కొండేపూడి నిర్మల
అత్తాపూర్లో వుండగా మా పక్కవాటాలో ముసలి దంపతులు వుండేవారు. ఆయనకి మధుమేహం, అంచేత ఆ ఇల్లాలు వంటయిపోయింతర్వాత కూడా రోజంతా పొయ్యిమీద దోసెలు పోస్తూనో, ఉప్మా కలియబెడుతూనో చెమటలు కక్కుతూ వుండేది. ఆయన మాత్రం ఎంచక్కా అన్నీ తినేసి అది బావుండలేదు. ఇది బావుండలేదు అని నానారకాలుగా తిట్టేవాడు (వొండి పెట్టే ఇల్లాలు-వోండ్రపెట్టే మొగుడూ – అని దాసరి నారాయణరావు లాంటివాడు సినిమా తీస్తే బావుంటుందని నేను అనుకునేదాన్ని).
ఇక్కడ మా వాటాలో డైనింగ్ టేబుల్ మీదున్న ప్లాస్టిక్ సంచుల్లో వున్న ఫాస్టు ఫుడ్ చేగోడీలు అవీ తింటూ మామగారు నిట్టూరుస్తూ వుండేవాడు. ఎందుకంటే నేను ఆఫీసుకు వెడుతూ పొద్దున్నెప్పుడో ప్లాస్కులో పోసిన టీ కూడా చల్లారిపోయి వుండేదేమో. ఓ పక్క వంటరితనం, ఇంకో పక్క వేడివేడిగా వండి వడ్డించే ఆడది లేని తనంలోంచి ఆయన తేరుకోలేక పొయేవాడు.
పైగా పుండు మీద కారం జల్లినట్టు పక్కింటి ఆయన ఈయన్ని ఉద్దేశించి ”మీకేమండీ అదృష్టవంతులు ఒక సుగరు లేదు బిపిలేదు, తిన్నది తిన్నట్టు అరుగుతుంది అనేవాడు.” ఈయన వూరుకుంటాడా, కడుపుమండిపోదూ, ”సుగరుదేముండి లేండి, జరిగితే జ్వరమంత భోగంలేదని అంటారు. వొండిపెట్టే ఇల్లాలు వుండడమే అసలైన అదృష్టం” అనేవాడు. కొద్ది వారిద్దరి అదృష్ట దురదృష్ణ విశ్లేషణ అయ్యాక అప్పుడు, ఎవరిదెంత గొప్ప వంశమో అది చెప్పుకునేవారు. మా పక్కింటి ఆయన తరచూ చెప్పే కథ ఒకటి ఆయన మాటల్లోనే మీ ముందు పెడతాను, వినండి. మేడ మీద చల్లగాలికి పిట్టగోడ మీద కూచుంటే ఇవి వినిపిస్తూ వుంటాయి కదా, తలబొప్పి కట్టేసింది.
తిలతిలతిల
మా తాతగారు, సూరంపూడి సుబ్బారావుగారనీ, మహా గొప్ప వకీలండీ, ఆ మండలంలోనే అంత గొప్ప వకీలు లేడు, నీతి మంతుడు. న్యాయం విషయంలో తనపర తేడా లేదు. ఒకసారి కట్టుకున్న ఇల్లాలి మీద కూడా కేసు పెట్టాడు.(నవ్వు) కేసు పెట్టి ఏంచేశాడనుకున్నారు. జడ్జీగారి తీర్పు ప్రకారం నష్టపరిహారం కూడా కట్టాడు.”
”అబ్బో ఏమి ఔదార్యం” మా మామగారు.
”ఆ కేసేమిటో చెప్పమంటారా…” వూరించాడు. నిన్ననేగా చెప్పింది.. అనే మాట ఈయన అనడు. ఎందుకంటే ఈయన తాత నేతి కథలు ఆయన వినాలికదా మరి. కాబట్టి చెప్పండీ అన్నట్టు చూస్తాడు. ”కత్తి తిప్పి సాముగరిడీకి దిగాడంటే అదిరి పోవాల్సిందే.. కన్నెర్రజేశాడంటే తోక ముడుచుకుని పరిగెత్తాలి. మా అమ్మమ్మ మాత్రం ఎంత దొడ్డ ఇల్లాలనుకున్నారు. సాక్షాత్తూ అన్నపూర్ణే.. తలెత్తి ఎవరివంకా చూసేది కాదు. ఎప్పుడూ లేచి మడి కట్టకునేదో ఎంత మందికి వడ్డించేదో గాని మనిషి కనబడేదేకాదు. ఆ ఇంటికి నాలుగు సందుల అవతల వీళ్ల దాయాదులుండేవారు. రెండు ఇళ్ళకీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒక రోజు చెప్పా పెట్టకుండా మా అమ్మమ్మ వాళ్ళింటికి బయల్దేరింది.
