విషాదమాధురి

వి. ప్రతిమ
‘హోరు’మంటూ
అసలు గాలి పలికేది ఈ పదమేనా? మరింకోటా?
ఈలకాదు, గుసగుసకాదు ఈ గాలి మరింకోటేదో పలుకుతోంది… ఆ పలకడంలో ఏదో మార్పు.
”స్‌…జ్‌…జ్‌ ఠపాఠప్‌… పళక్‌… గజ్‌జ్‌…జ్‌…జ్‌…”
ఈదురుగాలికి పడమటి గోడకున్న కిటికీరెక్క మూడుసార్లు కొట్టుకుని చేసేదేమీ లేక గాజుపలకని విరిచి ముక్కలు పోసింది.
ఆ ధాటికి కాబోలు కొత్తగా బిగించిన ఫ్రిడ్జ్‌ బోర్లాపడింది వైర్లు తెంచుకుని… ఆపై మెరూన్‌రంగు సోఫాసెట్టూ… దానిమీద తూగుటుయ్యాలవంటి పరుపూ, మంచమూ …  వాటిమీద గాజుతో తయారు చేయబడ్డ భోజనాల బల్లా, వెండి డైనింగ్‌ సెట్టూ, చెల్లాచెదురుగా పడిపోయిన ఖరీదయిన స్పూన్లూ, వాటిమీద ఒక్కొక్కటిగా వచ్చిపడుతోన్న మిక్సరూ, గ్రైండరూ, కుక్కరూ, మైక్రోవేవ్‌…
ఆ మొత్తం గుట్ట కింది నుండి హఠాత్తుగా విన్పించిన ఆ మూలుగూ…
”అయ్యో” ఈ అన్ని వస్తువుల కిందా ఎవరయినా పడివున్నారా?
ఎవరదీ? యింకా బతికే వున్నారా?
ప్రాణమున్నట్టే వుంది… లేకుంటే మూలగరు కదా.
”అయ్యొయ్యో” దగ్గరగా వెళ్ళి వొంగి చూశాను.
ఎవరో ఆడమనిషి
మళ్ళీ మూలుగు.
ఆ మూలుగు బాధపడ్డంతోనో, గాయపడ్డంతోనో వస్తున్నట్టుగా లేదు.
ఆ మూలుగులో ఏదో ఆనందపు దిగులు జీర…
ఆశ్చర్యంలో మరింత కిందికి వొంగి చూశాను.
ఆ నలుపుమీద పసుప్పచ్చ గళ్ళున్న కాంజీవరం కాటన్‌ చీర.
ఆ చీరలో నుండి తొంగిచూస్తోన్న నున్నటి, తెల్లటి పాదం, ఆ వేళ్ళు… రెండో వేలికి తొడగబడ్డ ఆ బంగారు మెట్టెలు…
అది… అది… అక్క… అక్కనా? అవునవును… స్వర్ణక్క.
ఆ గుట్టకింద… ఆ వస్తువుల కింద ఎడాపెడా పడిపోయి వుంది.
గాయాలేమీ కాలేదు కదా… ఎలా యిప్పుడు అక్కని బయటికి లాగడం?
అయ్యో బావగారేం చేస్తున్నారు?
సాయం పట్టడానికి పిలుద్దామని పరిగెత్తబోయి చప్పున ఆగిపోయాను.
పడమటి కిటికీకి అవతలి వరండాలో హోరుగాలిలో చేపట్టు మీద కూర్చుని సిగరెట్టు కాలుస్తూ అక్కకేసి చూస్తున్నాడతడు… విజయం సాధించిన విక్రమార్కుడిలా అతడి కళ్ళల్లో వింత గర్వం…
”బా…” పిలవబోయి దిగ్భ్రాంతితో నిలుచుండిపోయాను.
ఏదో ఒక కలగాపులగమైన వాసన… నేనిక్కడికి వచ్చినప్పటి నుండీ ఈ కొత్త వాసనేదో నా ముక్కుపుటాలను కలవర పెడ్తోంది… కడుపులో తిప్పుతూనే వుంది…
గొంతుకడ్డంపడ్డ దుఃఖపు వుండేదో మెదడు నరాలను ఛేదిస్తోంది.
