సామాన్య
(ప్రజలని అత్యంత ప్రభావితం చేయగల మాధ్యమం సినిమా. సినిమా నిర్మాణంలో ప్రభుత్వ ప్రమేయం అసలు లేకపోవడంచేత మన సినిమా ప్రస్తుతం కేవల లాభాపేక్షతో, మితిమీరిన హింస, శృంగారాలను రీళ్ల నిండుగా నింపుతున్నది. అంతేకాక, స్త్రీని భోగ్యవస్తువుగా నిలిపివుంచడంలోనూ, అనేక ఇతర వివక్షలను ప్రజల మనసులలోకి చొప్పించడంలోనూ విజయం సాధిస్తున్నది. సినిమా ఇట్లా కాకుండా ప్రజలకి వినోదంతోపాటూ గుణాత్మక, పరిణామాత్మక ప్రయోజనాలని అందించాలని ఒక బలమైన ఆకాంక్ష. ఆ ఆకాంక్షకి రూపమే ఈ ”సినిమా లోకం”. ఈ సంచిక నుండి సామాన్య కాలమ్ మొదలవుతుందని తెలియజేస్తూ…ఎడిటర్)
దాదాపు ఒకే సమయంలో విడుదలైన రెండు సినిమాలు ”కెమెరా మేన్ గంగతో రాంబాబు”, ”తుపాకి” (తమిళ అనువాదం). కెమెరామేన్ గంగతో రాంబాబు (ఇకపై కె.గం. రాం.) ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రధాన కథగానూ, స్త్రీ నడవడిక, నియమాదులను ఉపకథగానూ చర్చి స్తుంది. ‘తుపాకి’ సినిమా ఉగ్రవాదాన్ని గురిపెడుతుంది.
ఫలానా చారిత్రక అంశాన్నో, చర్చ నీయ అంశాన్నో సినిమాగా మలచడం పాశ్చాత్య దేశాలలో కద్దు. అందుకుగాను వారు ఏళ్ళ తరబడీ, పరిశోధనలు జరుపుతారు. కానీ, ఆ సాంప్రదాయం మనకు భారతదేశంలో అందునా దక్షిణ భారతదేశంలో లేదనే చెప్పవచ్చు. మన సినిమా తాత్కాలిక ఉద్రేకాలను ఇంకా రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే ధోరణిలోనే నడుస్తుంది. ఈ సినిమాలు అందుకు మినహాయింపు కాదు.
కె.గం.రాం సినిమా ప్రధాన స్రవంతి పురుషుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అసమంజసమైనదనీ, వారి ఆరోపణలు అసత్యాలనీ రీలు రీలులోనూ హేళనపరుస్తూ, వ్యాఖ్యానిస్తూ వస్తాడు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అన్నీ తానే అయిన దర్శకుడు, ప్రఖ్యాతి గాంచిన ”మలయాళీ నర్సులనూ, పంజాబీ దాబాలనూ” ఉదహరిస్తూ, వారిని రాష్ట్రం వదిలి వెళ్లిపొమ్మంటున్న ఉద్యమం తలకాయ లేని, నీతి లేని ఉద్యమమనే భావాన్ని ప్రేక్షకుల్లో కలిగించడానికి ప్రయత్నిస్తాడు.
హింస, ఆస్తుల విధ్వంసం అతితక్కువ పాళ్ళలో వుండటం తెలంగాణ ఉద్యమం ప్రత్యేకత. మిగిలిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలని (మిజోరామ్, నాగాల్యాండ్, మేఘాలయ వంటివి) పరిశీలించి చూస్తే మనకీ విషయం తేటతెల్లమవుతుంది. కానీ దర్శకుడు ఆ సత్యాన్ని వక్రీకరిస్తూ ఉద్యమకారణంగా వందలకొలది మనుషులు చచ్చిపోయారనీ, అనేకంగా ఆస్తులు విధ్వంసం జరిగిందనీ ”ఇది ఉద్యమం కాదు అరాచకం” అని ప్రేలాపిస్తాడు.
