చిన్నారి

గిజూభాయి
అనువాదం : అత్తలూరి నరసింహారావు
ఓ చిన్నమాట!
మన మాడు పగిలేట్టు ఎవరో చెప్పేదాకా కొన్ని మనకు అర్థం కావు. అనుభవంలోకి రావు. ”ఓరి నాయనల్లారా! పిల్లల్ని చెయ్యి చేసుకోకండి, తిట్టకండి, బెదిరించకండి, కోప్పడకండి, గదిలో పెట్టి గెడవెయ్య కండి, ఏడిపించకండి, గిల్లకండి, గుద్దకండి, తొడపాశం పెట్టకండి, మొట్టికాయలు వెయ్యకండి” అని మనకు ఎవరు ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చెప్పినా, అలా చెయ్యటం తప్పని ఎన్నిసార్లు జ్ఞానోదయమైనా, అవే వెధవ పనులు మనం చేస్తూనే వుంటాం. చేయిస్తూనే వుంటాం. చేస్తూంటే చూస్తూనే వుంటాం.
అప్పుడు కొట్టే మన చెయ్యి వెనువెంటనే విరగిపోవాలని మన పిల్లలు మనసులో కూడా అనుకోరు. కళ్లెర్ర చేసి, వురిమి చూసే మన కళ్ళు అమాంతం పేలిపోవాలని మన పిల్లలు కలలో కూడా అనుకోరు. గిల్లుతున్నా, తొడపాశం పెడుతున్న మన వేళ్ళని ఏ దేవుడన్నా అమాంతంగా వచ్చేసి తెగనరికితే ఎంత బాగుండునో కదా అని మన పిల్లలు నిద్రలో కూడా కలవరించరు. మొట్టికాయలు వేసే మన మూసిన గుప్పిళ్ళని గుండ్రాయిల్తో చితక్కొడితే బాగుండునని వాళ్ళు పాపం అనుకోరుగాక అనుకోరు.
మన పిల్లలు మనల్ని ప్రేమిస్తూనే వుంటారు.
అయినా మన హింసాకాండ మనం మానం.
మన పిల్లలు మనకి ముద్దులిస్తూనే వుంటారు.
అయినా మన దంపుడుకాండ మనం మానం.
మన పిల్లలు మనల్ని ఆరాధిస్తూనే వుంటారు.
అయినా మన పోలీస్‌కాండ మనం మానుకోం.
మన పిల్లలు అమ్మా, నాన్నా అంటూ దగ్గరకు చేరతానే
వుంటారు. అయినా మన పచ్చడి కాండ మనం మానుకోం.
మన అలవాటుకాండ మానుకోంగాక మానుకోం.
అయినా మన పిల్లలు మనల్ని అభిమానిస్తూనే వుంటారు.
మనల్నేకాదు-చందమామ రావే, జాబిల్లిరావే అనే పాటల్ని, జో అచ్యుతానంద జోజో ముకుందా లాంటి జోల పాటల్ని, కాళ్ల గజ్జ కంకాళమ్మా, వేపాచెక్కా వెలగా మొగ్గలాంటి ఆటపాటల్ని, ఖలీల్‌ జీబ్రాన్ని, దేవేంద్ర సత్యార్థినీ, చింతా దీక్షితుల్నీ, నార్ల చిరంజీవినీ, రేడియో అన్నయ్య, అక్కయ్యల్నీ, నేదునూరి గంగాధరం, వేటూరి ప్రభాకరశాస్త్రినీ, చలం, శ్రీ శ్రీనీ, బి.వి. నరసింహారావు, బాపు, ముళ్లపూడి, ఆర్‌.కె. నారాయణ్‌నీ, బాల, చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లుల్ని ఇష్టపడుతూనే వుంటారు.
