”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” -భావరాజు పద్మిని
స్త్రీ హృదయం పువ్వుకన్నా కోమలమైనది. ఒక అందమైన పువ్వును చూసినప్పుడు, కాసేపు ఆ సౌందర్యానికి ముగ్దులై చూస్తూ ఆనందించేవారు కొందరు. ఇందులో గొప్ప మానవత ఉంది. అదే సౌందర్యాన్ని నలిపి, ఆ పువ్వు రెక్కలు విరిగి నలిగిపోతుంటే చూసి పైశాచికానందం పొందేవారు కొందరు. ఇది చాలా అమానుషం, హేయం. ఆయువున్న నాలుగు రోజులు ఆ పువ్వు పరిమళాన్ని, జీవన మాధుర్యాన్ని ఆస్వాదించనీయక, తెగిన రెక్కలతో కాలం వెలిబుచ్చేలా చేసే కామాంధులు కొందరైతే, ఆ పువ్వు అస్తిత్వమే లేకుండా ప్రాణాలు తీసే రాక్షసులు కొందరు ఇప్పుడు తయారు అవుతున్నారు. ఈ సామాజిక స్థితికి కారణం ఎవ్వరు? దీనికి పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలను నా దృక్పథం నుంచీ చూద్దాం.
వలను వెతుక్కుంటూ వెళ్లి చిక్కుకుంటున్న ఆడపిల్లలు
జాలరి వల వేసినప్పుడు అనుకోకుండా చేపపిల్ల అందులో చిక్కి, ప్రాణాలపై తీపితో విలవిల్లాడుతుంటే, చూసే హృదయాలు ‘అయ్యో పాపం’ అనుకుంటాయి. కాని, చేపపిల్లే వలను వెతుక్కుంటూ ఈదుకుంటూ వెళ్లి చిక్కుకుంటే…. దాని తెలివితక్కువ తనానికి అంతా ఆశ్చర్యపోతారు. ఇలాగే ఉంది నేటి ఆడపిల్లల పరిస్థితి. క్రింది ఉదాహరణలు చూడండి. ఇవన్నీ వాస్తవ సంఘటనలే సుమా…
యు.కె.లో ఎం.ఎస్. చదువుతున్న సమయంలో వివేక్ (పేరు మార్చబడింది) అనే యువకుడు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా చెన్నైకి చెందిన ఓ మహిళా టెక్కీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి విశ్వాసం కలిగించిన వివేక్ ఆమె ఆన్‌లైన్ ఖాతాలను, పాస్‌వర్డ్స్‌ను పొందాడు. ఆమె వ్యక్తిగత విషయాలన్నీ తవ్వి తీశాడు. స్కైప్ చాట్ సెషన్‌లో ఆమెను మభ్యపెట్టి దుస్తులు విప్పేసేలా చేసి, దాన్ని రికార్డు చేశాడు. దాంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ అమ్మాయి హెచ్చరించింది. ఈ స్థితిలో ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి హైదరాబాదు వచ్చాడు. ఆ తర్వాత వివేక్కు ఇతర అమ్మాయిలతో కూడా అటువంటి సాన్నిహిత్యం ఉందని తెలుసుకుని, ఆమె దూరంగా ఉండసాగింది. దాంతో వివేక్ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అందుకు అతను ఆమె న్యూడ్ ఫోటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టడమే కాకుండా ఆమె కాలేజ్ గ్రూప్ సభ్యులకు వీడియోను పంపించాడు. అతని ఆగడాలను భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక సాక్ష్యాలు లభించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని బుధవారం అరెస్టు చేశారు. మధ్యవర్తుల సమక్షంలో వారు న్యూడ్ ఫోటోలున్న వివేక్‌కు చెందిన ల్యాప్‌టాప్‌ను, డీవీడీని స్వాధీనం చేసుకున్నారు.
దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో 17 ఏళ్ల విద్యార్ధినిపై ఇద్దరు ఐటీ ఉద్యోగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. డిసెంబర్ 31 రాత్రి వీరిద్దరూ విద్యార్ధినికి మద్యం తాగించి అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరు బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయం అయ్యాడని బాధితురాలు చెప్పినట్టు సమాచారం. న్యూయియర్ సెలబ్రేషన్స్‌కు తన ఫ్లాట్‌కు ఆహ్వానించి డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. కాగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, తీహార్ జైలుకు తరలించారు.