తుపాకి సినిమా కూడా మొత్తం ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడమనే అంశం చుట్టూ తిరుగుతుంది. విలన్లందరూ ముస్లిములే. అసలు ఉగ్రవాదానికి మూలమైన ఆకాంక్షలేమిటో, కొద్దిమంది ముస్లిములను ”స్లీపింగ్ సెల్స్”గా మార్చిన పరిస్థితులేమిటో, అందుకు పరిష్కారాలేమిటో ఆ సినిమాకి సంబంధం లేదు. కసబ్‌లాంటి టీనేజ్ కూడా దాటని కుర్రవాడు ఉగ్రవాది కావడానికి అపరిమిత పేదరికం కూడా కారణమేమో వంటి పునాది అంశం, మానవీయకోణం, అందులో వెతికినా కనిపించదు. కేవలం ఉద్రేకపరచడం, విషం నూరిపోయడం ప్రాతిపదికగా నడిచే ఈ సినిమాని ప్రభుత్వం ఎందుకు అనుమతించాలి? మనతో కలిసిమెలిసి జీవిస్తున్న భారతీయ ముస్లిముల మనోభావాలను పదేపదే గాయపరిచే హక్కు మనకేం వుంది అనే ప్రశ్నలకి ఎవరు సమాధానమిస్తారు? వీరికి సినిమా కొత్త కథతో నడపటం, డబ్బు సంపాదించి పెట్టడంతోనే సంబంధం.
మళ్ళీ కె.గం.రాంకి వస్తే ఈ దర్శకుడు చర్చించిన మరో అంశం స్త్రీ. సావిత్రీబాయి ఫూలే మొదలుకుని నేటి స్త్రీవాదుల వరకూ, నాటి సంస్కర్తల నుండీ, నేటి అభ్యుదయవాదుల వరకూ ఎంతో శ్రమించి భారతీయ స్త్రీ హృదయానికి వెలుగునీ, మెదడుకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ దర్శకుడు ఇప్పటి స్త్రీని వెనక్కి, తిరిగి అంధకారంలోకి నడవమంటాడు.
స్త్రీ పురుషుడికంటే తక్కువ కాదని భావించే నేటి స్త్రీకి ప్రతినిధిగా తన నాయికని సృష్టిస్తాడు దర్శకుడు. ఆ నాయిక తనను తాను కెమెరామేన్ (విమెన్‌గా కాదు)గా పిలుచు కుంటూ, తాను ”ఎక్స్ట్రార్డినరీ”ననే ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వుంటుంది. దర్శకుడు తనకు నకలు అయిన నాయకుడు లేదా ప్రధాన స్రవంతి పురుష ప్రతినిధి చేత నాయికకి ఆడతనాన్ని బాగా ప్రదర్శించమనీ, సిగ్గుపడమనీ, చీటికిమాటికి ఏడవమనీ, తద్వారా మగవాళ్ళని ఆకర్షించి ”బాగా (మగవాళ్ళ) ట్రాఫిక్ని పెంచుకోమనీ” బోధిస్తాడు.
అసలు ఆడది ”ఆర్డినరీ”గా ఉంటేనే పురుషుడికి బాగా నచ్చుతుందనీ, ప్రతి ఆడదీ ఆర్డినరీగా ఉండాలనీ సెలవిస్తాడు నాయకుడు. నాయిక పాపం నాయకుని పైన వున్న అలవికాని ప్రేమచేత ఆర్డినరీగా ఉండటానికి తలవంచి ”నువ్వు మాత్రం ఎక్స్ట్రార్డినరీవే” అంటుంది నాయకునితో. నాయకుడు వినమ్రతకో, మరొకందుకో అయినా మనందరం ఆర్డినరీలమే అనడు. బోర విరుచుకుని ”గుండెల్లో గుచ్చేసే మాటన్నావ”ని చాలా సంతోషపడి ఆ మరుసటిక్షణంనుండీ ఆ పిల్లని ప్రేమించేస్తాడు.
ఎస్.సి.,ఎస్.టీ., బీసీల మధ్య వివా దాల్ని తీర్చేందుకు ఎవడో ఒకడు కర్ర పట్టుకురావాల్సిన స్థితిలో ఇవాళ వారు లేరనే కనీస అవగాహన కూడా లేదు ఈ దర్శకుడికి. తమ తరువాత దాదాపు వందేళ్ళకి వచ్చిన ఈ సినిమాని గురజాడ, చలం, వీరేశలింగం, పెరియార్ వంటివాళ్ళు చూడాల్సి వస్తే కంటికి కడివెడు కన్నీళ్లు పెట్టుకుందురేమో. అంతవరకూ ఎందుకు ఇటువంటి సినిమా చూసినందుకూ, ఇటువంటి సినిమాలే చూడాల్సి వస్తున్నందుకు మనమీద మనం జాలిపడక మానం.