(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార
తమపై జరిగిన అత్యాచార ఘటనలను కూడా దళితులు మా సంఘం దృష్టికి తీసుకురావడం మొదలుపెట్టారు. చెర్లపటేల్‌గూడెంలో చిన్న ఎండిపోయిన కుంట… అంటే ప్రభుత్వ ‘శిఖం భూమి’ విషయంలో దళితులకూ భూస్వామికీ మధ్య వివాదం వుంది. భూస్వామ్య వర్గాలు దళితులను కొట్టి వారి గుడిసెలను తగులబెట్టాయి.
కేసులు రిజిష్టరయ్యాయి. తమ గుడిసెల్ని తగులబెట్టినందుకు ప్రభుత్వ నియమాల ప్రకారం తమకు సహాయం చేయాలని దళితులు అడిగితే ఆర్‌డిఒ పొగరుగా “కారంచేడులో దళితుల్ని చంపినట్టు వాళ్లు మీలో ఎవరినైనా చంపేశారా? ప్రభుత్వం డబ్బును మీకు ఎందుకు ఇవ్వాలి?” అని ప్రశ్నించాడు. ఆ మాటలను తీవ్రంగా పరిగణించి మేం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించాం. ఆర్‌డిఒను అక్కడి నుంచి బదిలీ చేసేంతవరకు ఊరుకోలేదు. అలాగే నారపల్లిలో ఎక్కువగా కల్లు గీసే గౌండ్ల కులస్తులుండేవారు. 1987లో ఒక గౌండ్ల అతనిని భూస్వామి విపరీతంగా కొట్టాడు. దానిపై మేం గ్రామంలో ధర్నా చేశాం. బహిరంగ సభ పెట్టాం. చివరికి ఆ భూస్వామిని అరెస్టు చేశారు. బాధిత గౌండ్ల కులస్తుడికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది.
ఇబ్రహీంపట్నంలో మహిళలు క్రమంగా చైతన్యవంతులవుతున్నారు. తమ ప్రయోజనం కోసం రూపొందించిన చట్టాల గురించి తెలుసుకుంటున్నారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి, కనీస వేతనాలు, ప్రభుత్వ భూములు పొందడం వంటి తమ హక్కులను అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల తమకు సంబంధించిన పోరాటాలలో మాత్రమేకాకుండా మా ప్రతి మీటింగ్‌లో, ప్రతి ఊరేగిsపులో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టారు. సంఘం నిర్వహించే పాదయాత్రల్లో కొందరు మహిళలు పిల్లలతో సహా వచ్చి పాల్గొనేవారు. నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలు ఎక్కువ చురుకుగా వుండేవారు. ఎందుకంటే అప్పటికి వాళ్ల పిల్లలు పెరిగిపెద్దవాళ్లయ్యేవారు, కొందరి పెళ్లిళ్లు కూడా అయిపోయేవి, ఇలాంటి వాటిలో పాల్గొనేందుకు వారి ఇళ్లల్లో కూడా అడ్డుచెప్పకుండా అనుమతించేవారు.
గతంలో పెళ్ళిళ్లూ కాన్పుల వంటి సందర్భాల్లో కూడా చాలామంది మహిళలు ఎన్నడూ ఊరు దాటి బయటికి వెళ్లేవారు కాదు. అలాంటి వాళ్లు సంఘం కార్యక్రమాలు మొదలైన తరువాత సాటి బాధితులకు సంఘీభావం తెలిపేందుకు కారంచేడు వంటి సుదూర ప్రాంతాలకు కూడా వస్తున్నారు. పోలీసు అధికార్లనూ, ముఖ్యమంత్రులనూ, గవర్నర్లనూ కలుసుకుంటున్నారు.
