జెన్ జీ అమ్మాయిల నిరసన: సంఘ పరివార్ ప్రతీకార స్పందన – ఎ. సునీత

జంతర్ మంతర్ నిరసనలు దేశ రాజకీయాలని కుదిపాయి. దీర్ఘ కాలికంగా ఇవి ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేకపోయినా, అనేక విశ్లేషణల్లో కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంఘ పరివార్ భావజాల, భౌతిక అధిపత్యానికి దెబ్బ తగిలింది.

తాము చేసిందే సరైంది, తమని ఎవరూ ప్రశ్నించలేరు, ప్రశ్నించాలని ప్రయత్నించే వారికి నిలువ నీడ లేకుండా చేస్తాం అని ప్రజల్లో పధ్ధతి ప్రకారం పెంచిన భయానికి కొంత గంటు పడింది. రెండు దశాబ్దాల పాటు అతి జాగ్రత్తగా నిర్మించుకున్న సంఘ పరివార్ ప్రచార సౌథానికి బీటలు బారాయి. వాట్సాప్, లెగసి మీడియా కాక ఇంస్టాగ్రామ్ మాత్రమే చూసే తరం తమ వ్యగ్యం, హాస్యం, సూటిగా మాట్లాడే తీరుతో నిరసనలకి కొత్త రూపం ఇచ్చారు. ఇది భిన్న భావజాలాల వ్యక్తులు పరిస్థితులని బాగు పరిచే దృష్టితో దగ్గరికొచ్చినప్పుడు వచ్చే పాపులిస్టు నిరసన. ఆధిపత్యం దెబ్బ తింటున్న సంఘ పరివార్ ఎప్పటి లాగే నిరసనలకారుల్ని ప్రతీఘాత శక్తులుగా చూపించటానికి శాయశక్తులా ప్రయత్నించింది. సీరియస్‌గా లేరని, బిర్యానీలు తింటున్నారని, డబ్బుతో పాడయిపోయిన వాళ్ళని, ఇంకా వేరే రాజకీయ కుతంత్రంతో నిరసన జరుపుతున్నారని. అవెందుకో పెద్దగా ప్రజల్ని, ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకోలేక పోయాయి.
యువకులు, ముఖ్యంగా తమని సమర్ధించే ఆధిపత్య కులాల కుటుంబాలకి చెందిన వారిని, బుజ్జగించటానికి ఇంస్టాగ్రామ్‌లో కొత్త ప్రచారం చేపట్టిన సంఘ పరివార్, యువతుల ప్రభుత్వ వ్యతిరేక ధిక్కారాన్ని మాత్రం తీవ్రంగా పరిగణించింది. సంఘ పరివార్ హిందూ మహిళల వీరత్వానికి వ్యతిరేకం కాదు, కానీ దానికో నమూనా వుంది. ఈ నమూనాకు వేదకాలం నాటి స్త్రీలు, వెయ్యేళ్ళలో ఏ ‘ముస్లిం’ రాజుతో ఏ కారణంగా అయినా పోరాడిన స్త్రీలు ఆదర్శం. ఎవరి ఆధ్వర్యంలో, ఎవరినయితే శత్రువులుగా సంఘ్ పరిగణిస్తుందో వారిపైనే ఏ హిందూ స్త్రీ అయినా వీరత్వాన్ని ప్రదర్శించాలి. మనం – వాళ్ళు అనే అంతరాన్ని పోషించటానికి స్త్రీలు పురుషుల ఆధ్వర్యంలో నడవాలి. హిందూత్వ భావజాల పరిధిలో బహిరంగ, అంతరంగ సమావేశాల్లో పాల్గొనటం, ‘ఇతరులు’ గా వేరు చెయ్యబడిన వారిని వెంట బడి, వేధించి, హింసించాలి. దాని కోసం ఎంతకయినా తెగించొచ్చు. తీవ్రవాద కార్యకలాపాలలో కూడా పాల్గొనచ్చు. ఈ నమూనాలో బాబ్రీ మస్జీద్ కూల్చివేత, గుజరాత్ ముస్లింల ఊచకోత, ముస్లింల నివాసాలపై బాంబులు వెయ్యటం వీరోచిత కార్యక్రమాలు.
