బింఝ్వార్ ఆదివాసీ సముదాయానికి చెందిన మంగలీ బాయి తన జీవనోపాధి కోసం అడవిపై ఆధారపడతారు, కానీ ఆమె అడవిని ఒక వనరు కంటే ఎక్కువగా చూస్తారు. అడవితో ఆమెకున్న అనుబంధం గురించిన కథనం.
“మా సముదాయంలో ఎవరైనా వెదురుతో పర్రా (వస్తువులను ఎండబెట్టడానికి ఉపయోగించే చదునుగా ఉండే పళ్ళెం)ని గానీ సూపా (తూర్పారబట్టే చేట)ని గానీ తయారుచేస్తే, వారు ఇతర సమూహానికి తిండి గింజలు లేదా డబ్బు రూపంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.” ఇక్కడ మంగలీ బాయి బింఝ్వార్, నహార్, నరోటియా, భరోటియా, రాయ్ మైనా, కాఠ్ మైనా వంటి బైగా ఆదివాసీ సముదాయాల ఉప సమూహాలు అనుసరించే జీవనోపాధి నియమం గురించి వివరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని బైగాలు ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహాలకు (PVGTలు) చెందినవారు. “ప్రతి సముదాయం వెదురుతో విభిన్నమైన వస్తువులను తయారుచేస్తుంది.”
స్వయంగా బింఝ్వార్ బైగా ఆదివాసి అయిన ఆమె, బాలాఘాట్ జిల్లాలోని నాటా గ్రామంలో 10 నుండి 12 ఆదివాసీ కుటుంబాలు నివసించే పండా టోలాలో నివసిస్తున్నారు. అది శుక్రవారం ఉదయం. మంగలీ బాయి తన సముదాయానికే చెందిన ఇతరులతో కలిసి, వెదురు తీసుకురావడానికి మల్ధర్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళుతున్నారు. వారు మామూలుగా వెళ్ళే సమయమైన ఉదయం 4 గంటల కంటే ఈ రోజు కొంచెం ఆలస్యమైంది, కానీ సూర్యోదయానికి ముందునుంచే వారు నాకోసం వేచి ఉన్నారు. దారిలో వారు తమ భోజనం డబ్బాలను ఒక ఎండిపోయిన నదీతలం అడుగున దాచిపెట్టి, ఒక్కొక్కరు ఒక నీటి సీసా, ఒక గొడ్డలిని మాత్రమే మోసుకుంటూ నడుస్తున్నారు. “ఇది మేం మోసే బరువును తగ్గించుకోవడానికి ఒక మార్గం,” మంగలీ బాయి చెప్పారు. మధ్యాహ్నం దాటిన తర్వాత వారు తిరిగి పండా టోలా వైపు 8 నుండి 10 కిలోమీటర్ల దూరం నడుస్తారు. వారు తమ తలపై దాదాపు 25 కిలోల బరువుండే మూడు నుండి నాలుగు వెదురు కర్రలను మోస్తారు.
ఇది ఆమె శుక్రవారం దినచర్య. వారంలోని మిగిలిన రోజుల్లో ఆమె వెదురు తొక్క ఒలవటం, ముక్కలుగా నరకటం, వాటిని సన్నని బద్దలుగా చీల్చి వెదురు బుట్టలు అల్లటం చేస్తారు. తన పని పుట్టుకతోనే నిర్ణయమైపోయిందని ఆమె చెప్తారు. “మేం బుట్టలు మాత్రమే తయారుచేస్తాం. మా జనం వాటిని మాత్రమే తయారుచేస్తుండటాన్ని చూస్తూ నేను పెరిగాను. కాబట్టి నేను నేర్చుకున్నది అంతే, నాకు తెలిసిందీ అంతే.