కొన్ని గ్రామాల్లో ఎంతో చైతన్యవంతులైన మహిళలుండేవారు. ముఖ్యంగా యాచారంకు మÖడు కిలోమీటర్ల దూరంలో మీర్‌ఖాన్‌పేట్ రోడ్డు మీద వుండే నందివనపర్తి గ్రామంలోని మహిళలు 1987లో ఒక విభిన్నమైన పోరాటం చేశారు. సుబ్బమ్మ అనే బాల వితంతువు బతుకుదెరువు కోసం తెనాలి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అమె వయసు ముప్పై ఐదు సంవత్సరాల వరకు వుంటుంది. హైదరాబాద్‌లో ఆమె నందివనపర్తి గ్రామానికి చెందిన మునుగోడె రంగయ్య అనే ఆరవైఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి నందివనపర్తిలో ఇరవై ఐదు ఎకరాల భూమి, ఇల్లు వున్నాయి. అంత వయసున్న వ్యక్తిని ఎందుకు పెళ్లిచేసుకున్నావు నువ్వు అని అడిగితే ‘ఆయనకు చాలా ఆస్తి వుంది కదండి. సుఖంగా బతకొచ్చని చేసుకున్నానండీ’ అనేది. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత రంగయ్య ఆమెను వదిలేశాడు. తన పేరు మీద కొంత ఆస్తినైనా రాసివ్వమని సుబ్బమ్మ ఎంత వేడుకున్నా అతను ఒప్పుకోలేదు. దాంతో ఆమె మనోవర్తి కోసం కోర్టులో కేసు వేసింది. కోర్టు చాలా నెమ్మదిగా వ్యవహరించడం వల్ల తీర్పు వెలువడకముందే రంగయ్య మధ్యలోనే చనిపోయాడు. రంగయ్య చనిపోయిన తరువాత ఆ కేసు పనికిరాకుండా పోయింది. సుబ్బమ్మ వచ్చి తన కాళ్ల మీద పడకుండా కోర్టులో కేసు వేస్తుందా అన్న కోపం రంగయ్యకు బాగా వుండేది. అందుకే చచ్చిపోయే ముందు తన మొత్తం ఆస్తిని ఆ ఊరి బ్రాహ్మణ సర్పంచ్ అనంతరామయ్యకు బహుమతిగా రాసిచ్చి పోయాడు. ఆ భూమిలో అనంతరామయ్య కొంత భాగాన్ని ఇతర్లకు అమ్మేసుకున్నాడు. సుబ్బమ్మ నందివనపర్తి గ్రామంలోని ఇంట్లోనే వుండేది. అక్కడి గిన్నెలు, వస్తువులు, దూలాలు, తలుపులు అవీ ఇవీ అమ్ముకుంటూ కొన్నాళ్లు గడిపింది. ఆ తరువాత ఊళ్లోని కల్లు దుకాణం ముందు శనగ గుడాలు, మిరపకాయ బజ్జీలు అమ్ముకోవడం మొదలుపెట్టింది. భర్త ఆస్తిలో తనకు రావలసిన వాటా కోసం ఆమె ఊరి పెద్దలకు చేసుకున్న విజ్ఞప్తులు, కోర్టుకు పెట్టుకున్న పిటిషన్లు ఏవీ ఫలించలేదు.
చివరకు 1987లో సుబ్బమ్మ సహాయం కోసం నందివనపర్తిలోని చైతన్యవంతులైన మాల, మాదిగ మహిళలను ఆశ్రయించింది. వాళ్లు ఆ కేసుతో ప్రమేయం వున్న వారిని వేధించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. దాని ప్రకారం చచ్చిపోయిన మునుగోడె రంగయ్య పొలంలోని చెట్లను నరికి ఆ చెత్తా చెదారాన్ని, గాజు పెంకుల్ని మిగతా భూభాగంలో పడేశారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ‘పోలీసోళ్లు నలుగురు… మేం ఆడోళ్లం వంద మందిమి. ఏం చేస్తరమ్మా వాళ్లు మమ్మల్ని’ అనేవారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసుల ముందే మరికొన్ని చెట్లను నరికి అలాగే పడేశారు. అప్పుడు పోలీసులు మహిళల జోలికి వెళ్లకుండా ఆ పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న ఐదుగురు మహిళల భర్తల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల పాటు వాళ్లని లాకప్‌లో పెట్టారు. దాంతో మరింత రెచ్చిపోయిన మహిళలు సర్పంచ్ అనంతరామయ్య పొలంలోని జొన్నపంటని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ మహిళలకూ, పోలీసులకూ, అనంతరామయ్య అనుచరులకూ మధ్య ఈ ీVAరాీVAరీ పోరాటం కొన్నాళ్లపాటు అలాగే కొనసాగింది. ఇక ఈ ఆడోళ్లు తగ్గేట్టు లేరని వాళ్లు గ్రహించారు. చివరికి అన్ని పార్టీలూ కలిసి కూర్చుని ఒక రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాయి. తద్వారా సుబ్బమ్మకు రెండు ఎకరాల పొలాన్ని ఇచ్చేందుకు బ్రాహ్మణ సర్పంచ్ అనంతరామయ్య అంగీకరించాడు.
ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా వుండటం వల్ల ఇక్కడి జనాన్ని కష్టనష్టాలకు గురిచేస్తున్న కొన్ని దురలవాట్ల గురించి నాకు తెలుసు. అందులో ముఖ్యమైనది పెళ్లిళ్ల కారణంగా కుటుంబాలు అప్పుల పాలవడమనేది ఒకటి. ఇతర కులాల్లో మాదిరిగా కాకుండా మాదిగ కుటుంబాల్లో కొడుకు పెళ్లి చేసినా.. కూతురు పెళ్లి చేసినా విపరీతంగా ఖర్చు అవుతుంది. ఇందులో పెళ్లి కూతురు కుటుంబం`పెళ్లికొడుకు కుటుంబం అన్న తేడా ఏమీ వుండదు. అటూ ఇటూ రెండు కుటుంబాలూ పెళ్లికి భారీ మొత్తం ఖర్చుపెట్టాల్సిందే. 1980లకి ముందు వీరిలో వరకట్నం వుండేది కాదు. సాధారణంగా ‘ఓలి’ (పెళ్లికూతురి ధర) అనబడేది వుండేది. 1985 నాటికి తెలంగాణాలో మాదిగ యువకులకు ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తుండటంతో వరకట్న దురాచారం నెమ్మదిగా మాదిగ కుటుంబాýకు కూడా అంటుకుంది. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఇతర కులాలకు చెందిన తమ తోటి సహచరులు పెద్ద మొత్తాల్లో వరకట్నం తీసుకోవడాన్ని చూసి వారిలాగా తమకూ సమానంగా ధర వుండాలని భావించడం మొదలుపెట్టారు. కాస్త డబ్బున్న మాదిగ కుటుంబాలు కూడా తమ
కూతుళ్లు ఇతర ఆడపిల్లల్లాగా అత్తవారింట్లో నీళ్లు మోసుకురావడం, పొయిలోకి కట్టె పుల్లలు ఏరుకురావడం, మండుటెండలో పొలాల్లో పనిచేయడం, వారి పిల్లలు చిరిగిన బట్టలతో పొలాల గట్ల మీద తిరగడం వంటి కష్టాలకు గురికాకూడదనీ.. కాన్పుల సమయంలో సరైన వైద్యసౌకర్యం లేక చనిపోకూడదనీ ఆశించేవారు. అందుకే తమ బిడ్డలకు సౌకర్యవంతమైన జీవితాన్ని కల్పించేందుకు డబ్బున్న సంబంధాల కోసం వెతికి, పెళ్లికొడుకులకు పెద్ద మొత్తంలో వరకట్నం ఇచ్చి పెళ్ళి చేయడం మొదలుపెట్టారు.
కొందరు మాదిగ వృద్ధ మహిళలు తమ కాలం నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ‘పెళ్లయినప్పుడు మేం ఒక ఈత చాప, ఒక జత బట్టలు, నీళ్లకోసం రెండు ఇత్తడి బిందెలో లేకపోతే రెండు మట్టి కుండలో వెంట తెచ్చుకుని అత్తగారింట్లో అడుగుపెట్టేవాళ్లం’ అంటుంటారు. 1980ల మధ్య నాటికి పెళ్లి కూతుళ్లు తమతో తెచ్చుకునే వస్తువుల జాబితా చాలా పెరిగింది. రెండు స్టీలు లేదా అల్యూమినియం పాత్రలు, ఒక స్టీలు అల్మారా, తనకే కాకుండా అత్తవారింట్లో అందరికీ కొత్త బట్టలు మొదలైనవి తీసుకురావడం మొదలయింది. పెళ్లినాటి విందులో ఒకటో రెండో మేకలు కోయాల్సిందే. ఆ పెళ్లి విందులు రోజుల తరబడి జరగాల్సిందే. పెళ్లి కూతురిని అత్తవారింటికి తీసుకువెళ్లడం, మళ్లీ తీసుకు రావడం, మళ్లీ తీసుకుపోవడం వంటి ఆచారాలు వచ్చాయి. ప్రతిసారీ ఇంటికి వచ్చే బంధువులందరికీ మటన్ భోజనం పెట్టడం, మందుతో కూడిన విందు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది.