హిందూత్వ స్త్రీత్వ నమూనా పెరుగుదల
ఈ స్త్రీత్వ నమూనా 1980లలో రూపుదిద్దుకోవటం ప్రారంభమయింది. సరిగ్గా పితృస్వామ్య అధికార మూలాల్ని ప్రశ్నించే స్త్రీవాదం దేశంలో వస్తున్న సమయంలోనే యధాతధ అధికార వ్యవస్థని బలపరిచే హిందూత్వ వాదాన్ని సంఘ పరివార్ దేశంలో వ్యాపింప చెయ్యటం యాదృచ్చికం కాదు. స్త్రీలలో మార్పు, స్వతంత్రత కోసం ఆకాంక్ష వస్తోందని గుర్తించిన సంఘ పరివార్ వాటికి సమానత్వం, హక్కులు కాకుండా వేరే దారి కల్పించటం కోసం దుర్గా వాహిని, రాష్ట్రీయ స్వయం సేవికా సంస్థలని ప్రారంభించింది. 1990ల చివరిలో బిజెపి ప్రభుత్వంలోకి వచ్చి, తర్వాతి రెండు దశాబ్దాలలో దాని ప్రభావం, ఆధిక్యత, ఆధిపత్యం పెరుగుతున్న కొద్దీ, ఆధునికత, సమానత్వ విలువలు, చదువు, జ్ఞానానికి బదులు సంప్రదాయ భావజాలం, యధాతథ సామాజిక ఆధిపత్యానికి సాంస్కృతిక విలువ మన సమాజంలో పెరుగుతూ వచ్చింది. దీనికి నయా ఉదారవాదం, ప్రభుత్వం సంక్షేమం, విద్య, ఉద్యోగాలు కల్పించనక్కర్లేదంటూ, మంచి వూతం ఇచ్చింది.
సమాజంలో అగ్రకుల హిందూ స్త్రీల కోసం నిర్దేశించిన పండగలు, సంబరాలు, వ్రతాలు, యాగాలు, కుటుంబాలని వదిలి సన్యాసినిలుగా మారిన వారి ప్రత్యేక చోట్లు, సాంస్కృతిక అలవాట్లు అన్నీ వాడుకుని ఈ హిందూత్వ స్త్రీత్వ నమూనా వృద్ధి చెందింది. స్త్రీవాదంతో ప్రభావితమయ్యి కుటుంబాలతో, స్వంత సమూహాలతో యుద్ధం చేసి తెచ్చుకునే స్వతంత్ర అస్తిత్వం కంటే, అధికార వ్యవస్థలతో కలిసి పనిచేసి తెచ్చుకునే అధికారం అనేక మంది స్త్రీలకి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక కుటుంబ జీవితాలని వదిలేసి సన్యాసినులుగా బ్రతికే హిందూ స్త్రీలకి వలస వ్యతిరేక ఉద్యమకాలం నుండి కూడా ఉంటూ వచ్చిన ఒక ప్రత్యేక అధికారం, చోటుని కూడా సంఘ పరివార్ ఉపయోగించుకుంది. ఇలా ఉపయోగించుకోవటం హిందుత్వ వాదానికే పరిమితం కాదు. కుల-పితృస్వామ్య వ్యవస్థలలో స్త్రీలకి అధికారం ఇలాగే లభిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పితృస్వామ్యాన్ని ఎంతో కొంత ఒప్పుకుని ఇంగ్లీషు చదువులతో సంప్రదాయ విలువలు, సామాజిక నిచ్చెన వ్యవస్థల పట్ల గౌరవం, హిందూత్వ రాజకీయాల పట్ల భక్తి కలిపి రంగరించిన స్త్రీత్వం జనరంజకమయింది. భారతీయత పేరుతో తప్పనిసరిగా సమానత్వం, ఆధునికత, స్త్రీవాదాలని తిరస్కరించటం దీని లక్షణం.
