రవీంద్రుడికి నీరాజనం 150 వ జయంతి సందర్భంగా

అబ్బూరి ఛాయాదేవి
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గురించి చెప్పడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం చాలా చిన్నది – మూర్తీభవించిన భారతీయ సంస్కృతి అంటే కొంతవరకు సరిపోతుంది. మహర్షిగా గౌరవం పొందిన దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ దంపతులకు 1861లో మే నెల 7వ తేదీన రవీంద్రుడు జన్మించాడు. సాహిత్యానికీ, బహుభాషా పాండిత్యానికీ, లలితకళలకూ, ఆధ్యాత్మిక చింతనకీ ఆలవాలమైన ఠాగూర్‌ కుటుంబంలో పుట్టిన రవీంద్రుడు 8 ఏళ్ళ వయస్సులోనే ఒక ఫ్రెంచి కవితకి అనువాదం చేశాడు. 12వ ఏట ఒక నాటకాన్ని రచించాడు. 16 సంవత్సరాల వయస్సుకే కవిగానూ, విమర్శకుడుగానూ పేరు తెచ్చుకున్నాడు. కొన్ని నవలలూ వివిధ కథలూ రాశాడు. సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ నిష్ణాతుడనిపించుకున్నాడు.
రవీంద్రుడు ప్రకృతి ప్రేమికుడు. బాహ్యసౌందర్యాన్నే కాక, ఆత్మసౌందర్యాన్ని కూడా దర్శించి ఆరాధించగల రసపిపాసీ, తత్త్వవేత్తా అయిన రవీంద్రుడు నిరంతర స్వాప్నికుడు కూడా. శారీరక సౌందర్యం, ఆత్మసౌందర్యంతో పాటు శ్రామిక సౌందర్యాన్ని కూడా గుర్తించిన మానవతావాది.
రవీంద్రుడి నుంచి మనం నేర్చుకోవల్సినది – ముఖ్యంగా, మాతృభాషనీ, భారతీయ సంస్కృతినీ ప్రేమించడం, ప్రోత్సహించడం, యుక్తవయస్సులో రవీంద్రుణ్ణి లండన్‌ యూనివర్సిటీకి పంపించినా, ‘లా’ డిగ్రీ పూర్తి చేయకుండానే, స్వదేశానికి తిరిగివచ్చి, శాంతినికేతన్‌ని ఆదర్శ విద్యా సాంస్కృతిక కేంద్రంగా రూపొందించి, జాతీయ సంకుచితత్వం లేకుండా, దాన్ని ‘విశ్వభారతి’గా వృద్ధి చేసి, విశ్వమానవతా వికాసానికి కృషి చేశాడు. అందుకే రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘విశ్వమానవుడు’గా, ‘విశ్వకవి’గా కీర్తిపొందాడు. 1961లో రవీంద్రుడి శతజయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, ఆచంట జానకీరామ్‌ సారథ్యంలో ఒక ‘విశేష సంచిక’ని ప్రచురించింది. ఆనాటి మహామహులైన కవులూ, పండితులూ వివిధ ప్రక్రియలలో చేసిన రచనలు ఉన్నాయి ఆ సంచికలో.
రవీంద్రుని రచనల్లో ‘గీతాంజలి’ కావ్యం అత్యంత విశిష్టమైనదీ, అంతర్జాతీయ ఖ్యాతి పొందినదీ. మానవత్వంలో దివ్యత్వాన్ని దర్శించి రచించిన ‘గీతాంజలి’ కావ్యానికి సమ్మోహితులు కానివారు ఉండరు. ‘గీతాంజలి’ కావ్యానికి రవీంద్రుడు స్వయంగా చేసిన ఆంగ్లానువాదానికి 1913లో నోబెల్‌ పురస్కారం లభించిన విషయం అందరికీ తెలిసినదే. నోబెల్‌ పురస్కారాన్ని పొందిన ప్రథమ భారతీయుడూ, ప్రథమ పాశ్చాత్యేతరుడూ రవీంద్రుడే. దీన్ని అనేక ప్రపంచభాషల్లోకి అనువదించడం జరిగింది. మన తెలుగులోకి చలం చేసిన అనువాదం ప్రసిద్ధి చెందింది. డా. జె. భాగ్యలక్ష్మిగారు తాదాత్మ్య భావంతో, సరళసుందరంగా అనుసృజన చేశారు, పదేళ్ళక్రితం. ‘గీతాంజలి ఒక కవితా తపస్సు’ అనే శీర్షికతో ప్రొఫెసర్‌ శ్రీ లక్ష్మణమూర్తి గారు ఆకాశవాణి కోసం రాసిన 13 ప్రసంగవ్యాసాలను ఇటీవలే ఒక సంపుటిగా ప్రచురించారు.