మరో చందమామయ్య కూడా వీళ్ల ఇష్టాల్లోకి వచ్చి కలిశాడు. ఆ మామయ్య పేరు గిజూభాయి. ఈయన గుజరాతీ భాషలో గుండెల్ని చీల్చుకుని  పిల్లలకోసం వచన కవితలో ఏడ్చారు. పిల్లల మీద ఈయన కున్న పిచ్చిని చూసి అక్కడివాళ్లంతా ఈయన్ని, ”మీసాల అమ్మ” అని ముద్దు ముద్దుగా, ప్రేమ ప్రేమగా, ఇష్టం ఇష్టంగా పిలుచుకుంటారట.
ఇది ఏ రూపంలో గుజరాతి, హిందీ భాషల్లోకి వచ్చిందో తెలియదుగానీ, మన రాష్ట్రంలోకి మాత్రం, ఇంగ్లీషులో ఫోల్డర్‌ కరపత్రంగా డా.ఎస్‌.ఆర్‌. పరిమిగారి ద్వారా వచ్చి పడింది. పిల్లల్ని కొట్టేవాళ్ళ చేతుల్లో పిడుగులా పడింది. ఈ చిచ్చర పిడుగు మనల్ని నిలుపునా కాలుస్తుంది. మనల్ని వుతికి ఆరేస్తుంది. మనల్ని వూపి పారేస్తుంది. మనం కుదేలయిపోతాం. మనం నేరస్థులమైపోతాం. మనం గిజుభాయి దెబ్బకి దొరికిపోతాం. మన పాప ప్రక్షాళనం కోసమైనా గిజుభాయి కవితని చదవాలి. ఆయన మెత్తటి చెప్పు దెబ్బల్ని ఆనందంగా అనుభవించాలి. ఆయన అక్షర లాఠీ విసురుల్ని వినాలి.
అప్పుడు మన చెంపల్ని మనమే వాయించుకుంటాం.
మన పిల్లల కళ్ళలోకి సూటిగా చూడలేకపోతాం.
మన పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరకి తీసుకోలేకపోతాం.
మన చిన్నారుల్ని గాఢంగా కౌగలించుకోలేకపోతాం.
అంటే మనం మనుషులం అయ్యామన్నమాట.
అవును తప్పకుండా అవుతాం.
అయి తీరుతాం.
అవ్వాలి కూడా.

పిల్లల పార్టీకి గిజుభాయి మానిఫెస్టో
అమ్మా నాన్నల ఆరో ప్రాణం ఈ చిన్నారి
మన ఇంటి అలంకారం ఈ చిన్నారి
మన ఇంటి ముందున్న తోటలోని శోభ ఈ చిన్నారి
మన కుటుంబానికి దీపం ఈ చిన్నారి
మన జీవితంలో నవ్వుతున్న మొలక ఈ చిన్నారి.
మన బాధని మర్చిపోయేట్టు చేసేదెవరు?
మన అలసటని పోగొట్టేదెవరు?
మన డొల్లతనం నుంచి కాపాడేదెవరు?
మన ఇంటిని బోసి నవ్వులతో నింపేదెవరు?
మన నవ్వుని కలకాలం నిలబెట్టేదెవరు?
మన చిన్నారే!
దేవుడ్ని చూడాలంటే చిన్నారిని ఆరాధించు.
సృష్టిలోకెల్లా చిన్నారే అద్భుతమైందీ, అమాయకమైందీను
మన పిల్లల అభివృద్ధి కదలికల్ని గమనిద్దాం
చిన్నారి స్వేచ్ఛగా వుండటానికి చేయూతనిస్తే
మొత్తం మానవజాతి శాంతిమార్గంలో పయనిస్తుంది.
చెప్పండి
ఎక్కడ ఆడుకోను?
ఎక్కడ గెంతను?
ఎవరితో కబుర్లు చెప్పను?
నేను మాట్లాడితే అమ్మకి అడ్డం
నేను ఆడితే నాన్నకి విసుగు
నేను గెంతితే కూర్చోమంటారు
నేను పాడితే నోరు మూసుకోమంటారు
చెప్పండి-
ఎక్కడికి వెళ్ళమంటారు?
ఏం చెయ్యమంటారు?