కానీ అది పూర్తిగా నిజం కాదు. అడవి అంచున నివసించే మంగలీ బాయికి అడవి గురించి చాలా విషయాలు తెలుసు. దాని రీతులు, దాని రంగులు, అల్లికలు, పండ్లు, ఆకుకూరలు, పువ్వులు, చెట్లు, మూలికల గురించి పూర్తిగా తెలుసు. ఆమెకు అడవి మార్గాలు, వాటిని కనుగొనే ప్రదేశాలు, అడవి భౌగోళికం, చరిత్ర గురించి తెలుసు. అవన్నీ ఆమెకు తెలుసు. ఎవరో చెప్పినట్లుగా, గోండ్ సే అచ్ఛా జమీన్ కే బారే మ్ఱఁ కోయీ నహీ జాన్ సక్తా, బైగా సే అచ్ఛా జంగిల్ కే బారే మ్ఱఁ కోయీ నహీ జాన్ సక్తా, ఔర్ ధీమర్ సే అచ్ఛా పానీ కే బారే మ్ఱఁ కోయీ నహీ జాన్ సక్తా (భూమి గురించి గోండుల కంటే బాగా ఎవరికీ తెలియదు, బైగాల కంటే అడవి గురించి బాగా ఎవరికీ తెలియదు, నీటి గురించి ధీమర్ కంటే ఎవరికీ బాగా తెలియదు).
అడవికి వెళ్ళే దారిలో మంగలీ బాయి ఇంటికి తీసుకెళ్ళటం కోసం తెందూ (తునికి) పూలు, చరోటా (కాసియా టోరా – తగిరస) ఆకులను సేకరిస్తారు. “ఇవన్నీ మాకు అడవి నుండే దొరుకుతాయి. భోడో పిహరీ (చెదపురుగుల పుట్టపై పెరిగే పుట్టగొడుగులు లేదా టెర్మిటోమైసెస్), బాఁస్ పిహరీ (స్థానిక వెదురు పుట్టగొడుగు లేదా కాంథారెల్లస్), పుట్టు (ఒక రకమైన అడవి పుట్టగొడుగురి, భాజీ ళిఆకుకూరలు).” బైగాలు మనుగడ కోసం, జీవనోపాధి కోసం అడవిపై ఆధారపడిన అటవీ వాసులు. దేశంలో ఉన్న వారి మొత్తం జనాభాలో దాదాపు 75 శాతం మంది – 2011 జనాభా లెక్కల ప్రకారం 4,14,526 మంది – మధ్యప్రదేశ్‌లోనే నివసిస్తున్నారు. కానీ ఈ సముదాయం అడవిని ఎప్పుడూ ఒక వనరుగా పరిగణించదు. అడవి నుండి ఏమి తీసుకోవాలో, ఎప్పుడు, ఎంత పరిమాణంలో తీసుకోవాలో వారికి తెలుసు. తీసుకున్నదానిని ఎలా తిరిగి ఇవ్వాలో కూడా వారికి తెలుసు.
“అబ్ తో జంగల్ భీ భాగ్ రహీసే, పహలే తో ఇహా హీ రహాయ్ (ఇప్పుడు అడవులు కూడా పారిపోతున్నాయి. గతంలో అవి ఇక్కడే ఉండేవి).” మంగలీ బాయి మాటల్లో వినిపించే, ఆమె చర్యలలో ప్రతిబింబించే జ్ఞానం ఏ పుస్తకాలలోనూ ఉండేది కాదు. గత రెండు దశాబ్దాలుగా తాను చూస్తోన్న, తన చుట్టూ మారుతోన్న ప్రపంచం గురించి ఆమె మాట్లాడుతున్నారు. ఆమె వయస్సు గురించి ఆమెకు ఖచ్చితంగా తెలియదు, కానీ తాను 40లలో ఉన్నానని నమ్ముతారు.