మెల్లిగా కళ్ళు తెరిచాన్నేను…
లైలా గాలి వీచి పడమటి రెక్కలు కొట్టుకుంటున్నది మాత్రం నిజం. చుండ్రుకు పోయిన నా గొంతు దాహార్తితో తపన పడుతున్నదీ నిజమే.
చప్పున తలుపు తీసుకుని ఫ్రిజ్‌ వద్ద కెళ్ళాను.
నాకంటే అడుగున్నర ఎత్తున్న ఆ ఫ్రిజ్‌ నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది…
”హాయ్‌ స్నేహా దాహమేస్తోందా? ఆ పచ్చరంగు సీసా తీసుకో చల్లగా వుంది అంటూ మళ్ళీ అదే నవ్వు నవ్వి ఠక్కున ఆగిపోయింది.
అవిశిపోయిన గుండెలు అంత గాలిలోనూ చెమటలు పట్టించడంతో రివ్వు మని నాక్కేటాయించబడిన గదిలోకొచ్చి పడ్డాను…
తనని వాడకుండా కిటికీ రెక్కలు తెరిచి వుంచినందుకు కాబోలు స్ప్లిట్‌ ఎ.సి. నాకేసి గుర్రుగా చూస్తోంది… ఇలా కిటికీ రెక్కలు టపటపా కొట్టుకోవడం అందమైన గాజు తలుపులు విరిగి గలగలా కిందికి రాలడం అనాగరికమని దాని వుద్దేశం కాబోలు.
ముడతలు లేకుండా నునుపుగా పరవబడ్డ అందమైన గులాబీరంగు బ్లాంకెట్‌ కిందనున్న మెత్తటి పరుపులో నుండి ఏదో పొడుచుకొచ్చి గుచ్చుకుంటున్నట్లుగా వున్నాయి… ఎదురుగావున్న ఎరుపురంగు సోఫాలో లావాటి కొండచిలువ ఒకటి కూర్చుని మింగడానికి సిద్ధంగా వుంది.
అప్రయత్నంగా నా కుడి అరచేయి గుండెల మీదికి చేరి అరువడగసాగింది…
లైలా మళ్ళీ ఒక ఉధృతమైన గాలితెరని గదిలోకి విసిరి నన్ను చల్లబరచాలని చూస్తోంది… అసహ్యకరమైన రంగుల కలయికతో కూడిన ఒక కొత్తవర్ణం సీలింగ్‌ మీద వికృతంగా నర్తిస్తోంది.
నిన్న సాయంత్రం నేనొచ్చేటప్పటికి స్వర్ణక్క ఫ్లాట్‌ టి.వి.లో ”మొగలిరేకులు” చూస్తోంది… నేను గేటు దగ్గరుండగానే జెర్మన్‌షెఫర్డ్‌, పొమరేనియన్‌ బిగ్గరగా స్వాగతం పలికాయి… ప్రహరీగోడ లోపలికి ఏ కొత్త వ్యక్తి వచ్చినా అవి రెండూ అమ్మగారికి, అయ్యగారికి కబురందిస్తాయి… అందుకోసమే అవి పెంచబడ్తున్నాయి.
అక్క సింహద్వారం వద్దకొచ్చి తొంగి చూస్తూ
‘నువ్వా స్నేహాఁ రా…రా…లోపలికి” అంటూ మళ్ళీ వెళ్ళి టి.వి. ముందు కూలబడి శ్రద్ధగా సీరియల్‌ చూడసాగింది.
సరేఁ నేను రావడమయితే చాలాకాలం తర్వాత వచ్చాను గానీ, ఈ యింటికి కొత్తదాన్నేమీ కాదు గదా… లోపలికెళ్ళి మొహం కడుక్కుని మంచినీళ్ళు తాగాను.
గాఢమైన ఫినాయిల్‌లో ఖరీదయిన సెంటేదో, గచ్చుతుడిచే రసాయనమేదో కలగలి సిన వికృతమయిన వాసన గుండెల్నిండా పరుచుకుని కడుపులో తిప్పుతున్నట్లయింది… సింక్‌ వద్దకు పరిగెత్తి నోట్లోని నీళ్ళు ఉమ్మేశాను. మళ్ళీ శుభ్రంగా ముఖం కడుక్కున్నాను.