వాడిది ఓ డిటిపి సెంటర్. కొన్ని కవితలు రాసి, ఆ కవితల క్రింద సెల్ నెంబర్ ఇస్తాడు. అమ్మాయిలు చేసే నెంబర్లను తన ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి, ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫ్రెండ్ మాట్లాడే ఏర్పాటు చేస్తాడు. అలా, ఒకే నంబరుకు, రోజు, ఎనిమిది మంది అమ్మాయిలు మాట్లాడేవారు. తన ఫ్రెండ్స్‌తో మొదట సరదాగా మాట్లాడించి, అమ్మాయిలను ఆకర్షించి, ఫోన్ నెంబరు తీసుకున్న తరువాత వేధింపులు మొదలుపెట్టేవారు. పోలీసులు వాడిని, వాడి ఎనిమిది మంది ఫ్రెండ్స్‌ను అరెస్ట్ చేస్తారు. కొంతమంది పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా, ఇలా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని మొదట డీసెంట్‌గా మాట్లాడి, ఉద్యోగం ఇప్పిస్తాను అని నమ్మబలికి, కూతురు వయసున్న అమ్మాయిని వేధిస్తుంటే, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు పెద్ద మనిషి కంప్యూటర్ క్రాక్ చేస్తే, అన్నీ బూతు వీడియోలు, మార్ఫింగ్ చేసిన అమ్మాయిల ఫోటోలు దొరికాయి. ప్రొఫైల్‌లో అందమైన అబ్బాయి ఫోటోలు చూసి స్నేహం చేస్తే, చివరికి అమ్మాయిలకు మిగిలేది తీరని మానసిక వేదన. అమ్మాయిలూ… తస్మాత్ జాగ్రత్త!
హాకింగ్ ద్వారా ఆడవాళ్ళ సామాజిక నెట్వర్క్ ప్రొఫైల్‌లో ఉన్న ఫోటోలు సేకరించి, మార్ఫింగ్ ద్వారా అశ్లీల చిత్రాలకు చేర్చి ప్రచురిస్తున్నారట.
లూథియానాలో ఎంతో గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన అమ్మాయి కాజల్ (పేరు మార్చబడింది) ఆమె తన సహోద్యోగి ప్రేమను నిరాకరించినందుకు- అతను కాజల్ ఫేస్ బుక్ ఎకౌంటు హాక్ చేసి, ఆమె ఫోటోలను అశ్లీలంగా, మార్ఫింగ్ ద్వారా మార్చివేసి, ఫోన్ నంబర్‌తో సహా ఆమె పేజీలో పెట్టాడట. ఇక ఆమె ఎదుర్కొన్న పరిస్థితిని ఎవరయినా ఊహించగలరా? ఫోన్ రింగ్ అవుతూనే ఉందట… ఏమి చెయ్యాలో పాలుపోక, అభిమానం చచ్చిపోయి, తనకు తానే – ధైర్యం కూడదీసుకుని, పోలీసు స్టేషన్‌కు వెళితే, ఇటువంటి నేరాలు సైబర్ క్రైం పరిధిలోకి వస్తాయని, అక్కడకు పంపారట. నేర విచారణ జరిగిన సుదీర్ఘ కాలంలో ఆమె మానసిక స్థితి దిగజారి.. షాక్‌లోకి వెళ్ళింది. ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఒక స్నేహితురాలి మీది అక్కసుతో, మరో స్నేహితురాలు ఆమె పేరుతో ఫేక్ ఎకౌంటు సృష్టించి, ఆమె ప్రవర్తన సరి లేదనే, అసభ్యకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. మరో ప్రబుద్ధుడు ఏకంగా అమ్మాయి పేరు, నెంబర్ ఇచ్చి, ఈమె వేశ్య- కావలసిన వాళ్ళు రాత్రికి పిలవవచ్చు… అని రాసాడట.
పై సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేటి యువతలో, రోజు రోజుకూ పెరుగుతున్న సామాజిక నెట్‌వర్క్‌ల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి అనేక కొత్త వలలు పన్నుతున్నాయి. తెలిసిన వాళ్ళే వంచిస్తున్న రోజులు ఇవి. మరి తెలియని వాళ్ళతో అతిచనువు సంభాషణలు, ఫోటోలు, ఫోన్ నెంబర్‌లు ఇవ్వడాలు, చివరికి వీడియో చాటింగ్‌లో బట్టలు విప్పి చూపేటంత పిచ్చి నమ్మకాన్ని ఏమనాలి? ముక్కూ, మొహం తెలియని వారితో మసలుకునే విధానం ఇదేనా?