బుల్లి జేబురుమాలని బాబునే వుతుక్కోనివ్వండి
గ్లాసులో నీళ్లు, పాపనే పోసుకోనివ్వండి
పువ్వులు సర్దనివ్వండి
పళ్ళెం కడగనివ్వండి
గింజలు ఒలవనివ్వండి
అన్నం వడ్డించనివ్వండి
చిన్నారినే చెయ్యనివ్వండి
తన పద్ధతిలో తనని చెయ్యనివ్వండి.
తను కోరుకున్నట్టు తనని చెయ్యనివ్వండి
మన కళ్ళల్లో విషం వుందో, అమృతం వుందో
మన మాటల్లో మంచితనం వుందో, మలినముందో మన స్పర్శ
మెత్తగా ఉందో, మోటుగా వుందో
మన మనసు అణకువగా వుందో, అలక్ష్యంగా వుందో
చిన్నారి ఇట్టే పసికట్టేస్తుంది.
చిన్నారికి అంతా తెలుసు.
త్వరగా నిద్రపో
లేకపోతే బూచాడు ఎత్తుకెళ్ళిపోతాడు
అన్నం తినకపోతే దొంగలు పట్టుకుపోతారు.
అదిగో పులి
ఇదిగో దెయ్యం
అదుగదిగో పోలీసులు
అల్లరి చేశావంటే గదిలో పెట్టేస్తా
చదవకపోతే
వీపు చిట్లగొడతా
ఇలా చిన్నారిని భయపెట్టి బెదిరించే వాళ్లంతా
చిన్నారికి శత్రువులే
అసలు మనకి అర్థమవుతోందా?
చిన్నారి నవ్వే, జీవిత దరహాసమని
చిన్నారి ఏడుపే, జీవన దుఃఖమని
చిన్నారి నవ్వులో పువ్వులు వికసిస్తాయని
ఏడుపుతో పువ్వులు వడలిపోతాయని
మన ఇళ్ళల్లోకి చిన్నారి నవ్వుల తియ్యటి సన్నాయి తెచ్చుకునే
బదులు
ఏడుపు భేరీని ఎందుకు మోగిస్తాం?
మన చిన్నారికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తే
మనం ఈ భూమి మీదే స్వర్గాన్ని నిలబెట్టవచ్చు
మన చిన్నారి ఆనందంలో స్వర్గం వుంది
మన చిన్నారి ఆరోగ్యంలో స్వర్గం వుంది
మన చిన్నారి బాగులో స్వర్గం వుంది
మన చిన్నారి అమాయకత్వంలో స్వర్గం వుంది
మన చిన్నారి ఇష్టారాజ్యంలో స్వర్గం వుంది
మన చిన్నారి తీసే కూనిరాగంలో వుంది స్వర్గం
మన చిన్నారి పాటలో వుంది స్వర్గం.
చిన్నారి బుజ్జిగాడేగాని, ప్రాణం వున్నవాడు
చిన్నారి శరీరం పెరుగుతుంది
చిన్నిగాడి శక్తులు పెరుగుతున్నాయి
చిన్నారి ప్రాణం నిండయింది
ఈ గొప్ప ప్రాణాన్ని మనం గౌరవించాలి
మన పద్ధతుల్తో చిన్నారిని చెడగొట్టకూడదు
మన చిన్నారి సంపూర్ణమైన వ్యక్తి సుమా!
చిన్నారికి మనసుంది, బుద్ధి వుంది భావాలున్నాయి.
అర్థం చేసుకోగల శక్తి వుంది
చిన్నారికి బలమూ వుంది, బలహీనతా వుంది
ఇష్టాలూ వున్నాయి, అయిష్టాలూ వున్నాయి
తన కోరికలేమిటో తెలుసుకుందాం ముందు
తన భావాలేమిటో అర్థం చేసుకుందాం ముందు
చిన్నారి బుజ్జిదే కాదు అమాయకమైందీను
మన అహంకారంతో చిన్నారిని కాదనకూడదు
మన గర్వంతో చిన్నారిని అవమానించకూడదు
చిన్నారి తినగలదు-తినిపించకండి
చిన్నారి స్నానం చేస్తుంది- బలవంతం చెయ్యకండి
చిన్నారి నడవగలదు-తొయ్యకండి
చిన్నారి పాడగలదు-పాడేట్టు చెయ్యకండి
చిన్నారి ఆడుకోగలదు-జోక్యం చేసుకోకండి
చిన్నారికి అన్నీ సొంతంగా చెయ్యాలని వుంటుంది.