ఎంతకీ  చలనం లేకపోవడంతో నేనే వంటగదిలోకెళ్ళి వెతుకులాడి కాఫీ కలుపుకుని స్వర్ణక్కకి కూడ ఒక కప్పు అందించాను.
”థాంక్యూ స్నేహా” అనయితే అంది.
అవతార్‌ సినిమా ప్రకటన తాలూకూ కాంతితో యిల్లంతా నీలివర్ణంలోకి మారి పోయింది… ఏ మాటకామాటే చెప్పుకోవాలి గానీ ఈ ఫ్లాట్‌ టి.వి.లో బొమ్మ, శబ్దమూ చాలా స్పష్టంగా వున్నాయి… క్వాలిటీ పెంచో, లేదా ఎప్పటికప్పుడు ఎత్తులతో చిత్తుచేసో మనుషుల్ని ఆకట్టుకోవడంలో ఈ అంగళ్ళు ఎంత నేర్పుని ప్రదర్శిస్తాయో కదా అను కుంటూ కాఫీ కప్పుని నోటికానించు కున్నాను.
అలా ఎంతసేపు గడిచిందో తెలీదు కానీ
”భోజనం చేద్దాం పద స్నేహా” అన్న అక్క పిలుపుతో యిద్దరం భోజనాల బల్ల వద్దకు నడిచాం.
ఇంట్లో ఏ దిక్కుకు చూసినా ఐశ్వర్యం తళతళమంటూ, ధగధగలాడుతూ, నిగనిగలు పోతూ నాట్యం చేస్తోంది… దానిమీద చిన్నతెర వెలుతురు పడి భయమో, దిగులో, ఉద్విగ్నతో, ధైర్యమో, దైన్యమో అర్థంకాని కలగాపులగ రంగురంగుల నీడలు యిల్లంతా పరుచు కుంటున్నాయి.
భోజనాలబల్ల దగ్గర వడ్డిస్తూ
”శ్రీరాం ఎట్లా వున్నాడు?… బడి బాగా నడుస్తోందా?” ప్రశ్నించింది.
అక్క… ”ఫర్లేదు… ఒత్తిడిలేని చదువులు కదా ఎవరికీ నచ్చవు…” అన్నాన్నేను నవ్వుతూ… అక్క వుద్దేశ్యం కూడా అదే… అందుకే అయిదేళ్ళదాకా పెంచినప్పటికీ టింకూ, పింకీలని అక్క మా బళ్ళో చేర్చలేదు… దూరంగా వూటీ స్కూలుకి పంపేసింది…
”పక్కింటి కమలమ్మ పిన్ని, బాబాయి బాగున్నారా?” వాళ్ళ కొడుకు రవి చెన్నైలోనే వుంటున్నాడా?” మరికొంచెం పప్పు నా పళ్ళెంలో వేసింది అక్క.
నాకు పొరపోయి దగ్గొచ్చింది.
పప్పులో కారముందని కాదు. అక్కకివన్నీ గుర్తున్నందుకు. ఎందుకో ఆ క్షణంలో అక్క చాలా ఆత్మీయంగా అన్పించింది నాకు.
ఒకే స్థాయిలో బతుకుతోన్న కుటుంబాలలోనుండి ఒకరెవరయినా ఉన్నతంగా ఎదిగితే ”వాళ్ళ కంటికిప్పుడు మనం ఆనడం లేదులే” అనుకుంటూంటా… అక్క యింకా మనుషులు ఆననంత స్థాయికి దిగజారలేదా?
అక్కకేసి నిశితంగా చూశాన్నేను… ఇదివరకటికంటే చాలా రంగొచ్చింది… నున్నటి, తెల్లటి నుదుటిమీద ఎర్రటిబొట్టు ప్రకాశవంతంగా మెరుస్తోంది… రంగు రావడంతో కాబోలు వెంట్రుకలు మరింత నల్లగా కాంతివంతంగా వున్నాయి… విశాలమైన కళ్ళు చేపపిల్లలా అటు, ఇటు కదులుతూ నాలుగు దిక్కుల్నీ పరికిస్తున్నాయి… మొత్తంమీద అత్యంత నాజూగ్గా వున్న అక్క, స్వరూపంలో నాకు చెల్లెల్లా వుంది.