నేను వామపక్షాలతో కలసి పనిచేసి వుండటం వల్ల.. ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ ఆచారాలూ కర్మకాండల గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల..పెళ్లిళ్లలో జరుగుతున్న ఆ దుబారా ఖర్చులను చూస్తుంటే చాలా బాధనిపించేది. రెండు తెలుగు రాష్టాల్లో అనేక చోట్ల అంబేడ్కరిస్టులు, లెఫ్టిస్టులు చేస్తున్నట్టు తమ పిల్లలకు ఇక్కడ సాధారణమైన పద్ధతిలో సామాజిక వివాహాలు, స్టేజి పెళ్లిళ్లు ఎందుకు జరిపించడం లేదా అని ఆశ్చర్యం వేస్తుండేది. సామాజిక పెళ్లిళ్లు ఒక బహిరంగ సభ మాదిరిగా జరుగుతాయి. దళితులైతే వేదిక మీద అంబేడ్కర్ చిత్రపటాన్నీ.. వామపక్షాల వారైతే వారి సిద్ధాంత కర్తల చిత్రపటాలనీ పెడతారు. ఒక పెద్దమనిషి క్లుప్తంగా ఉపన్యసిస్తాడు. ఆతరువాత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పూలదండలు మార్చుకుంటారు. అంతే, పెళ్లి అయిపోయినట్టే! నేను హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌లో పనిచేస్తున్నప్పు అలాంటి ప్రతి సామాజిక పెళ్లికీ పిలిచినా పిలవక పోయినా వెళ్లి అక్కడ మా పుస్తకాల దుకాణం ఏర్పాటుచేసేదాన్ని. ఆ పెళ్లిళ్లలో సాధారణంగా భోజనాలవీ వుండేవి కావు. ఎక్కడో కొందరు రెండు సమోసాలు, కప్పు చాయ్ ఇచ్చేవాళ్లు. ఇక మంగళసూత్రం కట్టడమనేది కూడా ఎక్కడో తప్ప కనిపించేది కాదు.
ఆరోజుల్లో ఇబ్రహీంపట్నంలో జరిగే వాటిలో బాల్యవివాహాలే ఎక్కువ. అది తప్పని వాళ్లకు ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. మా సంఘం సహచరులతో మనమే బైండ్ల కులం వ్యక్తి ద్వారా (దళితులలో బైండ్ల ఒక ఉపకులం) తక్కువ ఖర్చుతో సాధారణ వివాహాలు జరిపిస్తే ఎలా వుంటుందని చర్చించేదాన్ని. కానీ వాటికోసం తన సమయాన్ని వృధాచేయడం మా సంఘానికి ఇష్టముండేదికాదు. సాధారణంగా మాదిగల ఇళ్లల్లో పెళ్లిళ్లను బైండ్ల కులస్తుడే నిర్వహిస్తుంటాడు. బైండ్లవాళ్లు ఇతర్లలాగే వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుంటారు. రెండు తెలుగు రాష్టాలలో అధికారిక లెక్కల ప్రకారం దళితులలో మొత్తం అరవై రెండు కులాలు వున్నాయి. ఇబ్రహీంపట్నంలో, తెలంగాణా అంతటా కూడా బైండ్ల కులానికీ మాదిగ కులానికీ మధ్య సంబంధం వుంది.
అయితే మా సంఘం కూడా కొన్ని పెళ్లిళ్లను నిర్వహించింది. చిన్న బంగారు పుస్తెలను, పసుపుతాడును సంఘమే కొనేది. ఆహ్వానితులకు సంఘమే భోజనాలు పెట్టేది. వాళ్లలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువుల కంటే ఇతరులే ఎక్కువగా వుండేవారు. అయితే వాళ్లంతా సంఘం సభ్యులే. వంటలు అవీ గ్రామస్తులే చేసేవాళ్లు. ఆ విందు భోజనం కేవలం అన్నం, పప్పు చారుతో సాదాసీదాగా వుండేది. ఆ పెళ్లిళ్లకి సాధికారికత కల్పించే ఉద్దేశంతో మేం 1997లో జరిగిన ఒక పెళ్లికి హైదరాబాద్ నుంచి ప్రముఖ సామాజిక కార్యకర్తలను ఆహ్వానించాం. అందులో స్తీవాది స్నేహలతా భూపాల;్ ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత్రి, హేతువాది, స్తీల హక్కుల కోసం పోరాడే మల్లాది సుబ్బమ్మ, శాంతా సిన్హా వున్నారు. స్నేహలతా భూపాల్ రెడ్డిది భూస్వామ్య కుటుంబం. ఆమె సిర్నెపల్లి సంస్థానం (పూర్వ హైదరాబాదీ సంపన్న భూస్వామ్య కుటుంబం) కోడలు. స్తీవాది. నాతో చాలా స్నేహంగా వుండేది. తరచూ ఇబ్రహీంపట్నం వస్తుండేది. అందుకే ఆమెను పిలిచాను. ఆ వివాహం కప్పపహాడ్ గ్రామంలో జరగాల్సి వుండింది. అయితే వివాహ కార్యక్రమం మొదలవడానికి ముందు వధూ వరులను చూస్తే ఏముంది… వాళ్లద్దరూ మైనారిటీ తీరని చిన్న పిల్లలు! నాతో సహా, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ అతిథులంతా నిర్ఘాంతపోయారు. నాకు అప్పుడు బాగానే అక్షింతలు పడ్డాయి! ఇక ఆ తర్వాత మా సంఘం మళ్లీ బాల్య వివాహాల జోలికి పోలేదు.
