ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -32

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
మా అమ్మాయికి మామిడిపళ్లంటే చాలా ఇష్టం. అమ్మాయికి పెళ్లై అత్తారింటికి వెళ్లినప్పట్నించీ, మా ఆయన ముందు దానికి మామిడి పళ్లు పంపి, తరవాత తను తినేవారు. 1935 లో ఒకసారి ఆయన లక్నో వెళ్లారు. అక్కణ్ణించి దశహరీ పళ్లు, సఫెదా పళ్లూ తెచ్చారు. ఆయన ఇలా బెనారెస్‌ చేరుకోగానే బొంబాయినించి మున్షీ వెంటనే రమ్మని టెలిగ్రామ్‌ పంపాడు.
”అమ్మాయికి ఈ పళ్లు తీసుకెళ్లివ్వమని అబ్బాయి ధున్నూకి చెప్పు. నేను బొంబాయి వెళ్తున్నాను,” అన్నారు.
”వాడు తీసుకెళ్లద్దూ?” అన్నాను.
”ఎందుకు తీసుకెళ్లడు? వాడు పళ్లు తీసుకెళ్లకపోతే అసలు వెళ్లనే అక్కర్లేదని చెప్పు!”
”అలాగే.”
జ    జ    జ
వెనక్కి వచ్చాక పళ్లు పంపానా అని అడిగారు. పంపానని చెప్పాను.
సాహిత్య పరిషత్‌ మీటింగ్‌ 1936 లో వార్థాలో జరిగింది.
”అక్కణ్ణించి వచ్చేప్పుడు అమ్మాయిని వెంట తీసుకొస్తాను. వాళ్లకి ఉత్తరం రాయి,” అన్నారు.
”ముందే రాసేశాలెండి,” అన్నాను. ఆయన వెళ్తూంటే, ”మరీ ఎక్కువ ఆలస్యం చెయ్యకండి,” అన్నాను.
”ఒకటి రెండ్రోజులు ఎక్కువ పట్టచ్చు. చాలా చోట్లకి వెళ్లాలి. నాకు త్వరగా ఇంటికొచ్చెయ్యాలనే ఉంటుంది. సాగర్‌ దాకా వెళ్లి రావాలిగా, ఆలస్యం అవచ్చు!”
ఆయన వెనక్కి ఒంటిగానే వచ్చారు, అమ్మాయి రాలేదు. నేను ఆ సంగతి అడిగితే, జవాబు చెప్పకుండా పైకెళ్ళిపోయారు. నేను కూడా వెనకాలే వెళ్ళి, ”అమ్మాయేదీ?” అన్నాను.
ఆయన కళ్లనీళ్లు పెట్టుకుంటూ, ”ఒంట్లో బాగాలేదు!” అన్నారు.
”ఏమైంది?” అన్నాను.
”గర్భస్రావం, నేనక్కడికి చేరుకోగానే డాక్టర్‌ చెప్పింది.”
”మీరు అమ్మాయిని కలిశారా లేదా?”
”ఎందుకు కలవను? రెండ్రోజులు అక్కడే ఉన్నాను. దాని పరిస్థితి ఇలాగే ఉంటే జీవచ్ఛవంలా తయారవటం ఖాయం! ఆ బుద్ధిలేని గాడిదలకి కొంచెం కూడా పట్టలేదు. ఇరవైయ్యొ శతాబ్దంలో కూడా ఇంత బుద్ధి లేకుండా ఉంటారా?”
”ఎవరైనా కావాలని జబ్బు పడతారటండీ?”
ఇదంతా మన ఖర్మ అంటూంటే ఆయన గొంతు పూడుకు పోయింది.
అదేరోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. వెయ్యి రూపాయల నగదు, పదిహేనువందలు ఖరీదు చేసే నగలూ పోయాయి. దొంగ దొరకలేదు. ఆ దొంగతనం చేసింది ఒక వంట వాడు. ఎటువంటి ఆచూకీ తెలీకపోయేసరికి, ”నువ్వు నగలగురించి ఏమీ బాధపడద్దు. అవెప్పుడూ పెట్టెలోనే ఉండేవిగా! పాపం ఆ దొంగాడి పెళ్లామైనా వాటిని పెట్టుకుని ఆనందిస్తుంది. కానీ రొక్కం పోవటం నిజంగా నీకు బాధగానే ఉంటుంది. ప్రెస్‌లో పనివాళ్ల జీతం డబ్బులు అందులోంచే కదా ఇస్తాం? అయినా పెద్ద సమస్యేమీ లేదు, వాళ్ల జీతాలు ఎలాగోలాగ ముట్టచెపుదాం,” అన్నారు.