”అదేమిటీ నువు భోజనం చేయవా?” అన్నాను అక్క కేవలం గ్లాసు మజ్జిగ తాగు తోంటే…
అక్క జవాబు చెప్పకముందే బావగారొ చ్చారు హడావిడిగా.
నాకు ‘హలో’ చెప్పి ఆయన కూడా అభోజనంగానే తన గదిలోకి వెళ్ళిపోయాడు.
భోజనాలబల్లమీది ఖరీదయిన గాజుసామగ్రిని ఒక్కొక్కటిగా మెత్తటి టవల్తో తుడిచిపెడుతూ ఏ వస్తువు ఎక్కడ కొన్నదో, ఎక్కడ్నుండి తెప్పించిందో చెప్పసాగింది అక్క గర్వంగా… నాకు ఆసక్తి వుందా, లేదా అన్నది ఎంతమాత్రమూ పట్టించుకున్నట్టుగా లేదు.
నాకు చప్పున రాం గుర్తుకొచ్చాడు.
చేతికే పళ్ళెం అందితే దాన్లో నాకూ, తనకీ కూడా వడ్డించి ఆరుబయట అరుగుమీదకో, వాకిట్లో మంచం మీదికో నాచేతికందించే శ్రీరాం గుర్తొచ్చాడు… మా యిద్దరికీ… ఆ మాటకొస్తే స్వర్ణక్కకీ కూడ ఏకైక ప్రేమికురాలు వెన్నెల…
వెన్నెలంత అందంగా నవ్వుతోంది గానీ స్వర్ణక్క నవ్వులో ఏం లోపించిందో వెతకడానికి ప్రయత్నించాన్నేను…
మేమిద్దరం ఒకే కడుపులో పుట్టక పోయినా ఒకే యింట్లో పెరిగాం. నాన్న, పెద నాన్న అన్నతమ్ముళ్ళు… అమ్మ, పెద్దమ్మ సొంత అక్కచెల్లెళ్ళు… పెదనాన్న పెద్దమ్మలకి స్వర్ణక్క… అమ్మ, నాన్నలకి నేను అందరం కలిసి ఒకే యింట్లో, ఒకే కుటుంబంగా.
నా చిన్నప్పుడే నాన్న పొలం వద్ద పాము కరిచి చనిపోతే ఆ దిగులుతోనే ఆరునెలల తేడాతో అమ్మ కూడా పోయింది. పెదనాన్న పెద్దమ్మలే తల్లిదండ్రులయి పెంచారు నన్ను… యింట్లో స్వర్ణక్కకీ, నాకూ ఏమాత్రం తేడా వుండేది కాదు.
మా యిద్దరికీ వయసులో వ్యత్యాస ముండడం, చదువులో కూడ అక్క స్కూల్‌ ఫైనల్‌ దాటలేకపోవడంతో సంబంధం చూసి పెళ్ళి చేసేశాడు పెదనాన్న… అప్పటికి వ్యవసాయస్థితి కొంత మెరుగ్గానే వుండడం వల్ల బ్యాంకులో పనిచేస్తూండిన బావ అత్యంత తేలిగ్గా పెదనాన్నకి అల్లుడయిపోయాడు… ఆ తర్వాత మేనేజరయ్యాడు. ఇంకా రకరకాల వ్యాపారాలకి ఎగబాకాడు కూడ…
అయితే అక్క పురుళ్ళు, పుణ్యాలూ, నడతలూ, నాణ్యాలూ అదే సమయంలో పెద్దమ్మ అనారోగ్యం… నీటి ఎద్దడితో వ్యవసాయం సాగకపోవడం రకరకాల కారణాలతో పెదనాన్న చాలా దెబ్బతిన్నారు. అప్పటికి నేను కూడ చదువు చాలించి పెద్దదో, చిన్నదో ఉద్యోగం వెతుక్కున్నాను.
నాకు న్యాయం చేయలేకపోయానని పెదనాన్న బాధపడ్తూండేవాడు.
”డబ్బు సంగతెలా వున్నా శ్రీరాం లాంటి వ్యక్తి అల్లుడుగా దొరకడం మనందరి అదృష్టం తల్లీ! అంటూ పెదనాన్న రాంని పదేపదే పొగుడ్తూంటే అక్క ”మీకు చిన్నల్లుడంటేనే యిష్టం” అంటూ వుడుక్కునేది.
