ఒరియా మూలం : పారమితా శత్పథి
అనువాదం : ఆర్. శాంతసుందరి
”ఏయ్ చెప్పు. చెప్పకపోతే ఊరుకోను.”
సేవతి అలాగే తలవంచుకుని నిలబడింది.
”నిన్నే అడిగేది, వినిపించటం లేదా? నావైపు చూడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? తలెత్తి చూడు, ఊ!” సుమిత్ర కోపంగా అరిచింది. కుడిచేతిలో లాఠీ మీద పిడికిలి మరింత బిగిసింది. మొహం జీవురించింది.
సేవతి తలెత్తింది. అలవోకగా సుమిత్ర మొహంవైపు చూసింది. కానీ కోపంగావున్న ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక మళ్ళీ తలొంచుకుంది.
”ఇలా చెపితే వినే రకం కాదిది… దీనికి…” అంటూంటే మాలిని అడ్డొచ్చి, ”ఇలా ముంగిలా ఉంది గాని చాలా మొండిఘటం. మొదటిరోజు చూసినప్పుడే నాకు అర్థమైంది,” అంది. ఆమె స్త్రీ ఖైదీల మానిటర్. అందరిమీద వ్యంగ్యబాణాలు వదిలే అధికారం ఉందామెకి.
వీళ్ళు ఇన్ని మాటలంటున్నా సేవతి మొహంలో ఎలాటి భావమూ కనిపించలేదు. కాళ్ళు రెండూ నేలలో కూరుకుపోయినట్టు అలా నిలబడే ఉంది.
”చెప్పి చావవేం, వెధవపని చేశావు కదా? ఇప్పుడు దాన్ని దాస్తే ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్పేస్తే మేడం ఏమైనా కాస్త కరగచ్చు,” సేవతి దగ్గరకి వెళ్ళి చెవిలో రహస్యం చెప్పినట్టుగా అంది మాలిని. కానీ ఆమె గొంతు కరకుగా ఉంటుంది. ఆ మాటలు సుమిత్ర విననే వింది.
సేవతి అలాగే రాతిబొమ్మలా నిలుచుంది. తల ఎత్తైనా చూడలేదు.
”చెప్తావా లేదా? ఎవరు చేశారీ పని?” సూటిగా అడిగింది సుమిత్ర.
సేవతి దగ్గర్నించి జవాబు లేదు. కోపం, రోషం తన్నుకొచ్చాయి సుమిత్రకి. ”ఎంత తలపొగరే నీకు!” అంటూ లాఠీతో సేవతి నడుం మీద బలంగా కొట్టింది.
”అబ్బా!” అంటూ అరిచిందే కాని సేవతి తలెత్తలేదు. ఆ దెబ్బకి ఆమె తట్టుకోలేకపోయింది. కళ్ళు తేలేసినట్టుగా అయింది మొహం.
సుమిత్రకి భయం వేసింది. మూడోనెల అని డాక్టరు చెప్పింది. ఏమైనా జరగకూడనిది జరిగితే? అనుకుంది మనసులో. ”రేపు జైలరు వస్తే ఆయనే చూసుకుంటాడు నీ సంగతి. ఆయన అడగాలి, నేను తమాషా చూడాలి. అప్పుడు ఎలా చెప్పవో చూస్తా!” అనేసి అక్కణ్ణించి వెళ్ళిపోయింది సుమిత్ర.
సేవతిని విడిగా ఒక గదిలో పెట్టారు. ఈ విషయం అటో ఇటో తేలనంతవరకూ, నిజం తెలిసేంతవరకూ సేవతి ఇక్కడే ఉండాలి. సేవతిని లోపల పెట్టి తాళం వెయ్యగానే ఆమె గదిలో ఒక మూల నేలమీదే పడుకుండిపోయింది. బాగా అలిసిపోయినందువల్లో, నడుం మీద తగిలిన దెబ్బ నొప్పి పెట్టడంవల్లో కాదు, ఇలా మాటిమాటికీ వాళ్ళు ప్రశ్నలు వేసి చంపేస్తూంటే భరించలేకపోతోంది. బాగా డీలా పడిపోతోంది.
స్త్రీల సెల్‌లో అందరూ రహస్యంగా ఏమిటో మాట్లాడుకుంటున్నారు, ”దీని మొగుడు ఆరునెలలుగా జైల్లో ఉన్నాడు. హత్యానేరం కింద అరెస్టు చేశారతన్ని. కానీ దీని యవ్వారం చూడండే, మూడునెలల కడుపుతో ఎంత సిగ్గులేకుండా తిరుగుతోందో? అదీ జైల్లో ఉంటూ!”
