ఔను మిత్రమా….!
నేనిప్పుడు ఆమె నిషిద్ద దుఃఖం
గురించే రాస్తున్నాను
తరతరాలుగా
కావ్యాల నిండా వర్ణించబడిన
అవయవాల, చర్మపు పొరల సరిహద్దులు దాటి
జాలికి కూడా నోచుకోని
ఒక వేదనాభరిత
అనివార్య దుఃఖం గురించే రాస్తున్నానిపుడు
గోడ మీద వేళ్ళాడే కాలెండర్
మొహమ్మీద
ఎర్రని అంకెలనీ ఆదివారాలనీ,
విశ్రాంతి దినాలనీ నువ్వు వెతుకుతున్నప్పుడు
తన రెండు కళ్ళూ ‘ఆ మూడు రోజులనే’
భయంగ చూస్తామే
తరాలుగా తనని అణగదొక్కే
ఆయుధాలుగా మన చేతుల్లో ఉన్న ఆయుధాలివి.
ఒక్క క్షణం ఉన్నట్టుండి ఉలిక్కిపడుతూ
తాను కొన్ని నిమిషాలు
మన ముందు నుండి అదృశ్యమైపోతుంది
నాలుగు గోడల మధ్య
గర్భాలయపు గోడలని కడిగిన ‘పవిత్ర రక్తం’,
ఏ దేవుని సింధూరానికీ తీసిపోని రక్తం వెల్లువై
ప్రవహిస్తూంటే…. నిస్సహాయంగా
గాయపరిచిన అదృశ్య ఆయుధాన్ని
వెతుకుతూ….
అనంతానంత క్షోభని పొత్తికడుపుతో అదిమిపెడుతూ
కళ తప్పిన చందమామలా
నెలసరితో ఆమె వాలిపోతుంది.
అక్కడినుండే ఇక కొన్ని గంటలపాటు
మన ఆధిపత్యపు కళ్ళకి
ఇంట్లో అయితే పని దొంగలా
బయటైతే కాముకత్వపు చూపుకి
వెకిలినవ్వులూ, వెటకారపు మాటలూ విసిరేసే
చెత్తబుట్టలా కన్పిస్తుంది.
మిత్రుడా..!
నాకన్పిస్తుందొక్కోసారి
నీకూ నాకూ ఆమె మనిషిగా కాక
ఆడదిగా కనిపించినంత కాలమూ
మన మెదడు పొరల్లో
ఒక స్త్రీత్వపు దీపం వెలిగి
జాత్యహంకారాన్ని కాల్చేయనంత కాలమూ…
శీలం అనేది కొన్ని అంగుళాల, అవయవాల నుండే
తన పరిధిని విస్తరించుకోనంత కాలమూ….
మనకు ఆమె నిశ్శబ్దపు నిషిద్ధ దుఃఖం
అర్థం కాదేమో…..!!