క్లబ్బుకి వెళ్ళే బదులు చిన్నారిని పార్కుకి తీసికెళ్ళండి
డబ్బా కబుర్లు కొట్టే బదులు చిన్నారిని జూకి తీసికెళ్లండి
పేపరులో మునిగిపోయే బదులు చిన్నారి చెప్పేది కాస్త వినండి
నిద్రపోయే ముందు కథలు చెప్పే చిన్నారిని హాయిగా బజ్జోపెట్టండి
చిన్నారిపట్ల ఆసక్తి చూపించండి
అమ్మానాన్న ప్రేమగా ఎక్కడైతే వుంటారో
పువ్వుల్లాంటి పిల్లలు, చుట్టూ ఎక్కడైతే ఆడుకుంటారో
తాము జాగ్రత్తగా వుంటూ పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కడైతే చూస్తారో
పెద్దవాళ్ళ దగ్గర్నుంచి ఎక్కడైతే పిల్లలు గౌరవం పొందుతారో
పనివాళ్ళ దయమీద పిల్లలు ఎక్కడైతే బతకరో
అదే అందమైన ఇల్లు
అవును, అది ఖచ్చితంగా అందమైన ఇల్లే!
మన గౌరవం నిలుపుకోవాలంటే చిన్నారిని మనం
గౌరవించాలి
అరిచే అలవాటు పోవాలంటే చిన్నారి మీద అరవకండి
హింస నుంచి, చెడు ప్రవర్తన నుంచి బయటపడాలంటే         చిన్నారిని
బాదకండి
మనల్ని మనం చక్కదిద్దుకుంటే చిన్నారి కూడా సహజంగా
మంచితనంలో పెరుగుతుంది
అమ్మానాన్న, మాస్టర్లూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే
లంచాలతోను, బెదిరింపులతో పిల్లలకి మంచి నడత
కలిగించలేమని
అప్పుడయ్యేది వాళ్ళు సర్వనాశనమే
బెదిరింపుల ద్వారా వాళ్ళని మొరటుగా చేస్తున్నాం
లంచాల ద్వారా వాళ్ళని దురాశాపరులుగా చెయ్యగలం
ఇవి పిల్లల్ని సిగ్గులేని స్థితిలోను, దయనీయమైన
స్థితిలోను వుంచుతాయి
అమ్మానాన్న వాళ్ల ఇష్టం వచ్చినట్టు వాళ్లు చేస్తూ
పిల్లల్ని మంచి ప్రవర్తనలో పెడదామనుకుంటే
వాళ్ళు పప్పులో కాలేశారన్న మాటే
ఇల్లు, అమ్మా, నాన్నే… బలమైన బడులు
ఇంట్లో చెడిపోయిన పిల్లాడ్ని దేవుడు కూడా రక్షించలేడు
మనం ప్రకృతి నుంచి చిన్నారిని దూరం చేస్తే
దానిలోని గుసగుసలు ఎలా తెలుస్తాయ్‌?
