బాలికా వ్యధ
– తమ్మెర రాధిక
అమ్మ కడుపా అది
ఆడపిల్లల శ్మశాన భూమా!
జెండరు తేడాలు
సమాజాలు కూలిపోయే బాంబులు!!
ఆడపిల్ల పుడితే మైనస్, మగపిల్లాడు పుడితే ప్లస్ అట!
తరతరాల దుష్టసంప్రదాయంలో
మగపుట్టుక
పున్నామ నరకం తప్పించడమే అయితే
బ్రతికుండగానే మరుభూమిలో పారేస్తారు,
రోడ్డుమీద అడుక్కునేలా చేస్తారు,
యాసిడ్ దాడులు చేస్తారు,
నా కల నిజమైతే
మాతృ గర్భాన్ని ఆడపిల్ల పాలిటి
ఉక్కు సంకెల చేస్తాను.
కడుపులో వాడి ఊహను
ఉలిక్కిపడేలా చేస్తాను.
ఉమ్మనీటిలో జాలువారే ప్రేమతో
వాడి మెదడును ట్యూన్ చేస్తాను.
ఎంతసేపూ…
వంటగదిలో డస్ట్‌బిన్
బాత్రూంలో మాసిపోయిన దుస్తులు
బంధుబలగంలో పనిమనిషి
బెడ్‌రూంలో కరిగిపోయే మైనం…
ఇదేనా జీవితం… ఒకే మనిషి
ఇన్ని పార్శ్వాలు విస్తరించేలా చేసే
ఆక్టోపస్…
హలాల్ చేసే ఈ శరీరాలను
అమ్మకమూ కొనుగోలు చేసే
బిడారు వర్తకుల వ్యాపారపు సరుకు చేస్తున్నారు.
ఆడదంటే
చితికిపోయే బ్రతుకుల కోసం
రాల్చే సాంత్వన కన్నీటి బొట్టు!
ఆలంబన లేని
బడికి నిండైన ఆటపట్టు!
ఒయాసిస్సులో
మీరంతా అడుగుజాడలు వెతుక్కునే
సందర్భంలో
ఆమె దాహార్తి తీర్చే నిర్మల భావి.
రాళ్ళూ మట్టీ వేసి పూడ్చాలని చూసే
నైజం మారకపోతే
దాహమై బలిగొంటుంది ప్రాణం!
జాగ్రత్త!!
పులిమీద స్వారీ మానుకో
ఎంతసేపూ నువ్వు
సగం ఆకాశంలో చంద్రవంక కావాలనుకో!!
అమ్మ
– ఆదూరి శ్రీనివాసరావు
అన్నిచోట్లా తాను ఉండలేక ఆ దేవుడు ‘అమ్మ’ను యిచ్చాడు,
తన ప్రేమను వెలిబుచ్చాడు.
కడుపులో తంతున్నా కళ్ళనీరు పెట్టలేదు,
మలమూత్రాలు విసిరినా కోపంతో తిట్టలేదు,
నీ బొట్టు తుడిపేసినా, నీ పక్క తడిపేసినా,
నీ అక్కున చేర్చావు, నా ఆకలి తీర్చావు.
నా బోసినవ్వును చూసి పొంగిపోయావు,
నాకోసం ఎంతైనా వంగిపోయావు.
నా బట్టలు ఉతికే చాకలివైనావు,
నా వంటిని తుడిచే దాసీవైనావు,
నేను అడుగులు వేస్తే మురిసిపోయినావు…
నాకు జ్వరం వస్తే వణికిపోయినావు,
నేను అందంగా ఉన్నా, నా బుద్ధి మందంగా ఉన్నా,
నేను పొట్టి ఐనా, నా ముక్కు చట్టిదైనా,
నీకు నేనంటే ముద్దులే, పక్కింటిబాబు ఊసు నీకొద్దులే!
నాకోసం చందమామను రప్పించావు,
గోగుపూలను తెప్పించావు,
గోరుముద్దలను తినిపించావు.
కోదండరాముని కథలను వినిపించావు.
ఆటబొమ్మలనిచ్చి ఆడిపించావు,
”నేనెక్కడున్నానో కనుక్కోమని” ఏడిపించావు,
బిడ్డగా ఉన్నప్పుడు నీ చేతులలో పెంచుకున్నావు,
పెరిగిపెద్దవగానే నీ హృదయంలో ఉంచుకున్నావు,
నీకు స్వార్థం లేదమ్మా! నీకు పరమార్ధం నేనేనమ్మా!
