– పసుపులేటి గీత
పాదరసపు జవాబుల్లోంచి
జవాబుదారీతనాల్లోంచి
రెక్కల ప్రశ్ననై ప్రయాణమయ్యాను.
జనావాసాలకీ, అరణ్యాలకీ మధ్య
తేనె సైనేడ్ల దారులనల్లుకుంటూ
బస్సు సాలీడు బయలుదేరింది.
దారులన్నీ ప్రవహిస్తున్నాయి,
ఈ చివరన నిలబడి చూస్తే
ఎక్కడా చిన్న చీలికైనా లేకుండా
నేల మీద పరచుకున్న ఆకాశంలా
రోడ్డు ఏకమొత్తంగా కనిపిస్తుంది,
ఏకత్వానికి ప్రతీకవుతుంది.
కానీ ప్రయాణించే కొద్దీ,
అది సిగ్నళ్ళుగా, ట్రాఫిక్ జామ్లుగా, మలుపులుగా,
సవాలక్ష దారులవుతుంది.
నన్ను నన్నంతా దారుల కూడలిగా మార్చిన
రహదారులన్నింటా రక్తనాళాలెండిన జాడలే.
కానీ దారంతా పాదముద్రలే,
నేలంతా చక్రాలు కుళ్ళగించిన తాజా గాయాలే.
ఆ దారి నిద్రకూ, మెలుకువకూ కూడా దూరమై
అసహనంగా అటూ, ఇటూ కవాతు చేస్తోంది.
సణుగుతున్న దారిలోంచి,
సలుపుతున్న గుండెలోంచి
నేను మందినై, మాటనై, పాటనై,
కేరింతనై, ఉరకనై, ఉత్సాహాన్నయి
నాగరిక నగిషీల ఉత్పాతాన్నై
తపోకాసారంలోకి పిడుగుపాటునై
అడవి ధ్యానముద్ర మీద
అలవిమాలిన పిడుగుపాటునయ్యాను.
హఠాత్తుగా దారులన్నీ ముడుచుపోయాయి,
లుంగచుట్టుకున్నాయి
దారి మీద బళ్ళన్నీ ఇళ్ళకెళ్ళిపోయాయి
వెలుగు, ధైర్యం సన్నగిల్లాయి
వెన్నెల మసకబారింది,
దారులు మూడంకె వేశాయి
దారి పక్కన మాటలు మరచిన మోళ్ళు
ఆకుల్ని రాల్చేసుకున్నాయి,
జలపాతం పుకార్లని పుక్కిళిస్తోంది
గాయానికి మచ్చికైన జంతువులా
ఎందుకోగానీ, అడవి అడవంతా సలుపుతోంది
ఎండుటాకుల దిబ్బల మీద
ఇంకా తడియారని నెత్తుటి కేకలు గుసగుసలాడుతున్నాయి
భాష మరచిన మైలురాయి
వసంతాన్ని వెలివేసిన
ఒకానొక శిలాజపథంలోకి దవుడు తీసింది.
పునాదులు వేసిన దగ్గర్నుంచీ కూలిపోతూనే ఉన్న నగరమొకటి
అడవిని అపహాస్యం చేస్తూ నృత్యబీభత్సాన్ని ఆవిష్కరించింది.
నా జాతి మరచిపోయిన సిగ్గుమొదళ్ళ ఆనవాళ్ళు
అడవి నట్టనడుమ గజ్జెకడితే, నేను వాటికి వెలకట్టాను.
ఇకో టూరిజాన్ని భుజాన వేసుకుని
నేను గిరిజన సంక్షేమానికి నడుమిచ్చాను.
నాలో నాగరిక అవమానానికి
డబుల్ డెమ్మీ సైజు పత్రికలు సరిపోవు
నిరంతర ధారావాహికలుగా
అవి ప్రవహిస్తూనే ఉంటాయి.
నా ఛద్మవేషపు అంగీలో
హైపోథెర్మిస్ సుడిగాలి వణికింది.
నా మెళ్ళోని చిక్కుడు గింజల మాల
కొండపూల నడుమ చిన్నబోయింది.
చెట్టు నా భుజం మీద టాటూగా పచ్చబారింది
భుజమిచ్చినట్టే ఇచ్చి,
పత్రహరితానికి ఇప్పదోసిలి ఒగ్గాను
ఆకుపచ్చ స్తన్యంలో ఉప్పుకల్లునయ్యాను
కాళ్ళకింది మట్టిచాపను ఎప్పుడు లాగేస్తానో తెలీదు
కానీ నేను ఆ కళ్ళనిండా మమకారమయ్యాను.
నిమిషపు బెజ్జం నుంచి జారిపడిన
క్షణాలన్నీ నా మీద జెర్రులై పాకుతున్నాయి
యోధుని కోసం వెదకమని నేను యుద్ధాన్ని పంపించాను
కానీ పాపం, దానికి అతని జాడే దొరకలేదు
పాదాల్ని మోసుకుని అతను వెళ్ళిపోయాడు.
బాటలో నలిగిన ఎండుటాకులు
పదముద్రల్ని గుండెల్లో దాచుకున్నాయి
దారి పథికుణ్ణి కనిపెట్టింది.
ఆ పథికుడు బందూకు బావుటాగా,
స్థూపంగా నిలబడి అజ్ఞాతంగా
దారికి కాపలా కాస్తూనే ఉన్నాడు.
రోడ్డు పక్కన ఇనుప సంకెళ్ళ దుకాణం
సందేహాల్ని పల్లీల్లా అమ్ముకుంటూ
మా దగ్గరికి వచ్చాడొకడు,
కానీ చిత్రంగా వాడు
మా దగ్గరున్న అనుమానాలన్నింటినీ దోచుకుని పారిపోయాడు.
కొంచెం గాయాన్ని, మరికొంచెం గేయాన్ని,
కొంచెం దాహాన్ని, మరికొంచెం ప్రవాహాన్నీ వెంటబెట్టుకుని
తొలగిన ముసుగుల్ని ఉతికి, ఇస్త్రీ చేసి, మడత పెట్టుకుని
ఇంటి ముఖం పట్టిన దారులన్నీ
అలుపుసొలుపులేని నెలవారీ పోరాటాల్లోకి
అనూదితమవుతాయి.
అందమైన దారులన్నీ నాలోకి, నీలోకి నడిచొచ్చేస్తాయి
అప్పుడు వాటిని ఎక్కడికి వెళుతున్నావని అడక్కూడదు.
నిందల్ని, నిట్టూర్పుల్ని,
ఆవేశాల్ని, కావేషాల్ని మట్టికరిపించి,
ఆకుపచ్చని రాతిచివుళ్ళయి, పూల లోయలై,
వాగు చంద్రవంకలై,
నేను నేనంతా మేమైతే,
రెక్కలొచ్చి, రేకులు విచ్చి
పాదాల కింద దారి
పట్టుపులుగవుతుంది.
దారంటే ప్రయాణమే తప్ప, గమ్యం కాదు.
(భూమిక మిత్రబృందంతో కలిసి 20-1-14న ఆదిలాబాద్, నిజామాబాద్‌లలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన జ్ఞాపకాల్లోంచి…)