నేటి చదువులు మిడిమిడి జ్ఞానాన్ని ఇస్తున్నాయే కాని, లోక జ్ఞానాన్ని ఇవ్వటం లేదు. పదోవ తరగతి ఉత్తీర్ణులు అయ్యేసరికి పిల్లల్ని హాస్టల్స్‌లో చేర్పించవలసి రావడం, డిగ్రీ కాగానే కాంపస్ ఉద్యోగాలు స్వాగతించడంతో, చాలా మంది అమ్మాయిలు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అక్కడ పెద్దల పర్యవేక్షణ ఉండదు. సమస్యలకు మార్గదర్శకత్వం చేసే పరిజ్ఞానం తోటి స్నేహితులకు ఉండదు. పైగా, సాంకేతిక పరికరాలైన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ చాలా సులువుగా అందుబాటులో ఉంటోంది. మొదట కాలక్షేపం కోసం చాటింగ్ మొదలుపెట్టి, క్రమంగా తమ చుట్టూ బిగుస్తున్న ఉచ్చును తెలుసుకోలేక, జరిగిన చేదు సంఘటనలకు తలెత్తుకోలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఎందరో అభాగినులు. వెలుగుకు వచ్చిన వాస్తవాలే ఇంత కఠినంగా ఉంటే, కుటుంబ ప్రతిష్టకోసం వెలుగుకు రాని వాస్తవాలెన్నో ఊహించుకోవచ్చు.
మాన ప్రాణాలు హరిస్తున్న మద్యం మత్తు
దేశమంతా నివ్వెరపోయి, ఒళ్లు గగుర్పొడిచి, గుండెలు విలవిలలాడి, ప్రతీ మనసూ కరిగినీరయిన అమానవీయ, పాశవిక, హేయ సంఘటన, నిర్భయ విషయంలో జరిగింది. చాలామంది ఈ సంఘటనను ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ కేసులో నిందితులు తాము మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి అలా ప్రవర్తించామని చెప్పిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు మద్యమే మహిళల మానప్రాణాలను హరించే మహమ్మారి అయ్యింది. క్రింది వాస్తవిక సంఘటనలు చదవండి….
పదిమందిలో తిరుగుతూ ఉండే ఉద్యోగిని అయినా, తల్లిదండ్రుల నీడలో ఉండే అమాయకురాలైనా.. ముంబైలో అయినా… ఖమ్మంలో అయినా… ‘ఆడ’ అనిపిస్తే చాలు కీచకవారసులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఖమ్మం నగరానికి చెందిన 17 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే వార్త స్థానికంగా కలకలం రేపింది. కూరగాయలు తీసుకు వచ్చేందుకు ఇంటినుంచి వెళ్లిన బాలికను కామాంధులు మాయమాటలతో మోసగించి, ఆటో ఎక్కించి, మత్తుమందు ఇచ్చి, నగర శివార్లలోకి తీసుకువెళ్లి మద్యం కలిపిన కూల్‌డ్రింక్ తాగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన సర్వత్రా కలవరం రేపింది. కూలీ పనులు చేసుకుంటూ… ఉన్న దాంట్లోనే గుట్టుగా పిల్లలను సాదుకుంటున్న తల్లిదండ్రులు తమ బిడ్డకు అన్యాయం జరిగిందనే వార్త విని కుప్పకూలిపోయారు. శరీరం నిండా గాయాలతో కళ్ళముందు బిడ్డ పడుతున్న అవస్థను చూడలేక బోరుమన్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై పోలీసులు స్పందించారు. ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.
ముషీరాబాద్ రాంనగర్ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన 18 ఏళ్ళ యువతిపై అదే ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు కన్నేసి ప్రేమిస్తున్నట్టు నమ్మబలికాడు. ఆ తర్వాత ఏప్రిల్ 17వ తేదీన నగర శివారు ప్రాంతానికి యువతిని తీసుకుని వచ్చి తొలుత అత్యాచారం చేశాడు. ఈ నెల 7వ తేదీన తన స్నేహితులు నిఖిల్, అరుణ్‌తో కలిసి ఆటోలో యువతిని బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 9న తిరిగి వారు ముగ్గురు మరో వ్యక్తితో కలిసి ఆటోలో ఆమెను హుస్సేన్‌సాగర్‌కు తీసుకొచ్చి ఇదేవిధంగా అగాయిత్యానికి పాల్పడాలని భావించారు. హుస్సేన్‌సాగర్‌లో ఆమెను తోసేద్దామని ఆ తర్వాత విరమించుకున్నారు. దీంతో బాధితురాలు తన పరిస్థితిని తన సోదరికి చెప్పడంతో ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా నగర పోలీసు కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకుల్లో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.