యధాతథ పరిస్థితులని కాపాడి అధికారంలో పాలు పంచుకునే అవకాశాన్ని అనేక మంది స్త్రీలు ఉపయోగించుకుని పైకొచ్చారు. ముంబైలో ముస్లింలపై దాడులు చేసిన శివసేన స్త్రీలు, గుజరాత్‌లో తమ ఇంటి పని ముగించుకుని పచ్చళ్ళు పెట్టినట్లు, కలిసి డాబా మీద బాంబులు తయారు చేసిన గృహిణులు ఒక పక్క, టెలివిజన్ సీరియళ్ల ద్వారా వత్తిళ్లలో వుండే కుటుంబాన్ని కాపాడే వీర గృహిణి పాత్ర పోషించి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన స్మ్రుతి ఇరానీ వంటి స్త్రీలు ఇంకో పక్కా మనకి హిందూత్వ వీరవనితా నమూనాలుగా కనిపిస్తారు. వసుంధర రాజే సింధియా నుండి ఉమా భారతి, ప్రజ్ఞ సింగ్, మాయ కొడ్నని వంటి వాళ్ళతో పాటు, నావికా కుమార్, రుబిక లాల్, అంజనా కశ్యప్, పాల్కి శర్మ వంటి జర్నలిస్టులు, వారితో పాటు చారు ప్రగ్య, రిద్ధిమా శర్మ, చాందిని భగత్ వంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎదిగారు. ముస్లిం పితృస్వామ్యంతో విసిగిపోయిన షాజియా ఇల్మీ వంటి ముస్లిం స్త్రీలకి కూడా చోటు లభించింది.
ఈ నమూనాలో విధేయతకు తప్ప, విభిన్నతకి, అభిప్రాయం బేధాలకి చోటు ఉండదు. పార్టీ నాయక విధేయులుగా, ఎన్నికల రాజకీయాలు ఏకపక్షమయ్యి, అధికారమంతా ఒకేచోట కేంద్రీకృతమవుతున్న నేపథ్యంలో వార్తా పత్రికలూ, న్యూస్ చానెళ్లు ఆ తర్వాత నెమ్మదిగా హిందీ, తెలుగు సినిమా పరిశ్రమల్లో కూడా విధేయ మార్గం పట్టాయి. బిజెపిలో ఎదగాలనుకునే ఏ స్త్రీకయినా సంప్రదాయికత సమర్ధన, ముస్లిం/క్రిస్టియన్ ద్వేషం, స్వతంత్రంగా అభిప్రాయాలూ వ్యక్తం చేసే ఆడవాళ్లపై తిట్లు, శాపనార్ధాలతో ఆన్లైన్ దాడులు, వీలయితే కేసులు వేయటంతో పాటు భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకత్వం పట్ల అపరిమిత భక్తి ప్రదర్శించటం తప్పనిసరి అయ్యాయి. పార్టీలో కొంత స్వతంత్రత ప్రదర్శించిన ఉమా భారతి వంటి వాళ్ళకి కూడా స్థానం లేకుండా పోయింది.
యువతుల ధిక్కారం
జెన్ జీ నిరసనల పుణ్యమా అని రెండున్నర దశాబ్దాల పైగా జాగ్రత్తగా నిర్మించి, ముఖ్యంగా ఆధిపత్య కులాల, వర్గాల స్త్రీలకి అందించిన హిందూత్వ స్త్రీత్వ నమూనా ప్రమాదంలో పడిందని సంఘ పరివార్‌కి అనిపించింది. నెల రోజుల పైగా జరిగిన నిరసనలో అమ్మాయిలు కీలక పాత్ర పోషించారు. ఐసా విద్యార్థి నాయకురాలు నేహా బోర 22 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే, రత్నాసింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధిగా వున్నారు. వందలాది మంది స్కూలు, కాలేజీ, విశ్వవిద్యాలయ విద్యార్థినినులు నిరసనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అబ్బాయిల్లాగే ఇంట్లో చెప్పి వచ్చిన వాళ్ళు కొందరయితే, చెప్పకుండా చాలా మందే వచ్చారు. ఉత్సుకత రేకెత్తించే పోస్టర్లు, నవ్వొచ్చే మీమ్స్, ఆలోచింపచేసే రీల్స్‌ని తయారు చెయ్యటంతో పాటు పాటలు పాడారు, డాన్సులు చేశారు. జులై 20న పార్లమెంటు వైపు జరిగిన మార్చిలో భాష్ప వాయువు, పోలీసు లాఠీలు, తూటాలతో పాటు అబ్బాయిలకి ఎదురువవ్వని లైంగిక పరమైన తిట్లు, వేధింపులు, హింస ఎదుర్కొన్నారు. పోలీసులు, సివిల్ డ్రెస్‌లో వున్న సంఘ్ పరివార్ గూండాలు అమ్మాయిల గుప్త భాగాల మీద కొట్టి, వేసుకున్న బట్టలు చించి, నగ్నంగా చేసి కొడతాం అంటూ అని కెమెరాలున్నాయనే భయం ఏ మాత్రం లేకుండా బెదిరించారు.
