పార్లర్‌ ఆన్‌ వీల్స్‌

రాణి
హిమాయత్‌నగర్‌లోని ఒకవీధిలోని ఒక గదిలో కొడుకుతో పాటు నివాసం.
పెళ్ళైన 14 సం||లకి రోడ్‌ యాక్సిడెంట్‌లో భర్తపోయాడు. తల్లితండ్రి భర్తకన్నా ముందే పోయారు. అన్నయ్య ఇద్దరు చెల్లెళ్ళున్నా వారి జీవితాలు వాళ్ళవి. రాకపోకలు గానీ రాగబంధాలు గానీ లేవు ఎవరితోనూ. ఉదయం లేచిన దగ్గర్నించి రాత్రి పడుకునేదాకా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టుగా పరుగులు పెడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న రాణితో ఓసారి మాట్లాడదాం.
ప్రశ్న : రాణీ! నీ భర్త పోయాక మీ అత్తింటివాళ్ళు అండగా వుండలేదా? మరి బయటికొచ్చాక నువ్వు నీ కొడుకు ఎలా….?
రాణి: ఒక ఆరునెలలు వాళ్ళతోనే కలిసి వున్నానండి. రోజులు గడిచినకొద్దీ వాళ్ళ వేధింపులు కుటుంబ కలహాలు భరించలేకపోయాను. ఆఖరుకు నా కొడుకు చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి నేను కంగారుపడుతుంటే వాడే వస్తాడులే ఏమీ చచ్చిపోడు అనేవాళ్ళు. తట్టుకోలేకపోయేదాన్ని. ఆ ఇంట్లోనుంచి బయటకు వచ్చేయాలనుకున్నాను. ఇంటి ఆస్తిలో ఎప్పుడూ ఏమీ అడగనని నాతో కాగితం రాయించుకుని నన్ను వదిలించుకున్నారు వాళ్ళు. ఆయన వున్న రోజుల్లోనే నలుగురు ఆడపడుచులున్నారు కదా, దేనికైనా పనికొస్తుందని ఒక సంస్థలో బ్యూటీపార్లర్‌కి సంబంధించిన ట్రైనింగు తీసుకున్నానండి. చీరలకు ఫాల్స్‌ కొంత కుట్టుపని చేయగలను. అంతకుముందు బాగా తెలిసిన ఒక కుటుంబం వాళ్ళింట్లో ఓ గది అద్దెకిచ్చారు. చుట్టుప్రక్కల ఇళ్ళలో మెల్లగా అందరికీ తెలిసిపోయి హెన్నాలకి పిలవడం, ఫేషియల్‌ చేయించుకోవడానికి పిలవడం చేసారు. అదే నా సంపాదన. నా కొడుకుని చదివించుకోవాలి. మేమిద్దరం బ్రతకాలి అందులోనే.
పెద్ద పెద్ద బ్యూటీపార్లర్‌లున్నాయి వున్నాయి. కాని నేను ఇంటికి వెళ్ళి సర్వీస్‌ ఇస్తాను కదా! ఉదాహరణకి తలకి హెన్నా పెట్టించుకుని ఇంటిపనులెన్నో చేసుకోవచ్చు. మిగిలిన పార్లర్‌ సర్వీస్‌ ఇంటి దగ్గర దొరకడం సమయం ఆదా అయినట్టే కదా! అసలు అందరికీ సమయం సర్దడమే కష్టం అవుతుంది ఒక్కోసారి. పెళ్ళిళ్ళ సీజన్‌లో అసలు తీరకే ఉండదండీ. అప్పుడు బాగానే వుంటుంది. ఎంతబాగున్నా అద్దె, అవసరాలు, బాబు ఫీజు వీటికే సరిపోతుందండి! ఈ బతుకు ప్రయాణంలో నాకు బాగా సహకరించిన వార్లు  ఒక నార్త్‌ ఇండియన్‌ కుటుంబం వున్నారండి పన్నెండేళ్ళుగా వాళ్ళింట్లో వంటపని ఇచ్చి నన్ను ఆదుకున్నారు. అండగా ఉన్నారు. వాళ్ళింట్లో వంటపని పూర్తికాగానే, నా పని నేను చేసుకుంటాను. అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మరిచిపోవద్దు. వారిని నేను ఎప్పుడూ తలచుకుంటూనే వుంటాను.
