సామాన్య
ఒకసారి మాటల సందర్భంలో నా రీసెర్చ్ గైడ్ కే.కే. రంగనాథాచార్యులు గారు ఇరానియన్ ఫిల్మ్స్ గురించి ప్రస్తావిస్తూ అద్భుతమనో అట్లాంటిదో ఒక మాట వాడారు. అప్పటికి నేను చూసిన ఒకే ఒక ఇరాని ఫిల్మ్ చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్. ఒక సేయింగ్ ఉంది కదా అన్నం ఉడికిందని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలని….. వారు అన్న ఆ మాట అక్షరాలా నిజమని చెప్పడానికి ఈ మూవీ ఒక్కటే సరిపోతుంది.
సినిమా చూస్తుంటే మనం ఒక సినిమా చూస్తున్నామని అనిపించదు. మొదట మన చుట్టూ ఒక దేశం ఆవరిస్తుంది. ఆ దేశంలో ఒక చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలోని ఒక పేద అమ్మానాన్న, వారి పిల్లలు. ఆ పిల్లల జీవితంలోని కొన్ని రోజులు ….. ఆ కొన్ని రోజులు పిల్లవాడు పెట్టిన ఒకటే పరుగు…. అందులో లీనమై పోయి మనకి మనం ఉండని మనం…. ఆ సినిమాలో భాగమైపోతాం, దిగులు పడిపోతాం. అంతలా మేజిక్ చేస్తుందీ మూవీ.
వైయక్తికంగా మనుషులం మనం, చాలా సున్నితులం. హృదయపూర్వకంగా స్పందిస్తాం. సమిష్టిలోకి వచ్చేసరికి మన స్వభావాలు అనేక ప్రభావాల చేత కలుషితమవుతాయ్. అపనమ్మకాలను ఏర్పరుచుకుంటాయ్ …. కదా? మంచి మూవీని చూసేప్పుడో, మంచి సాహిత్యాన్ని చదివినప్పుడో చూడండి ఎంతలా కదిలిపోతామో. నిజానికి అదే మానవ సహజ స్థితి. మసక బడ్డ ఆ సహజతను కదిలించగలిగినదే మంచి సినిమా లేదా మంచి సాహిత్యం లేదా మరోటీ…. అంతలా మన సహజాతాలను కదిలిస్తుంది ఈ మంచి సినిమా.
పెద్దవాళ్ళం అయిపోయాక అనేక రకాలుగా మనల్ని మనం అదుపు చేసుకుంటాం కదా, పైకి ఏడవలేం కదా. కానీ అప్రమేయంగా ఉబికే కన్నీళ్ళని ఏం చెయ్యగలం. మూవీచూస్తున్నప్పుడు అలా ఊరిన రహస్యపు కన్నీళ్ళతో హృదయం తడిసి ముద్దై, బరువెక్కిపోతుంది. బరువెక్కిన హృదయం ఒక అందమైన అనుభూతిని మిగుల్చుతుంది. ఈ చిత్రం మీ జ్ఞాపకాలలో ఉన్నన్ని రోజులూ మీరీ బరువుని మోయాల్సిందే, తప్పదు.
అలీ, జాహ్ర అన్నా చెల్లెళ్ళు. ఒకసారి చెల్లి బూట్లు రిపేర్ చేసి తీసికోస్తూ మధ్యలో కూరగాయలు కొనటానికి ఆగుతాడు అలీ. అంగడి దగ్గర పక్కనే పెట్టుకున్న ఆ బూట్లు అదృశ్యమవుతాయ్. అమ్మనాన్నకి ఏం చెప్పాలి. చెల్లిని రిక్వెస్ట్ చేస్తాడు, అమ్మ వాళ్లకి చెప్పొద్దని. ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ చర్చించుకునే తీరు ఎంత ముద్దుగా ఉంటుందో. అలా చర్చించి ఒక ఒప్పందానికొస్తారు అప్పటి నుండి మొదలవుతాయ్ ఆ పిల్లాడి కష్టాలు.