ఈ విషయం సురేష్‌కి కూడా తెలిసిపోయింది. మొదట అతను నమ్మలేదు. పెళ్ళాన్నే నేరుగా అడిగే వీలులేదు. నెమ్మదినెమ్మదిగా ఈ వార్త అతనికి శాంతి లేకుండా చెయ్యసాగింది. సేవతి ఇలాటి పని ఎలా చేసింది? ఎక్కడికన్నా పారిపోవాలనీ, ఎందులోనన్నా దూకి చావాలనీ అనిపించిందతనికి. ఎలాగూ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అసలు ఎక్కువకాలం బతకాలన్న కోరిక ఎప్పుడో చచ్చిపోయింది. సేవతి ఎప్పుడూ, ”మనం పైకోర్టులో అపీల్ చేద్దాం. మంచి లాయర్ని చూసి నిన్ను విడిపించుకుంటాను. అంతవరకూ కాస్త ధైర్యంగా ఉండు,” అనేది. కానీ ఆలోచించినకొద్దీ అలా తనకోసం ఆందోళనపడే సేవతి అలాటి పనిచేసి ఉంటుందని నమ్మకం కలగలేదు. ఊహించుకోడానికి కష్టమనిపించింది. కళ్ళు మూసుకుని, తల పట్టుకుని అక్కడే కూలబడ్డాడు సురేష్. మూసుకున్న కళ్ళకి అతని ఊరు, ఊళ్ళో తమ ఇల్లూ అన్నీ కనిపించసాగాయి. చిన్న ఇల్లు…ఒక గదీ, వంటిల్లూ, ఆవరణలో బావి. బావి పక్కన సేవతి నాటిన తీగ కిటికీ మీదికి పాకింది. దాని పచ్చని ఆకుల్ని సేవతి మైమరచి చూస్తూ ఉండిపోయేది. అది గుర్తొచ్చింది సురేష్‌కి.
సేవతి! ఎంత ప్రాణప్రదంగా ప్రేమించాడు ఆమెని! మొదటిసారి సేవతి తన నీలం స్కర్టూ, తెల్ల చొక్కా వేసుకుని స్కూల్‌నించి ఏదో ఆలోచిస్తూ వస్తూ కనబడింది. గుండెలకి పుస్తకాలు హత్తుకుని ఎటో చూస్తూ నడుస్తోంది. అవసరం లేకపోయినా గట్టిగా ఆటో హారన్ వేశాడు సురేష్. ఉలిక్కిపడి తలతిప్పి చూసింది సేవతి. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. అప్పుడు ఎనిమిదోక్లాసు చదువుతోంది తను. పెళ్ళయాక ఆ సంఘటన గుర్తుచేస్తే తనకి అంత సరిగ్గా గుర్తులేదంది సేవతి. సురేష్ మొహం ముడుచుకున్నాడు.
అవన్నీ తనకి అంత బాగా గుర్తుండడం చూసి తనే ఆశ్చర్యపోయాడు. జీవితఖైదు శిక్ష పడ్డప్పట్నించీ అతనికి గతం అదే పనిగా గుర్తు రాసాగింది. జైల్లో మొక్కలకి నీళ్ళు పొయ్యాలన్న విషయం జ్ఞాపకం రాగానే అతను లేచాడు. నీళ్ళుపోస్తూ మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయాడు.
సేవతికి ఇంకొకరితో పెళ్ళి నిశ్చయమైందని తెలిసి అతను పిచ్చివాడయిపోయాడు. ప్రభుత్వ కార్యాలయంలో డ్రైవరు పనిచేస్తూ నెలనెలా జీతం తెచ్చుకునే ఆ మనిషి త్వరలోనే పర్మినెంట్ అవుతాడని కూడా విన్నాడు. ఆ రోజు అతనికి అన్నం నీళ్ళూ సయించలేదు. ఇన్నాళ్ళూ సేవతితో, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’, అని చెప్పనందుకు తనని తాను తిట్టుకున్నాడు. ఎందుకు జంకాడో తెలీదు. సేవతి చేసుకోబోయేది తనలాంటి డ్రైవర్నే కదా? నిజమే తను ఆటో నడుపుతాడు, ఆ రెండో వ్యక్తి గవర్నమెంట్ కారు నడుపుతాడు. కానీ తనది సొంత ఆటో! ఆ తరవాత కట్నం దగ్గర పేచీ వచ్చి సేవతి పెళ్ళి రద్దయిందన్న వార్త విన్నాడు. చాలా సంతోషించి, ఈసారి ఎలాగైనా సేవతికి మనసులో మాట చెప్పెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కానీ సేవతి చేసిన పని చూసి నిర్ఘాంతపోయాడు. సేవతి తన చెల్లెలి ద్వారా స్కూల్ గేటు దగ్గరకి రమ్మని అతనికి కబురు పెట్టింది. ”సురేష్, నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగింది అతన్ని చూడగానే. తన కోరిక ఇంత సులభంగా తీరుతుందని అతను కల్లో కూడా అనుకోలేదు. ఈ లోకంలో అన్నిటికన్నా విలువైనది దొరికినట్టు ఉబ్బితబ్బిబ్బయాడు. కానీ వెంటనే తేరుకుని జవాబు చెప్పలేకపోయాడు. చివరికి, ”కాస్త మంచి ఇల్లు చూసుకుని…” అని అతను ముగించే లోపల సేవతి, ”ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ ఇల్లు చాలు నాకు,” అంది.