బాయికి వివాహమైనప్పుడు, అడవి లోపల మూడు నాలుగు కిలోమీటర్ల నడక దూరంలోనే వెదురు అందుబాటులో ఉండేది, అప్పుడు వాళ్ళు వారానికి మూడుసార్లు వెళ్ళి దాన్ని తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు వెదురు కోసం తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అది కూడా వారానికి ఒకసారి మాత్రమే వెళతారు, ఒకేసారి మూడు లేదా నాలుగు పొడవైన వెదురుగడలను తెచ్చుకుంటారు. “చెట్లన్నిటినీ నరికేశారు. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా సాగ్వాన్ ళిటెక్టోనా గ్రాండిస్ – టేకురి మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు కొత్త చెట్లెక్కడ కనిపిస్తున్నాయి? మీ చుట్టూ ఒకే రకమైన చెట్లున్నాయి. వాళ్ళు వాటిని నరికి, తిరిగి నాటుతూనే ఉన్నారు. మా రోజుల్లో మేం అడవి నుండి తీసుకురానివి ఏమున్నాయి! కకోరా (ఆగాకరకాయలు), భాజీ (ఆకుకూరలు), తెందూ (తునికి). ఇప్పుడు ఇవేవీ దొరకడం లేదు,” అన్నారామె.
వేసవిలో కూడా వారు మహువా (మధూకా లాంగిఫోలియా – ఇప్ప)ను, తెందూ ఆకులను సేకరించడానికి ప్రయత్నించే సమయాలున్నాయి. “ఈ సంవత్సరం నేను 500 పూడాలు (ఒక్క పూడాలో 100 ఆకులు ఉంటాయి) కూడా సేకరించలేదు.” వర్షాకాలంలో, వెదురు బుట్టల తయారీ పని మందగించినప్పుడు, మంగలీబాయి ఇతరుల పొలాలకు వెళ్ళి మొక్కలు నాటి కొంత డబ్బు సంపాదించుకుంటారు. 62 ఏళ్ళ వయసున్న ఆమె అత్తగారైన మహో బాయికి మాత్రం రూ. 600 వృద్ధాప్య పింఛను లభిస్తోంది. మంగలీ బాయి మామగారు ఆమె వివాహానికి ముందే మరణించారు, ఆమె భర్త మదన్ ఉయికే జనవరి 2024లో, 45 సంవత్సరాల వయసులో మరణించారు. వలస కూలీ అయిన ఆయన నిర్మాణ పనులు ఎక్కడ ఉంటే అక్కడికి ప్రయాణించేవారు. “అప్పుడతను హరియాణాకు వెళ్ళాడు,” మంగలీ బాయి చెప్పారు. “ఏం జరిగిందో మాకు తెలియదు, అతను పరాయి భూమిలో మరణించాడు. కాంట్రాక్టర్ కూడా మాకు ఏమీ చెప్పలేదు. మేం అక్కడికి చేరుకున్నాక, చలి వాతావరణం కారణంగా అతను చనిపోయాడని మాకు అర్థమయింది.” “నేను నా కొడుకు ముఖాన్ని కూడా చూడలేకపోయాను,” మహో బాయి వాపోయారు. “శవాన్ని అప్పగించడానికి ఆసుపత్రిలో 3,500 రూపాయలు అడిగారు, దానికి తోడు వాహనం అద్దెకు తీసుకోవడానికి కూడా డబ్బు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి? మేం శవాన్ని వెనక్కి తెచ్చుకోలేకపోయాం. అక్కడే ఆసుపత్రిలోనే అంత్యక్రియలు జరిపించాం,,” మంగలీ బాయి వివరించారు. తన తండ్రి చనిపోవడంతో, వారి కొడుకు సుకేశ్ ఉయికే 8వ తరగతితోనే చదువు మానేశాడు. “మైఁ స్కూల్ కభీ నిగే హావ్, ఉన్‌లా కాహిన్ బోలాహు, నహీ పఢ్రే ఆవ్, తో మత్ పఢో, కామ్ కరో, కెహన్ కరాహరీఁ ఔర్ (నేనెప్పుడూ బడికి వెళ్ళలేదు. ఇంక వాళ్ళకేం చెప్పగలను? చదువుకోవాలని లేకపోతే చదవొద్దు, పని చేసుకో, ఇంకేం చేయగలవు)?” అని ఆమె అంటున్నారు. ఈ రోజున 18 ఏళ్ళ ఆమె కొడుకు, తన తండ్రిలాగే పని కోసం వలస వెళ్ళి, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఇంటికి పంపిస్తున్నాడు. అతను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం అతని తిండికి, అద్దెకే సరిపోతుంది. గ్రామంలో నివసించే మంగలీ బాయి, ఆమె అత్తగారు వెదురు బుట్టలు అల్లి వారానికి సుమారు 600 రూపాయలు సంపాదిస్తారు. వారికి సుమారు 1.5 ఎకరాల చిన్న పొలం ఉంది, అందులో ఆ కుటుంబం ఏడాదికి ఒకసారి వరి పండిస్తుంది. సాగు సమయంలో సుకేశ్ ఇంటికి వచ్చి, పొలంలో పనిచేసి, పంట కోతల సమయంలో తిరిగి వెళ్ళిపోతాడు.