ఆమె వయస్సు 45 సంవత్సరాలు. ఓ రోజు పనుల నిమిత్తం పొలానికి వెళ్ళింది. అక్కడికి సమీపంలోని మాదిగల గుట్ట వద్ద కొందరు వ్యక్తులు మందు పార్టీ చేసుకుంటున్నారు. నాటు కోళ్ళు, మద్యంతో అక్కడి వాతావరణంతోపాటు మనుషులూ వేడెక్కారు. అదే సమయంలో ఆ మహిళ వారికంట పడింది. మాంసం ఇస్తాం రమ్మంటూ పిలిచే సరికి మరేం ఆలోచించకుండా వారివెంట నడిచింది. అక్కడ మద్యం చూసేసరికి ఆమెకు నాలుక లాగింది. ఆమెకూ మద్యం తాగే అలవాటు ఉండడమే అందుక్కారణం. వారు అడిగీ అడగకముందే మందు కొట్టేసి మైకంలోకి జారుకుంది. వంతుల వారీగా ఆమెను బలాత్కరించారు. ఆమె వంటిపై నగలు కూడా దోచుకున్నారట. ఈ వ్యవహారంపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా… పెద్ద మనుషుల చలవతో విషయం బయటే పరిష్కారమైందని తెలుస్తోంది.
బెంగుళూరులోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఓ విద్యార్ధిని (19) ఆదివారం తాను ఉంటున్న హాస్టల్ నుంచి అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బస్‌స్టాప్‌కు బయలుదేరింది. ఆ సమయంలో తెలుపు రంగు స్కార్పియో కారులో వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె పక్కన కారు ఆపి అడ్రస్ అడుగుతూ కారులోకి లాక్కొన్నారు.
కారులోనే ఆ యువతిని లైంగికంగా వేధించిన ఆ దుండగులు తర్వాత నిర్జన ప్రదేశంలోని ఓ ఇంటికి తీసుకెళ్ళి బాధితురాలిని చితకబాది, బలవంతంగా మద్యం తాగించి మళ్లీ సామూహిక అత్యాచారం చేశారు. చివరకు స్పృహ కోల్పోయిన ఆమెను అక్కడ వదిలి పరారయ్యారు. చాలాసేపటికి తర్వాత కోలుకున్న ఆ యువతి తీవ్ర గాయాలతో హాస్టల్‌కు చేరుకుంది. యువతిని సోమవారం సాయంత్రం వార్డెన్, ఆమె స్నేహితులు సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకున్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె తల్లితండ్రులు వాపోతున్నారు. ఇంకా ఈ కేసుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
మద్యం త్రాగడం విచక్షణను చంపేస్తుంది. పేద, ధనిక బేధాలు లేకుండా నేడు ప్రజలు మద్యానికి బానిసలు అవుతున్నారు. వీటికి తోడు సర్కారే దళారీగా మారి బొక్కసాన్ని నింపుకునేందుకు యువతతో ఇష్టం వచ్చినట్టుగా మద్యం తాగిస్తోంది. మద్యం మత్తులో అశ్లీల మాస్ మీడియా ప్రభావానికి లోనైన యువత మహిళలు కనబడితే తోడేళ్లలా రెచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నారో, దానికి పర్యవసానాలేమిటో తెలుసుకోలేని స్థితిలోకి యువత నెట్టివేయబడుతోంది.
బాబాల ముసుగులో అత్యాచారాలు
మోసపోవడానికి విద్యతో, వయసుతో నిమిత్తం లేకుండా, కేవలం ఒక అమాయకత్వపు స్త్రీ. అందుకే నేడు బాబాల ముసుగులో, గురువుల ముసుగులో కూడా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. భక్తి పేరుతో రక్తి నడిపే నేటి బాబాల లీలలు చదవండి….
