విజయ నగర్‌కు వెళ్లి వాటిని అందజేశారు. ఆ తరువాత తొమ్మిది పదిమందితో కూడిన బందాలుగా ఏర్పడి ఆ శిబిరాన్ని సందర్శించి వస్తుండేవాళ్లం. ఒకసారి జోగు జంగమ్మ, ఎలిమినేటి చంద్రమ్మ నాతో పాటు ఆ శిబిరానికి వచ్చారు. అంతవరకూ వాళ్లు కోస్తా ఆంధ్రప్రాంతానికి ఎప్పుTడూ రాలేదట. అక్కడి పచ్చదనం, అభివద్ధిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అదేసమయంలో అక్కడ ఇంతటి ఘోరమైన దుర్మార్గం జరగడం పట్ల దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ‘మేం పేదలం కావచ్చు కానీ మా ఊరిలో ఎన్నడూ ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదమ్మా’ అన్నారు. కోస్తా ఆంధ్రా లోని దళితుల మీద జరిగినట్టు తెలంగాణలో ఎక్కడా దళితుల మీద అంతటి ఘోరకలి జరగలేదన్నారు. అందుకు కారణాలు అనేకం వుండొచ్చు. ముఖ్యంగా కోస్తా ఆంధ్రలో మాదిరిగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తిలో అంత అభివద్ధి జరగకపోవడం, అక్కడిలాగా ఇక్కడ మార్కెట్ సంబంధాలు లేకపోవడం, 1940ల నాటి సాయుధ రైతాంగ పోరాటం వంటి మిలిటెంట్ ఉద్యమాలు ఇక్కడ అనేకం జరగడం, ఆంధ్రా కమ్మల మధ్య వున్న ఐక్యత తెలంగాణా రెడ్ల మధ్య కొరవడటం మొదలైనవి. అలాగే ఆంధ్రాలో మాదిరిగా కాకుండా తెలంగాణలో రెడ్లు మాదిగలను చిన్న తమ్ముళ్లలాగా చూస్తారు, తమ అనుచర మాదిగల కండబలం మీద ఆధారపడే పెత్తనం చేస్తుంటారు.
కారంచేడు దళితులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఆ ఉద్యమానికి ఒక కొత్త రూపునూ, కార్యాచరణనూ అందించేందుకు 1985 సెప్టెంబర్‌లో చీరాలలో జరిగిన ఒక సమావేశంలో ‘దళిత మహాసభ’ అనే సంస్థ ఆవిర్భవించింది. “ఛలో చీరాల” అంటూ దళిత మహాసభ ఇచ్చిన పిలుపునకు స్పందించి రాష్టం నలుమూలల నుంచీ మూడు లక్షలమంది దళితులు చీరాలకు తరలి వచ్చారు. నేను అంత భారీ జనసమీకరణను అంతకు ముందెప్పుడూ చూసివుండలేదు. వాళ్లంతా ముక్తకంఠంతో స్పందించారు. సుప్రసిద్ధ కవి, ప్రజా గాయకుడు గద్దర్ ఆ మహాసభను “దళిత పులులమ్మో దళిత పులులమ్మా… కారంచేడు భూస్వాములతో కలబడి, నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మా…” అనే కొత్త పాటతో ప్రారంభించారు. ఆ పాట వింటుంటే అందరి రోమాలూ నిక్కబొడుచుకున్నాయి. ఆ బహిరంగ సభ వేదికను దళితులకే పరిమితం చేశారు. ఎంతటి సానుభూతిపరుడైనప్పటికీ ఒక్క దళితేతర సవర్ణుడిని కూడా వేదిక మీదకు ఎక్కనివ్వలేదు. అదేవిధంగా దళిత మహాసభ కార్యనిర్వాహకులందరూ దళితులై వుండేలా చర్యలు తీసుకున్నారు. దళితేతరులు ఎవరైనా దళిత మహాసభలో సాధారణ సభ్యులుగా కొనసాగాల్సిందే తప్ప కార్యనిర్వాహక కమిటీలో వుండటానికి వీల్లేదు. కారంచేడులో దళితుల మీద జరిగిన మారణకాండ ఆంధ్రప్రదేశ్ సబాల్టన్ రాజకీయాల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. దళితులూ, ఇతర అట్టడుగు కులాల వాళ్లూ సబాల్టన్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు ఆత్మవిశ్వాసంతో సంసిద్ధులయ్యారు. వివిధ వామపక్ష పార్టీలూ, గ్రూపులూ అనివార్యంగా కులానికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కులాన్ని మరుగున పరచడమో, దాటవేయడమో ఇంకా వారికి ఏమాత్రం వీలుకాదు. మొదట ఎన్.