జగాలు నడిచినా, యుగాలు గడిచినా,
నీ గుణం మారేది కాదు,
ఈ ఋణం తీరేది కాదు.
సీపురు కట్టయి, సఫాయి తట్టయి…
– జూపాక సుభద్ర
ఈ గడ్డ మీద గుడ్డు దెరిసిన నేరానికి
నోసుకోని పుట్టని నొసటి రాతను
యిల్లిల్లు దిరిగి కసువు బండీడుస్తున్న పసితనాన్ని
సదువులేని సవిటి నేలను
కూడు దూరమైన బీడు దుక్కాన్ని
నరాలు దెగిన సెరువు సేతల్ల
వట్టిపోయిన వ్యవసాయ కూలిని
పుట్టు బాంచకు కట్టు బాంచై
కరువు ముండ్లకు సిక్కిన సీరె పేల్కను
మట్టి సుట్టిర్కాల్ని ముడేసుకున్న వాడ వలస ముల్లెను
సెత్త, బెత్త, వూములు, వుచ్చలు
రొచ్చు, రోతల గబ్బు జబ్బు
రోడ్డు మంచాన మురిక్కాలవ ముసుగ్గప్పుకొని
నగరం నిద్రబోయే నడిజామున
నర్సులై అద్దమోలె దిద్ది, ఆవుసును అద్దే
సీపురుకట్టల, సఫాయి తట్టల మాన ప్రాణాలు గాల్లె దీపాలు
వుప్పురాయికి సాలని వూడిగాలు
పీతి కుప్పల్ని బకీట్లు బకీట్లు ఎత్తిపోస్తున్నా తప్పని కులగీతలు
మా మగస్వామ్యాలు బూడిద పిర్రలు, బుడ్డ గోసులు
పిడికెడు మెతుకుల కోసం పీతి బొందల్ల మునిగి పీనుగులైనా
నిండని ఆకలి బొందలు
ఒడువని దుక్కాల్ని ఒడిగట్టుకున్న బతుకు
యెన్నెల్లు యెలేస్తే, అమాసలు అలుముకున్న చీకటి దీపంతను
అంటరాని మట్టి మడ్తల్ల మలిగిపోని బత్తిని
హిల్స్ విల్లాలకు కన్నీల్ల కంకెర, సెమట సిమిటి
మాలందించిన మిల్లర్‌ను
పొట్ట నెత్తిన బెట్టుకొని పట్నమొచ్చిన గూడాలు
అడ్డా కూలీలైన సాకిరి సంతలు
చెత్త కుప్పల్ని పీక్కతినే చదరంగంలో
కుక్కలతో తలపడే వలపోత
విత్తులు జారనియ్యని జోగమ్మ, మాతమ్మల నెత్తులు
మానని రడాలు
వూడలు దిగిన నీ వెయ్యి కాళ్ళ వెతలకు
పాసి పీడల గోసలకు గోరి కట్టేదెప్పుడో?
  Viagra;
ఆమెను కాపాడుతా
– కోటం చంద్రశేఖర్
నేను బోయనో కోయనో నాదో చిన్నకులం-
రోజూ వేటకెళ్తూనో వేటాడబడ్తూనో-
దాహమేసి నీళ్ళు తాగుదామని వడివాగు దగ్గరికి-
అక్కడ ఓ అబల మునిగిపోతూ-
ఆహార్యం చూస్తే తనను మించిన అంతస్థేమోననుపిస్తుంది
ఆపన్నహస్తం అందించాలంటే భయమేస్తుంది
శాస్త్రాల్ని వరించాలా? సహాయ అస్త్రాల్ని మొహరించాలా?
ఏమైతేనేం?
ప్రాణం కన్న మిన్న ఏది?
నేను బోయనో కోయనో పంచలో వున్న పంచమున్నో-
ప్రమాద ఘంటికలు మోగుతుంటే ఎలా ఊరుకునేది
విధి ఆమెపైకి మృత్యుపాశాలు విసురుతుంటే చేతులు కట్టుక ఎలా కూర్చునేది
నేను గాయపడ్డా కట్టుబాట్ల కంచెను దాటేస్తా
కులంతో మనసులో చీలికలు వచ్చి భేదాలు తెచ్చి
నా క్రియాశీలతే దెబ్బతినడం నేను సహించలేను