తెలంగాణా పోరాటంలో పాల్గొన్న స్త్రీలను కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఉత్సాహం. అనుభవాన్ని వివరించటంపట్ల వాళ్ళు చూపించిన ఆసక్తిలో అప్పటి ఉద్యమం వాళ్ళకిచ్చిన ప్రోత్సాహం, ధైర్యం, స్వేచ్ఛ స్పష్టంగా మాక్కనపడ్డయ్. వాళ్ళ ఉత్సాహాన్ని ఇంటర్వ్యూల్లో మేమూ పంచుకున్నాం. జీవితంలో ఎప్పుడూ ఊహించనటువంటి అవకాశాలు రావటం, కొత్త ప్రపంచం గురించి కలలు కనటం వాళ్ళకు మాత్రమే కాదు, వాళ్ళ మాటల్లో మాకూ అనుభవమయింది.
మమ్మల్ని వాళ్ళెంత స్నేహపూర్వకంగా సహృదయంతో ఆహ్వానించారనేది తల్చుకుంటే మనసు గర్వపడుతుంది. కాని మామీద వాళ్ళకంత నమ్మకం ఉండటానికి కారణం ఏమిటి? వాళ్ళ అనుభవాల్ని చాలా విలువైనవిగా గుర్తించి వాటిని రికార్డు చేసుకోవాలనుకోవటమే వాటిని పంచుకునే అవకాశాన్ని మాకిచ్చిందా అనిపిస్తుంది. ఎంతో కాలంగా చూడని ఆత్మీయుల్ని తిరిగి కలిసినట్టు మమ్మల్ని ఆదరించారు. స్త్రీలుగా మా పోరాట సంప్రదాయాన్ని తెలుసుకోవాలని చేసే ఈ ప్రయత్నంలో వాళ్ళ గత చరిత్రలే మాకు ఆధారాలయినై. ఇంటర్వ్యూల్లో వాళ్ళు మర్చిపోయారనుకున్న పోరాట సంప్రదాయపు గతం ప్రాముఖ్యతను తిరిగి వాళ్ళకే గుర్తుచేసినట్టయింది. కమలమ్మ ఇట్లా అంటుంది : ”మేం చేరిత్ర సృష్టిస్తున్నాం అన్నారు. ఇప్పుడు మీరొచ్చినదాకా మమ్మల్ని అడిగిన వాళ్ళులేరు.” ”మా చరిత్రలు రాసిన వాళ్ళెవరు? ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళెవరు? మీరు చేస్తుంటేనన్నా చెప్పాలి కదా!” అంటుంది స్వరాజ్యం.
అట్లా ఎంత సమయాన్నయినా మాతో గడపటానికి నిరాకరించలేదు. చికాకుపడలేదు. పైగా ఇష్టపడ్డారు. మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ పనికి ఉన్న ప్రత్యేకతను గుర్తించారు. దానికి తోడ్పడటం వాళ్ళ బాధ్యత అనుకున్నారు. ఈ పనిని చివరివరకు సక్రమంగా నిర్వహించగలుగుతామని మా శక్తి మీద వాళ్ళుంచిన నమ్మకం, మా బాధ్యతనింకా ఎక్కువ చేసింది.
అయితే అసలు వీళ్ళెవరు? ఎక్కడినుంచొచ్చారు? పెద్ద సంఖ్యలో ఉద్యమంలోకెందుకొచ్చారు?
చెప్పాలంటే అందులో అన్నిరకాల వ్యక్తులూ ఉన్నారు. రైతుకుటుంబాల నుంచీ మధ్య తరగతి, భూస్వామ్య కుటుంబాలనుంచీ వచ్చిన వాళ్ళున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం, ఒకామె అనాథాశ్రమంలో పెరిగి పెద్దదయింది. తల్లిని పోషించడానికి టీచరయింది. ఒకామె దేవదాసీల కుటుంబంలో పుట్టింది. ఇంకొకామె హింసించే భర్తనీ, వివాహ జీవితాన్నీ వదిలి ఉద్యమంలో కొచ్చింది. ఒకామె అతినిష్టాపరులైన కుటుంబంలో పుట్టి అయిదవ ఏటనే బాల్యవివాహం చేసుకున్నది. వీళ్ళందరూ మధ్యతరగతికి చెందినవాళ్ళే. ఏదో ఒక రకమైన పరదా, ఘోషా పద్ధతులనవలంబించే కుటుంబాల వాళ్ళు. వంటిళ్ళూ, ఇళ్ళ నాలుగుగోడలూ తప్ప బయటి ప్రపంచమేంటో ఎరగని వాళ్ళు. కుటుంబం కోసం శ్రమించటమే కాకుండా బయట ఇంకా ఎన్నోరకాల అనుభవాలుంటాయని గుర్తించే అవకాశం వాళ్ళకి మొదటిసారి కలిగింది.
