మార్చి ఎనిమిది సమీపిస్తుందంటే ఒక ఉత్సాహం, ఒక సంతోషం మనసంతా కమ్ముకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా ఎన్నో సమావేశాలు. రాష్ట్రం నలుమూలల నుండి అసంఖ్యాకంగా ఆహ్వానాలు. ఆదోని రమ్మని ఉషారాణి, కాకినాడ రమ్మని అబ్బాయి, చేనేత మహిళల మీటింగ్‌లో పాల్గొనమని నిర్మల, పాడేరులోని అరణ్యక మీటింగ్‌కి రమ్మని మాలిని, ఆఖరికి నేను అనంతపూర్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. మీరు ఈ సంపాదకీయం చదివేసరికి మార్చి ఎనిమిది సంబరాలు ముగిసిపోతాయి కూడా.
నగరంలో కూడ లెక్కలేనన్ని మీటింగులు జరుగుతాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా మార్చి ఎనిమిదిన మహిళల అంశాలపై, మహిళల సమస్యలపై చర్చోపచర్చలు జరుగుతాయి. కొందరు పోరాట దినంగా జరిపితే, కొందరు ఉత్సవంలా, ఉల్లాసంగా జరుపుతారు. వందేళ్ళ చరిత్ర కలిగిన మార్చి ఎనిమిది ఎన్నో పోరాటాల్ని, మహిళల ఆరాటాల్ని, ఆర్తనాదాల్ని తనలో ఇముడ్చుకుంది. వాటన్నింటినీ గుర్తు చేసుకోవడానికి, గురు తప్పిన గమ్యాలను పునర్మినించుకోడానికి, మహిళా ఉద్యమానికి పునరంకిత మవ్వడానికి మార్చి ఎనిమిదిని మించిన రోజు మరోటి లేదు.
అయితే కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ సందర్భంగా ముందుకొస్తున్నాయి. బీజింగ్ సదస్సు స్ఫూర్తితో మహిళలపై అన్ని రకాల వివక్షతను వ్యతిరేకంగా జరిగిన ఒప్పందం (సీడా) నేపధ్యంలో భారతదేేశం మహిళల రక్షణ కోసం చాలా చర్యలను తీసుకుంది. కొత్త చట్టాలను చేసింది. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు (73,74 రాజ్యాంగ సవరణ) గృహహింస నిరోధక చట్టం 2005, లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010 లాంటివి వచ్చాయి. అయితే అసెంబ్లీ, పార్లమెంటుల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లు మొద్దు నిద్రలోనే జోగుతోంది. పనిస్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక బిల్లును చట్టరూపంలో తేవడానికి అనవసర జాప్యం జరుగుతోంది. గృహహింస నిరోధక చట్టం కూడా దేశమంతా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అసలు రక్షణాధికారులు వ్యవస్థ ఏర్పడనేలేదు. చట్టంవొచ్చి 5 సంవత్సరాలు గడిచిపోయినా అమలులో ఎంతో నిర్లిప్తత, నిర్లక్ష్యం కనబడుతోంది. ఇంత నిర్లక్ష్యం క్షమించలేం. అలాగే ఈ చట్టం గురించిన ప్రచారం ప్రభుత్వం చేపట్టలేదు. ఒక పనికి ఆహారపథకం, ఒక పల్ప్‌పోలియో, ఒక ఆర్టిఐ చట్టం ప్రచారం కోసం నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం విషయంలో మాత్రం స్ట్రాటజిక్‌గా మౌనం వహిస్తోంది.
కొత్త చట్టాలొస్తున్నాయి. కొత్త కొత్త సపోర్ట్ సిస్టమ్స్ వెలుస్తున్నాయి. అయినాగానీ స్త్రీల మీద హింస ఏ మాత్రం తగ్గడం లేదు. స్త్రీలపై నేరాలు పెరుగుతున్నాయని సాక్షాత్తు జాతీయ నేర నిరోధక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నేరాలు పెరుగుతున్నాయని లెక్కలేసి చెబుతున్నారుగానీ వాటి తగ్గుదల కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పడం లేదు. చట్టాలు చేసాం కదా అని చేతులు దులిపేసుకునే బండవైఖరి కన్పిస్తోంది కానీ చట్టాల సక్రమ అమలుకోసం జండర్ స్పృహతో ఆలోచిస్తున్న దాఖలాలు లేవు.