సేవతి తండ్రీ, అన్నా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. సరైన ఇల్లు కూడా లేనివాడికి పిల్లనెలా ఇస్తాం అన్నారు. పైగా అతని తల్లెవరో, తండ్రెవరో ఏమీ తెలీదు. అతనికి ఎవరూ లేరు. కానీ వాళ్ళేమయారో కూడా అతనికి తెలీదు. బొత్తిగా తాడూ బొంగరం లేని శాల్తీ.
సేవతి అతన్ని మళ్ళీ ఒంటిగా కలుసుకుని, ”వీలైతే మా నాన్నకి కొంత డబ్బు తెచ్చియ్యి,” అంది.
అదే రోజు రాత్రి సురేష్ పదివేలు తెచ్చి సేవతి పేర వెయ్యమని ఆమె తండ్రికిచ్చాడు. ఆ ఏడాది దీపావళి వెళ్ళగానే సేవతి పెళ్ళి సురేష్‌తో జరిగిపోయింది. సురేష్ తన సెకండ్‌హ్యాండో ఆటో తాకట్టుపెట్టి ఆ పదివేలూ తెచ్చాడు. అతని చిన్ననాటి క్లాస్‌మేట్, సేఠ్ దగ్గరే ఆటో తాకట్టు పెట్టాడతను. సురేష్ చదువు ఏడో క్లాసుతో ఆగిపోయింది. సేఠ్ పదో క్లాసు పాసయాడు.
అప్పుడప్పుడూ స్నేహితులతో కూడలి దగ్గర కలిసే సురేష్ పెళ్ళయాక అటుకేసి వెళ్ళడమే మానేశాడు. ఒక ఆటో అద్దెకి తీసుకుని రోజంతా నడిపి పొద్దుగూకగానే ఇంటికి త్వరగా వెళ్ళాలని బైలుదేరేవాడు. సేవతి తోటిదే లోకమన్నట్టు ఉండేవాడు. స్నేహితులు ఎంత ఆటపట్టించినా దులిపేసుకునేవాడు.
సురేష్ సంపాదన వాళ్ళ అవసరాలకు బొటాబొటిగా సరిపోయేది. తన ఆటో ఎలా విడిపించుకోవాలా అని మథనపడేవాడు సురేష్. సేఠ్ వాళ్ళింటికి వడ్డీ వసూలు చేసుకోడానికన్న సాకుతో తరచూ వచ్చి, వాళ్ళ అరుగుమీదున్న పాత కుర్చీలో కూర్చుని సేవతితో కబుర్లు చెపుతూ ఉండేవాడు. అలా ఆరునెలలుగా అతను వడ్డీ వసూలు చేస్తున్నాడు. త్వరగా అసలు చెల్లించి ఆటో తీసుకెళ్ళమనీ, లేకపోతే దాన్ని ఇంకెవరికైనా అద్దెకిచ్చేస్తాననీ అనడం మొదలెట్టాడు. బండి అన్నాళ్ళు నడపకుండా ఉంటే పాడైపోతుందనీ, ఆ తరవాత ఎందుకూ పనికిరాదనీ సురేష్‌కి తెలుసు, కానీ దాన్ని ఇంకెవరికో ఇస్తాననడం సురేష్ భరించలేకపోయాడు. సురేష్ చీటికీమాటికీ విసుక్కోసాగాడు. సేవతికోసం అతను కన్న బంగారుకలలన్నీ చెదిరిపోయాయి. ఒక కొత్త చీర కొనిద్దామన్నా, ఆమెని తీసుకుని ఎక్కడన్నా తిరిగి వద్దామన్నా, ఏదైనా ఒక డాబాలో చికెన్ కర్రీ తినిపిద్దామన్నా జేబులో డబ్బులుండేవి కావు. మంచం, గ్యాసు, చిన్నదైనా ఒక టీవీ కొనుక్కోవాలన్న అతని కల కలగానే మిగిలిపోయింది.
”ముందు ఆటో విడిపించుకుందా,” అంది సేవతి.
”నేనూ అదే అనుకుంటున్నాను, కానీ ఎలా?” అన్నాడు సురేష్ నిస్పృహగా.
”ఇంకాస్త పొదుపు చేద్దాం. ఇంటిఖర్చు ఇంకా తగ్గిస్తే సరి. వీటిని తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బిచ్చి ముందు ఆటో విడిపించుకు రా. ఆటో నడిపి సంపాదించే డబ్బు కొద్దికొద్దిగా సేఠ్‌కి ఇచ్చి అప్పు తీర్చేద్దాం,” అంది సేవతి, తనకున్న ఒకే ఒక బంగారు నగ, చెవిరింగులు తీసిస్తూ.
ఆ తరవాత వినిపించీ వినిపించకుండా, ”ముందు మన పరిస్థితి బాగుపడ్డాక మనం పిల్లలు కనడం విషయం ఆలోచిద్దాం,” అంది.
సేవతి తెలివితేటలకి సురేష్ నిర్ఘాంతపోయాడు, ఆమెవైపే చూస్తూ ”అలాగే,” అన్నాడు.