అప్పటి వరకూ నెల రోజుల పాటు జరిగిన నిరసనలో అమ్మాయిలు ఏ ఒక్క రోజూ అభద్రతా భావానికి లోనవ్వలేదు. కొత్తతరం తమ నిరసన నిర్వహణలో భాగంగా తిండి, నీళ్లు, శుభ్రతలతో పాటు, అమ్మాయిల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గుంపు ఎక్కువయినప్పుడు తోపులాట నుండి కాపాడటానికి వాళ్ళ చుట్టూ మానవ హారం తయారు చెయ్యటం నుండి వాటిలో ఒకటి. మొదటిసారి తమకి రోడ్ల మీద భద్రంగా అనిపించిందని, అన్ని వేల మంది మధ్యలో కూడా ఎక్కడా ఒక్క వేధింపు గాని, చెడ్డ అనుభవం ఎదురవలేదని అనేక మంది అమ్మాయిలు రీల్స్ చేసి మరీ చెప్పారు. వేధింపులు సర్వ సాధారణమయిన ఢిల్లీ వంటి నగరంలో ఇది మామూలు విషయం కాదు. అటువంటి వాతావరణంలో పోలీసులు, గూండాల దాడితో అమ్మాయిలు సహజంగానే దిగ్బ్రాంతి చెందారు. అయితే వారిపై ఇక్కడితో దాడులు అక్కడితో ఆగలేదు.
తమ భావజాల కొనసాగింపులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన విధేయ స్త్రీత్వ నమూనాని నిరసనలో పాల్గొన్న అమ్మాయిలు ముక్కలు చేసేశారన్న ఆగ్రహంతో బిజెపి మొత్తం ద్రుష్టినంతా వీరి వైపు సారించింది. ఒకపక్క నిరసన కారులకి పోలీసు కేసులు పెట్టమనీ, పెట్టినవి తీసేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఫేషియల్ గుర్తింపు టెక్నాలజీ వాడి పోలీసులు, ఐ టి సెల్ ద్వారా బాగా పాపులర్ అయిన అమ్మాయిలని గుర్తించి, వారి వివరాలని బహిర్గతం చేసింది. వారిపై తీవ్రమైన ఆన్లైన్ దాడులు చేయించింది. ఒక 15 ఏళ్ల అమ్మాయి ‘తీవ్రమైన భాష’ వాడిందనే పేరు మీద ప్రధాన స్రవంతి మీడియా ఎంత బెదిరించారంటే, ఆ అమ్మాయి కుటుంబం అద్దె ఇల్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్ళటమే కాకుండా దేశం మొత్తానికే క్షమాపణ చెపుతూ వీడియో చెయ్యాల్సి వచ్చింది. ముంబైలో నిరసనకారుల్ని తీసుకెళ్తున్న పోలీసు వాన్‌ని ఆపిన మోడల్‌ని బీజేపీ ఆన్లైన్ ట్రోల్ల్స్ తీవ్రంగా వేధించి, లైంగిక దాడి చేస్తామని బెదిరించిన తర్వాత ఆ అమ్మాయి పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయ్యాల్సి వచ్చింది. అనేక మంది ఇళ్ళకి పోలీసులు ఇన్ఫార్మల్‌గా వెళ్లి మరీ బెదిరించారు.