అంత ధైర్యం ఎలా వచ్చిందో గాని అటు చూడనే లేదండి అన్నపూర్ణమ్మ. ”పసుపు కుంకాల కోసం వెడుతున్నాను. నన్ను ఆపకండి అని ప్రాధేయపడిందట..వినలేదు మా తాత,
ఏం చేస్తుంది పాపం, భర్తకి ఎదురు తిరిగే కలికాలం రోజులుకావు కదా అవి. అంచేత గుడ్ల నీరు కుక్కుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అటువంటి మహా ఇల్లాలు మా తాత పరువు ఎలా తీసిందో తెలుసా..? తెల్లారుఝామునే అన్నీ భర్తకి అమర్చి పెట్టి వెళ్ళిపోయింది.
తాత చూసుకోలేదు. కోర్టుకి చకచక నడిచి వెడుతూ వుంటే సరిగ్గా ఆ దాయాదుల ఇంటి గోడ నుంచి ఎంగిలి విస్తళ్ళ కట్ట నెత్తిన పడింది. ఎవర్రా అది అని, కళ్ళెర్రజేశాడు. గోడ వెనకగా బిత్తరపోతూ తన భార్య అన్నపూర్ణమ్మ..మాట్లాడకుండా ఇంటికొచ్చాడు. పరువు నష్టం దావా వేశాడు. బోనులో నుంచుని వుంది అన్నపూర్ణమ్మ.
”ఏమ్మా అతని మీద విస్తళ్ళ కట్ట వేసింది నిజమేనా…”తలూపింది. నేరస్తురాలు అన్నపూర్ణమ్మ వీరిని అవమానించే నిమత్తమే దాయాదుల ఇంటికి వెళ్ళటమే కాక ఎంగిలి విస్తళ్ళ కట్ట వేసింది. కాబట్టి ఒక రోజు జైలు శిక్షగాని, రెండు రూపాయల నష్టపరిహారం కానీ చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు చెప్పింది.
అన్నపూర్ణమ్మ తలెత్తలేదు. అప్పటిరోజులు కదా అవి మరి, అదే ఇప్పుడయితేనా…?(మధ్యలో వ్యాఖ్యానం)
మా తాత నష్టపరిహారం కట్టేశాడు. భార్యను ఇంటికి తేవడంకోసం గుర్రపు బండి ఎక్కమని పురమాయించాడు. అన్నపూర్ణమ్మ ఎక్కింది. తెల్లారేసరికి వూరి చివర దిగుడుబావిలో దూకేసింది. మా తాత దిక్కులేనివాడయ్యాడంటే నమ్మండి. ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడో…అంత అన్యాయం మా అమ్మమ్మ ఎలా చేసిందో…తన పర తేడా లేని మా వకీలు తాత, అసలు న్యాయానికి రోజులు లేవంటే నమ్మండి… ఆయన వాగ్ధాటి కొనసాగుతోంది. ఈ కథ వెనుక వున్న కథ ఏమిటో తర్వాత ఆంటీని అడిగి తెలుసుకున్నాను.
ఏమీ లేదమ్మా.. వాళ్ళకీ వీళ్ళకీ పచ్చగడ్డివేసినా గాని భగ్గుమనేదిగానీ, ఈ అన్నపూర్ణమ్మా ఆ ఇంటి ఇల్లాలు సువర్చలమ్మా వేలు విడిచిన అక్క చెల్లెళ్ళు. మొగుళ్లకి భయపడి చెరువు దగ్గర రహస్యంగా కలుసుకునే వారు. ఆవిడ కూతురు పెళ్ళికే ఆవిడ వెళ్ళింది. పరాయిచోటుకి ఏమీ కాదు…వెడుతూనే పనిలో జొరబడి కలివిడిగా వంటలు చేసింది. వియ్యాలవారికి వడ్డనలు చేసింది. విస్తళ్ల కట్ట ఎత్తి గోడవతల పారేస్తుంటే ఖర్మకాలి భర్తగారు అటు రావడమూ ఆయన నెత్తినపడటమూ జరిగిపోయాయి. పొరబాటు ఎవరికైనా సహజమేకదా. తన పర్మిషను లేకుండా శత్రువు ఇంటికి వెళ్లడమే కాకుండా అక్కడ నుంచి ఎంగిలి విస్తళ్ళ కట్ట పడేయ్యడమా, పైగా మేడమీంచి ఆ పిల్లలు నవ్వుతారా.. అని ఉడికిపోయాట్ట. తగుదునమ్మా అని కట్టుకున్న భార్య మీద పరువు నష్టం కేసు పెట్టి ఆవిడ ఆయువు తీశాడు. కోర్టుకి ఎక్కాక ఇంక బతకడం ఎందుకనుకుందో, ఏమిటో…జరిగిన నష్టం ఏదయినా వుంటే ఆవిడకే గాని ఆయనకి ఏమీ కాదు…ఆ తర్వాత ఎవర్నో చేరదీశాడనుకో… అది చెబుతాడేమో చూడు ఈ మహానుభావుడు. ఆ తాత పేరే కదా ఈయనది… అంచేత ఇంత జరిగిన సరే ఈయనగారు మా తాత ఎంత వకీలో అని గప్పాలు కొడతాడు. అమ్మమ్మ వైపు ఎందుకని ఆలోచించడో… అంది కొంగుతో కళ్ళొత్తుకుంటూ..