సేఠ్ ఆ చెవి రింగులకి మూడువేలిచ్చాడు, కానీ ఆటో తనదగ్గరే ఉంచేసుకున్నాడు. ఇంకొక అయిదువేలిస్తేగాని ఆటో ఇవ్వనని అన్నాడు. సురేష్ ఎంత బతిమాలినా వినలేదు. ”చూడూ, నా భార్య పిల్లాణ్ణి తీసుకుని వాళ్ళ పుట్టింటికెళ్ళింది. ఇంట్లో మా నాన్నా, తమ్ముడూ, నేనే ఉన్నాం. వంట చేసుకోడం కష్టమౌతోంది. ఒక నాలుగురోజులు వంట చేసేందుకు మీ ఆవిణ్ణి పంపించు. పగలంతా ఎలాగూ నువ్వు ఇంట్లో ఉండవుగా?” అన్నాడు సేఠ్.
సేఠ్ మాట పూర్తిచెయ్యకముందే సురేష్ అతనివైపు కోపంగా చూశాడు.
”సర్లే, ఆటో తీసుకెళ్తానంటావు, అంతేనా? తీసుకెళ్ళు, పో!” అన్నాడు సేఠ్.
ఇంకో మాట మాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు సురేష్.
మర్నాడు ఆటో నడుపుతున్నాడన్నమాటే గాని సురేష్ మనసు మనసులో లేదు. మధ్యాన్నమయేసరికి ఇక భరించలేకపోయాడు. ఆ రోజెందుకో మాటిమాటికీ సేవతి గుర్తురాసాగింది. స్నానం చేసి గదిలోకి రాగానే సేవతి ఒంటినుంచి వచ్చే సువాసన, ఎండలో బట్టలు ఆరేసేప్పుడు తళతళలాడే ఆమె మొహం, వంట చేస్తూ అటూ ఇటూ వంగేప్పుడు చీరెకీ జాకెట్టుకీ మధ్య కనిపించే ఆమె పొట్టా, వీపూ అదేపనిగా గుర్తురావడం మొదలెట్టాయి. ఇక ఆగలేక ఆటో ఇంటివైపు మళ్ళించాడు.
”అలాగంటే ఎలా చెప్పు. సురేష్‌కి నువ్వే నచ్చజెప్పాలి. ఇదేమంత పెద్ద విషయమని? ఈరోజుల్లో అందరూ చేసేదే కదా? మరి డబ్బు అప్పనంగా ఇస్తారా ఎవరైనా? నిన్ను వదినా అని పిలుస్తున్నానా లేదా? మన ప్రాంతంలో ఉన్న ఆనవాయితే… మరిదిగా నాకూ నీమీద హక్కు ఉందని ఒప్పుకుంటావా?” సగం తెరిచి ఉన్న తలుపు అవతలినించి సేఠ్ గొంతు వినిపిస్తోంది. సురేష్ ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయాడు. బైట ఒక జత చెప్పులుంటే వాటికేసి చూస్తూ ఉండిపోయాడు.
”ఆయన రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను. ఇక మీరు వెళ్ళండి,” సేవతి మర్యాదగా అనడం వినపడింది.
”ఏం కొంతసేపు ఇక్కడే ఉంటే నీకేమన్నా ఇబ్బందా? ఎప్పుడూ నీకోసమేగా పరిగెత్తుకొస్తూ ఉంటాను! నేవచ్చేది పైసలకోసం అనుకుంటున్నావా? నువ్వుంటే ఇంక డబ్బెవరిక్కావాలి? నా గురించి కూడా ఎప్పుడైనా కాస్త ఆలోచించు మరి!” సేఠ్ గొంతు స్పష్టంగా వినిపిస్తోంది సురేష్‌కి.
”లేదు… ఇదంతా ఏమిటి? వదలండి నన్ను… వెళ్ళిపోండి ఇక్కణ్ణించి… చెప్పిన మాట వినండి… వదలండి” సేవతి ఆందోళనగా గొంతు పెంచి అంటోంది.
సురేష్ ఇంక తమాయించుకోలేకపోయాడు. తలుపుని ఒక్కతోపుతోసి లోపలికొచ్చాడు. సేఠ్ సేవతి రెండుచేతల్నీ గట్టిగా పట్టుకుని, బలవంతంగా తన కౌగిట్లోకి లాక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. సేవతి విడిపించుకునేందుకు పెనుగులాడుతోంది.
”వదల్రా… తనని వదిలిపెట్టు…” అన్నాడు పళ్ళు బిగించి సురేష్. అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. సేఠ్‌ని చంపెయ్యాలన్నంత కోపం అతన్ని నిలవనియ్యడం లేదు. పిడికిళ్ళు బిగించాడు.
సేవతిని వదలకుండానే తలతిప్పి సురేష్‌వైపు చూశాడు సేఠ్. ఇద్దరూ సురేష్‌ని చూసి ఆశ్చర్యపోయారు.
”వదిలిపెట్టను. ఏం చేస్తావేం? దరిద్రుడా… డబ్బు కావల్సినప్పుడు కాళ్ళావేళ్ళా పడ్డావే! ఇంతలో ఏం కొంప మునిగిపోయిందని?” అంటూ సేఠ్ మళ్ళీ సేవతివైపు తిరిగాడు. అతని కళ్ళు కూడా క్రూరంగా ఎర్రబడ్డాయి.
”వదుల్తావా లేదా?” సురేష్ కోపం తారాస్థాయికి చేరుకుంది.
”వదలను… ఏం చేస్కుంటావో చేస్కో! పరాయి సొమ్ముతో కులుకుతూ, పెళ్ళాం మాత్రం సతీసావిత్రిలా ఉండాలనుకుంటున్నావా?” అంటూ సురేష్‌వైపు చూడకుండా సేవతిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించసాగాడు.
సురేష్ దృష్టి ఎడమవైపున్న గ్యాసుపొయ్యి మీదికి వెళ్ళింది. గ్యాస్ మీద ఒక మూకుడు ఉంది. నేలమీద సగం తరిగిన ఉల్లిపాయలూ, బంగాళాదుంపలూ చెల్లాచెదరుగా పడున్నాయి. పక్కనే తుప్పుపట్టి మొద్దుబారిన కత్తి కూడా ఉంది. రెప్పపాటు సమయంలో సురేష్ ఆ కత్తి తీసుకుని సేఠ్ మెడ వెనక, కాలర్‌కి పైన కత్తితో బలంగా పొడిచాడు. కత్తి ఎక్కువ లోతుగా దిగలేదు లాగుంది, చెయ్యి తీస్తూంటే దానితోబాటు కత్తికూడా బైటికొచ్చేసింది. కానీ పిచికారీలోంచి రంగునీళ్ళు చిమ్మినట్టు చివ్వున రక్తంధార చిమ్మి సురేష్ మొహం మీదా ఛాతీ మీదా రక్తం చిందింది. నొప్పికన్నా కూడా అనుకోని ఈ హఠాత్సంఘటనకి విస్తుపోతూ సేవతిని వదిలి వెనక్కి తిరిగాడు సేఠ్. కళ్ళు పెళ్ళుకొచ్చాయి… బూతులు తిట్టడం మొదలెట్టాడు.
మరుక్షణం సేఠ్ తన మీదికి లంఘించబోతున్నట్టు సురేష్ పసికట్టాడు. సేఠ్ మంచి ఒడ్డూపొడుగూ ఉన్న మనిషి. సురేష్‌కన్నా లావుగా, అయిదారంగుళాలు పొడుగ్గా ఉంటాడు. సురేష్‌కి ఆలోచించేందుకు సమయం లేకపోయింది. కళ్ళుమూసుకుని, కత్తిని అతని పొట్టలొ బలంకొద్దీ పొడిచాడు. సేఠ్ పొట్ట ఒక చేత్తో పట్టుకుని, కిందకి వంగాడు. కాళ్ళు తడబడసాగాయి. చేతులు పక్కలకి వేలాడిపోయాయి. గోడకి ఆనుకుని నేలమీదకి ఒరిగిపోయాడు. అతని మెడమీది గాయంలోంచీ, పొట్టలోంచీ రక్తం ధారగా కారి నేలమీద మడుగుకట్టడం మొదలెట్టింది. సురేష్, సేవతి మ్రాన్పడిపోయి అతన్నే చూస్తూ నిలబడ్డారు. ఇరవైరోజులు పోలీసు లాకప్‌లో ఉన్నాడు సురేష్. సెషన్స్ జడ్జి అతనికి జీవితఖైదు శిక్ష విధించాడు. అతన్ని సర్కిల్ జైల్లోకి మార్చారు. సురేష్ లాకప్‌లో ఉన్నన్నాళ్ళూ సేవతి అతన్ని చూసేందుకు రోజూ వచ్చేది. ప్రతిసారీ అతనికి ధైర్యం చెప్పి పై కోర్టులో అపీల్ చేద్దామనీ, తను వకీల్‌ని ఏర్పాటుచేస్తాననీ చెప్పేది. ఒకటిరెండుసార్లు సేవతి మొహంలో దిగులుచూసి కారణం ఏమిటని అడిగాడు సురేష్. ముందు ఏమీ లేదని అన్నా, తరవాత సేఠ్ తమ్ముడూ, తండ్రీ తనను వీధిలోకి వెళ్ళకుండా చేస్తున్నారని చెప్పింది. కనిపిస్తే బండబూతులు తిడుతున్నారనీ, సురేష్ ఆటోని విరగ్గొట్టారనీ, సాయం కోసం పుట్టింటికి వెళ్తే అన్న కూడా తిట్టి తరిమేశాడనీ, కొన్నాళ్ళక్రితం ఇంటి కప్పుకి వేసిన ఆస్బెస్టాస్ షీట్లలో ఒకటి గాలివానకి ఎగిరిపోయిందనీ, తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది. ట్యూషన్ చెప్పేందుకు చిన్నపిల్లలెవరైనా దొరుకుతారా అని వెతుకుతున్నాననీ, అంతదాకా వీధిలోని దర్జీ దుకాణంలో చీరలకి ఫాల్స్ కుట్టి కొంత డబ్బు సంపాదిస్తున్నాననీ అంది.
సేవతి వెళ్ళిపోయాక సురేష్‌కి పిచ్చెత్తినట్టు ఉండేది. తను ఏమేం ఊహించుకున్నాడూ! పాపం సేవతి ఒక్కత్తీ ఎలా ఉంటోందో? తన నిస్సహాయ స్థితికి ఏమీ చెయ్యలేక జైలు కటకటాలకేసి తలబాదుకునేవాడతను.
హఠాత్తుగా సేవతి రావడం మానేసింది. సురేష్‌కి ఏమీ పాలుపోలేదు. తమ పక్కింటతను వచ్చి చెప్పేవరకూ సేవతి జైల్లో ఉందని సురేష్‌కి తెలీలేదు. ”ఎందుకు జైల్లో ఉంది?” అని అడిగాడతన్ని. కానీ అతను ఏమీ స్పష్టంగా చెప్పలేకపోయాడు. దాంతో సురేష్ మరింత ఆందోళనకి గురయ్యాడు. ఏం చేసి ఉంటుంది? ఎందుకలాటి పని చేసింది? తనకోసమే కదా హత్య చేసి నేను జైలు పాలయాను? అనుకున్నాడు. తన గొంతుకేదో అడ్డంపడి ఊపిరాడనట్టయింది. ”సార్ నిన్ను పిలుస్తున్నారు,” అన్నాడు కానిస్టేబుల్ వచ్చి. సురేష్ మొక్కలకి నీళ్ళు పోస్తున్నాడు. ఒక్కరోజులో పదేళ్ళు పెరిగినట్టు అనిపిస్తోందతనికి.
”అటువైపు…” బల్లమీద ఆనించిన తలెత్తి పక్కగదివైపు సైగ చేశాడు అసిస్టెంట్ జైలర్. అతను చెప్పినవైపు నాలుగడుగులు వేశాడు సురేష్. చాలా చిన్నగది, లోపల చీకటిగా ఉంది. గది ఆ చివర కిటికీ దగ్గర స్టూల్ మీద కూర్చుని ఉన్నారెవరో. ”ఎవరూ?” అంటూ సేవతి లేచి నిలబడింది. రెండడుగులు లోపలికి నడిచి గోడవైపు తిరిగి ఆనుకుని నిలబడ్డాడు. సేవతి మొహంలోకి చూడలేకపోయాడు. సేవతి అతనికి ఎడమవైపు నిలబడి ఉంది. సురేష్ మొహం అటువైపు తిప్పుకున్నాడు. ఆమెవైపు చూడలేకపోయాడు. క్రితంరోజు రాత్రినించీ గుండెల్లో సన్నగా నొప్పి ప్రారంభమైందతనికి. అది ఇప్పుడు ఎక్కువవుతున్నట్టనిపించింది.
”సురేష్!” అందామె మెత్తగా. ప్రేమగా పిలిచిన ఆ ఒక్క పిలుపు అతన్ని కుదిపేసింది. కానీ బైటికి అతనిలో ఎటువంటి మార్పూ కనబడలేదు. ”ఇటు తిరుగు… నావైపు చూడు, సురేష్!” ఇంక ఆగలేకపోయాడు సురేష్. ఆమెకేసి తిరిగిచూశాడు. బాగా బిగించి వెనక్కి కట్టిన జుట్టూ, బోసి చెవులూ ముందుగా కనిపించాయతనికి. ఆ తరవాత అతని చూపులు ఆమె కళ్ళదగ్గరకొచ్చి ఆగిపోయాయి.
”మూడు నెలలుగా నేనిదే జైల్లో ఉన్నాను,” అంది సేవతి నెమ్మదిగా కానీ దృఢమైన గొంతుతో. సురేష్ జవాబు చెప్పలేదు. తరవాతేం చెపుతుందో అన్న కుతూహలమైతే ఉంది.
”నువ్వు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పుడు రోజూ నిన్ను చూసేందుకు పరిగెత్తుకొచ్చేదాన్ని కదా? ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్… అలా అందరి దగ్గరికీ వెళ్ళి నిన్ను కలుసుకోనివ్వమని బతిమాలేదాన్ని. నాలుగైదురోజులు అలా జైలు చుట్టూ తిరిగాను, కానీ వీలుకాదని నన్ను వెనక్కి పంపేశారు వాళ్ళు. ఆరోరోజు ఎలాగైనా సరే నిన్ను కలవకుండా వెనక్కి వెళ్ళనని నిర్ణయించుకున్నాను. చాలాసేపు నన్ను అక్కడే నిలబెట్టి, ”ఎందుకిలా రోజూ వస్తావు? నీ మొగుడికి ఉరిశిక్ష పడడం ఖాయం,” అన్నాడు సబ్‌ఇన్‌స్పెక్టర్.