వెన్నెల వెలుగు, పారుతున్న ఏరు, చేలో మట్టి, పొలంలో గుడిసె
కొండమీది రాళ్ళు, స్వచ్ఛమైన గాలి, ఆకాశంలోని రంగులు
ఇవన్నీ చిన్నారికి ప్రకృతి ఇచ్చిన బహుమతులు
పిల్లలు బాగా తృప్తి పడేవరకూ ప్రకృతిలోని ఆనందాన్ని
అనుభవించనివ్వండి
ప్రతి నిమిషం చిన్నారి పెరుగుతున్నాడు
ప్రశ్నించే కళ్లు చిన్నారికి వున్నాయి
రకరకాల భావాల్ని తెలియజేసేది చిన్నారి హృదయం
పిల్లల వ్యాకరణం ప్రశ్నలతోను, ఆశ్చ్యర్యార్థకాల్లోను నిండి వుంది
దాంట్లో ఫుల్‌స్టాపులూ లేవు, కామాలూ లేవు
చైతన్యం తిరిగి జన్మించటమే చిన్నారి
పాముల్ని ఆరాధించే కాలం పోయింది
దెయ్యాల్ని పూజించే కాలం గడిచిపోయింది
రాతి విగ్రహాల్ని కొలిచే కాలం ఇక లేనే లేదు
పిల్లల్ని పూజించే కాలం ఇది
అమ్మానాన్న మధ్య తగవులు ఇంటిని పాడుచేస్తాయి
పిల్లల కష్టాలకి అవే కారణం అవుతాయి
పిల్లల బాగుకోసం పెద్దలు పొందిగ్గా వుండటం
నేర్చుకోవాలి
ఇంట్లోని ఆనందమే చదువులో ముందుకు వెళ్లడానికి ఆధారం
పిల్లలు ప్రేమతో నన్ను గౌరవించేవారు
నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు
వాళ్ళకి పాఠాలు చెబుతున్నప్పుడు నేనెంతో చదువుకున్నాను
మాస్టారుగా నేను నేర్చుకుంది ఏంటంటే
పిల్లలే నిజమైన మాస్టర్లని
ఇది కవిత్వం కాదండి
అనుభవం
పుస్తకాలు చదవటమే విద్య అనుకునేవాళ్లు
మాస్టర్లు అవుతారు
పిల్లల ద్వారా జ్ఞానం తెలుసుకోగలం అనేవాళ్లు
వివేకవంతులవుతారు
వివేకవంతులకి ప్రతి ఒక్క కుర్రాడు
ఓ అద్భుతం!
ఓ ప్రాణం వున్న పుస్తకం!!
లోకానికి నువ్వు అబద్ధం చెప్పగలవు
కానీ, చిన్న కుర్రాడితో అబద్ధం ఆడలేవు
ఎవరినైనా నువ్వు మోసం చెయ్యగలవు
కాని, పిల్లాడిని మోసపుచ్చలేవు
మామూలు మనుషుల దగ్గర విషయాల్ని దాయగలవు
పిల్లల దగ్గర నువ్వు దాయనే లేవు
చిన్నారికి అన్నీ తెలుసు
చిన్నారి ప్రతిచోటా వుంది
చిన్నారి అంతటా వుంది
ఈ బుల్లి దేవుడికి ఆరాధకుడిగా వుండు
నీ ఆరాధనలో ఏకాగ్ర మనస్కుడనై వుండు
నీ విజయంలో రహస్యం ఇదే సుమా!
మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు
పిల్లలగురించి చదవటం, ఆలోచించటం, రాయటం
సరిపోతుందా? సరిపోదు
కొత్త దేవాలయాల్ని నిర్మించాలి
వాటిల్లో సరస్వతిని, జ్ఞానాన్ని పునఃస్థాపించాలి
పిల్లల యుగం కొత్తగా మొదలైంది
మాటలతో సరిపోదు
మనం ఏదో ఒకటి చెయ్యాలి
మనం పనిలోకి దిగాలి
పిల్లలతో పనిచెయ్యడం కష్టం
పిల్లాడి ప్రవృత్తి అర్థం చేసుకోవడం అవసరం
గాఢమైన అనుబంధాన్ని, ఆరాధనని పెంచుకోవటం అవసరం
పిల్లాడ్ని నమ్మటం, ప్రేమించటం కష్టంతో కూడుకుంది
దానికోసం పైనుంచి కిందకి నువ్వు చెమట కక్కాల్సి వుంది
గంధం పొడికన్నా
సందులోని దుమ్మూ, ధూళి పిల్లాడికి ప్రియమైంది
అమ్మ ముద్దుకన్నా చక్కటి చల్లగాలి పిల్లాడికి ఇష్టమైంది
కౌగలింతకన్నా సూర్యకిరణాలే పిల్లాడికి అతి మెత్తనైనవి
పిల్లాడ్ని ఇంట్లో కొడుతున్నంతకాలం
బళ్ళో తిడుతున్నంతకాలం
నేను ఎలా విశ్రాంతి తీసుకోను?