”నావి రెండువేల అయిదువందలు దొంగలు దోచుకుపోతే మీకు వెటకారంగా ఉందా?” అన్నాను.
ఆయన తనదైన ప్రత్యేకమైన చిరునవ్వుతో, ”నీకు రెండువేల ఐదువందల గురించి విచారంగా ఉందా? మనిషి ప్రాణమే ఏదో ఒకరోజు పోతుంది కదా! అలా చూస్తూ ఉండగానే ప్రాణం పోతుంది, మనం ఏమీ చెయ్యలేం! నీ కూతురు బతికి బైటపడిందని సంతోషించు. అది ఆరోగ్యంగా ఉంటే అదే పదివేలు! నేను మూడు నెలలు పనిచెయ్యలేదని సరిపెట్టుకుంటే పోతుంది.”
నేనేమీ మాట్లాడకుండా నా గదిలోకెళ్లి అమ్మాయికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. వెనకాలే ఆయనా వచ్చారు.
”ఏం రాస్తున్నావు?” అన్నారు.
”అమ్మాయికి ఉత్తరం రాస్తున్నాను,” అన్నాను.
”నే రాస్తాలే!”
”ఏం?”
”నీ బుర్రని ఇంకా ఆ దొంగతనం జరిగిన సంగతి తొలుస్తూనే ఉంది. అది కూడా రాసెయ్యగలవు! అసలే దాని ఆరోగ్యం బాగాలేదు. ఈ వార్త విని మరింత కుంగిపోతుంది.”
”సరే, మీరే రాయండి!”
ఆయనే ఉత్తరం రాశారు. జూన్‌ నెలలో మగ పిల్లలిద్దర్నీ పంపి అమ్మాయిని పిలిపించాలని అనుకున్నారు. ”వెళ్లి తోటనించి ఒక వంద మామిడిపళ్లు తీసుకురా!” అన్నారు ధున్నూతో.
”చాలా బరువు కదా? అయినా అక్కయ్యే ఇక్కడికి వస్తోందిగా?” అన్నాడు ధున్నూ.
”బరువేమిటి? నువ్వేమైనా తలమీద మోసుకెళ్తావా? అమ్మాయి వస్తుంది కానీ వాసుదేవ్‌ రాడు కదా? అతను తినక్కర్లేదా?”
అబ్బాయికి చెప్పినా, ఉదయం షికారుకి వెళ్లినప్పుడు తనే ఆర్రూపాయలకి పళ్లు కొని తెచ్చారు. ఎవరి చేతో మోయించుకుని వచ్చి, ”వీటిని చక్కగా మూటకట్టు!” అన్నారు నాతో.
”వీటిలో బాగా పండిపోయినవి ఏం చెయ్యను?” అన్నాను.
”వాటిని వీళ్లిద్దరికీ ఇచ్చెయ్యి. లేకపోతే మొత్తం మామిడిపళ్లన్నీ కెలికి తీసుకుని తినేస్తారు.” అన్నారు.
ఒకసారి ద్వివేదీగారు వస్తున్నారనీ, వారికి స్వాగతం పలికేందుకు రమ్మని పిలుపు వచ్చింది. అదేరోజు అమ్మాయికి ఆరోగ్యం ఏమీ బాగాలేదని టెలిగ్రామ్‌ కూడా వచ్చింది. ఈయన ప్రెస్‌లో ఉండగా టెలిగ్రామ్‌ అందింది. ఆయన వెంటనే ఇంటికొచ్చి, మేడమీదున్న నన్ను కేకేసి పిలిచారు. కిందికి రాగానే, ”స్థిమితంగా కూర్చో!” అన్నారు.
”ఏమైంది?” అన్నాను.
”అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు. సాగర్‌కి తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్చారు. ఈ వేళప్పుడు రైలేదైనా ఉందా? మనం వెళ్లాలి. పోనీ అలహాబాదు దాకా లారీలో వెళ్దామా? అక్కణ్ణించి ఏదైనా రైలు దొరకచ్చు,” అంటూ రైల్వే టైమ్‌టేబుల్‌ చూడసాగారు. ప్రస్తుతం అలహాబాద్‌కి రైలేదీ లేదని తెలిసింది.