టి. రామారావు ద్వారా, ఆ తరువాత ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు ద్వారా శక్తివంతులైన కమ్మలు తమ పట్టును బిగిస్తున్న సమయంలోనే ఇదంతా చోటుచేసుకుంది. ఆ రోజుల్లో పత్రికారంగం చాలావరకు కమ్మల నియంత్రణలోనే వుండేది. అత్యధిక సర్క్యులేషన్ వున్న ఈనాడు దినపత్రిక అత్యంత శక్తివంతుడైన రామోజీరావు చేతుల్లో వుంది. విశాలాంధ్ర, ప్రజాశక్తి, అశోక్ బుక్ సెంటర్, నవోదయ పబ్లిషర్స్, శ్రీరాఘవేంద్ర పబ్లిషర్స్ వంటి పుస్తక ప్రచురణ సంస్థలమీద కూడా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గణనీయమైన భాగం మీద లాగే కమ్మ పెత్తనమే కొనసాగింది; వస్తువుల తయారీ, రియల్ ఎస్టేట్ రంగం, ఆసుపత్రులు మొదలైనవి కూడా వారి అధీనంలోనే వున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా దళితోద్యమం ఉవ్వెత్తున సాగడం ఆనాటి ప్పు్రల ధోరణిని చాటిచెబుతుంది. కారంచేడు దళితోద్యమం ఇబ్రహీంపట్నంలోని మా పోరాటానికి స్ఫూర్తిని, జవసత్వాలను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద దళితోద్యమం లేదా ఇబ్రహీంపట్నంలోని మా అతిచిన్న పోరాటం ఏ దశలోనూ వెనుకంజవేసినట్టు నాకనిపించలేదు. చిన్న చిన్న పోరాటాల్లో మేం ఓడిపోయి వుండవచ్చు కానీ పెద్ద యుద్ధంలో విజయం మాదే. మా కాళ్లమీద మేం నిలబడుతున్నాం. ఎప్పటి కప్పుడు మా భవితవ్యాన్ని తగిన విధంగా మార్చుకుంటున్నాం.కారంచేడుకు ముందు ఇబ్రహీంపట్నం మాదిగల విషయంలో నా దష్టి కోణం అస్పష్టంగా వుండేది. మాదిగలు ఆ ఊళ్లో అందరికంటే పేదవారు కాబట్టి సమావేశాలు వాళ్ల వాడలో నిర్వహించడమే మంచిదనిపించేది అప్పుడు. కానీ కారంచేడుపై జరిగిన చర్చోపచర్చలు వర్గం` కులం గురించిన నా అవగాహనను మార్చివేశాయి. ఇదేదో పైపైన కాదు లోతుగా. 1985 నుంచి మేము తెలుగులో వెలువడిన అంబేడ్కర్ రచనలను పంపిణీచేయడం మొదలుపెట్టాం. హైదరాబాద్‌లో అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సభలకు హాజరయ్యేలా మా వాళ్లని చైతన్యపరిచాం. ప్రతి సంవత్సరం ఇబ్రహీంపట్నంలోనూ, యాచారంలోనూ అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తూ వచ్చాం. ఇక్కడి చదువుకున్న యువతను హైదబాద్‌లో జరిగే అంబేడ్కర్ సభలకు వెళ్లేలా, అక్కడి తమలాంటివారితో సంఘీభావాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించాం. నేను ఇంకా అంబేడ్కర్‌ని లోతుగా అధ్యయనం చేయలేదు. నిజం చెప్పాలంటే 1984 నుంచీ 1992 వరకూ నేనసలు ఏమీ చదవలేదు. నాకంత సమయం ఎక్కడుంది? అప్పుడు నాకు క్షేత్ర స్థాయి పనే తప్ప సిద్ధాంతం ముఖ్యం కాదు.