తమిళనాడుకు చెందిన పరమహంస నిత్యానంద మీద కూడా కేసులు నడుస్తున్నాయి. ఒకానొక దశలో నిత్యానంద తన ఆశ్రమాలను ఫ్రాంచైజీలను చేసే వరకూ వచ్చారు. ఈయనకు చెందిన షాకింగ్ వీడియో తమిళ సినిమా ఇండస్ట్రీనే ఒణికించింది. రేప్, బెదిరింపు, మోసం అంటూ అనేక ఆరోపణలు. అరెస్టులూ-కేసులు ఇతర అనేకానేక విషయాలు నిత్యానందను వివాదాస్పద స్వామిజీని చేశాయి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువతిపై కూడా నిత్యానంద అత్యాచారం జరిపినట్లు సీఐడీ అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన ఈ ఉద్యోగినిపై ఇతను అత్యాచారం చేశాడని, ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించాడని తమకు ఫిర్యాదు అందినట్టు సీఐడీ అధికారులు రామ్‌నగర్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో వెల్లడించారు. సదరు స్వామి ప్రవచనాలకు ఆకర్షితురాలైన ఆమె 2006 ఆగస్టులో ఆశ్రమంలో చేరింది. అదే సంవత్సరం డిసెంబర్ వరకు ఆమె ఆశ్రమంలోనే గడిపింది. ఒక రోజు దొంగ స్వామి ఆ యువతిని పిలిచి మద్యం తీసుకు రావాలని కోరాడు. దీంతో ఆ యువతి షాక్‌కు గురై అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నించింది. కానీ… అతని అనుచరులు మాత్రం… గురువు చెప్పింది చేస్తే నీకు మోక్షం లభిస్తుందని ఆ యువతికి నమ్మబలకడంతో ఆమె భక్తితో మద్యం తీసుకువెళ్లి గురువు గారికి సమర్పించిందట. స్వామీజీ అంతటితో ఆగక.. ఆమె చేత మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెను అమెరికాలోని లాస్ వేగాస్‌కు తీసుకెళ్లి, అక్కడ ఆమెతో శారీరక సుఖాన్ని అనుభవించాడు. కొన్నాళ్లకు భారత్ తిరిగి వచ్చాక ఆమె ఎలాగో దొంగ బాబా ఉచ్చు నుంచి బయట పడింది. బాబా పరపతికి భయపడి ఆమె తొలుత అసలు విషయాలు బయటపెట్టలేదు. కానీ… ఆయన రాసలీలలు వెలుగు చూసిన తర్వాత అతనిపై కేసు నమోదు కావడంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
చదువుకుని, మంచి ఉద్యోగంలో ఉన్న ఆమెనే కాదు, ఎంతో మంది స్త్రీలు భక్తి ముసుగులో అత్యాచారాలకు గురవుతున్నారు. ఇప్పటి వరకూ వెలుగు చూసిన మరికొందరు కీచక స్వాముల కథలు చూడండి…
తమిళనాడుకు చెందిన మరో స్వామీజీ ప్రేమానంద. ఈయనకు ‘త్రిచీ సాయిబాబా’గా పేరు. ఈయన అనుకూలురు డిఎంకేలోనూ వున్నారు. ఈ బాబా మీద 94లో రేప్ – మర్డర్ కేసులు నమోద య్యాయి. ఈయనపై ఫోర్స్‌డ్ అబార్షన్ కేసులు కూడా వున్నాయి. ఆశ్రమంలో జరుగుతున్న అనుమానాస్పద విషయాలపై ప్రశ్నించిన ఓ ఇంజనీర్ హత్యకేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్నారు.
బీమానంద్ జీ మహరాజ్ చిత్రకూట్ వాలే అనే మరో మహనీయుడున్నాడు. ఈయన ప్రొస్లిస్టిట్టూషన్ స్పెషలిస్టు. తనకు తాను దేవుడ్నని చెప్పుకుని తిరిగే ఈ స్వామీజీ పెద్ద వ్యభిచారరాకెట్లు నడుపుతూ అరెస్టయ్యారు. అదేంటని అడిగితే తనలో ఓ అపరిచితుడున్నాడని సెలవిచ్చాడు… చిత్రమైన స్వామీజీ మహరాజ్ చిత్రకూట్ వాలే.
మోస్ట్ వాంటెడ్ బాబాస్ లిస్టులో మరో ఘనుడు సంతోష్ మహదేవన్. అమృత చైతన్యఆశ్రమం నిర్వహించిన ఈయనగారు.. దుబాయ్‌కి చెందిన మహిళను 50 లక్షల రూపాయల మేర మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అంతే కాదు ఓ పదిహేనేళ్ల బాలికను రేప్ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
ఇక పత్రీజీ స్వామిగా చెప్పుకోరు కానీ, ఆ స్థాయి వివాదాలైతే చుట్టుముట్టాయి. పిరమిడ్ ధ్యాన మహాసభలు పెట్టి ప్రచారం పొందే ఈ ధ్యానగురువు సంచలన వార్తలకు కేంద్రంగా నిలిచారు. ఒకానొక సమయంలో జనం నోళ్లలో విపరీతంగా నానారు. ఆయన కు చెందిన వ్యవహారాలపై అధికారులు పరిశోధనలకు దిగవలసి వచ్చింది. ముఖ్యం గా పత్రి ప్రవర్తన మీద అనేక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రత్యేకించీ స్త్రీలను ఆలింగనాలు చేసుకోడం… వారి చేత లేనిపోని సపర్యలు చేయించుకోడం.. శృంగారం విషయంలో వింత ప్రకటనలు చేయడం… జనాన్ని విస్మయపరిచాయి.