”పోనీ రేపు ఉదయం వెళ్దాం,” అన్నాను.
ఆ రోజు ఆయన అన్నం, నీళ్లు ముట్టలేదు. మర్నాడు ఇద్దరం ఉదయాన్నే బైలుదేరాం. అలహాబాద్‌ చేరేసరికి తొమ్మిదయింది. అక్కణ్ణించి సాగర్‌కి రైలేదీ దొరకలేదు. అలహాబాద్‌ వెయిటింగ్‌రూమ్‌లో కూర్చున్నాం. ”అమ్మాయి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంటుందంటావు? కోలుకుని ఉంటుందా?” అని నన్ను మాటిమాటికీ అడగటం మొదలుపెట్టారు.
”నాకెలా తెలుస్తుందండీ? ఆ దేవుడికే తెలియాలి!” అన్నాను. కొంతసేపయాక, ”పద లూకర్‌గంజ్‌ దాకా వెళ్లి కనుక్కుందాం!” అన్నారు. తీరా అక్కడికెళ్లాక ఎటువంటి సమాచారమూ తెలీలేదు. పగలంతా ఎలాగో గడిపి రాత్రి సాగర్‌ వెళ్లే రైలు పట్టుకున్నాం. మా ఆయనకి కంగారు క్షణక్షణం పెరిగిపోసాగింది. రైల్లో కూడా ”అది ఎలా ఉందో?” అని బాధపడుతూనే ఉన్నారు. ఆయన కంగారు చూసి నేను లేని ధైర్యం తెచ్చుకున్నాను.
ఉదయం కట్‌నీనించి వేరే రైలు మారేప్పుడు, ”మీరు మొహం కడుక్కోండి. అమ్మాయి బాగానే ఉంది!” అన్నాను. అది విని ఆయన మొహం చాటంతయింది, ”నిజంగానా?” అన్నారు.
”అవును, వాళ్లు హడావిడి పడిపోయి టెలిగ్రామ్‌ ఇచ్చారు. మీరు మొహం కడుక్కుని పలహారం చెయ్యండి.”
ఏ ఒంటిగంటకో సాగర్‌ చేరుకున్నాం. వాసుదేవ్‌, తన తమ్ముణ్ణి వెంటబెట్టుకుని స్టేషన్‌కి వచ్చాడు. ఈయన ఆ తమ్ముడి దగ్గరకి గబగబా వెళ్లి, ”మా అమ్మాయి ఎలా ఉంది?” అన్నారు.
”కులాసాగానే ఉంది,” అన్నాడతను.
రెండ్రూపాయలు అతని చేతిలో పెట్టి, ”మిఠాయిలు తీసుకురా!” అన్నారు.
మేం ఆస్పత్రికి వెళ్లగానే ఆ కుర్రాడితో, ”ముందు నన్ను మా అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లు!” అన్నారు. అమ్మాయి మంచంమీద నీరసంగా పడుకునుంది. జ్వరం ఉంది. పసివాడు దూరంగా ఉయ్యాలలో ఉన్నాడు. అమ్మాయి మమ్మల్ని చూస్తూనే భోరుమంది. అది చూసి మా ఆయన, ”భయపడకమ్మా! జబ్బు నయమైపోతుంది,” అని పసివాణ్ణి చూసి, ”గులాబీ మొగ్గలా ఉన్నాడు. దేవుడు వీణ్ణి చల్లగా చూడాలి!” అన్నారు.
ఎనిమిది రోజులు అక్కడే ఉన్నాం. అప్పటికి అమ్మాయి జ్వరం తగ్గింది. ”ఇంక మేం బైల్దేరతాం, తల్లీ! నువ్వు పూర్తిగా కోలుకున్నాక ధున్నూ వచ్చి అక్కడికి నిన్ను తీసుకొస్తాడు,” అన్నారు.
”నన్నైనా మీవెంట తీసుకెళ్లండి, లేదా అమ్మని ఇక్కడ వదిలివెళ్లండి,” అంది అమ్మాయి.
”డాక్టర్‌ నిన్ను కదలద్దన్నాడమ్మా!” అని, నాతో ”పోనీ నువ్వు ఉండిపో!” అన్నారు నాతో.