రవీంద్రుని నవలలు ‘గోరా’, ‘నౌకాభంగం’ అత్యంత ప్రసిద్ధమైనవి. తెలుగులోకి అనువాదం కాని రవీంద్రుని రచనలు ఏవీ లేవేమో! రవీంద్రుని నాటకాలను కొన్నిటిని అబ్బూరి రామకృష్ణరావుగారు కేంద్ర సాహిత్య అకాడమీ కోసం అనువాదం చేశారు. వాటిని అకాడమీ 1969లో ప్రచురించింది. శాంతినికేతన్‌లో విద్యాభ్యాసం చేసిన డా. బెజవాడ గోపాలరెడ్డి గారు, అబ్బూరి రామకృష్ణరావు గారితో కలిసి మరికొన్ని నాటకాలను అనుదించారు అకాడమీ కోసం. రామకృష్ణరావుగారూ, రాయప్రోలు సుబ్బారావుగారూ కూడా యౌవనంలో విద్యాభ్యాస సమయంలో కొంతకాలం శాంతినికేతన్‌లో గడిపినవారే.
రవీంద్రుడు 1877లో కథలు రాయడం ప్రారంభించాడు. ఆ సంవత్సరంలో రాసిన మొదటి కథ ‘భికారిణి’ – బెంగాలీ భాషలో ప్రప్రథమ ఆధునిక కథగా చెబుతారు.
రవీంద్రుడు రాసిన 84 కథల్లో సగానికి పైగా మూడు సంపుటాలుగా ‘గల్పగుచ్ఛ’ పేరుతో వెలువడ్డాయి. వీటిని తెలుగులోకి మద్దిభట్ల సూరి అనువదించారు. ‘రవీంద్రుడి కథావళి’గా సంకలనం ప్రచురితమైంది. రవీంద్రుని పరిసరాలూ, ఆధునిక భావాలూ, మానసిక సమస్యలూ ఆయన కథల్లో ప్రతిబింబిస్తాయి. జమిందారు వంశానికి చెందిన వ్యక్తిగా గ్రామాల్లో కూడా కొంతకాలం టాగూర్‌ గడపడం వల్ల, అక్కడి వాళ్ళ జీవితాల్ని నిశితంగా పరిశీలించి, ప్రగాఢంగా అనుభూతి చెంది రాసిన కథలు ఆయనవి. నగర జీవితానికి అలవాటుపడిన వాడైనా, పర్వతాలగురించీ, అరణ్యాల గురించీ కన్న కలలు కనిపిస్తాయి కొన్ని కథల్లో.
రవీంద్రుడి కథల్లో కొన్ని ఎంతో కళాత్మకమైనవి సినిమాలకూ, నాటకాలకూ ఆధారమయాయి.
రవీంద్రుడికి స్త్రీలపట్ల అభ్యుదయభావాలు ఉండేవి. పురుషాధిపత్య బెంగాలీ సమాజంలో, మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీల దుర్భాగ్య పరిస్థితులను చిత్రించాడు తన కథల్లో. రామాయణంలో రాముడి సంశయాన్ని నివృత్తి చేయడానికి అగ్నిప్రవేశం చేసిన సీతని మహాపతివ్రతగా కీర్తించే హిందూ సంప్రదాయాన్ని విమర్శించాడుట ‘హైమంతి’ అనే కథలో.
అయితే, ఠాగూర్‌కి భార్యమీద ప్రేమ ఉన్నా, మొదట్లో యౌవన దశలో ఆమెని సాహిత్యరంగంలో ఎదగకుండా చేశాడుట – అది స్త్రీ లక్షణం కాదంటూ. చివరికి భార్య ప్రతిభని గుర్తించి, ఆమె ఆధిక్యానికి తల వంచినట్లు నిజాయితీగా ‘దర్పహరణ్‌’ అనే కథని, స్వీయానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినట్లు తెలుస్తుంది. రవీంద్రుడికి అత్యంత ఆత్మీయురాలు మృణాళిని. రవీంద్రుడి భార్య మృణాళిని.
న్యూఢిల్లీలో ఉండగా, శంభుమిత్రా, తృప్తిమిత్రా బృందం వారు ఠాగూర్‌ నాటకాలను కొన్నిటిని ప్రదర్శించారు. ‘చరిదీవీ ళితీ శినీలి ఈబిజీది ్పునీబిళీలీలిజీ’ నాటకాన్ని బెంగాలీలో చూసినప్పుడు, అది కూడా నోబెల్‌ పురస్కారానికి అర్హమైనంత గొప్పగా అనిపించింది. నాకు వ్యక్తిగతంగా రవీంద్రుడి గేయం ఒకటి మార్గదర్శకం. ఎవరైనా నన్ను ”ఒంటరిగా ఎలా ఉంటున్నార”ని అడిగినప్పుడు, ”రవీంద్రుడు ‘ఏక్లచలో’ అన్నాడు కదా” అంటూ ఉంటాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.