18. వామపక్షం, స్వచ్ఛంద సంస్థలు, అంబేడ్కర్
1987 చివరి నాటికి మా ‘ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటీవీసీఎస్)’ పని తీరును ఒక్కసారి సమీక్షించుకుంటే` అది చాలా వరకూ ‘గ్రామీణ అభివృద్ధి’ కార్యక్రమాల వంటి వాటిలో నిమగ్నమయిందని చెప్పుకోవచ్చు. నాకేమో అలాంటి వాటిలో పెద్దగా పాల్గొనాలని అనిపించేది కాదు. వామపక్ష ఎంఎల్ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినదాన్ని కావటంతో ‘పోరాట’ కార్యక్రమాలు వేరు, ‘అభివృద్ధి’ (లేదా నిర్మాణాత్మక) కార్యక్రమాలు వేరనీ, ఆ రెండూ పూర్తి భిన్నమైనవని భావిస్తుండేదాన్ని. అయితే అసలీ పదాలే చాలా ఇబ్బందికరమైనవి. ఎందుకంటే ఇలా చూడటం వల్ల పోరాటానికీ, నిర్మాణాత్మక కార్యక్రమాలకూ మధ్య చాలా వైరుధ్యం ఉందనీ, వీటిలో ఒకటి విధ్వంసకరమైనదీ, రెండోది నిర్మాణాత్మకమైనదీ అన్నట్టు భావించే అవకాశం ఉంది. నా దృష్టిలో సమాజంలో సమÖలమైన మార్పు తేవాలనేవారు పోరాట మార్గాన్ని అనుసరిస్తారు. వ్యవస్థను మొత్తంగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా చూస్తూ వాటిని మార్చాలని, వాటిలో సంస్కరణలు తేవాలని భావించేవారు అభివృద్ధి కార్యక్రమాల బాట పడతారు; మొత్తం వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా, సమÖలంగా సంస్కరించాల్సిన అవసరాన్ని వీళ్లు గుర్తించరు.
వాస్తవానికి మన ముందు సాధు మార్గాలూ ఉంటాయి, కాస్త కఠినమైన మార్గాలూ ఉంటాయి. మనం ఈ రెండు ప్రత్యామ్నాయాల గురించీ తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే ప్రజలు రాజ్యంలాంటి బలీయమైన వ్యవస్థను ఎదిరించేందుకు, అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రోది చేసుకునేందుకు సాధు మార్గాలను ఎంచుకుంటే ప్రయోజనం ఉండదు. అది కాస్త కఠినమైన మార్గాల ద్వారానే సాధ్యం. 1980లలో మార్క్సిస్టు`లెనినిస్టు రాజకీయాలను అనుసరించేవారు నిర్మాణాత్మకమైన పనులంటే అవేవో గాంధేయ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలన్నట్లు చిన్నచూపు చూస్తూ, వాటికి దూరంగా ఉండేవాళ్లు. బహుశా, రాజకీయంగా ప్రజలు సాధికారతను సాధించుకున్నప్పుడు.. తమకు అవసరమైన నిర్మాణాత్మక రాజకీయాలేమిటో వారే ఎంచుకుని, వాటిని వాళ్లే అమలు చేసుకోగలుగుతారన్న వామపక్షాల విశ్వాసమే ఇందుకు కారణం కావచ్చు. అలాగే ఈ కార్యక్రమాలను మరింత నిశితంగా పరిశీలిస్తే సంక్షేమ కార్యక్రమాలన్నవి.. ప్రస్తుత వ్యవస్థ సమర్థంగానే పని చేస్తోందనీ, ఎవరికి ఏవి అవసరమో వాటన్నింటినీ అందిస్తోందన్న భ్రమాత్మక వాతావరణాన్ని సృష్టిస్తాయన్న భావనతో కూడా వామపక్షాలు వీటిని వ్యతిరేకిస్తుంటాయి. మరీ ముఖ్యంగా రుణ పథకాలు పేదల మధ్య విభజన రేఖలు గీసి, వారిని వేరు చేస్తాయన్న భావన బలంగా ఉంది.
