– తంగిరాల వెంకట సుబ్బారావు
కవిమిత్రులు శ్రీ లకుమ బూదేశ్వరరావుగారు ”ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ ఫౌండేషన్ (యంయస్యస్యఫ్)” ను స్థాపించి, ఆ దివ్యగాయనీమణి గొప్పతనాన్ని తెలుగువారికి చాటి చెపుతూ, 2006లో ”స్మృతి కవిత” అనే 40 పుటల చిన్న గ్రంథాన్ని; 2012లో ”స్వరగంగ” అనే 300 పుటల పెద్ద గ్రంథాన్ని ప్రచురించారు. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఈ పుస్తకాలను చాలా అందంగా ముద్రించారు. వీటిలో ఎం.ఎస్. గారివి ఎన్నో మంచి మంచి ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథాలు రెండూ ఎం.ఎస్. గారి వజ్రాల దుద్దుల జతలా ధగధగా మెరుస్తున్నాయి అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు.
చిన్న పుస్తకం ”స్మృతి కవిత” లో ఎం.ఎస్. నిర్యాణానికి చింతిస్తూ ప్రముఖ కవులు వ్రాసిన కవితలున్నాయి. వీటిలో మాజీ రాష్ట్రపతి డా|| ఎ.పి.కె. అబ్దుల్ కలాం గారి కవిత ‘గీతాంజలి’ (అనువాదం) కూడా ఉండటం విశేషం. శ్రీ ఈత కోట సుబ్బారావు (‘తొలి నామం’) డా|| ఎల్.కె. సుధాకర్, శ్రీ తనికెళ్ల భరణి (‘ఎం.ఎస్.అంటే’), శ్రీ శిఖామణి (‘పాటల పాలవెల్లి’) వ్రాసిన కవితలు ఆద్యంతమూ అత్యద్భుతంగా ఉన్నాయి. ఎంతో రసానందాన్ని ఇస్తున్నాయి. మిగిలిన కవుల కవితలలో అక్కడక్కడ కొన్ని మంచి కవిత్వపాదాలు తళుక్కుమంటున్నాయి. ఈ కవితలతో పాటు, ఎం.ఎస్. లాగే సంగీత ప్రపంచంలో మహామహులైన పండిట్ రవిశంకర్, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి డి.కె. పట్టమ్మాళ్, శ్రీ కె.జె. జేసుదాసు మొదలైనవారి సంతాప సందేశాలు కూడా ఉన్నాయి.
”స్వరగంగ” అనే పెద్ద పుస్తకంలో ఎం.ఎస్. ను గురించి వివిధ పత్రికలలో వచ్చిన చిన్న చిన్న వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. సంగీతాభిమానులైన ప్రత్యేక వ్యక్తులు వ్రాసిన పెద్ద వ్యాసాలు కూడా కొన్ని లేకపోలేదు. వీటిలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మిగారు- ఆమె భర్త సదాశివన్గారు బ్రతికి ఉన్న సుఖ సంతోషాల రోజులలో ప్రచురింపబడిన వ్యాసాలు కొన్ని; సదాశివన్ గారు చనిపోయిన తరువాత ఎం.ఎస్. ఏకాకితనంలోను బాధను తెలియజేసే వ్యాసాలు మరికొన్ని; ఎం.ఎస్. మరణించిన తరువాత సంగీత రసజ్ఞుల కన్నీటి నివాళులతో కూడిన వ్యాసాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలా మూడు విధాలుగా ఉన్న వ్యాసాలన్నీ ఎం.ఎస్. జీవితంలోని ఎన్నో రసవత్తర ఘట్టాలను పాఠకులకు తెలియజేస్తూ వారిని ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నాయి. ”ప్రత్యక్షదేవత” వంటి వ్యాసాలు ఎం.ఎస్. దాతృత్వాన్ని తెలియజేస్తూ పాఠకుల్ని కంటతడి పెట్టిస్తాయి.
ఈ ”స్వరగంగ”లో చిన్నవీ పెద్దవీ మొత్తం 72 వ్యాసాలున్నాయి. వీటిని ‘లకుమ’ గారు 12 భాగాలుగా విభజించి, ఒక్కొక్క భాగానికి ‘భారతరత్న’ రాసులు, వజ్రపు ‘దుద్దులు’- బంగారు ‘బేసరలు’- మంచి ‘ఫ్రెంచిపెర్ఫ్యూమ్లు’- జ్ఞాపకాల ‘మల్లెపూలు’- ఇంటర్ దశల ‘మట్టిగాజులు’- ఇత్యాదిగా ఎంతో కవితాత్మకమైన శీర్షికలు ఉంచారు. 12వ విభాగంలో తన మొదటి పుస్తకమైన ”స్మృతి కవిత” పై కవుల విమర్శకుల అభిప్రాయాలను ”వ్యూలు-రివ్యూలు” అనే పేరుతో ప్రచురించారు. వీటిలో నాలుగు వ్యూలు, ఐదు రివ్యూలు ఉన్నాయి. మొత్తంమీద ఇది సంగీత రసజ్ఞులందరూ జాగ్రత్తగా భద్రపరచుకోవలసిన అపురూప గ్రంథం. ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పాలగుమ్మి విశ్వనాథంగారు వ్రాసిన ”ఎం.ఎస్. స్వరలక్ష్మి” అనే వ్యాసం ”స్వరగంగ” అనే ఈ పుస్తకానికి మణిమకుటం! ఇది అత్యద్భుతమైన సమగ్రమైన వ్యాసం!
మనకు సాహిత్యాన్ని గురించి కొంతలో కొంత తెలుసు. సంగీతాన్ని గురించి అంతగా తెలియదు. ఆ తెలియని రంగంలో మహారాజ్ఞ వంటి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారిని ఈ రెండు గ్రంథాల ద్వారా తెలుగువారికి ఎంతో సుందరంగా పరిచయం చేసిన ‘లకుమ’ గారిని మనసారా అభినందిస్తున్నాను….