ఈ మార్చి ఎనిమిది సందర్భంలో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అంశమొకటుంది. దేశ రక్షణకోసం సైన్యంలో చేరిన మహిళలకు జరుగుతున్న అన్యాయం. ఆర్మీలో కొనసాగుతున్న జండర్ వివక్ష. ఆర్మీలో పనిచేసే మహిళలకి పర్మినెంట్ ఉద్యోగాలివ్వకుండా 14 సంవత్సరాల దాకా టెంపరరీగా పనిచేయించుకుని ఎలాంటి పదవీవిరమణ సౌకర్యాలు కల్పించకుండా ఇంటికి సాగనంపుతారని ఇటీవల సుప్రీంకోర్టుకొచ్చిన ఒక కేసు గురించి చదివినపుడు తీవ్ర దిగ్భ్రమను కల్గింది. అత్యంత గోప్యతను పాటించే ఆర్మీలో విషయాలు బయటకు రావడం చాలా కష్టం. కొంతమంది మహిళా అధికారులు ఈ అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఈ అంశం బయటకొచ్చింది. వీరిపట్ల కొనసాగుతున్న వివక్ష అంతర్జాతీయ ఒప్పందాలకు విరుధ్ధం. భారత రాజ్యాంగానికి విరుద్ధం. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో వేచి చూడాల్సి వుంది.
మార్చి ఎనిమిదికి జేజేలు పలుకుతూ, మహిళా అంశాలను సమీక్షించుకోవడానికి మార్చి ఎనిమిది సమావేశ వేదికలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ…
అందరికీ అభినందనలు తెలుపుతూ…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
హోరినీ! మార్చ్ 8 అనగానే మా ఆవిడ ..అనగా మా క్వీన్ విక్టోరియా పుట్టిన రోజే గుర్తుకొస్తుంది..అప్పుడప్పుడు నేను మర్చిపోయినా మా పిల్లలు గుర్తు చేస్తారు…. కానీ…అదే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటారని ఇప్పటిదాకా నాకు తెలియదు సుమా!
నా ఆనందం ఇప్పుడు రెట్టింపు అయింది..
భవదీయుడు…
వంగూరి చిట్టెన్ రాజు
అమెరికా లో ఉండే మీకు,స్త్రీల ప్రత్యేక సాహితీ సదస్సులు ఇండియా లో నిర్వహించే మీకు స్త్రీల ఉద్యమంలో మహా పోరాట చరిత్ర కలిగిన మార్చి ఎనిమిది గురించి తెలియకపోవడమ చాలా విచారకరము.
వందేళ్ళ చరిత్ర గురించి మీకు అవగాహన లేకపోవడము నిజంగా బాధాకరము.
మీలాంటి వాళ్ళు ఇన్కెంత మంది ఉన్నారో అని చాలా దిగులుగా ఉంది నాకు
2010 మార్చ్ లొ అట్లాంటా నగరం లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి అక్కడ దినపత్రిక లో చదివి సత్య కి లాగే నాకూ బాధేసింది. వివిధ రంగాల మహిళలకు బోలెడన్ని సన్మానాలు చేస్తారు.ఉత్సవం లాగా చేస్తారు.అమెరికా లోని న్యూయార్క్ నుంచే మొదలై ప్రపంచ మహిళ లందరికీ పోరాట స్ఫూర్తి నిచ్చిన శ్రామిక మహిళా పోరాట దినమని,మహిళా ప్రపంచం లో ఇప్పటి వరకూ సాధించిన విజయాల్ని సమీక్షించుకుని – జనాభా లో సగ భాగం గా ఉన్న స్త్రీలకి అన్ని రంగాలలో పురుషుల తో సమానమైన ప్రాతినిధ్యం కోసం పోరాడే దినం అని సాహిత్య జీవి అయిన వంగూరి గారికే తెలియకపోతే మిగిలిన మామూలు మనుషుల గురించి ఎమనుకోవాలి?