13. నెలకు ఒక్క రూపాయితో బంధ విముక్తి
1985 నాటికి ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటీవీసీఎస్) తన ప్రాథమిక వ్యవస్థాగత నిర్మాణాన్ని మొదలుపెట్టింది. పూర్తి కాలపు కార్యకర్తలే ఈ సంఘానికి బలమైన పునాది. వాళ్లంతా పద్దెనిమిది నుంచి ముఫ్పైఐదు సంవత్సరాల మధ్య వయసున్న, పదోతరగతి వరకు చదువుకున్న యువకులు. వారిలో ఎక్కువమంది మాదిగలే. సంఘంలో మొదట శంకరయ్య, బుగ్గయ్య చేరారు. శంకరయ్య తెలగ కులానికి చెందినతను. ఉత్సాహవంతుడు, తెలివైనవాడు. మొదటి నుంచీ చివరి వరకూ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ తరువాత కూడా స్థానికంగా చురుకుగా వ్యవహరిస్తూ వాళ్ల ఊరి సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. బుగ్గయ్య మాల కులస్తుడు. జలాల్‌మియాపల్లెకు చెందినవాడు. మాతో కొద్ది కాలమే కలసి పనిచేశాడు. ఆ తరువాత శాంతా సిన్హా ఆధ్వర్యంలోని శ్రామిక విద్యాపీఠంలో చేరాడు. చురుగ్గా వుండేవాడు. అయితే అతను తమను ప్రోత్సహించేవాడు కాదని మాదిగలు అనేవారు. నేను అలాంటి విమర్శలను అప్పుడు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కాకపోతే ఆంధ్ర ప్రదేశ్‌లో వర్గీకరణ కోసం మాదిగ దండోరా ఉద్యమం మొదలైన తరువాత ఆ విమర్శలపై అవగాహన వచ్చింది. బుగ్గయ్య 2013లో చిన్న వయసులోనే చనిపోయాడు.
చెర్లపటేల్‌గూడెంలో మాదిగ కులానికి చెందిన పంది మైసయ్య మా సంఘంలో చేరినప్పుడు నిరక్షరాస్యుడు. ఆ తరువాత పట్టుదలగా చదవడం, రాయడం నేర్చుకుని ఏడవ తరగతి బోర్డు పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. మగ సంతానం కోసం ఎదురుచూస్తూ వరుసగా ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చాడు. (ఆ తరువాత ఇద్దరు కొడుకులు పుట్టారు). ఈ విషయంమీద అందరూ అతణ్ని ఆటపట్టించేవారు. చాలా కలుపుగోలుగా వుండేవాడు. ఎవరితోనైనా సులభంగా కలసిపోయేవాడు. మా సంఘంలో ప్రతి ఒక్కరూ అభిమానించే చురుకైన కార్యకర్త. నా మీదా, పంది మైసయ్య మీదా అనేక పోలీసు కేసులుండేవి. అతను 2018లో గుండెపోటుతో చనిపోయాడు. హస్మత్‌పురాకు చెందిన మాదిగ రాములు సహజమైన కార్యకర్త. లారీ ప్రమాదంలో ఒక కాలును పోగొట్టుకున్నాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తుండేవాడు. సంఘంలో చేరకముందు పైరవీకారుగా పనిచేసేవాడు. అంగవైకల్యం వల్ల ‘కుంటి’ అనేది అతని ఇంటిపేరుగా మారిపోయింది. జైపూర్‌కు వెళ్లి కత్రిమ కాలును పెట్టించుకుని వచ్చాక ఊతకర్ర సాయం లేకుండా అందరిలా మామూలుగా నడిచేవాడు. గొడవలు జరిగి ఎవరైనా తన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు చప్పున ప్యాంటును పైకెత్తి కత్రిమ కాలును చూపించి తప్పించుకునేవాడు. ఎప్పుడైనా మా సంఘంలో అభిప్రాయబేధాలు వస్తే మధ్యవర్తిగా వ్యవహరించి సర్దుబాటు చేసేవాడు. ఏవిషయమైనా అందరికీ అర్థమయ్యేలా వివరించేవాడు. అందుకే మహిళలకూ వయోవద్ధులకూ కుంటి రాములంటే చాలా అభిమానం. మొత్తంమీద మా బందం ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా వుండేది. అందరూ అప్రమత్తంగా వుంటూనే తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చే కషిలో, ముఖ్యంగా తాము అసహ్యించుకునే రెడ్ల ఆధిపత్యాన్ని నిర్మూలించే కషిలో భాగస్వాములయ్యేందుకు, దానికి నేతత్వం వహించేందుకు ఉత్సాహపడేవారు.
