– జూపాక సుభద్ర
ఈ ఐదేండ్లనుంచి ఆడపిల్లల మీద మరీ ముఖ్యంగా టీనేజి అమ్మాయిల మీద విపరీతంగా లైంగిక దాడులు, కిడ్నాపులు, అత్యాచారాలు ఎక్కువైనాయి. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బంగారమోలె దాసుకునే పరిస్థితులున్నయి. తల్లిదండ్రులు బైటికిబోయి న ఆడపిల్లలు యింటికొచ్చేదాక గజగజ వణుకుతున్నరు. యిదివరకు ఆడపిల్లలు స్కూల్లకు, కాలేజీలకు, పనులకు బోయేవాల్లు చాలా మామూలుగా ఒక్కరే పొయొచ్చేది. కాని యిప్పుడట్లా లేవు కాలాలు. యింట్ల బైట ఆడపిల్లలు భయంభయంగా బతికే ముదనష్టం కాలంల వున్నము.
యిప్పుడు కొంతమంది తల్లిదండ్రు లు స్కూలుకు, కాలేజికి తమ ఆడపిల్లల్ని తీస్కపోయి తీసుకొచ్చుకుంటుండ్రు. యిక పనులకు బోయే ఆడపిల్లల పరిస్థితులు రక్షణలు కనాకష్టంగున్నయి. యిట్లాంటి అభద్రతల్లో ఈ దేశం ఆడపిల్లల బతుకులు భయంభయంగా సాగుతున్నయి. నిత్యం వందల్లో వేలల్లో వున్నయి ఈ అగాయిత్యాలు.
యివన్నీ పట్నాల్లోనే పల్లెల్లో అందులో అడివిగ్రామాల్లోకి యిట్లాంటివి వెల్లలేదు అనే అపోహ వుండేది. కానీ నాకీ మధ్య మా బంధువుల్లోనే జరిగిన ఘటన చూసి బుర్ర నీల్లయింది. మా బంధువమ్మా యి పదారేల్ల పసిబిడ్డ. యిప్పుడిప్పుడే చదువుకుంటున్న మొదటితరమ్, వాల్లది అడివిలో వుండె బుడ్డపల్లె. ఆ పల్లెల నిచ్చెనమెట్ల కులసమాజం లేదు మాదిగ, లంబాడీ రెండు కులాలే. యీ రెండు కులాల మధ్యనే వియ్యాలు, కయ్యాలుంటయి. అడివిలో పోడు వ్యవసాయం చేస్కుంటరు. కులాధిపత్యం కులచట్రాలు లేని, బైటి అనాగరికతలు అంటని అడివిపల్లె అనీ నాకు చాలా యిష్టముండేది యీ పల్లె అంటె.
అట్లాంటి పల్లెలో ఇంటర్ చదివే అమ్మాయి మీద అంతే వయసున్న బందువుల మొగపోరగాండ్లు యింట్ల యెవరులేని సమయం జూసుకొని ఆ అమ్మాయి నోట్లె గుడ్డలు కుక్కి కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేసి పారిపోయిండ్రు. ఆ ఘటనకు అవమానపడి వుద్వేగపడి మెనోసల్ఫాన్ తాగింది ఆ అమ్మాయి. దాంతో కోమాలోకి బోయి చావుబతుకుల కండిషన్‌లో రూపాయి పెట్టుకునే పరిస్థితి వున్నవాల్లు కాకున్నా తల్లిదండ్రులు గవర్నమెంటు హాస్పటల్‌లో సూదుంటే మందుండది, మందుంటే సూదుండని స్థితి అనీ… ఎట్లయినా పిల్లను బత్కిచ్చుకోవాలెనని ప్రైవేటు హాస్పటల్లో వేసిండ్రు. దానికోసం ఎడ్లు, బండమ్ముకు న్నరు. భూమి గిరువుకు బెట్టిండ్రు. పోలీస్టేషండ్ల కేసు బెట్టాలనే సంగతి గూడ తెలువని తల్లిదండ్రులు.
కొన్ని సోషల్ ఆక్టివ్ గ్రూపుల సాయంతో పోలీస్ స్టేషండ్ల కేసు బెట్టించి నిందితుల్ని పాక్సో, నిర్భయ చట్టం కింద అరెస్టు చేయించడం జరిగింది. యీ చట్టాల గురించి సోషల్ ఆక్టివ్ గ్రూపులకే పూర్తిగా పట్టలేదు. యిక మామూలువాల్లకు, పల్లెటూరు, చదువుకోనివాల్లకు తెలిసే అవకాశమే లేదు.
కోమాలో హాస్పటల్లో వున్న అమ్మాయికి జరిగే చికిత్స ఖర్చుకు సంబంధించి ప్రభుత్వాలకు పట్టలే. నిర్భయ చట్టంలో బాధితురాలికి రిహాబిలిటేషన్ యివ్వాలని వుంది, కాని అది జడ్జిమెంట్ అయిన తర్వాత యిస్తారట. యీలోగా యిట్లాంటి రిస్క్‌లో వున్న బాధితురాలి పరిస్థితేంటి? ఆ బాధితురాలికి సరియైన చికిత్స అందక, సాయంలేక చచ్చిపోవాల్సిం దేనా! జిల్లా కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెల్‌కి ఘటన మీద, అన్యాయమ్మీద సాయంకోసం నిర్భయ చట్ట ప్రకారం రావాల్సిన తక్షణ రిహాబిలిటేషనిస్తే… వాల్లు కలెక్టర్‌కి పంపి చేతులు దులుపుకుంటరు. అసలు ప్రైవేట్‌లో ఎందుకు చేర్చారు? ప్రభుత్వాసుపత్రిలో వేయండి, చేద్దాం చూద్దామనే చర్యలు. అస్మిత, దళిత హెల్ప్ డెస్క్ వెంటనే అందించిన కొంత ఆర్థిక సాయం, చైల్డ్‌కేర్‌వాల్లు భూమిక, మానవహక్కుల వేదిక, దళితస్త్రీశక్తి, యింకా కొంత మంది వ్యక్తిగతంగా మేమున్నామనే ధైర్యం, సపోర్టు ఆ అమ్మాయి కుటుంబానికి కొంత వూరట కలిగించింది.
అట్లాంటి పేద దళిత బాధిత మహిళలకు వెనువెంటనే ప్రభుత్వాలనుంచి ఆర్థికసాయం, లేదా క్రెడిట్‌గానైనా అందించి వుంటే… ఆ అమ్మాయి తల్లిదండ్రులు తాహతుకు మించిన అప్పులు చేసి వుండేవారు కాదు. ‘మేము అమ్ముడుబోయైనా మా బిడ్డను బత్కిచ్చుకుంటమనే’ పట్టుతో వున్నందునే ఆ అమ్మాయి కొంతవరకైనా కోలుకుంది.
ఆడపిల్లల్ని అల్లరిపెట్టే కల్చర్, అత్యాచారాలు చేసే కల్చర్ అడివిపల్లెలక్కూడా పాకిన పాపము టీవీ సినిమాల వల్లనే. యిట్లాంటి హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు ఎందుకు పెచ్చరిల్లినయి. వీటి విరుగుడుకు ఏంచేద్దాం? చట్టాలు చేసి చేతులు దులుపుకోకుండా ఆ చట్టాలు ప్రజలకు కూడా పూర్తి దశలో అందించే ప్రభుత్వ పౌరసంస్థలుండాలి. పాక్సో చట్టం నుంచి నిర్భయచట్టం దాకా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలి.