నా ఈడు స్నేహితులం
నలుగురం కలుసుకుంటే
మొదటగా మాట్లాడుకునేది
ఆరోగ్యాల గురించే.
మోకాళ్ల నొప్పులో
థైరాయిడ్ తిప్పలో
స్పాండిలైటిస్ బాధలో
షుగర్ లెవెల్స్ కథలో…
ఎప్పుడూ వీటిగురించేనా అంటే
ఏం చెప్తాం!
విషాదంలో
చిరునవ్వును కలుపుకొని
తాగడమే జీవితమైతే!
అయితే
సాగివచ్చిన దారిని తలుచుకొని
మురిసిపోనని కాదు.
దూరభారాల్లో
మమతల దారాలను మరిచిపోలేదు.
నా బాల్యం
నా పిల్లల బాల్యంలో రీప్లే అయ్యింది.
యవ్వనమేగా
ఇన్ని బాధలకు మూలం!
కానీ
వసంతమే లేకపోతే
జీవితం నిండా
ఇన్ని పువ్వులు పరుచుకునేవా!
జీవితం ఒక వీణ
కొన్ని తీగెల్లోని విషాదమే
ఇతరుల కష్టాల్లోకి తొంగిచూసే
గవాక్ష రాగమౌతుంది.
నీలోని మౌలిక దుఃఖమే
మానవాళికి ఆశీర్వాదమౌతుంది.