చాలామంది యువకులు మా సంఘంలో చురుకైన పాత్ర పోషించేందుకు ముందుకొచ్చారు. కొందరు పూర్తికాలపు కార్యకర్తలుగా పనిచేశారు. మీర్‌ఖాన్‌పేట నుంచి మాదిగ కులానికి చెందిన గండు నరసింహ ఊళ్లో భూమి హక్కుల పోరాటం సందర్భంగా సంఘంలో చేరాడు. చాలా తెలివైనవాడు, మాటకారి. 1996లో ఆవిర్భవించిన డప్పు కలెక్టివ్స్‌లో కీలకంగా వ్యవహరించాడు. తోలుతో డప్పును తయారుచేసేదీ, వాయించేది మాదిగలే. సాంప్రదాయికంగా గ్రామాల్లో ప్రజలకు ఏ విషయమైనా చాటి చెప్పేందుకు (దండోరాకు) డప్పును ఉపయోగిస్తుంటారు. రాజుల కాలం నుంచీ ఈనాటి వరకూ డప్పు ఒక సమాచార సాధనంగా కొనసాగుతోంది. 1990ల మధ్య కాలంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వర్గీకరణ కోసం దండోరా ఉద్యమాన్ని మొదలుపెట్టిన తరువాత అన్ని రాజకీయ పార్టీల సభల్లోనూ డప్పు ప్రాధాన్యత పెరిగింది. డప్పు కలెక్టివ్స్‌లో దళితులు ప్రధాన పాత్ర వహించే దాదాపు వంద స్వచ్ఛంద సంస్థలకు సభ్యత్వం వుంది. యాచారం గ్రామానికి చెందిన జోగు కష్ణ అనే మాదిగ వ్యక్తి సంగీతంలో, నత్యంలో ప్రవేశమున్న కళాకారుడు. ఎప్పుడూ సరదాగా వుండేవాడు. అందరూ అతడిని అభిమానించేవారు. వీరే కాకుండా మాదిగ కులానికే చెందిన రామచంద్రయ్య గుంగల్ గ్రామం; బైండ్ల రాములు, మీర్‌ఖాన్‌పేట; అంజయ్య, జబ్బార్‌గూడెం తదితరులు మా సంఘంలో కొంతకాలం పనిచేశారు.
పూర్తికాల కార్యకర్తల్లో చాలామంది మేం ఏర్పాటు చేసిన అనియత విద్యా కార్యక్రమాల ద్వారా జీతభత్యాలను పొందేవారు. తదనంతరం వారు పర్యవేక్షకుల స్థాయికి ఎదిగారు. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు నిధులతో అనియత విద్యా కార్యక్రమాలు (ఎనఎఫఇ) నడిచేవి. వెట్టి చాకిరీ నుంచి విముక్తి చెందిన పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇతర కార్యకర్తల జీతభత్యాల కోసం మేం హైదరాబాద్‌లోని మా శ్రేయోభిలాషుల నుంచి విరాళాలు సేకరించేవాళ్లం. ఎనఎఫఇ కార్యక్రమంలో చాలామంది తమ సొంత ఊళ్లలోనే వుండేవారు. వారానికి కనీసం మూడు రోజులపాటు ఇతర గ్రామాల్లో గడిపేవారు. మా అందరిలో కేవలం శంకరయ్యకూ, లింగయ్యకూ మాత్రమే మోపెడ్ బండ్లు వుండేవి. మిగతావాళ్లంతా బస్సుల్లోనో నడుస్తూనో ఆయా గ్రామాలకు వెళ్తుండేవారు. కొందరు సంఘంలో చేరకముందు సాంప్రదాయక పంచెలు కట్టుకునేవారు, ఆతరువాత ప్యాంట్లు వేసుకోవడం మొదలుపెట్టారు.
సంఘం రోజువారీ పనితీరు సులువుగా వుండేది. అన్ని నిర్ణయాలనూ మాదిగ వాడలో జరిగే బహిరంగ సమావేశంలో తీసుకునేవారు. యాచారం మాదిగ వాడ సభ్యుల బందం సంఖ్యా పరంగానూ, నాయకుల సమర్థత పరంగానూ మిగతా యువతకు ఆదర్శంగా వుండేది. తరువాతి కాలంలో ఎలిమినేడు, పులిమామిడి మాదిగ వాడలు కీలక పాత్రను పోషించాయి. నిజానికి ప్రజాస్వామిక ఓటు అనేది ఏమంత కష్టం కాదు` అంటే పూర్తికాలపు కార్యకర్తలమెవరమూ చర్చలను నిర్వహించేవాళ్లం కాదు, ఇతర్లు మాట్లాడేలా, నాయకత్వం వహించేలా ప్రోత్సహించేవాళ్లం. పూర్తికాలపు కార్యకర్తలూ, జనమూ నిర్ణయాత్మకంగా వుండేవారు. స్థానిక నిర్ణయాలలో చాలావరకు జనాలదీ, వాళ్ల నాయకులదే తుది నిర్ణయం. భూస్వాములనుంచీ, పోలీసులనుంచీ ఎదురయ్యే అణచివేత చర్యల్ని ఎదుర్కొనేది వాళ్లే కాబట్టి అదే సరైన పద్ధతి. ఆ సమావేశాల్లో స్తీలూ పురుషులూ పాల్గొని అన్ని విషయాలనూ చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఓటింగ్ నిర్వహించడం, చేతులు పైకెత్తి ఆమోదం తెలుపడం వంటివేమీ వుండేవి కాదు. ఏ నిర్ణయాన్నైనా అమలుపరచాలనుకుంటే అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందే. దానర్థం ఏకాభిప్రాయానికి వచ్చేంత వరకూ వరుసగా అనేక రాత్రుళ్లు సుదీర్ఘ చర్చలు కొనసాగుతుండేవి. ఒకవేళ ఏ ఒక్కరైనా ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే, మేం దానిని పునఃపరిశీలించాల్సిందే. అలాగే చేసేవాళ్లం. తీసుకునే ప్రతీ నిర్ణయం మా చుట్టూ వున్న ప్రపంచాన్ని ఎంతో కొంత మార్చేందుకు ఉద్దేశించిందే. ప్రతి మార్పునకు మూల్యం చెల్లించాల్సి వుంటుంది కాబట్టి మేం చాలా జాగ్రత్తగా వుండేవాళ్లం.