“ఇప్పుడతను వస్తాడు,” మంగలీ బాయి అంటున్నారు, “అప్పుడింక మేం మళ్ళీ వ్యవసాయం పనుల్లో పడతాం. మేం సీజన్లో ఒక్కసారి మాత్రమే సంపాదిస్తాం. మాకు సుమారు 20-30 క్వింటాళ్ళ వరి పండుతుంది, కానీ మేం దాన్ని అమ్మం. బేచేంగే తో కా సే ఖాబో ఫిర్ (పండించినది అమ్మేస్తే, తర్వాత ఏం తింటాం)?” వ్యవసాయం పని పూర్తయ్యాక, వెదురు తెచ్చుకొని బుట్టలు అల్లుతాం; మేం వెదురుతో మాత్రమే పని చేస్తాం.” కానీ వెదురును సేకరించడం మరింత కష్టతరం అవుతోంది. భారతదేశంలోనే అతిపెద్ద వెదురు ఉత్పత్తి చేసే ప్రాంతం మధ్యప్రదేశ్. దేశీయ వెదురు మిషన్ కింద పరిశ్రమల, తోటల అభివృద్ధిని జీవనోపాధి కోసం వెదురుపై ఆధారపడిన ఈ పివిటిజి సముదాయం ఎదుర్కొంటోన్న పెరిగిపోతున్న ఇబ్బందుల దృష్టితో చూడాలి. “ప్రతి ఏటా అడవిని నరికేస్తూ పోతే మీకు వెదురు ఎలా దొరుకుతుంది?” అని ఆమె అడుగుతున్నారు. “ఇప్పుడు వెదురు అస్సలు కనిపించటంలేదు. ప్రతిరోజూ ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎవరో ఒకరు అడవిని నరికేస్తున్నారు. కొందరు మా ఊరివాళ్ళు కూడా పని కోసం అక్కడికి వెళ్ళేవారు. ఇంతకుముందు మేం ఎక్కువ వెదురును తెచ్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు పోలీసు అధికారులు మమ్మల్ని అలా తీసుకుపోవడానికి అనుమతించడం లేదు, దాన్ని వాళ్ళే లాక్కుపోతున్నారు,” అన్నారామె. వెదురును నరకడం పూర్తి చేసిన మంగలీ బాయి, పచ్చిగా ఉన్న ఒక వెదురు కర్రను ఒలిచి తయారుచేసిన తాడుతో ఆ కర్రలను కట్టడానికి ఇబ్బందిపడుతున్నారు. ఒక చెట్టు ఆకుల నుండి వేర్ల వరకు ప్రతి భాగాన్ని ఎలా ఉపయోగించాలో బైగా ప్రజలకు తెలుసు. శతాబ్దాలుగా వారు అడవితో కలసిమెలసి జీవిస్తున్నారు. వారు తమ జీవనోపాధి అవసరాలలో చాలా వాటి కోసం అడవిపైనే ఆధారపడతారు. బహుశా అందుకేనేమో వారు అడవిని పూజిస్తారు, దానిని తమ దేవతగా భావిస్తారు.