అక్క చాలా అరుదుగా వచ్చేది మా వూరికి.
”అబ్బబ్బఁ ఎండ… ఈ ఉక్కపోత భరించలేం” ఎప్పుడయినా వూరికొస్తే అక్క అనే మాట అది మాత్రమే.
ఆ ఎండలోనే అరమైలు నడిచి ఒక్కోసారి చెప్పులు కూడ లేకుండానే హైస్కూలుకి వెళ్ళేవాళ్ళమని అక్క మరిచి పోయింది… అవునుఁ అక్క చాలా మారిపోయింది.
చిన్నప్పుడు నాతో గుజ్జనగూళ్ళు, బొమ్మరిల్లు, తొక్కుడుబిళ్ళ అచ్చనగాయలు ఆడిన అక్క… బళ్ళో ఎవరయినా నన్నేదయినా అంటే ఎంతమాత్రమూ సహించని అక్క… చిన్న జామముక్కనయినా సరే కాకెంగిలి చేసి తినిపించే స్వర్ణక్క… నన్నెంతగానో అభి మానించి ప్రేమించిన స్వర్ణక్క పెళ్ళయిన తర్వాత క్రమంగా మారిపోయింది… బావ కయితే మా కుటుంబమంటే మొదట్నుండీ కీతానే…
ఇంత లైలా తుఫాను రాత్రి కూడ నా గుండెల్లోంచి గుబగుబ చెమటలూ… కళ్ళల్లోనుండి రెండు కన్నీటిబొట్టూ…
”ఏసుకో… చెమటపడ్తోంది… నన్నే సుకో స్నేహా” కిసుక్కున నవ్వుతోంది నన్ను చూసి ఎ.సి. మిషను.
జ          జ          జ          జ
మనిషన్నవాడికి ఎవరయినా సరే ఏదో ఒక అసంతృప్తి వుండనే వుంటుంది… దాన్ని అధిగమించడానికి తెలిసో, తెలీకో ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు… ఆ మార్గం కొంతమందిని ఉన్నతాసనం మీద కూర్చో బెడితే, మరికొంతమంది లోలోపలికి ముడు చుకుపోయే యిరుకుమార్గాల్లో కూరుకు పోతారు.
కోరికచేత జ్ఞానం ఎందుకిలా కప్పబడుతుంది?
కోరికెలా పుడుతుందసలు?
ఆలోచనల వేడికి నా మెదడు నరాలు కదలడం స్పష్టంగా తెలుస్తోంది.
మళ్ళీ అదే వాసన…
సువాసనో, దుర్వాసనో అర్థంకాని ఒక కొత్తరకం వాసన నా ముక్కుపుటాలను పగులగొడ్తోంది…
ముందు నేను బావతో మాట్లాడదామనే అనుకున్నాను.
కానీ నాకు తెలుసు.
ఇదే సాకుగా తీసుకుని ఆయన క్లాసు పీకుతాడు.
”ఎంత చేసినా తృప్తిలేదు… ఎంత సంపాదించినా నాకు సుఖం లేదు. ఎన్నెన్ని రకాల వస్తువులు కొన్నా మళ్ళీ మర్నాటికి మరో వస్తువుకి టెండరేస్తుంది. ఒక కారు చాలదట… తనకి వేరే వుండాలట… ఇంటిని నరకం చేస్తోంది” అంటూ అక్క మీద అన్ని కోణాలనుండీ దాడి చేస్తాడు.
ఇటువంటి నేరారోపణలు కాని నేరారో పణలు చాలా చేస్తుంటాడతడు. ఇంట్లో జరిగే అపసవ్యాలన్నింటికీ అక్క, సవ్యాలన్నింటికీ తానూ కారణమని బావ వుద్దేశ్యం…దీన్నే రకరకాలుగా అభియోగిస్తుంటాడతడు… మగాళ్ళెప్పుడూ తమ ఓటమిని స్త్రీలమీదికి నెట్టేస్తుంటారు… అదే స్త్రీ అయితే తన విజయాన్ని కుటుంబ విజయంగా అభివర్ణించ డానికి తపన పడుతుంది.