వివాదాస్పద గురువుల్లో, బాబాల్లో… ఆసారాం బాపూజీ కూడా వున్నారు. హిందూ మతంపై ఎన్నో ప్రవచనాలు వల్లించిన బాపూజీ, మరెన్నో వివాదాలకు కేంద్రమయ్యారు. ప్రస్తుతం 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కనుక బాబాల విషయంలో, స్వామీజీల వ్యవహారంలో ఆచీ తూచీ వ్యవహరించాల్సి వుంటుందని చెబుతున్నాయి హేతువాద సంఘాలు.
ఇక బాలసాయి, కాళేశ్వర్, కల్కీ వంటి స్వామిజీల గురించి తెలిసిందే. ఆశ్రమాల ముసుగులో సాగించిన అరాచకాలు విదితమే. వీరందరూ భూకబ్జాల నుంచి మోయని కేసులేదు. భక్తి చాటున అనేక మత్తు చేష్టలు చేయించిన ఘనత ఈ స్వాములది. భక్తులను మత్తెక్కించడంలో కల్కీజీ మరీ స్పెషలిస్టు. కనుక ఈ మాయలో పడి మోసపోకండి అంటున్నాయి వాస్తవ సంఘటనలు.
అజ్ఞానం నిండుగా ప్రవహిస్తున్నంత వరకూ ఇలాంటి దొంగబాబాల పంట సస్యశ్యామలమే. అమాయకంగా నమ్మివ చ్చిన ఆడవాళ్ళని లోబరచుకుంటు న్నారు. కాదంటే రేప్… కలబడితే మర్డర్… ఒకరో, ఇద్దరో కాదు, వందలాదిమందితో అక్రమ సంబంధాలు సాగించే ఈ కాముకులను దేవుడితో సమానంగా కొలవడం సామాన్యు ల అజ్ఞానానికి నిదర్శనం. భక్తిలో కూడా విచక్షణ కోల్పోరాదు, నేటి పరిస్థితులకు గుడ్డి నమ్మకం కూడదు.
మహిళలపై అత్యాచారాలు – గణాంకాలు
నిర్భయ ఘటన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు 15 వరకు 1,036 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వెలుగు చూసిన రేప్‌ల సంఖ్య ఇంత తీవ్రంగా ఉంటే గుట్టుగా దాచిపెట్టినవో, బెదిరించి బయటికి పొక్కకుండా చేసినవో ఇంకా అంతే సంఖ్యలో అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. గతేడాది ఇదే సమయంలో 661 కేసులు నమోదయ్యాయి.
2010లో 507, 2009లో 469, 2008లో 466, 2007లో 598, 2006లో 623, 2005లో 658, 2004లో 551, 2003లో 490 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. గడిచిన దశాబ్దకాలంలో హై సెక్యూరిటీ జోన్‌గా ఉన్న ఢిల్లీలో నమోదయిన అత్యాచార ఘటనల గణాంకాలు ఇలా ఉంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఆధిపత్య కులాలు, వర్గాలు రాజ్యమేలే ప్రాంతాల్లో మహిళల రక్షణ పరిస్థితిని, ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు. దేశంలో సగటున 20 నిమిషాలకో మహిళపై అత్యాచారం జరుగుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2012లో దేశవ్యాప్తంగా 24,923 మంది మహిళలపై అత్యాచారం జరిగినట్లుగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే ఆ సంఖ్య చెరిగిపోయింది. అంటే నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక కూడా మహిళలకు భద్రత లేకుండా పోతుంది అన్నది వాస్తవం. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడం వేగంగా జరుగుతుందే తప్ప అత్యాచారాల నిరోధం మాత్రం జరగడం లేదు.