ఇటువంటి స్వంత వ్యక్తిత్వం, అభిప్రాయాలు వ్యక్తం చేసే ఆడవాళ్లపై గత పదేళ్లలో తమ ఐ టి సెల్ ద్వారా రోజువారీ దాడులు చేసి, వారిని నియంత్రించటానికి లవ్ జిహాద్ చట్టాలు, వుమ్మడి పౌర చట్టం పేరుతో ఎంతో కష్టపడినా సరే ఇంతమంది అమ్మాయిలు జంతర్ మంతర్‌కి ఎలా వచ్చారు? ఇదే సంఘ పరివార్ బాధ. విధేయ స్త్రీత్వ నమూనాకి పడిన బీటలు, దానికి బాగు చెయ్యటానికి సంఘ పరివార్ పడుతున్న తంటాలు తర్వాతి ప్రచార బాటలో కనిపిస్తాయి. దీనికి నాయకత్వం వహిస్తూ ప్రధాన ఇన్ఫ్లుయెన్సుర్ మోడీజీ 15 ఏళ్ల మైనర్ అమ్మాయి ‘చనిపోయిన మా అమ్మని తిట్టిందంటూ’ తన ఇంస్టాగ్రామ్ మెసేజ్‌లో ఏడ్చి ‘మన ఆడ పిల్లలు సంస్కృతిని ధిక్కరించి పాడయి పోతున్నారని, వారిని బుజ్జగించి సరయిన భారతీయ సంస్కృతిని నేర్పాలని’ అన్నాడు. మోహన్ భగవత్ ఇంకొంత లోతుకి వెళ్లి విశ్లేషిస్తూ ‘మహిళా ఉద్యమం స్వతంత్ర భావాలని నేర్పి రెండు తరాల స్త్రీలని చెడగొట్టిందంటూ’ ప్రకటించాడు.
అయన వూహ సరైందే. జంతర్ మంతర్ నిరసనల్లో కీలక పాత్ర పోషించిన ఐసా నాయకురాలు నేహా బోర తల్లిదండ్రులిద్దరూ సంఘ పరివార్ సమర్ధకులు, బిజెపి ఓటర్లు. ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు చూడటానికి తల్లి వచ్చింది కానీ, తండ్రి రాలేదు. జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆమె వామపక్ష విద్యార్థి సంఘంలో చేరి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ విద్యా విధానాలపై పదునైన విమర్శ చేస్తూ వస్తోంది. ఆమే కాదు, ఇతర అనేక మంది యువతులు, యువకులు కూడా బిజెపి సమర్ధక కుటుంబాలలో పెరిగి, తల్లి తండ్రులతో దేశ రాజకీయాల గురించి విభేదించి, ప్రధాన స్రవంతి మీడియా చూడొద్దని కొట్లాడి విసిగిపోయామని అడిగిన వాళ్లకి చెప్పారు, ఇంస్టాగ్రామ్ కామెంట్లలో రాశారు. విధేయతా సంస్కృతికి ప్రతిరూపమై, హిందూత్వ భావజాలానికి ఆధారంగా మారిన కుటుంబం లోపలి నుండే ఈ ధిక్కారం రావటం సహజంగానే సంఘ పరివార్‌ని కలవర పెట్టింది. దాని పర్యవసానమే నిరసన ఉపసంహరణ తర్వాత, యువతులపై కేంద్రీకరించి జరుగుతున్న ప్రతీకార దాడులు.