ప్రతి కథ వెనకా ఇంకో కనపించని వ్యధ వుంటుందన్నమాట.. మగ వాళ్ళు అహంకార పోషణలోనూ ఆడవాళ్ళు మానవ సంబంధాల పోషణలోనూ సిద్ధహస్తులు. రామాయణమంతా రాముణ్ణి హీరో చెయ్యడానికి రాసినట్టు కనబడుతుంది. భారతం కృష్ణుడు చెప్పినట్టు నడిచింది. పాదాభివందనాలు చేయించుకోవడానికి మగవాళ్ళు నుంచున్నట్టుగా ఆడవాళ్ళు నుంచోవడం ఎక్కడయినా చూశారా.. అంటున్నానని కాదు. ఆలోచించండి. సాదా సీదా మనుషులైన మా పక్కింటి అంకుల్ నుంచి ప్రపంచ రాజకీయ చరిత్రదాకా కథలన్నీ మీసాలు గడ్డాలు పెట్టుకుని కనబడుతున్నాయాలేదా…? భండారు అచ్చమాంబని కనిపెట్టడానికి ఎన్నాళ్ళు పట్టిందో మనకి తెలీయకపోతే కదా…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
నిర్మల గారూ,
చాలా బాగా రాశారు. నిజంగా, స్పష్టంగా వుంది మీరు రాసింది. మొదటి సగం ఎంతో నవ్వు తెప్పించింది. కళ్ళల్లో కాసిని నీళ్ళు కూడా వచ్చాయి. సరదాగానే రాస్తూ, చురకలు వేస్తున్నారు అని సంతోషించాను కూడా. అయితే, ఆ అమ్మమ్మ గారు దిగుడు బావిలో తేలారని, మీరు రాసింది చదివాక, మనసు కకలావికలమయి పోయింది. అప్పటి వరకూ మొహం మీద వున్న నవ్వు ఎగిరి పోయింది. కధ అయితే మార్చి రాసుకోవచ్చు గానీ, నిజాన్ని మార్చి రాయలేరు కదా?
ఈ వ్యాసం చివర్లో మీరు చెప్పింది చాలా కరెక్టు. అలాగే, ఈ మగ సమాజం మీ మీద రుద్దిన మీ ఇంటి పేరు సంగతి కూడా ఒక సారి ఆలోచించండి. అది మీకు, మీ భర్త ద్వారానో, మీ తండ్రి ద్వారానో సంక్రమించినది అయివుంటుంది. మీ పిల్లల పేర్లలో కూడా మీకు స్థానం వుండి వుండదు. అయినా సర్దుకుని కొనసాగు తున్నారు. భవిష్యత్తులో, స్త్రీలు, “ఒక్కప్పుడు ఆడ వాళ్లందరూ, భర్త నించో, తండ్రి నించో వచ్చిన ఇంటి పేర్లని మోసేవారట. పిల్లల పేర్లలో ఆడ వాళ్ళకి చోటుండేది కాదట” అని చెప్పుకుంటారేమో! ఏం, ఇప్పుడు మనం పాత కాలం అణగి మణగి వుండిన స్త్రీల గురించి చెప్పుకోవడం లేదూ? అలాగే.
మొత్తానికి మీ వ్యాసం బాగుంది విషయం చెప్పడంలో, మనసుకి కష్టం కలిగించినప్పటికీ. నా చేత ఒక కామెంటు రాయించింది.
– ప్రసాద్