అత్యాచారాన్ని నివారించేందుకు కొన్ని పరిష్కార మార్గాలు
ప్రభుత్వ పరంగా తీసుకోదగ్గ పరిష్కారాలు :
సమాజంలో మార్పు వచ్చినప్పుడే ఈ అత్యాచారాలను అరికట్టగలం. అంతే కాని, ఎన్ని నిర్భయ చట్టాలను విధించినా, యెంత మందిని ఉరి తీసినా, సమాజంలో మార్పును తీసుకురాలేము. ప్రపంచీకరణ ప్రభావంతో మనదేశంలో ఎంతో దిగజారి కొంత ప్రగతిని మూటగట్టుకుంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు చౌకగా లభించడం ఎంత స్థాయిలో మంచి చేసిందో అంతకంటే ఎక్కువ చెడునే అందించింది. ఇంటర్నెట్ నిండా ఫోర్బో సైట్లు, అశ్లీల, బూతు సాహిత్యం ఒక్క క్లిక్‌తో వచ్చేస్తున్నాయి. అవి విద్యార్ధులు, యువత మనసులను పెడదారులు పట్టిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియా అశ్లీల, బూతు మాటలకు చిరునామాగా మారింది. ఇక సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు అతి జుగుప్సా కరమైన డైలాగులు వల్లించే ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలు, వాటిని తలదన్నే రీతిలో బుల్లితెర కార్యక్రమాలు యువతను పూర్తిగా చెడుదారి పట్టిస్తున్నాయి. యువతను అత్యాచారం దిశగా పురిగొల్పిన దిగజారుడు వ్యవస్థనూ దోషిని చేయాలి. అశ్లీలాన్ని చూపించి, చెప్పించి వాటిని సొమ్ము చేసుకునే మాస్ మీడియా, ఖజానా నింపుకునేందుకు విచ్చలవిడిగా మద్యం అమ్మించే ప్రభుత్వమూ ఇందుకు బాధ్యత వహించి, కొంత మారాలి.
అశ్లీల వెబ్‌సైటులు, చిత్రాలపై నియంత్రణ విధించాలి.
మీడియాలో క్రైమ్ విశేషాలను అత్యుత్సాహంతో ప్రదర్శించడాన్ని నియంత్రించాలి. ఇవి యువతకు కొత్త ఐడియాలు ఇస్తున్నాయి.
స్త్రీలను అగౌరవంగా ఏమే, ఒసేయ్ అంటూ పిలిచే చిత్రాలను నిషేదించాలి. అలాగే బుల్లితెర కార్యక్రమాల్లో అంగాంగ ప్రదర్శనలు చేసే కార్యక్రమాలను నిషేధించాలి.
మద్యనిషేదం విధించాలి. మద్యం అనే మహమ్మారి ఎందరు మహిళల జీవితాలు పొట్టన పెట్టుకుందో ఆలోచించి, ప్రభుత్వం సహృదయంతో స్పందించాలి.
సినిమా అనేది అనేక మందిని సులువుగా చేరే ఒక మాధ్యమం. అత్యాచారానికి గురయిన స్త్రీ, ఆమె కుటుంబం శారీరకంగా, మానసికంగా యెంత వేదనకు గురవుతుందో తెలియచేసే సినిమాలను తియ్యాలి. వాటిని నిర్బంధంగా అన్ని ఛానల్స్ ప్రదర్శించాలి. చదివినది మర్చిపోతారేమో కాని, చూసింది మర్చిపోరని మనం వింటూ ఉంటాం. అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా సులువుగా అర్థం చేసుకునే సినిమాను మాధ్యమంగా వాడి, సామాజిక మార్పుకై ప్రయత్నించాలి.
స్త్రీల భద్రతకై ప్రత్యేక అత్యవసర ఫోన్ నెంబర్‌లను, దళాలను ఏర్పాటు చెయ్యాలి.
అత్యాచారాలకు గురయిన స్త్రీల వివరాలు గోప్యంగా ఉంచి, వారికి తిరిగి మానసిక బలాన్ని అందించగలిగిన కౌన్సిలింగ్ సెంటర్లు, ఉపాధి కేంద్రాలు నెలకొల్పాలి.
స్త్రీలు, తల్లిదండ్రుల పరంగా పరిష్కార మార్గాలు
ముందు జాగ్రత్తగా, ఆడవాళ్ళు, అమ్మాయిలు తమ ఫేస్ బుక్ ఎకౌంటు, ఇతర సామాజిక నెట్వర్క్‌లలో ఎక్కువ ఫోటోలు పెట్టకుండా ఉండడమే మంచిది. కొందరు ఆకతాయిలు అమ్మాయిల వివరాలు సేకరించి, వారి పేరుతో, అడ్రస్‌తో, ఫోన్ నెంబర్‌తో, ప్రొఫైల్ సృష్టించడం, వెకిలి వ్యాఖ్యలు పంపడం, ఏవేవో అసభ్య చిత్రాలు పోస్ట్ చెయ్యడం వల్ల సమాజంలో ఆడపిల్లలు, యే తప్పు చెయ్యకుండానే, తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తోంది. ఇలా తమ వ్యధను బయట చెప్పుకోలేక, తమ నిజాయితీని నిరూపించు కోలేక బాధ పడుతున్న ఆడపిల్లలు ఎందరో. కాళ్ళ బేరానికి వెళ్ళిన అమ్మాయిలతో డబ్బు, ఇతర బేరాలు కుదుర్చుకుని వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు.