పిల్లలకి ఆటస్థలాలు లేనంతకాలం
పనిచెయ్యటానికి తోటలు లేనంత కాలం
నేర్చుకోవటానికి స్థలాలు లేనంతకాలం
స్వేచ్ఛగా పెరగటానికి ఇళ్లు లేనంత కాలం
నేను ఎలా విశ్రాంతి తీసుకోను?
పిల్లలు ప్రేమా, ఆరాధనా పొందనంత కాలం
నేను ఎలా విశ్రాంతి తీసుకోను చెప్పండి?
పిల్లలు అందరు సమానమే
పిల్లల్లో అన్ని రకాల వాళ్ళు వుంటారు
పనికిరాని వాళ్ళు, గుడ్డివాళ్ళు, తెలివిగలవాళ్ళు, తెలివితక్కువ         వాళ్ళు
అందగాళ్లు, అందహీనులు, నల్లటివాళ్లు, తెల్లటివాళ్లు
ఇంకా- చురుకైనవాళ్లు, బొండాంగాళ్లు, అల్లరివాళ్లు
కొంటెపిల్లలు, దగాకోరులు కూడా వుంటారు
నిజమైన మాస్టారి దృష్టిలో పిల్లలంతా సమానమే
వాళ్ళందరూ దేవుడి పిల్లలే!
లక్షలాది పిల్లల్ని మురికి వీధుల్లో ప్రమాదకరమైన వీధుల్లో
అల్లరి చిల్లరిగా తిరగనిస్తామా? లేదు.
వాళ్లు సృజనాత్మకంగా కాలక్షేపం చెయ్యటానికి
మనం పిల్లలకి మంచి ఇళ్ళు ఏర్పాటు చెయ్యాలి
శరీరాన్ని, బుద్ధినీ అభివృద్ధి చేసుకోవటానికి
ప్రతి వీధి చివరా మంచి ఆటస్థలాలు వాళ్లకి అందించాలి
పిల్లల నిజమైన అభివృద్ధికి
మంచివి, తక్కువ ఖర్చుతో వచ్చేవి ఆటస్థలాలే
ఇది నా ఆలోచన
పిల్లల హక్కులు పునఃస్థాపించటానికి, నాకు బతకాలని వుంది
ఈ పనిచేస్తూనే నాకు చచ్చిపోవాలని వుంది.
మతం గురించి మాట్లాడుతూనో
సంప్రదాయ దుస్తులు వేసుకుని కర్మకాండ చేస్తూనో
పిల్లలకి మతైక దృష్టి కలిగించలేం
మతం పుస్తకాల్లోనూ, వ్యక్తుల్లోనూ లేదు
చచ్చిన పిడి సిద్ధాంతాల్లో లేదు
జీవితంలోనే వుంది
అమ్మా, నాన్న మాస్టర్లు ఇలా జీవిస్తూ వుంటే
సహజంగా పిల్లలు కూడా ఈ విద్య పొందుతారు.
నువ్వు దేవుడివి కాదు
పిల్లల దగ్గర నువ్వు దేవుడిలా నటిస్తావెందుకు?
నువ్వు అన్నీ తెలిసినవాడివి కావు
పిల్లల అజ్ఞానం చూసి నవ్వుతావెందుకు?
నువ్వు సర్వశక్తిమంతుడివికావు
పిల్లల నిస్సహాయత్వం చూసి నువ్వెందుకు విసుక్కుంటావు?
నువ్వు సంపూర్ణ మానవుడివి కావు
పిల్లల తప్పులు చూసి నువ్వెందుకు
కోపం తెచ్చుకుంటావు?
నువ్వు సంపూర్ణ మానవుడివి కావు
పిల్లల తప్పులు చూసి నువ్వెందుకు విసుక్కుంటావు?
ముందు నీవైపు నువ్వు చూసుకో
ఆ తర్వాత ఆ చిన్నారి వంక చూడు.
(నవంబరు 99-ఫిబ్రవరి 2000)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.