– ఆశాలత’
దోజ్ హూ డిడ్ నాట్ డై’ అనే తన పుస్తకంలో రచయిత్రి రంజన పథ పంజాబ్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని మహిళల పై వ్యవసాయ సంక్షోభపు ప్రభావాన్ని వారు ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు. వ్యవసాయంలో అప్పులు పేరుకుపోయి అవి తీరే దారి తెలియక రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాలలోని మహిళలు కుటుంబాన్ని పోషించటానికి పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు చేయటానికి చేస్తున్న పోరాటాన్ని వర్ణిస్తూనే దానికున్న రాజకీయ, మానవతా కోణాలపైకి అందరి దృష్టి మళ్ళించాలని రచయిత్రి ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమాలు వరకట్నం వంటి సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం సాగించినప్పటికీ అది ఇప్పటికీ భంకరమైన సమస్యగానే వుంది పంజాబ్లో చాల మంది రైతులు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యలేక కట్నాలు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్నా రనేది చేదు నిజం. నేడు పేద రైతు కుటుంబాలలో నెలకొన్న దుర్భర స్థితిని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. అది కేవలం మార్కెట్ ధరలు, సబ్సిడీలు, వ్యవసాయ రుణాలకు సంబంధించినది మాత్రమేకాదు. ఇది వ్యవసాయ సంక్షోభపు ‘సామాజిక కోణానికి’ సంబంధించిన అంశం అని రచయిత్రి భావిస్తున్నారు.
హరిత విప్లవం ఉధృతంగా అమలుజరిగిన పంజాబ్లో కంటే ఈ రోజున దక్షిణాదిన, అందునా మన రాష్ట్రంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
దేశంలో సగటున 12 గంటలకు ఒక రైతు ఆత్మహత్య జరుగుతున్నదని జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్ సి ఆర్ బి) గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1995-2012 మధ్య, 18 సంవత్సరాలలో మన దేశంలో 2,84,694 రైతులు, మన రాష్ట్రంలో 35,898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వీరిలో మహిళా రైతులు కూడా ఉన్నప్పటికీ వారివి రైతు ఆత్మహత్యలుగా నమోదు కావటంలేదు. ఎన్సిఆర్బి గణాంకాల ప్రకారం మనదేశంలో 1995-2010 సంవత్సరాల మధ్య 6041 మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదంతా దేశానికి వెన్నెముకగా వున్న వ్యవసాయ రంగంలో నెలకొన్న తీవ్ర సంక్షోభావానికి సూచిక. 1990ల తర్వాత దేశంలో మొదలయిన నయా ఉదారవాద ఆర్ధిక సంస్కరణలు, వాటిననుసరించి వచ్చిన వ్యవసాయ విధానాలే ఈ ఆత్మహత్యలకు కారణం. ఇవి నిజానికి ఆత్మహత్యలు కాదు ప్రభుత్వం చేస్తున్న హత్యలే.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని మహిళలను కలసినప్పుడు వారి భార్యలు, తల్లులు, పిల్లలలో గూడుకట్టుకున్న దైన్యం విషాదం కలచివేస్థాయి. పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే భర్తను కోల్పోయి ఒడిలో పసిపిల్లలతో వున్న స్త్రీలను కదిపితే కన్నీటి వరద ప్రవహిస్తుంది. ఏం జరిగింది ఎట్లా జరిగింది అని అడిగితే చెప్పటానికి వారికి గొంతు పెగలదు, భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తోస్తుంది.కొన్ని సందార్భలలో ఆత్మహత్య చేసుకోవటానికి ముందురోజు భార్యభర్తల మధ్య గొడవ జరిగివుంటే, భర్త ఆత్మహత్యకు భార్యే కారణమనే నిందను కూడా భరించవలసివస్తున్నది. చుట్టూ వున్న సమాజం నేరస్తురాలుగా చూస్తుంటే బయట ముఖం చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇది వారిని మానసికంగా మరింత కుంగదీస్తున్నది. కొంతమందికి తమ పేరుమీద ఎంత భూమి వుందో, ఎంత ఆప్పు వుందో, భర్త ఎక్కడ ఆప్పు చేశాడో సరిగ్గా తెలియదు. అటువంటి వాళ్ళు వ్యవసాయం వైపు పోవటానికి తెగించలేక, మళ్ళీ అప్పు చేసి సాగు మొదలెట్టడమో లేక ఇతరులకు కౌలుకివ్వటమో లేక బీడు పెట్టటమో చేస్తున్నారు. రోజు కూలి చేసుకున్న బ్రతుకుతున్నారు. మరికొంత మంది కుటుంబ సభ్యుల సహాయంతో వ్యవసాయం సాగిస్తూ బ్రతుకుబండిని ఈడ్చుకొస్తున్నారు. ఇంకొంతమంది మంది నెలలు, ఏళ్ళు గడుస్తున్న కొద్దీ దైర్యం కూడగట్టుకొని, భర్తపేరు మీద రావలసిన నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేటట్లు తిరుగూతూనే కుటుంబాన్ని పోషించటానికి నడుంబిగించారు. అటువంటి మహిళలను కలసినప్పుడు భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురిస్తాయి.
