ఆమె హృదయంలో ద్రవీకరణ ఎక్కువ
ఆలోచనలకు అడ్డంగా బండరాళ్ళు
అక్కడక్కడా ఎదురైనా
కష్టాల సుడిగుండాలు గుండెని చుట్టుముట్టినా
నిశ్శబ్ద పవనాలు అన్నింటినీ ఇంకించాయామె హృదయంలో!
వచ్చిన వాళ్ళకు పిడికెడు గింజలు
ఓదార్చిన వాళ్ళకి గుప్పెడు హితోక్తులు
పోసి ఎన్నో సంఘటనల్ని
వండి వార్చింది!
ఆధిపత్యపు విషపు కోరలు
దిగబడ్డ చోటల్లా శరీరంలో
జీవగతుల స్వప్నాలు సర్వనాశనమై పోయి
అలలు అలలుగా మనసు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి!
చలన శీలమైన ఆమె జీవితం
తనను తాను రక్షించుకునే
అస్తిత్వ సమర కవాతుకు సిద్ధమై పోయింది.
తనను తాను సమీకరించుకునే
అధినాయకత్వపు అజెండాని
ఎవరెస్ట్‌పై ఎగరెయ్యాలని తపన పడింది.
దైవం మరోలా వుంటే
ఎడారులు సస్యశ్యామలం ఎందుకవుతాయి?
కాలం లడాయి బుద్ధిని ఎందుకొదులుకుంటుంది?
ఆడవాళ్ళ గుండెల్లోని నదులూ వాగులూ
నిర్దాక్షిణ్యపు దాష్ఠీకానికి ఇంకిపోతూ
నిర్భయ చట్టంలో లొసుగులై
ఆనవాలు లేకుండా పోతుంటే
మహోన్నత హిందూ వాహినులు
ఇంకిపోవా ఈ దేశంలో!!