నన్నక్కడే వదిలేసి ఆయన ఒక్కరూ వెళ్లిపోయారు. ఆయన అటు వెళ్లగానే అమ్మాయి ఆరోగ్యం మళ్లీ పాడయింది. అలా రెండు నెలలు ఆయన ఒంటిగా ఉండాల్సి వచ్చింది. సరైన తిండీ, నీళ్లూ లేవు. మలబద్ధకంతో బాధపడసాగారు. పంటినొప్పి కూడా మొదలైంది. అమ్మాయి ఆరోగ్యం కాస్త కుదుటపడిందని తెలియగానే వాసుదేవ్‌కి ఉత్తరం రాశారు, ‘మీ అత్తగార్ని ఇక్కడికి పంపెయ్యి. డాక్టర్‌ అనుమతి ఇవ్వగానే అమ్మాయినీ, మనవణ్ణీ ఇక్కడ తెచ్చి దించి వెళ్లు.’
నేను బెనారస్‌ చేరుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఈయన రాసుకుంటూ కనిపించారు. టాంగా ఆగిన చప్పుడు విని బైటికొచ్చి, ”వచ్చేశావా?” అన్నారు.
”ఆఁ, వచ్చేశాను,” అన్నాను.
”నువ్వేమైనా జబ్బు పడ్డావా?”
”నాకేమీ కాలేదు, కానీ మీరు మాత్రం రోగిష్టిలా తయారయారు.” అంటూ సామాన్లు దింపుదామని నాలుగడుగులు వేశాను.
”నువ్వుండు, నేను దింపుకుంటాను,” అన్నారు. ఇంట్లోకొచ్చి, ”అమ్మాయేది?” అన్నారు అది ఎక్కడా కనిపించక పోయేసరికి.
”ముందు కొంచెం స్థిమితపడండి, అన్ని సంగతులూ చెపుతాగా!” అన్నాను. అక్కడ వాసుదేవ్‌ వాళ్ల అక్క హఠాత్తుగా రావటం, ఆవిడ రాగానే జబ్బుపడటం గురించి వివరంగా చెప్పాను. భోజనం చేశాక, ఆయన వెంటనే కూర్చుని పెద్ద ఉత్తరం రాయసాగారు. నేను మాత్రం పడుకుని నిద్రపోయాను. నేనలా చాలాసేపు పడుకునుండి పోయాను. ఆయన కూడా నన్ను లేపలేదు. నేను మధ్యాన్నం మూడుగంటలకి లేచాను. ”నేను ప్రెస్‌కి వెళ్లొస్తాను, తమలపాకులు చుట్టివ్వు!” అని ఆయన తాంబూలం వేసుకుని వెళ్లిపోయారు. ఆయన అటువెళ్లగానే వాసుదేవ్‌ అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చాడు. వీళ్లు వచ్చారని ఆయనకి కబురుపెట్టాను. వెంటనే ఆయన ఇంటికి పరిగెత్తుకొచ్చారు. వస్తూనే మనవణ్ణి ఎత్తుకుని, ”చూడు, వీడెలా అయిపోయాడో!” అని, వెంటనే, ”పోన్లే దేవుడి దయవల్ల తల్లీ, బిడ్డా కోలుకున్నారు!” అన్నారు.
ఆరోజు మొదలు ఆయనకి మనవడితోటిదే లోకమయింది. ఎప్పుడూ వాణ్ణి ఆడిస్తూ కూర్చునేవారు.
అమ్మాయి వచ్చిన మూడోరోజు దాన్ని లేడీడాక్టరు దగ్గరకి తీసుకెళ్ళి పరీక్ష చేయించాలని అనుకున్నాం. ”డాక్టర్ని ఇంటికి పిలిపించు,” అన్నారీయన.
”ఆవిడ ఫీజెంత?” అన్నాను.
”అక్కడికి వెళ్తే ఎనిమిది రూపాయలు. ఇంటికొస్తే పదహారు, రాకపోకలకి ఒకరూపాయి అదనంగా ఇవ్వాలి.”