దీనికి పరాకాష్ట కేరళలో సంఘ పరివార్‌లో దశాబ్దాలు పని చేసిన 70 ఏళ్ల మోహన్ దాస్ ప్రేలాపనలు. తాను గనక ఉంటే జంతర్ మంతర్‌లో నిరసన కారులపై కాల్పులు జరిపి, చనిపోయిన వాళ్ళ శరీరాల్ని అక్కడి నుండి వెంటనే తీసేయించె వాడినని, దెబ్బకి అందరూ చెల్లా చెదురయి పొయ్యే వాళ్ళనీ అనటమే కాకుండా, పెద్ద ఎత్తున అత్యాచారాలు చేయించే వాడినని, ఈ నిరసనల్లో పాల్గొనే స్త్రీవాద, వామపక్ష యువతులకు అత్యాచారం చేయించుకోవటం ఇష్టం కాబట్టి వాళ్ళేమీ అడ్డు చెప్పే వాళ్ళు కాదనీ అన్నాడు. పిచ్చి వాడి ప్రేలాపనలా అనిపించినా ఇది సంఘ పరివార్ ఆలోచనలో కొత్తదేమీ కాదు. పాశ్చాత్య విలువల వల్లే అత్యాచారాలు జరుగుతాయని, అమ్మాయిలు పురుష సంరక్షణ లేకుండా బయట తిరగ కూడదని, అటువంటి అమ్మాయిలకి ఏమయినా జరిగితే వాళ్ళే బాధ్యులని ఈ భావజాలం నమ్మబలుకుతుంది. బిల్కిస్‌బానో రేపిస్టులని, హత్రాస్ రేపిస్టులని, ఒలింపిక్ క్రీడాకారిణులని వేధించిన బ్రీజ్ భూషణ్‌ని ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్ధించిన సంఘ పరివార్‌కి చెందిన మనిషి జంతర్ మంతర్ కొచ్చిన యువతులపై ఇలా ప్రేలాపన చెయ్యటం ఆశ్చర్యం కలిగించదు.
స్త్రీలకి తమ కంటూ స్వంత ఆదాయం, దానితో వచ్చే గుర్తింపు మరియు ఉనికి ఇచ్చే ఉద్దేశం లేని ఆర్ధిక వ్యవస్థ, రాజ్యం వున్న దేశం మనది. దీనితో మహిళా ఉద్యమ నిర్మాణం, స్త్రీవాదం సామాజిక మార్పులో పోషించే పాత్రని పరిమితంగానే ఉంటూ వచ్చింది. విద్యలో అమ్మాయిల శాతం పెరిగి, వాళ్ళు ఇంటి బయట బ్రతకగలిగే అవకాశాలు ఉన్నాయని గత ముప్ఫయి ఏళ్ళల్లో తెలుసుకున్నారు. మహిళా ఉద్యమం, స్త్రీవాదం పెరగగలిగే సమయం ఇది. అదే సమయంలో సంఘ పరివార్ యధాతధ వాదాన్ని బలపరిచి కుటుంబాన్ని స్త్రీవాద వ్యాప్తిని కొంత మేరకు అడ్డుకోగలిగింది. కానీ ఈ వాతావరణంలో పెరిగిన స్త్రీలు తమల జీవితాల్లో తీవ్ర వైరుధ్యాన్ని ఎదుర్కోక తప్పలేదు. పితృస్వామిక వ్యవస్థ ఇచ్చిన స్త్రీత్వాన్ని పక్కన పెట్టి ఎదిగిన స్త్రీలు బహిరంగ జీవితంలో మాత్రం అవే విలువలని నిర్ద్వంధ్వంగా సమర్ధించాలి. ఎప్పుడయితే ఈ యధాతధ వాదం తన వాగ్దానాలని నిలబెట్టుకోలేక పోయిందో, ఈ వైరుధ్యం ఎక్కువయింది. ప్రచారం దాన్ని కాపాడలేకపోయింది. సోషల్ మీడియా ఈ అసంతృప్తులకి ఒక వేదికగా మారి ఈ ప్రచారం ఉచ్ఛ స్థాయిలో వున్నప్పుడు పెరిగి పెద్దయిన అమ్మాయిలే జంతర్ మంతర్ నిరసనల్లోకి వచ్చారు. యువతగా దేశ రాజకీయాలకి సవాలు విసరటంతో పాటు యువతులుగా ఈ యధా తధా వాద పితృస్వామ్య సంస్కృతికి బహిరంగ సవాలు విసిరితే స్త్రీవాదం, మహిళా ఉద్యమం కూడా పెరిగే అవకాశాలున్నాయి!

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.