అందరూ వంగి తమ వెదురును కట్టకట్టడాన్ని చూసి, కర్రలను కూర్చుని కట్టడం సులభం కదా, అని నేను వారిని అడిగాను. “లేదు, మేం దీన్ని మా దేవతగా భావిస్తాం. దేవతల ముందు ఎలా కూర్చోగలం? మేం ఈ స్థలాన్ని పూజిస్తాం.”
కానీ మీరు అడవిని నరుకుతున్నారు కదా? “హమ్ జాన్తే హై కౌన్ సా కౌలా హై ఔర్ ఉగనే వాలా హై, కిస్కో లేనా హై, కిస్కో ఛోడ్నా హై, సర్కార్ కో థోడీ పతా హై, వహ్ తో సబ్ కాట్ దేతీ హై (ఏది లేతగా ఉందో, ఏది ఇంకా పెరుగుతుందో మాకు తెలుసు. దేన్ని తీసుకోవాలో, దేన్ని వదిలేయాలో మాకు తెలుసు. ప్రభుత్వానికేం తెలుసు? వాళ్ళు అన్నింటినీ నరికేస్తారు),” మంగలీ బాయి గొంతులో కొద్దిగా అసహనం వినిపించింది. ప్రకృతి పట్ల వారికున్న ఈ గౌరవం, భక్తి కేవలం మాటలకే పరిమితం కాదని, అది వారి చేతలలో కూడా ఉందని నేను గ్రహించాను. టోలా నుండి వచ్చిన 10-12 మంది వ్యక్తుల బృందం, చిన్నలూ పెద్దలూ కూడా, తిరిగి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. దారిలో, ఇంటికి వెళ్ళేందుకు ఇంకా నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉండగానే, వారికి తాగే నీరు అయిపోయింది. దాంతో వారు ఎండిపోయిన నది గర్భంలోకి కొంచెం ముందుకు నడిచారు. అక్కడ ఒక ఎత్తైన అర్జున చెట్టు పడిపోయి, కొద్దిగా నీడగా ఉంది. మంగలీ బాయి, ఇంకొంతమంది ఆ చెట్టుకాండం దిగువన కొద్దిగా తడిగా ఉన్న చోటుని గుర్తించి ఇసుకను తవ్వడం ప్రారంభించారు. అక్కడ వాళ్ళకు నీరు దొరుకింది! “మేం వెదురు సేకరిస్తున్నప్పుడు ఎవరైనా పోలీసు అధికారి ఇక్కడికి వస్తే, వాళ్ళు దానిని స్వాధీనం చేసుకోవటమే కాక, చివరకు గొడ్డలిని కూడా పట్టుకెళ్ళిపోతారు. అందుకే మేం అమ్మాయిలం, మహిళలందరం కలిసి గుంపులుగా వెదురు సేకరించడానికి వెళ్తాం. అది పోలీసు అధికారులను ఎదుర్కోవడానికి మాకు సహాయపడుతుంది,” అన్నారు మంగలీ బాయి. వెదురు లేనప్పుడు మీరేం పని చేస్తారు? “ఏం చేస్తాం, మాకు ఇంకే పనీ చేయరాదు. బాఁస్ రహేగా తో టోకనీ బనాతే హై, నహీ తో చుప్పాయీ రహతే హై (వెదురు ఉంటే బుట్టలు తయారుచేస్తాం. ఏమీ లేకపోతే అలా ఉత్తినే కూర్చుంటాం),” అన్నారామె.
కేవలం కొడవలిని, తమ చేతులను ఉపయోగించి మహిళలు వెదురు బుట్టలను అల్లే ప్రక్రియను దగ్గరగా చూపించే కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. ఒక కుప్పగా పేర్చిన వారి కఠోర శ్రమ, చివరకు వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించే ఆనందం. ఈ కథనాన్ని మొదట హిందీలో నివేదించారు. ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (వీవీఖీ) ఫెలోషిప్ సహకారం అందించింది.