మరోవైపు స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవో) ధోరణి ఇందుకు పూర్తి భిన్నం. పరిస్థితులను వాళ్లు మరోవైపు నుంచి చూస్తూ.. రెడ్ టేపిజం (కాలయాపన విధానం) కారణంగా ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం అసాధ్యమని భావిస్తుండేవాళ్లు. 1980లలో విదేశీ నిధులు పుష్కలంగా అందుబాటులో ఉండేవి. వాటిని పేద ప్రజల అభ్యున్నతికి ఎందుకు వినియోగించకూడదన్నది వాళ్ల వాదన. ఈ భిన్న ఆలోచనా ధోరణుల మధ్య.. 1984లో నేను సరిగ్గా ఎక్కడున్నానో, ఎటువైపు మొగ్గానో, ఏ వైఖరి తీసుకున్నానో ఇప్పుడంతగా గుర్తు లేదు. కానీ విశాల దృక్పథంతో వుండాలనే అనుకునేదాన్ని. స్వచ్ఛంద సంస్థల సంక్షేమ వాదం పట్ల మాత్రం నాకు చాలా సందేహాలుండేవి. వాళ్లు సామాజిక సంక్షేమం అన్నది వ్యక్తుల వ్యక్తిగత సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి వుంటుందనీ, అందువల్ల వ్యక్తిగత సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా అంతిమంగా సమాజానికి మేలే చేస్తాయని నమ్మేవారు.
రాడికల్ రాజకీయాలలో విస్తృతంగా పాల్గొన్న నాకు పోరాట కార్యాచరణ అంటే ప్రత్యేక అభిమానం. విద్యార్థి నాయకురాలిగా నేను ఓ కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్తూ.. ఉపన్యాసాలిచ్చి, విద్యార్థులతో చర్చించి, వాదించి, ఒప్పించి, చివరికి బతిమాలి మరీ విద్యార్థులను సమీకరించేదాన్ని. మా డిమాండ్ల కోసం ఉద్యమాలు చేసి, ఊరేగింపులు తీసి, అధికారవర్గాలకు ఎదురొడ్డి నిలబడేవాళ్లం. ఇబ్రహీంపట్నంలో కూడా 1987 వరకూ నేను చాలా వరకూ ఉద్యమ కార్యాచరణకే పరిమితమయ్యాను. కానీ నేను గ్రామాల్లోకి వెళ్లి, వాళ్ల జీవితాలను దగ్గరగా పరిశీలించటం మొదలుపెట్టినప్పుడు.. ఈ ‘పోరాట ` అభివృద్ధి’ కార్యక్రమాలన్న విభజన చాలా కృతకమైనదని అర్థమయ్యేది. అక్కడ నిరుద్యోగం, కటిక పేదరికం తాండవిస్తున్నాయి. పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అక్కడి వాస్తవ పరిస్థితులు అర్థంచేసుకోవటానికి పాతకాలపు ఈ పరస్పర వైరుధ్య ఆలోచనా ధోరణులు, పడికట్టు పద్ధతులు ఏమాత్రం పనికిరావని గుర్తించాను. గ్రామీణ వ్యవసాయ సంబంధాల్లో మార్పులు తేవడంగానీ, పేదలకు కనీస వేతనాలను సాధించడంగానీ ఒక్క రోజులో అయ్యే పనులు కావు. ఈ లోగా ఆ పేదలు ఏం తినాలి? ఎక్కడ తలదాచుకోవాలి? జబ్బు చేస్తే వైద్యం ఎలా? తమ పిల్లలను ఎలా చదివించుకోవాలి? తమకున్న అరకొర వనరులతో ఆ పిల్లలు చదువుకుని, ఈ తరంలో కాకపోయినా వచ్చే తరంలోనైనా తమకు ఒక హక్కుగా దక్కాల్సిన వాటిని పొందగలుగుతారా?