రోజూ ఉదయం యోగా కోసం ఏదో పార్కు వెళ్తాను. మాలాంటి డబ్బుల్లేని వాళ్ళకు పెద్ద పెద్ద జబ్బులొస్తే కష్టం కదా. అందుకే కొంచెం ఆరోగ్యంగా ఉండటం కోసం ఇందిరాపార్క్‌లో నేర్పించే ఉచిత యోగా శిక్షణ కోసం వెళ్తాను. అక్కడి పురాతనమైన వృక్షాలు, వాటి నుంచి కావల్సిన మెటీరియల్‌ కొంత సేకరించుకుంటాను. బయట ఆకుకూరలు అమ్మేవారికి ముందుగా చెప్పి అల్లోవేరా, గుంటగలగరాకు, మందారం ఆకులు తెప్పించుకుంటాను., సీజన్‌లో సంవత్సరానికి సరిపడా ఉసిరికపొడి నేనే తయారుచేసి వుంచుకుంటానండి. పాత బస్తీకి వెళ్ళి హోల్‌సేల్‌గా హెన్నాపౌడర్‌ తెచ్చి పెట్టుకుంటాను. మాటసాయంగా అప్పు కింద కొంత డబ్బు తీసుకుని టూవీలర్‌ ఒకటి కొనుక్కున్నాను. అప్పు మెల్లగా తీరింది. టూ వీలర్‌ వల్ల చుట్టుపక్కల ఏరియాలన్నీ త్వరగా త్వరగా తిరిగి రాగలుగుతున్నాను.
ఇదివరకటి శక్తి సన్నగిల్లింది. ఒక్కోసారి ఎందుకీ బతుకు అన్పిస్తుంది. నా కొడుకు గుర్తొస్తాడు. వాడిపుడు డిగ్రీ ఫైనలియర్‌లో వున్నాడు. చేతికందివస్తే కొంచెం నా కష్టాలు గట్టెకుతాయనే ఆశ. వాడితో కూడా పాల పాకెట్లు వేయించాను. పేపర్‌ వేయించాను. కంప్యూటర్‌ షాప్‌లో కొన్నాళ్ళు పనిచేసాడు. బతకడం నేర్పాననే అనుకుంటున్నానండి. వాడికి కూడా కష్టం, సుఖం తెలిసొచ్చిందండి. సాయంత్రం పూట కొంచెం విశ్రాంతిగా వుండమ్మా ఎక్కువగా కష్టపడకు అంటున్నాడు. రోజూ తెల్లవారు ఝామునే లేచి యోగాసాధన చేసి ఏడుగంటల నుంచి రాత్రి పదింటిదాకా రాణి తన సేవలను కొనసాగిస్తూనే వుంటుంది. అనుకోకుండా నేర్చుకున్నా విద్య ఇవాళ అన్నం పెడుతోంది. ఎవరిసహాయం కోసమో, ప్రభుత్వ పథకాల కోసమో ఎదురు చూడకుండా, తన చేతిలో వున్న విద్యని ఆధారంగా మార్చుకుంది రాణి. ఇవాళ అశోక్‌నగర్‌, గగన్‌మహల్‌, విద్యానగర్‌, హిమాయత్‌నగర్‌, దోమల్‌గూడ ఏరియాల్లో ఎంతో మంది స్త్రీలు రాణి సేవలను వినియోగించుకుంటున్నారు. వర్కింగు వుమెన్స్‌కి, ప్రొఫెషనల్స్‌కి, వీకెండ్స్‌లో వెళ్ళి సర్వీసెస్‌ అందిస్తుంటుంది. ఇవాళ రాణి ఎంత బిజీ అంటే రెండ్రోజుల ముందుగా ఫోన్‌ చేస్తే తప్ప దొరకదు. ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు రాణి తన మనిషి అనుకునేలా వుంటుంది రాణి ప్రవర్తన. పన్నెండేళ్ళ క్రితం ఒంటరిగా మొదలైన తన ప్రయాణంలో తనకు వెన్నుదన్నుగా ఈ మహిళలందరూ ఉన్నారని అంది రాణి చెమర్చిన కళ్ళతో. నిరంతరం పరుగులు పెడుతూ జీవిక కోసం బ్రతుకుచక్రాన్ని లాగుతున్న రాణిని ”పార్లర్‌ ఆన్‌ వీల్స్‌” అనొచ్చేమో. ఆమె కొడుకు ఆమె కష్టాన్ని ఒడ్డెక్కించాలని రాణి లాగే మనమూ కోరుకుందాం.
ఇంటర్వ్యూ :హిమజ

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.