అయితే అప్పుడప్పుడు పూర్తి కాలపు కార్యకర్తల్లోని ముఖ్యులు విడిగా సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు. ఆ సమావేశాలను చాలావరకు మాదిగ వాడలోనే ఒక ఇంట్లో ఇతరులెవరూ రాకుండా తలుపులు మూసి నిర్వహించడం జరిగేది. ఇతరులెవరైనా వస్తామన్నా మేం నిరాకరించేవాళ్లం. ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు, పనులు ఎగ్గొట్టడం, నిధుల దుర్వినియోగం వంటి సున్నితమైన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం కుదరదు. మా అంతర్గత పని విభజన, మా సొంత సమస్యలు, మేం వివరణ ఇవ్వాల్సిన ఏవైనా ప్రశ్నలు మొదలైన వాటిని కూడా ముందు అంతర్గతంగా విశ్లేషించకుండా నేరుగా బహిరంగ సమావేశంలో చర్చించలేం.
ఏదైనా ఒక కార్యక్రమానికి ఎవరు నాయకత్వం వహించాలి అనే విషయంలో ఎప్పుడూ సంఘానికి ఇబ్బంది అనిపించలేదు. సంఘంలోని సహజసిద్ధ నాయకులు దేనికైనా ముందుకు వచ్చేవారు. ఇతరులెవరూ వారిని వ్యతిరేకించేవారు కాదు. పెద్ద సమస్య ఏమిటంటే ఎవరినో ఒకరిని నాయకుడిగా వుండమని ఒప్పించడమే. మా సంఘంలో నేను తప్ప మరో పూర్తికాల మహిళా కార్యకర్త లేదు. ఇబ్రహీంపట్నంలో వున్నప్పుడు నాకు మహిళను అన్న భావన వుండేది కాదు. నా నగర జీవిత నేపథ్యమే ఆ గ్రామంలో నన్నొక భిన్నమైన వ్యక్తిని చేసింది. నేను సవర్ణ కుటుంబం నుంచి వచ్చినదాన్ని, వ్యవసాయపనులు చేసే శ్రామికులకు ఏమైనా ఉపయోగపడాలంటే నేను నా స్తీత్వాన్ని పట్టించుకోకూడదు. స్తీత్వానికి అతీతంగా వ్యవహరించాలి. ఒక సంక్షోభం వచ్చినప్పుడు అది పనికిరాలేదు. నా వర్గంగానీ, నేను బయటిదాన్నవడం అనేది గానీ నన్ను కాపాడలేదు. చాలామంది మహిళలు మాతో పాటు వారాల తరబడి కలసి తిరిగేవారు. కానీ, ఏదో ఒక సమయంలో మధ్యలోనే ఇంటిబాట పట్టేవారు. మహిళలను పూర్తికాలపు కార్యకర్తలుగా తీసుకోవడాన్ని మాదిగలు, ఇతర ముఖ్య సభ్యులు గట్టిగా వ్యతిరేకించేవారు. దానివల్ల తమకూ, ఆ స్తీలకూ మధ్య అక్రమసంబంధాలున్నట్టు పుకార్లు పుడతాయనేవారు. అది ఒకవిధంగా స్తీల లైంగికతను నియంత్రించడమే. దీనికి తోడు కాస్తో కూస్తో చదువుకున్న ఆడవాళ్లందరూ చాలా చిన్నవయసు వాళ్లు. వారికి బిడియం ఎక్కువగా వుండేది. ఇక సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలున్న పెద్దవయసు స్తీలకు ఇంటి బాధ్యతలు తక్కువగానే వుంటాయి. కానీ, వాళ్లకి బొత్తిగా చదువు రాదు. ఇతరులకోసం ఏవైనా ఫారాలు నింపడం, వాటి గురించి వివరించడం వాళ్లకు తెలియదు. అయితే అన్నివిధాలా నిబద్ధతతో కష్టించి పనిచేయగలిగేది, సంపూర్ణ సమగ్రతను కలిగి వుండేది మాత్రం మహిళలే.