అప్పటికే పల్లెల్లో ‘గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు’ అనబడేవి కొనసాగుతున్నాయి. వీటిలో భాగంగా మెరుగైన వ్యవసాయ పద్ధతులను నేర్పించటం, నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించటం, జీవనోపాధి మార్గాలను పెంచేందుకు రకరకాల మార్గాలను అన్వేషించటం, అలాగే పక్కా ఇళ్లు కట్టుకోవటానికి సాయం అందించడం వంటివి నడుస్తున్నాయి. వీటన్నింటినీ విస్మరించటం అంటే రాజకీయ వాతావరణాన్ని మొత్తంగా పాలక వర్గ రాజకీయాలకు వదిలివేయటమే అవుతుంది. రాజకీయ నాయకులేమో నిలకడైన, దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే గుణాత్మక చర్యలను గాలికి వదిలేసి, కేవలం తమ తాత్కాలిక ప్రయోజనాలనే చూసుకుంటూ ఎప్పటికప్పుడు కంటితుడుపు పద్ధతులనే అనుసరిస్తున్నారు. నిజానికి ప్రతి గ్రామంలో పేద ప్రజలు సంఘటితమై బలంగా నిలబడితే` ఆ గ్రామం నిధులు ఎలా సమకూర్చుకోవాలి, వేటి మీద ఎలా పన్నులు వేయాలి (ఉదా. మద్యంపై పన్ను వంటివి), దాన్ని మళ్లీ ఎలా వినియోగించాలన్నది నిర్ణయించుకునే అవకాశం, ఆ నిర్ణయాధికారం వారికి ఉంటుంది. ఇక్కడి ప్రజల విషయానికి వచ్చేసరికి వారి సమస్యల్లో ఒకదాని గురించి మాట్లాడేందుకు, పోరాడేందుకు సంఘం ఉంది. కానీ మిగిలిన అన్ని అంశాలకు సంబంధించీ వాళ్లు పాలక వర్గానికీ, ఆ పాలక వర్గ వ్యవస్థలకూ లొంగిపోయి విధేయంగానే ఉండాల్సి వస్తుండటం నాకు చాలా అర్థరహితంగానూ, అసంబద్ధంగా కూడా అనిపించింది.
క్రమేపీ ప్రభుత్వ కార్యక్రమాలు అట్టడుగు వర్గాల వారిని బిచ్చగాళ్ల స్థాయికి తీసుకొచ్చాయి. సంక్షేమ కార్యక్రమాల్లో వారికి తగిన వాటా ఇస్తున్నట్టు ప్రచారం ీVAరెత్తిస్తూనే అవి పేదలను విభజించాయి. ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు గౌరవప్రదంగా, సాధికారంగా పాల్గొనేట్టు చేయడం, అందుకు తగిన విధంగా వారిని సమీకరించటం సాధ్యమేనా? రాడికల్ రాజకీయాలకు అసలీ ఆలోచనే వ్యతిరేకం. ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలనేవి ప్రజలను పాలకవర్గ భావజాలంలోకి లాగేసుకుంటాయనీ, వారికి తెలియకుండానే దానిలో కూరుకుపోయేట్టు చేస్తాయనీ భావించేవాళ్లం. అయితే ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఆ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల డబ్బుతో నిర్వహించబడుతున్నాయి. కాబట్టి వారు అందులో తమ న్యాయమైన వాటాను పెంచుకునేందుకు, తమ నిర్ణయాలు తాము తీసుకునేందుకు సానుకూలంగా ఎందుకు ప్రయత్నించకూడదు? అసలు మన దేశంలోనే, మనకు అందుబాటులోనే కావలసినంత సంపద వుండగా భారీఎత్తున విదేశాల నుంచి నిధులు (వాటితో వచ్చే బోలెడన్ని తలనొప్పులతో సహా) తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? పైరవీకార్ల వంటి వారి సాయంతోనో, మరో రకంగానో పేదలు ఏదో విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరుకుంటూనే ఉన్నారు. అలాంటప్పుడు అమల్లో ఉన్న ఆ ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా, సక్రమంగా, సత్వరమే అమలయ్యేలా చూడటం; ఆ పథకాల సాధ్యాసాధ్యాలూ, వాటికుండే పరిమితుల వంటి వాటిపై ప్రజల్ని చైతన్యపరచటం, ముఖ్యంగా వారు ఈ పథకాల పరిధుల్లో చిక్కుకుని విభజనకు గురికాకుండా మరింత సంఘటితమయ్యేలా చెయ్యటం సాధ్యం కాదా?
రాజ్యం ఏ కార్యక్రమాన్నైనా అది ‘రాజ్యాంగ బద్ధమా?’ లేక ‘రాజ్యాంగేతరమా?’ అన్న కోణం నుంచే చూస్తుంటుంది కాబట్టి ఈ కార్యాచరణ అంతా కూడా ఆ చట్రంతో బలంగా ముడిపడివుంటుంది. మరోవైపు ఈ చట్రంలోని ఏ కార్యక్రమాన్నైనా వామపక్షాలు అనుమానస్పదంగానే చూస్తుండేవి. సీపీఐ నాయకుడు, తెలంగాణా సాయుధ రైతాంగ తిరుగుబాటు నేతలలో ఒకరైన చండ్ర రాజేశ్వరరావు 1980లలో నల్గొండ జిల్లా, కోదాడలో జరిగిన పార్టీ వ్యవసాయ కార్మికుల సంఘం సమావేశంలో మాట్లాడుతూ ఈ అంశాన్ని నిశితంగా విశ్లేషించారు. మా సంఘం తరఫున కొందరం ఆ సమావేశానికి సౌహార్ద్ర ప్రతినిధులుగా హాజరయ్యాం. ఆ రోజు ఆయన` “తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతున్న రోజుల్లో పేదలంతా దానితో మమేకమై పెద్ద ఎత్తున కదిలివచ్చారు, కానీ ఆ రోజుల్లో వారికి అనుకూలమైన చట్టాల్లేవు. ఆ చట్టాల కోసం మేం పోరాడాం. ఇప్పుడేమో పేదల కోసం ఎన్నో రకాల ప్రగతిశీల చట్టాలున్నాయి. కానీ వాటి అమలు కోసం పేదలను కదిలించే పోరాటాలు, ఉద్యమాలు కరువయ్యాయి” అన్నారు.