”ఎందుకండీ డబ్బు దండగ చేస్తారు? అమ్మాయినే అక్కడికి తీసుకెళ్దాం,” అన్నాను. ఆయన ఒప్పుకున్నారు. టాంగా పిలిపించారు. అమ్మాయిని పట్టుకుని కిందికి దింపుతూంటే అది జారిపడింది. ఆ చప్పుడు వినగానే ఆయనా, వాసుదేవ్‌ పరిగెత్తుకొచ్చారు. నేను అమ్మాయిని లేవనెత్తాను. ఆయన పక్కకి వెళ్లి ఏడవసాగారు.
”మీరు మరీనండీ! కాస్త కాలుజారి పడితే, అంత మాత్రానికే?” అన్నాను, ఆయన ఏడవటం చూసి.
”అందరూ పడతారు, కానీ దానికి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో!”
”అంత దెబ్బేమీ తగల్లేదు లెండి. బామ్‌ రాశాను. ప్రస్తుతం నొప్పేం లేదు.”
”బామ్‌ దొరికిందా?”
”కొట్టునించి తెప్పించాను.”
”ఏమ్మా, బాగా నొప్పిగా ఉందా?” అని అడిగారు అమ్మాయిని.
”లేదు, నాన్నా! ఎక్కువ దెబ్బేమీ తగల్లేదు. మందు రాయగానే ఆ కాస్త నొప్పి కూడా పోయింది,” అంది అమ్మాయి.
మర్నాడే ఒక మంగలివాళ్ల స్త్రీని అమ్మాయికీ, మనవడికీ సేవ చేసేందుకు పిలుచుకొచ్చారు. ”వీళ్లిద్దర్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావంటే నువ్వు ఏమడిగితే అదిస్తాను. ఇద్దరూ ఆరోగ్యంగా తయారవాలి, అంతే!” అన్నారు.
”తప్పకుండా బాబుగారు! మీ అమ్మాయి నా చెల్లెలిలాటిది!” అందామె. అన్నట్టుగానే వాళ్ళిద్దరికీ చక్కగా సేవచేసి ఇద్దరి ఆరోగ్యాన్నీ చక్కబరిచింది.
మధ్యలో ఒకసారి ఆమె ఆరోగ్యం పాడయింది, మలేరియా వచ్చింది. మూడునాలుగురోజులు నేనూ, అమ్మాయీ ఆమెకి శుశ్రూష చేశాం. అయినా ఆమె కోలుకోలేదు. చాలా గాభరాపడసాగింది. మేమెంత చెప్పినా వినకుండా ఆమె వెళ్లిపోయింది. మా ఆయన సాయంత్రం ప్రెస్‌నించి వచ్చి, ”రమదేయీ ఒంట్లో ఎలా ఉంది? జ్వరం తగ్గిందా?” అని అడిగారు.
”తగ్గలేదు. ఆవిడ మూడుగంటల ప్రాంతంలో ఇంటికెళ్లి పోయింది,” అన్నాను.
”ఎందుకు వెళ్లనిచ్చావు?”
”వద్దని ఎంత చెప్పినా వినలేదు, ఏం చెయ్యను?”
”ఆమె ఇంట్లోవాళ్లు ఏమనుకుంటారు? బాగున్నన్నాళ్లూ చాకిరీ చేయించుకున్నారు, ఆరోగ్యం పాడవగానే తరిమేశారు, అనుకోరూ? ఇక్కడే ఉంటే మందులవీ ఇప్పించేవాణ్ణి కదా! సొంతవాళ్లు కూడా చెయ్యనంత సేవ చేసింది, పాపం! ఇక మీ ఇద్దరికీ సమస్యే. రేపు క్వినైన్‌ తెప్పించి దాంతోపాటు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లింటికి పంపించు!” అన్నారు.
మర్నాడు ఉదయం క్వినైన్‌, డబ్బు పంపించాం.
సాయంత్రం ప్రెస్‌నించి వస్తూనే, ”మనకి సేవ చేసినవాళ్లని ఎప్పుడూ మర్చిపోకూడదు. అవసరం వచ్చినప్పుడు వాళ్లకి కూడా సేవ చెయ్యాలి. మనవాళ్లు నౌకర్లని మనుషుల్లాగే చూడరు, వాళ్లు ఎంత ముఖ్యమైనా సరే! ఇంగ్లీషువాళ్లలో ఉన్న ఆ గుణం మనలో లేదు. ఇంగ్లీషువాడికి నౌకరు నీళ్లు అందిస్తే ”థాంక్యూ!” అంటాడు-
– ఇంకా ఉంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.