మా సంఘం ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా వుండాలనుకోలేదు. అన్ని రాజకీయ పక్షాలతోనూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో చురుకుగా వున్న సిపిఐ మొదలుకుని ఎంఎల్ గ్రూపులన్నింటితోనూ స్నేహపూర్వకంగా వుండేవాళ్లం. మేం తరచూ అన్ని గ్రూపుల నాయకులను, సభ్యులను కలుస్తుండేవాళ్లం.
ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటీవీసీఎస్) కోసం నేను హైదరాబాద్‌లోని మిత్రుల నుంచి నిధులు సేకరించేదాన్ని. కొందరు నెలకు వంద రూపాయల చొప్పున, మరికొందరు నెలకు యాభై రూపాయల చొప్పున విరాళం ఇచ్చేవారు. మేం పొదుపుగా వుంటూ, చాలా మితంగా ఖర్చులు చేసేవాళ్లం కాబట్టి మా సంఘానికి నిధుల కొరత ఎప్పుడూ ఏర్పడలేదు. సంఘాన్ని రిజిస్టర్ చేయించి, విదేశాలనుంచి నిధులు సేకరించడం నాకు ఇష్టంలేదు. అసలు స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ) అన్న ఆలోచనకే నేను వ్యతిరేకం. బహుశా అది నాలోని వామపక్ష భావనలోంచి ఏర్పడింది. నాలోని అతి నైతికత దానికి తోడైంది. మేం చేస్తున్నది వివాదాలకు అవకాశముండే పని. అందువల్ల అనవసరపు వివాదాలకు ఆస్కారం కల్పించడం నాకు ఇష్టముండేదికాదు. ఇక్కడ వాటర్ డెవలప్‌మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఉదంతం గురించి చెప్పుకోవాలి. విదేశీ నిధులు సేకరించి రాజకీయపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న ఆరోపణలతో ఆ సంస్థ మీద దాడులు చేసేవారు. దాంతో చివరికది తన సంస్థనే మూసేసుకోవాల్సి వచ్చింది. సభ్యుల నుంచి మా సంఘం నెలకు ఒక రూపాయి చొప్పున సభ్యత్వ రుసుం తీసుకునేది. ఆ డబ్బు మా సాధారణ సమావేశాలకూ, ఖర్చులకూ సరిపోయేది. కాకపోతే, బహిరంగ సభలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు మాత్రం షామియానాలు, వేదిక, మైకు మొదలైన వాటికోసం ఎక్కువ డబ్బు కావలసివచ్చేది. ఆ బహిరంగ సభ సందర్భంగా అవసరమైన అన్నపానీయాలను స్థానికులే సమకూర్చేవారు. ఆ తదనంతరం మా విద్యా కార్యకమాల ద్వారా కొంత ఆదాయం లభించడం మొదలయింది. అప్పటినుంచీ సంఘం తనకు కావలసిన చిన్న కార్యాలయాల్ని నెలకొల్పుకో గలిగేది. వాటి కోసం చిన్న గదిని అద్దెకు తీసుకునేవాళ్లం. మేం చేస్తున్న పనిని గ్రామస్తులంతా అభిమానించే వాళ్లు కాబట్టి ఆ గది బయటవుండే ఖాళీ స్థలాన్ని మా సమావేశాలప్పుడు వాడుకోగలిగేవాళ్లం.