”నేనతన్ని కలవాలి. లాయర్ని పెట్టుకుని పోరాడతాం,” అన్నాను.
”ఓ, అంత డబ్బుందా నీ దగ్గర? ఏది ఎంత తెచ్చావో చూపించు” అన్నాడాయన.
నేనేం మాట్లాడలేదు. నాదగ్గర డబ్బుంటే కదా!
”ఇందా ఇవి తీసుకో. వెళ్ళి ఏమైనా తిని తాగు,” అంటూ రెండు పదిరూపాయల నోట్లు జేబులోంచి తీసిచ్చాడు.
”నేను కదల్లేదు మెదల్లేదు. ఆయన నావైపొకసారి చూసి కానిస్టేబుల్‌ని పిలిచి రెండు టీలు తెమ్మని చెప్పాడు. తరువాత కుర్చీలోంచి లేచి నా దగ్గరకొచ్చాడు. ”ఇప్పుడు వెళ్ళి రాత్రి తొమ్మిదిన్నరా పదికి మళ్ళీ రా. అప్పుడు చూద్దాంలే,” అన్నాడాయన. నాకేం చెయ్యాలో పాలుపోలేదు.
”ఏమిటీ, నేను చెప్పింది అర్థం కాలేదా, కావాలని నఖరాలు చేస్తున్నావా? ఇంకా నీ మొగుణ్ణి జైలుకి పంపలేదు, అర్థమైందా… రాత్రికి రా… పది గంటలకి. లేకపోతే వాణ్ణి కలవలేవు, తెలిసిందా?” అన్నాడు సబ్‌ఇన్‌స్పెక్టర్ అంతే సంగతులన్న ధోరణిలో.
”అప్పటికి ఇంటికెళ్ళిపోయి, రాత్రి ఆయన చెప్పిన టైముకి స్టేషన్‌కి వెళ్ళాను. నేవెళ్ళేసరికి ఆయనొక్కడే అటూ ఇటూ పచార్లు చేస్తూ కనిపించాడు. నేను లోపలికెళ్ళగానే ఇంకో గదిలోకి పిల్చుకెళ్ళి తలుపులు బిడాయించాడు. మర్నాడు పొద్దున్నకి గాని నాకు నువ్వు అక్కడే రెండు గదుల అవతల ఉన్నావని తెలీలేదు. ఆ తరవాత లాయరుతో కొన్నిసార్లు స్టేషన్‌కి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అతను పెద్ద పలుకుబడి ఉన్న లాయరు కాదు. మంచి లాయర్ని పెట్టుకోడానికి డబ్బుల్లేవు. అందుకే ఏమీ చెయ్యలేకపోయాను. ఈ లోపల నిన్ను జైలుకి పంపేశారు,” అని సేవతి ఆగి ఊపిరి తీసుకుంది.
సేవతికేసి చూశాడు సురేష్. చాలా చిక్కిపోయింది. తనకున్న వయసుకన్నా పెద్దదానిలా కనిపించింది. సురేష్ మౌనంగా ఊపిరిబిగబట్టి వినడం తప్ప ఏమీ మాట్లాడలేదు.
”ఒకసారి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ని చాలా బతిమాలాను. జైల్లో ఎవరైనా తెలిసినవాళ్ళుంటే నిన్ను కలుసుకునే ఏర్పాటు చెయ్యమని అడిగాను. ముందు తను సాయం చెయ్యలేనన్నాడు. నేను అదే పనిగా అడిగేసరికి, ‘రాత్రికి రా, చూద్దాం’ అన్నాడు. రాత్రి అతనితోబాటు ఇంకో మనిషి కూడా ఉన్నాడు. అతన్ని జైలర్ అని నాకు పరిచయం చేశాడు సబ్‌ఇన్స్‌పెక్టర్. మర్నాడు పొద్దున్న అక్కడికి వెళ్తే ఆ రెండో వ్యక్తి లేడు. ఆయనెప్పుడొస్తాడని అడిగాను. ”కొంచెం ఉండు, వస్తాడు,” అన్నాడాయన. నేనక్కడే బెంచిమీద కూర్చున్నాను. గంటయింది, రెండు గంటలయింది, ఆయన పత్తాలేడు. ‘ఆయనెప్పుడొస్తాడు? అని ఈసారి కొంత ఆదుర్దాగా అడిగాను. ఎందుకోగాని సబ్‌ఇన్‌స్పెక్టర్‌కి సర్రున కోపం వచ్చేసింది.’ ‘నేనాయన్ని జేబులో పెట్టుకు తిరుగుతున్నానా? రాకపోతే నేనేం చేసేది? ఊరికే నా బుర్ర తినేయకు! పో ఇక్కణ్ణించి!’ అన్నాడు.