తమ పిల్లలు ఎక్కడ ఉన్నా సరే, వారితో క్రమం తప్పకుండా మాట్లాడుతూ, వారి స్నేహితులపై, వారి ప్రవర్తనపై నిఘా ఉంచాలి. అతి నమ్మకం ఈరోజుల్లో కూడదు.
వీలున్నంతవరకూ స్త్రీలు ఒంటరిగా కాక, ఒక బృందంగా ప్రయాణించాలి. అమ్మాయిలు కొత్తవారిని కలిసేందుకు వెళ్తున్నప్పుడు, ఒంటరిగా వెళ్ళకూడదు.
ముక్కూ, మొహం తెలియని వారిని సామాజిక నెట్వర్క్‌లలో కలిసి, గుడ్డిగా నమ్మి, వివరాలు అందించి, అతి చనువు సంభాషణలు చెయ్యకూడదు. మగవారి మోసపూరిత పొగడ్తలకు పడిపోయి, వారితో వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు.
ప్రేమ పేరుతో వంచిస్తున్న ఈ రోజుల్లో, స్వంత నిర్ణయాలు తీసుకుని, తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడపకూడదు. సినిమాల్లో, టీవీల్లో చూపినంత మాత్రాన ప్రేమించడం తప్పనిసరి కాదన్న విషయాన్ని గుర్తించాలి.
ఆటోలలో ఎక్కేటప్పుడు డ్రైవర్ వాలకం గమనించాలి. ఏ ఆటోలో ఒంటరిగా ఎక్కినా, ముందుగా ఆ ఆటో నెంబర్ ఫోనులో నమోదు చేసుకునీ, ఆప్తులకు మెసేజ్ పంపాలి.
ముందుగా ఎవరికి సత్వర రక్షణ అందించగలిగింది, వారే అన్న సత్యాన్ని గ్రహించాలి. అత్యవసర ఫోన్ నెంబర్‌లు ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలి.
ప్రలోభాలకు లొంగకూడదు, తెలియని వారి ఇళ్ళకూ, వారితో విహార యాత్రలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఒక పురుషుడు తన వంక చూస్తున్నప్పుడు, అతని కళ్ళలో ఉన్న భావాన్ని క్షణ కాలంలో పసిగట్టగలదు స్త్రీ. ఎదుటి వారి చూపులు తనను ఏ దృష్టితో, ఎక్కడెక్కడ తడుము తున్నాయో గమనించి, అప్రమత్తం కావాలి.
స్త్రీకి స్త్రీ శత్రువు… అన్నవిధంగా నమ్మిన స్నేహితురాళ్ళు వంచిస్తున్న రోజులివి. హాస్టల్స్‌లో ఉన్న స్త్రీలు తమ స్నేహితురాళ్ళతో సైతం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు తమ వివరాలను ఎవరికైనా అందిస్తున్నారేమో గమనించుకోవాలి.
అన్యాయం జరిగిన స్త్రీలు పరువు, కుటుంబ ప్రతిష్టల కోసం మాత్రమే ఆలోచించక, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు, ధైర్యంగా ముందుకు వచ్చి, మహిళా హెల్ప్‌లైన్‌లను ఆశ్రయించాలి.
నిర్భయ కేసులో అత్యాచారానికి గురయి, నిస్సహాయంగా ఉన్న వారు, ఆసరా కోసం ఎన్నో గంటలు రోడ్డుపై గాయాలతో పడి ఉన్నారని తెలుసుకున్నాము. సమాజంలో అటువంటి సంఘటనలు తారసపడినప్పుడు, ప్రజలు వెంటనే స్పందించాలి. అదే స్థితిలో తమ వారు ఉంటే ఏమి చేస్తారో, అన్న మానవీయ కోణం నుంచీ ఆలోచించాలి. తాము నేరుగా సహాయపడలేకపోయినా, అనుమానాస్పద విషయాలు కనిపిస్తే, వెంటనే పోలీసులకు వివరాలు అందించాలి.
మన దేశపు మొగ్గలను పూర్తిగా విచ్చుకోకుండానే చిదిమేస్తున్నారు. ఇటువంటి సంఘటనలను అరికట్టాలంటే, పూర్తి వ్యక్తిగత, ప్రభుత్వ, సామాజిక చైతన్యం అవసరం.