1984`85 ప్రాంతంలో మాతో కలసి పనిచేసిన దళితేతర కులాల వాళ్లు భోజనాల సమయానికి తమ బంధువుల ఇళ్లకు వెళ్లాలి అంటూ నెమ్మదిగా జారుకునేవారు. చివరికి మాల కులస్తులు కూడా మాదిగల ఇళ్లల్లో భోజనం చేయడానికి ఇష్టపడేవారు కాదు. మా సంఘంలో ఒక్క శంకరయ్యా, నేనూ తప్ప పూర్తికాలపు కార్యకర్తలందరూ మాదిగ కులానికి చెందినవాళ్లే. మాతో కలసి భోజనం చేయాలని అందరికీ గట్టిగా చెప్పేవాళ్లం. కులం గురించి బహిరంగంగా మాట్లాడే వాళ్లం.1987 నాటికి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఎలిమినేడు గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి అనే ఒక పటేల్ మాతో కలసి పనిచేసేస్తూ ప్రతిచోటుకీ వచ్చేవాడు. మాతో కలసి భోజనం కూడా చేసేవాడు. కొన్ని గ్రామాల్లో మాదిగలు కానివాళ్లతో కలసి పనిచేస్తున్నప్పుడు (అక్కడ అందరూ కురుమ లేదా తెలగ లేదా మాల కుýస్తులే వుండేవారు) మా సంఘంలోని పూర్తికాలపు మాదిగ కార్యకర్తల భోజనాల విషయంలో గానీ, వారి నాయకత్వం విషయంలో గానీ ఎలాంటి ఇబ్బందీ ఎదురయ్యేదికాదు.
సంఘంలో పూర్తికాల కార్యకర్తలుగా పనిచేయాలని అనుకునేవాళ్లందరూ తమకు తాముగా ముందుకొచ్చినవాళ్లే. అలా పనిచేయడానికి వారికి తమ ఊళ్లో ఎలాంటి ఆటంకాలూ, ఇబ్బందులూ వుండేవికావు. మమ్మల్ని తరచూ ఆహ్వానించే గ్రామాలకు సంఘం కార్యక్రమాలను విస్తరించాల్సి వచ్చినప్పుడు మా పూర్తికాలపు కార్యకర్తలు సులువుగా మరో పూర్తికాలపు కార్యకర్తను తయారు చేయగలిగే వారు. మేం పనిచేసే ప్రాంతంలో మా కార్యకర్తలెవరూ మందు తాగేవాళ్లు కాదు. ఒకవేళ ఎవరైనా కల్లు తాగాలనుకుంటే గ్రామానికి దూరంగా సంఘం చురుగ్గా లేని చోటుకు వెళ్లి తాగి వచ్చేవారు.
ఒకోసారి కొందరు పూర్తికాలపు కార్యకర్తలు ప్రజల డబ్బు విషయంలో నిజాయితీగా, నైతికంగా వుండేవారు కాదు. ఊళ్లో చిట్‌ఫండ్ వాళ్లనుంచి రుణాలు తీసుకునేవారు. బహుశా ఆ కార్యకర్తలు సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న కారణం వల్ల వారికి రుణాలను తిరస్కరించేవారు కాదు. ఇక మరికొందరు కార్యకర్తలు తాము వసూలు చేసిన సభ్యత్వం మొత్తాన్ని సంఘానికి కట్టేవారుకాదు. అలాగే గహ నిర్మాణ రుణ దరఖాస్తులకోసం రూ.311ల చొప్పున జనం నుంచి అధికారికంగా వసూలు చేసి ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి సరిగా కట్టేవారు కాదు. ఇబ్బంది కలిగించే ఇలాంటి వాటిని మేము అలక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా ఆ డబ్బును చెల్లించేలా వారిపై ఒత్తిడి చేసేవాళ్లం.
మేం చేస్తున్న పనికి ఇప్పుడిప్పుడే ఒక రూపం వస్తోంది. దానికి ఒక నిర్మాణం, దిశ ఏర్పడ్డాయి. ప్రతి రోజూ కాకపోయినా వారానికి ఒకసారైనా పూర్తికాలపు కార్యకర్తలం తప్పకుండా సమావేశమయ్యేవాళ్లం. ఫోన్లు అందుబాటులో లేకపోయినా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి మౌఖికంగా చేరవేసే విధానం అప్పుడు బలంగా వుండేది. బస్సులు ఊళ్లల్లో రెండు వైపులా నడుస్తుండేవి. మా సమాచారాన్ని ఆ ఊరికి వెళ్లే ప్రయాణికుల ద్వారా చేరవేసేవాళ్లం. సందర్శించాల్సిన ఊళ్లు ఎక్కువగా వున్నప్పుడు మా కార్యకర్తలంతా ఒక్కో ఊరికి ఒక్కొక్కరు చొప్పున వెళ్తుండేవారు. ఇబ్రహీంపట్నం వచ్చి మూడేళ్లు అవుతున్నప్పుడు నేను నా సైకిల్‌ని చాలా అరుదుగా ఉపయోగించేదాన్ని. ఎందుకంటే నాతో పాటు గ్రామాలకు వచ్చేవారికి సైకిళ్లు వుండేవి కావు. అందువల్ల ఎక్కడికైనా అందరం కలసి నడుస్తూనో, బస్సుల్లోనో వెళ్లేవాళ్లం. నేను గుంగల్‌లో నా అద్దె గదిని అలాగే వుంచుకున్నాను. కానీ, అందులో ఎప్పుడూ వరుసగా రెండు