అందుకే బావతో మాట్లాడాలన్న ఆలోచనని విరమించుకుని అక్కతోనే మాట్లాడదామనుకున్నాను…
”ఇంత పెద్ద యిల్లూ, యిన్ని ఆడం బరాలూ, ఇన్నిన్ని నగలూ, ఇన్ని పదుల పట్టుచీరలూ అవసరమా?” అన్న విషయాన్ని నేరుగా కాకుండా కొంత పరోక్షంగా అక్క దగ్గర ప్రస్తావించాను… ముందురోజు అక్క చూపించిన రంగురంగుల పట్టుచీరలూ… రాళ్ళనగల ధగధగలూ నాకళ్ళముందు గిర్రున తిరుగుతున్నాయి…
రెండునిముషాల మౌనం తరువాత
అక్క నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వ్యంగ్యపు చిరునవ్వు నవ్వింది… మోనాలిజా నవ్వులా వుందది…
నాలుగు దశాబ్దాల నా జీవితకాలంలో అటువంటి నవ్వుని నేనిదివరకెన్నడూ, ఎక్కడా చూసి వుండలేదు…
మా యిద్దరినీ నిశ్శబ్దం చాలాసేపే ఆవరించింది.
మళ్ళీ నేను ”ఊఁ” అంటూ రెట్టించాను.
అదే… మళ్ళీ అదే మొనాలిజా నవ్వు.
ఆ తర్వాత కొంతసేపటికి పెదవి విప్పింది అక్క.
”స్నేహాఁ నన్నెవరయినా ప్రేమిస్తే బావుణ్ణుఁ… ”నీకు నేనున్నానుఁ ఎప్పటికీ వున్నాను… నువ్వుతప్ప నాకీ ప్రపంచంలో మరేదీ ఎక్కువ కాదు” అంటూ నన్ను గుండెలకు హత్తుకునే మనిషొకరు కావాలి… స్నేహా నన్నెవరయినా ప్రేమిస్తే బావుణ్ణు గాఢంగా…”
ఒక్కసారిగా నిశ్శబ్దం భళ్ళున పగిలి నట్టయింది.
స్థాణువయిన నా గుండెల్లోకి బాధ సునామీలా ప్రవహించింది.
నేను విభ్రమతో అక్క కళ్ళల్లోకి సూటిగా చూడ్డానికి ప్రయత్నించాను. ఎంతో విలువయిన పోషణతో ఎప్పుడూ మిలమిలలాడుతూండే అక్క ముఖం ఎలా పాలిపోయిందో చెప్పడానికి మాటలు వెదుక్కోవల్సిందే…
నా కళ్ళు రెపరెపలాడాయి. నా ముఖం లో నెత్తురు వేడెక్కిపోయింది.
తేరుకుంటూ తేరుకుంటూ నాకేదో అర్థమవసాగింది.
ఈ ప్రపంచంలో అందరికీ అర్థమయ్యే భాష ఒక్కటే…
అది ప్రేమ.
శూన్యంలోకి చూస్తున్నానో, అక్కకేసి చూస్తున్నానో తెలీడం లేదు గానీ ఆ విధంగా చెప్పాల్సివచ్చిన పరాధీనస్థితిలోకి జారి పోవడాన్ని సులభం చేసుకోవడానికి ముందే వార్ధక్యపు ముసుగు తొడుక్కుని పడమటి కొండలమాటుకి వెళ్ళిపోయిన వానాకాలపు సూర్యుడిలా వుంది అక్క ముఖం ఆ క్షణంలో.
మెట్లు దిగుతూ ఒక్కసారి అక్కకేసి చూడాలనుకున్నాన్నేను.
ధైర్యం చాలక నిండుతున్న కళ్ళను స్పష్టం చేసుకుంటూ ముందుకే నడిచాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to విషాదమాధురి

  1. sivalakshmi says:

    మార్కెట్ మనిషి ని ఎడా పెడా వాయించడాన్ని చాలా టచింగ్ గా చెప్పింది ప్రతిమ. వస్తువు ల మధ్య నుంచి స్వర్ణ తనకేం కావాలో తెలుసుకున్న పద్ధతి కధ లో బాగా చెప్పింది.ఆలోచన రేకెత్తించే కధ అందించిన ప్రతిమ కి ధన్యవాదాలు !

  2. padma says:

    చాలా బాగుంది. రాసిన తీరూ బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.