”ఇన్నాళ్ళూ నన్ను ఇంత హింసపెట్టి, వాడుకుని, ఇప్పుడిలా కుక్కని తరిమినట్టు తరమడం చూసి నాకు మండిపోయింది, నేను వెళ్ళను, ఆయన్ని ఇప్పుడే పిలిపించండి. నేను మా ఆయన్ని చూసేందుకు జైలుకెళ్ళాలి. ఆయన నన్ను తీసుకెళ్తానని చెప్పాడు,” అంటూ లేచి ఆయన బల్ల దగ్గరికి వెళ్ళాను.
”ఏం మనిషివే నువ్వు?” చెప్తే అర్థం కాదా? ‘వెళ్తావా నీ సంగతి చూడనా?’ అని ఆయన లాఠీతో నా పొత్తికడుపులో బలంగా పొడవసాగాడు. నేను పడబోయి బల్ల అంచుని గట్టిగా పట్టుకుని నిలదొక్కుకున్నాను. నా చేతికి దగ్గర్లో ఒక పెద్ద గాజు పేపర్ వెయిట్ కనిపించింది. దాన్ని గబుక్కున తీసుకుని సబ్‌ఇన్‌స్పెక్టర్ తలకి గురిచూసి కొట్టాను. తలకి దెబ్బ తగిలి రక్తం సన్నగా కారడం మొదలెట్టింది. ఆ తరవాత ఏం జరిగిందో వివరాలెందుగ్గాని, నాకు ఆరునెలలు జైలు శిక్ష పడింది.” ఇంతవరకూ చెప్పి ఊరుకుంది సేవతి.
సురేష్ ఛాతీలో నొప్పి మాయమైంది. ఎంత నరకయాతన అనుభవించింది, సేవతి! అదీ తనని విడిపించడం కోసం. ఇంకా పెద్ద బాధ ముందుంది. తనకి ఉరిశిక్ష పడ్డా, జీవితఖైదు అనుభవించాల్సొచ్చినా, ఇద్దరం భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆలోచన రాగానే అతను రాయిలా బిగుసుకుపోయి సేవతికేసి పిచ్చివాడిలా చూడసాగాడు.
”ఆనాడు ఎందుకలాటి పనిచేశావు, సురేష్? ఒకటిరెండుసార్లు సేఠ్ దగ్గరకి వెళ్ళినంత మాత్రాన ఏమయేది? మనం ఆటోని విడిపించుకుని ఉండేవాళ్ళం కదా? ఇద్దరం హాయిగా సంసారం చేసేవాళ్ళం. సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు ఏమైందో. నిన్ను కలుసుకోవడం కోసం, ఎంతమందితో, ఎన్నిసార్లు, ఎన్ని రాత్రులు…” అని ఇక మాట్లాడలేక చేతుల్లో మొహం దాచుకుని, వెక్కివెక్కి ఏడవసాగింది. ఎన్నాళ్ళుగానో లోపల అణిచిపెట్టుకున్న దుఃఖం ఆమె శరీరాన్ని కుదిపి కుదిపి వదిలింది.
హఠాత్తుగా మంచులో కూరుకుపోయినట్టు అనిపించింది సురేష్‌కి. కళ్ళు మూసుకున్నాడు. లోపల తీరని కోరికల చితి రగలసాగింది. సేవతికీ అతనికీ మధ్య ఉన్న ఆ మూడు నాలుగు అడుగుల దూరాన్ని క్షణంలో దాటాడతను. సేవతిని వాటేసుకుని, గట్టిగా ఛాతీకి అదుముకున్నాడు – చేజారిన కలలని ఇద్దరూ మళ్ళీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు… ఇద్దరి కళ్ళూ వర్షించసాగాయి.
”సార్!” సురేష్ గొంతు విని అసిస్టెంట్ జైలర్ తలెత్తి ఏమిటన్నట్టు చూశాడు. ముందు సురేష్, అతని వెనక ఒదిగి నిలబడిన సేవతి కనిపించారు. ”సార్, ఈమె గర్భంలో ఉన్నది నా బిడ్డే సార్!” అంటూ సురేష్ సేవతి చెయ్యి పట్టి ముందుకిలాగి తనపక్కన నిలబెట్టుకున్నాడు.
అసిస్టెంట్ జైలర్ కళ్ళు చికిలించి, నుదురు చిట్లించి, అదెలా సాధ్యం అనబోయి తమాయించుకున్నాడు. ఇద్దర్నీ రెప్పవెయ్యకుండా చూస్తూ ఉండిపోయాడు.
”సార్, ఈమె కడుపులో ఉన్నది మా ఇద్దరి బిడ్డే, సార్!” అని అసిస్టెంట్ జైలర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ స్పష్టంగా చెప్పాడు సురేష్. ఆ విషయం ప్రపంచానికంతటికీ తెలియజేస్తున్నట్టు!
కధ మొత్తం చదివి, బాధగా నిట్టూర్చాను. ఇలాంటి కధలకి, “బాగుంది కధ” అని అనకూడదు. అది సున్నితంగా వుండదు. మంచి మనుషుల కష్టాలు చదివాక, “బాగుంది” అని ఎలా అనిపిస్తుందీ? శాంత సుందరి గారి అనువాదం చాలా బాగుంది.
ప్రసాద్