రాత్రుళ్లు వున్నదిలేదు. సాయంత్రం కల్లా ఒక గ్రామానికి చేరుకుని అక్కడ రాత్రి ఎనిమిది తర్వాత సమావేశానికి హాజరై, అక్కడే తిని, అక్కడే పడుకుని మర్నాడు మరో గ్రామానికి వెళ్లేదాన్ని. ఉదయం సాయంత్రం విభిన్న వ్యక్తులు కలుస్తుండేవారు. అందులో వెనుకబడిన తరగతుల నుంచి నానమ్మ వయసున్న వాళ్లు మొదలుకుని చిన్నవాళ్ల వరకు అందరూ వుండేవారు. ఉదయపు సమావేశం ముగిసిన తరువాత నాస్తానూ, లంచ్‌నీ కలిపి తినేసి ఇబ్రహీంపట్నమో, యాచారమో వెళ్లిపోయేదాన్ని. అక్కడ మండల కార్యాలయంలో పనులు చూసుకుని గుంగల్‌లోని నా అద్దె గదికి తిరిగి వచ్చేదాన్ని. మరో గ్రామంలోని కార్యక్రమానికి బయలుదేరేంతవరకు మాత్రమే నేను నా గదిలో వుండేదాన్ని.
సిరిల్ వద్ద ముఖ్యమైన పత్రాలు తీసుకోడానికీ, వాటి గురించిన వివరాలు తెలుసుకోడానికీ మాత్రమే నేను హైదరాబాద్‌కు వెళ్లి వచ్చేదాన్ని. నా చిన్న బ్యాగ్‌లో ఒక జత బట్టలు, ఒక తువ్వాలు, సబ్బు, కాగితాలు, పెన్ను వుండేవి. ఇబ్రహీంపట్నం ప{్టణానికి వెళ్లాలంటేనే నాకు ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే అక్కడ నాకు బాత్‌రూం సౌకర్యం లేదు. ఆతరువాత కొన్నాళ్లకి మా సంఘం ఇబ్రహీంపట్నంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అయితే అందులో కూడా బాత్‌రూం సౌకర్యం లేదు. ఏ కోర్టు కేసుకో, ధర్నా కార్యక్రమానికో హాజరు కావాలంటే నాకు చచ్చే చావయ్యేది. ఎందుకంటే సాయంత్రం పొద్దుపోయి, ఊరు చివరికో, జన సంచారం లేని రోడ్డుకో చేరుకునేంతవరకూ మూత్రాన్ని ఆపుకోవాలి. కడుపు ఉబ్బి చాలా ఇబ్బందిగా వుండేది. వైద్యుడు లేని చోట, స్తీల ఆరోగ్యం గురించిన పుస్తకం ‘సవాలక్ష సందేహాలు’ ప్రచురణ కోసం పనిచేస్తున్న సమయంలో నాకు మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటే మూత్రకోశ వ్యాధులు వస్తాయన్న విషయం తెలిసింది. అప్పటికే నేను తీవ్రమైన యూరినరీ ఇన్‌ఫెక్షన్‌కు గురై ఎన్నో బాధలు అనుభవించివున్నాను. అందుకే పట్టణాల్లో ఖాళీగా వున్న ఇళ్ల వెనకకు వెళ్లి మొహమాటం లేకుండా మూత్ర విసర్జన చేయడం అలవాటు చేసుకున్నాను. మాలో ఒకరు మూత్రం చేస్తుంటే మిగతా ఆడవాళ్లు అటువైపునకు ఎవరూ రాకుండా కాపలాగా నిలబడేవాళ్లు. సిగ్గుపడకుండా మూత్ర విసర్జన చేసే ఈ అలవాటు నాకు ఆ తరువాతి కాలంలో ఎంతో ఉపయోగపడింది. నాకు మూత్రం వస్తుందంటే మధ్యలో ఆగి అనువైన చోటు చూసుకుని మూత్ర విసర్జన చేయడానికి వెనుకాడేదాన్ని కాదు. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మూత్రం వస్తున్నట్టయితే వెంటనే డ్రైవర్ వద్దకు వెళ్లి నిర్మానుష్యంగా వున్న చోట బస్సు ఆపమని ధైర్యంగా అడిగేదాన్ని.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.