మొదట చెల్లి బూట్లు వేసుకుని బడికి వెళ్తుంది. తరువాత వాటినే వేసుకుని పిల్లాడు మధ్యాన్నం స్కూలుకి వెళ్ళాలి. సమయాలు మేనేజ్ చేయాలి. యెట్లా చేయడం. అది మొదలు ఆ పిల్లాడికి ఒకటే పరుగు సినిమా అంతా పరుగే. అంతలా పరిగెట్టినా లేటై హెడ్ మాస్టర్‌కి దొరికిపోతాడు. రెండు సార్లు క్షమించి మూడోసారి నువ్వింక స్కూల్‌కి రాకంటాడు హెడ్ మాస్టర్. మధ్యలో క్లాస్ టీచర్ జోక్యంతో వాడు ఆ సమస్య నుండి బయట పడతాడు.
ఇంతలో చెల్లి తన బూట్లు ఒక పిల్ల వేసుకొని ఉండటం గమనిస్తుంది. అన్నా చెల్లి కలిసి ఆ పిల్ల ఎవరు యెక్కడ అని పరిశోధన మొదలుపెడతారు. ఆ పాప తండ్రి అంధుడనీ, వారూ పేద వారని తెలుసుకుని మరిక ఆ పిల్లతో బూట్ల విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు.
బడిలో అంతర్ స్కూళ్ళ పరుగు పందాల కోసం పేర్లు ఇవ్వమని అడుగుతారు. మొదట అలీ ఆ విషయాన్ని పట్టించుకోడు. అనుకోకుండా బహుమతుల వివరాలు చదివిన తరువాత ఆ పిల్ల వాడికి ఆశ కలుగుతుంది. అందులో మూడో బహుమతి ఏదో వెకే షనూ, ఒక జత కేన్వాస్ షూసు. అప్పటికే పేర్లు తీసేసుకోడం అయి పోయి ఉంటుంది. వీడు వెళ్లి టీచర్ని బ్రతిమాలుతాడు, తను ఎంత వేగంగా పరిగెత్తగలడో చూపుతాడు. ఈ మధ్య బాగా పరిగెత్తిన ప్రాక్టీస్ ఉంటుంది కదా. అంచేత టీచర్ని మెప్పించగలుగుతాడు.
పరుగు పందెం మొదలవుతుంది. సంపన్నులైన అమ్మ నాన్నలు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తారు. ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటారు. వీడికి వీడి లక్ష్యమే తోడు… పోటీలో గెలిచి చెల్లికి షూస్ ఇవ్వాలి అంతే. వాడి ఏకాగ్రత అంతా ఆ మూడో బహుమతి పైనే.
చివరి వరకూ బాగానే పరిగెడతాడు. ఆఖరి నిముషానే విపరీతమైన వత్తిడికి లోనవుతాడు. దురదృష్టం, పాపం వాడికి మొదటి బహుమతి వచ్చేస్తుంది. విజయంతో ఉప్పొంగి టీచరు వాడ్ని భుజాల పైన ఎక్కించుకుని తిప్పుతాడు. పేపర్ల వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. అందరి దృష్టీ వాడి పైనే, కానీ చుట్టూ ఏం జరుగుతున్నా వాడి ముఖంపైకి వెలుగేరాదు. వాడికది పెద్ద షాక్, చెల్లికి ఏం చెప్పాలీ. దిగులు పడతాడు. మనకేమో ఏడుపొచ్చేస్తుంది. అందుకేనేమో దర్శకుడు మాజిద్ మజిది మనందరి పై జాలి పడి అందమైన ఆఖరి దృశ్యంతో మూవీని ముగించాడు. ఆ దృశ్యం… ఇంటికొస్తున్న అలీ నాన్న సైకిల్ వెనకాల ఉన్న కొత్త బూట్ల జతలు. పిల్లలకి చూపించాల్సిన సినిమాల ఎంపికలో చేర్చుకోడానికి సర్వ లక్షణ లక్షితమైన మూవీ ఇది. చూపించండి, చూడండి.