మొదక్ జిల్లా పెద్దగొట్టిముక్కల గ్రామంలో 6 సంవత్సరాల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ఒక్కొక్కరికి ఒక ఎకరం చొప్పున భూమి వుంది. వారి భార్యలు మేడ్చల్ బాలమణి, భాగ్యమ్మ, పుణ్యమ్మలు (వయసు 30-35 మధ్య ఉంటుంది) కాడి కింద పడెయ్యకుండా సాగు కొనసాగించారు. మొదట్లో మగతోడు లేకుండా వ్యవసాయం చేయటం, ఇతరుల సూటిపోటి మాటలు భరించటం కష్టంగానే అనిపించినా పిల్లల భవిష్యత్తు కోసం మొండి ధైర్యం తెచ్చుకున్నారు. స్వంత బోరు ఉండటంతో వారు కొంత వరి, మొక్కజొన్న, కొంత భూమిలో కూరగాయలు పండిస్తున్నారు. కొంత వరకు అప్పులు తీర్చారు. పిల్లలను చదివిస్తున్నారు. బాలామణి కూతురికి కట్నం ఇచ్చి పెళ్ళి చేసింది. (పెళ్ళిళ్ళు, పండుగలు, దావత్లు విపరీతమైన ఖర్చుతో కూడుకొని వున్నా, చెయ్యకపోతే కులం తప్పుపడుతుందనే భయంతో పేద కుటుంబాలు అప్పు చేసి అర్భాటాలకు పోతున్నారు, అది ఇటువంటి కుటుంబాలకు శాపంగా మారుతున్నది).
మహబూబ్నగర్ జిల్లా మాడుగుల మండలం బ్రహ్మణపల్లికి చెందిన దళిత స్త్రీ రడంపల్లి వెంకటమ్మ. భర్త యాదయ్య 3 ఏళ్ల క్రితం పత్తి పంట వేసి అప్పులెక్కువై ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితో పాటు ఇద్దరు అన్నలకు కలసి 3 ఎకరాల భూమి వుంది, వారు పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నందువల్ల 3 ఎకరాలు యాదయ్యే సాగుచేసేవాడు. అతడు చనిపోయే నాటికి లక్షా 50 వేల అప్పు వుంది. వెంకటమ్మది కూలి పోవటానికి సిద్దంగా వున్న మట్టిగోడల పూరిగుడిసె. ఆమెకి 8, 12 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు. వారి చదువు ఆగకుండా బడికి పంపుతున్నది. భర్త చనిపోయాక 3 ఎకరాల భూమిని యాదయ్య అన్నలు కౌలుకి ఇచ్చారు. ఇప్పుడు వెంకటమ్మ రోజు కులిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నది. రెక్కాడకపోతే ముగ్గురికి డొక్కాడని పరిస్థితి. భర్తకు రావలసిన నష్టపరిహారం కోసం ఆమె ప్రతి సోమవారం మాడుగుల ఏమ్ ఆర్ వో ఆఫీసుకు వెళుతుంది. 2012 డిసెంబర్లో మహబూబ్నగర్లో ఆర్ డి వో కార్యాలయం ముందు, ఢిల్లీలోను రైతు ఆత్మహత్య కుటుంబాలు చేసిన ధర్నాలలో పాల్గొని పేద రైతుల సమస్యలను మీడియా ముందు ఘంటాపధంగా వివరించింది. కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి సహయంలేకపోయినా, ముఖంమీద చెరగని చిరునవ్వుతో అంతులేని ఆత్మవిశ్వాసంతో వెంకటమ్మ తనతోపాటు పక్క గ్రామంలోని మరో ఇద్దరు స్త్రీలకు కూడా వెన్ను తట్టి దారిచూపుతోంది.
మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో గౌడ కులానికి చెందిన 35 ఏళ్ల పందుల కృష్ణమ్మ భర్త రెండున్నర ఏళ్ల క్రితం స్వంత భూమితోపాటు కౌలు భూమిలోకూడా పత్తివేసి అప్పు పేరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు. భర్త చనిపోయిన తర్వాత కృష్ణమ్మ తన రెండు ఎకరాల భూమిలో సాగు కొనసాగించింది. ఇతరుల భూమిలో కూలీపనికి వెళుతుంది. 14 ఏళ్ల పెద్ద కూతురిని చదువు మానిపించి తనతోపాటు పొలంపనికి కూలిపనికి తీసుకెళుతుంది. రెండవ కూతురు, కొడుకు చదువుకుంటున్నారు. చదువుకోవాలనే కోరిక వున్న పెద్ద కూతురు గ్రామంలోని ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 10వ తరగతి పరీక్ష ప్రయివేటుగా రాసి పాసయింది. భూమి పంపకాలు జరిగినప్పటికీ పట్టా ఇంకా మామ పేరుమీదనే వుంది. నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుంది కాని జతపరచవలసిన సర్టిఫికెట్లు అందక ఆమె దరఖాస్తు ఏమ్ ఆర్ వో ఆఫీసులో ఆగిపోయింది. కృష్ణమ్మ ఈ సంవత్సరం కొంత భూమిలో పత్తి, కొంత వరి పండించింది. వచ్చిన ఆదాయం నుండి 10వేలు అప్పు తీర్చింది. చన్నీళ్ళకు వేడినీళ్ళగా ఉంటుందని ఆమె రెండు మేకలను పెంచుతున్నది, మేకల నుండి సంవత్సరానికి 6-7 వేలు ఆదాయం వస్తుందని చెప్పింది. రోజు పొలానికి వెళ్ళేటప్పుడు మేకలను తనతో తీసుకెళుతుంది. అప్పులు తీర్చి పెద్ద కూతురి పెళ్ళి చేయటం ఇప్పుడు కృష్ణమ్మ ముందున్న పెద్ద సవాలు. భర్త అప్పులు చేసి ముంచి పోయాడని ఏడుస్తూ కూర్చోకుండా కృష్ణమ్మ పిల్లల సహాయంతో దైర్యంగా బ్రతుకు పోరాటం సాగిస్తున్నది.
ఇట్లా అనేక కథలు, అనేక అనుభవాలు, సాధారణంగా నెలకొని వున్న వ్యవసాయ సంక్షోబ నేపథ్యంలో అనుభవాలు నిరుత్సాహంగా వున్నప్పటికీి కొన్ని అనుభవాలు ఆశావహంగా వున్నాయి. సామాజికంగా అణచివేత స్వభావంగల సంప్రదాయాలు, కులవ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థల వలయంలో కూరుకుపోయిన స్త్రీలు, గ్రామీణ ప్రాంతాలలోని రైతాంగ మహిళలు స్వతంత్రగా స్వేచ్ఛగా లేరు. భూమి హక్కులు నిర్ణయాధికారం లేక వారు ఇంకా ఇతరులపై ఆధారపటడం కొనసాగుతోంది. స్త్రీలకు భూమి హక్కును కల్పిస్తూ హిందూ వారసత్వ చట్టం 2005 సవరించబడినప్పటికీ, ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చినప్పటికి అవి ఆమలుకు నోచుకోవటం లేదు. గ్రామీణ ప్రాంతాలలో పురుషులు (రైతులు, కూలీలు) వ్యవసాయాన్ని విడిచి వెళ్ళటం పెరుగుతున్న కొద్దీ మహిళలు ఆ భారాన్నంతా భుజాల మీద వేసుకుని రైతులుగాను కూలీలుగాను ”సాగులో సగం” కంటే మించి శ్రమిస్తున్నారు. వ్యవసాయంలో 70-80 శాతం పనులు మహిళలే చేస్తున్నారని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయినా వారికి రైతులు ఆనే గుర్తింపు లేదు. ఇవీ మనదేశంలో రైతాంగ మహిళలను సతమతం చేస్తున్న సమస్యలు. ఇవి పరిష్కారం కానంతవరకు వ్యవసాయంలో ప్రధాన పాత్ర వహిస్తున్న మహిళలు స్వతంత్రంగా స్వేచ్ఛగా మనుగడ సాగించలేరు.
మహిళా రైతులకు నిర్ణయాధికారం వున్న సందర్భాలలో వాళ్ళు ఎక్కువ అప్పులు చేసి భూమిని పర్యావరణాన్ని నాశనం చేసి సాంద్ర పద్ధతిలో కాకుండా రకరకాల తిండి పంటలను పండిస్తూ ప్రకృతికనుకూలమైన సాగు చేస్తున్నారు. ఆహార సార్వభౌమత్వానికి కీలకమైన విత్తనాలను కాపాడుతున్నారు, కుటుంబాలకు ఆహార భద్రతను కల్పిస్తున్నారు. వీళ్ళే భవిష్యత్తుకు దారి చూపే ఆశా దీపాలు.
(రైతు స్వరాజ్య వేదిక చేసిన ఆధ్యయనం ఆధారంగా)..
చాల బాగా రాసారు.