చట్టాలను ఉపయోగించుకుని న్యాయ పోరాటం చేయటం, ప్రభుత్వ సంస్థలను కూడా పోరాట క్షేత్రాలుగా మార్చుకోవటమన్న అవకాశాలను వామపక్షాలు పూర్తిగా విస్మరించాయి. నిజానికి ఆ సంస్థల విస్తృతి, ప్రభావం, ప్రజల జీవితాల్లో వాటి ప్రమేయం చాలా ఎక్కువ. ప్రజలను చేరుకునేందుకు అవసరమైన అవకాశాలనూ, ఆ విస్తృతినీ ఇవి గణనీయంగా పెంచాయనీ, ప్రజల దైనందిన జీవితాల్లో ఈ వ్యవస్థలన్నీ ఓ భాగంగా కలగలిసిపోయాయన్న వాస్తవాన్ని చాలామంది యాక్టివిస్టులు గుర్తించటం లేదు. ఉదాహరణకు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కూడా పేదలందరికీ రేషన్ కార్డు అన్నది అత్యంత కీలకమైన పత్రం. కానీ దీన్ని సమకూర్చుకోవటం మాత్రం వారికి అంత తేలిక కాదు. చాలామంది పేదలు ఈ కార్డు పొందటం కోసం ఇప్పటికీ ఎక్కువగా పైరవీకార్ల మీద, వాళ్లు చేసే మాయల మీదే ఆధారపడాల్సి వస్తోంది.
1985`1990ల మధ్య పీపుల్స్ వార్ గ్రూపు ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భూములను స్వాధీనంచేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఆక్రమించిన భూముల్లో ఎర్ర జెండాలు పాతేవాళ్ళు. అప్పుడు ఎటు చూసినా ఆ ఎర్ర జెండాలే కనిపించేవి. నిజానికి అలా స్వాధీనం చేసుకున్న భూములు సహజంగా, చట్టపరంగా పేదలకు దక్కాలి. కానీ ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులను కల్పించేందుకుగానీ, అనుభవ హక్కులను కల్పించేందుకు గానీ ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. పైగా ఎవరన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేద్దామని అన్నారంటే చాలు. వెంటనే వాళ్ల మీద విప్లవ ద్రోహులుగా ముద్ర వేసేవారు. అలాంటి ప్రయత్నాలు రాజ్యానికీ, దాని వ్యవస్థలకూ ఆమోదయోగ్యతను కల్పించేందుకు దోహదం చేస్తాయని వాదించేవారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎర్రజెండాలు పాతిన భూములను అదే భూస్వాములు సమాజంలో కాస్త సంపన్నులైన, పరపతి ఉన్న వర్గాల వారికి అమ్ముకున్నారు. అలా కొనుక్కున్న వాళ్లు` పేదలు మళ్లీ వెళ్లి ఆ భూములను ఆక్రమించకుండా అడ్డుకోగల శక్తిమంతులు, పలుకుబడిగల వాళ్లు. చివరికి అవి పేదలకు దక్కకుండాపోయాయి. అలాంటి భూ ఆక్రమణ కార్యక్రమాల తర్వాత నిజంగానే విప్లవం అనేది వాస్తవరూపం దాలుస్తుందనీ, అది విజయం సాధిస్తుందనీ పీపుల్స్ వార్ గ్రూపు బలంగా విశ్వసించిందా? మరీ ముఖ్యంగా ఎంతో పటిష్టమైన, అత్యాధునికమైన సైనిక బలగాలున్న దేశంలో` చెదురుమదురుగా, అక్కడక్కడా చేసే సాయుధ ప్రతిఘటనల ద్వారా ఎప్పటికైనా విప్లవాన్ని సాధించటం సాధ్యపడేదేనా?
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఫోన్ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com