సమాజంలో స్త్రీల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఆ సమాజం స్త్రీలను కొన్ని పరిమితుల్లో పరిధుల్లో ఎట్లా ఉంచుతుందో అర్థం చేసుకోవటం అవసరం. సమాజం ఎప్పుడూ ప్రైవేటు పబ్లిక్‌రంగాలనే పరిధుల్ని చాలా జాగ్రత్తగా, మనక్కనిపించనీయకుండా నిర్వహిస్తూనే ఉంది. ఇవి రెండూ రెండుప్రపంచాలని ఒకదానితో ఒకటి ఎంత దగ్గర సంబంధం కలిగి ఉన్నా, ఏ మాత్రం సంబంధంలేని వాటిలా కనిపిస్తాయని గుర్తించటం, మన అణచివేతనర్థం చేసుకోవాలంటే చాలా ముఖ్యం. కుటుంబం, ఇల్లు, పిల్లలు, సెక్సువాలిటీ (సెక్సువాలిటీ అంటే తెలుగులో లైంగికత్వం అని అనువాదం ఉంది. కాని మా ఉద్దేశంలో అది సరైన అర్థాన్నివ్వదు. మన శరీరం పట్ల మనం ఏర్పరచుకున్న భావాలు, ఇతరులతో స్పందించే పద్ధతి, సమాజానికున్న విలువలు, నమ్మకాలు అభిప్రాయాలు, ఇవన్నీ కలిసి సెక్సువాలిటీ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు- సంస్కృతి పరమైంది, రాజకీయమైంది.) లన్నీ ప్రైవేటు ప్రపంచం – ఆడవాళ్ళు ప్రధానంగా ఈ ప్రపంచానికి పరిమితమై ఉన్నారు. రాజకీయాలు, రచ్చకబుర్లు, ఉత్పత్తి, యుద్ధాలు, ఉద్యమాలు, విప్లవాలు- అన్నీ పబ్లిక్ ప్రపంచానికి చెందినవి. ప్రధానంగా మగవాళ్ళ ఆధిపత్యంలో ఉంటాయి. అంటే ప్రైవేటు ప్రపంచం అంతా ఆడవాళ్ళ కంట్రోలులో ఉంటుందని కాదు. వాళ్ళా పరిధిని దాటివచ్చే అవకాశం ఉండదు. మగవాళ్ళకే ఏ పరిమితుల్లేకుండా రెండు ప్రపంచాల్లోనూ మసిలే అవకాశం ఉంది. స్త్రీల ప్రపంచం అనబడే ప్రైవేటు ప్రపంచం కూడా వాళ్ళ కంట్రోలులో ఉండటమే కాకుండా వాళ్ళకు అనుకూలంగా కూడా ఉంటుంది.
ఇంతవరకు ఈ స్త్రీల జీవితాల్లో ప్రైవేటు ప్రపంచానికి, పబ్లిక్ ప్రపంచానికి మధ్య అడ్డుగోడ చాలా గట్టిగా ఉంది. వీళ్ళు ఆ ప్రైవేటు ప్రపంచం బయటి పరిధిలోకి కనీసం తొంగికూడా చూడలేదు. అట్లాచూస్తే పరదా అనేది కంటికి ప్రత్యేకంగా కనిపించే అడ్డుగోడ మాత్రమే కాదు. సిద్ధాంత విభజన కూడా. అది మన చూపును, ఆలోచనల్ని, స్వభావాన్నీ, అన్నింటినీ అదుపులో పెడుతుంది. అదే మనకి లక్ష్మణరేఖ. దాయనీ కౌసల్య అంటుంది, ”ఈ పోరాటం రాకముందు నాలుగు గోడల బయట కాలు పెట్టలేదు సరికదా, మా పొలాల్లో పనులు చూసుకోవటానికి అయినా మేం పోక పోయేది” అని.
ప్రైవేటు ప్రపంచం పబ్లిక్ ప్రపంచం అనే విభజన రైతాంగ స్త్రీలకు మాత్రం అంతగా వర్తించదనే చెప్పుకోవాలి. సమాజంలో, ఉత్పత్తిలో, ఎప్పుడూ వాళ్ళు భాగంగానే ఉండటం దానికి కారణం కావచ్చు. అయినా అంతకుమించి రాజకీయాలు, సాయుధ పోరాటాల జోలికి వెళ్ళే అవకాశం వాళ్ళకు రాలేదు. కాని అప్పుడు తెలంగాణాలోని పరిస్థితులు ఆ అవకాశాన్ని కల్గించినై. నిజాం ప్రభుత్వం, రజాకార్లు తెచ్చిన నిర్బంధాల్ని ఎదిరించి ప్రతిఘటనను నిర్మించింది. గ్రామాల్లోని ఈ స్త్రీలే. వెట్టిచాకిరీ, దాస్యం, భూస్వాము లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటం, దేవదాసీ, ఆడపాపల సంప్రదాయాలు, బలవంతపు లెవీలు, దుర్భర దారిద్య్రం-ఇవన్నీ కాకుండా రాక్షస నిర్బంధాన్ని కూడా ఈ స్త్రీలే ఎదుర్కోవలసి వచ్చింది. 1944 తర్వాత నిర్బంధం మరీ ఎక్కువై గ్రామాల్లో మొగవాళ్ళంతా ఇళ్ళొదిలి పెట్టి అడవుల్లోకి పోవల్సొస్తే గ్రామాల్లో మిగిలిన గొడ్డూ, గోదా, పిల్లా పాపా, ముసలీ ముతకల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతంతా వీళ్ళమీదే పడింది. ప్రతిఘటనకి వెన్నెముకయింది వీళ్ళేనని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఒక్కొక్కళ్ళుగా నిర్బంధాన్ని తట్టుకోలేరని సందర్భాన్ని బట్టి గ్రూపులుగా ఉండటం మంచిదని తెలుసుకున్నారు. కలిసికట్టుగా ఉండటంలోనే వాళ్ళకిశక్తి ఉంటుందని గ్రహించారు. అవసరమైనప్పుడు సంప్రదాయాల్ని కూడా ఉపయోగించుకున్నారు. ఒక పిల్ల పెద్దమనిషయిందనో, ఒక ముసలామె చనిపోయిందనో, ఒక పాప పుట్టిందనో వంకపెట్టి అందరూ ఒకచోట కూర్చుని పోలీసులబారినుంచి రజాకార్ల చేతుల్లోనుంచి తెలివిగా తప్పించుకున్నారు. వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళకున్న నైపుణ్యాన్ని అందుబాటులో ఉన్న పనిముట్లని సందర్భానికనుగుణంగా ఉపయోగించుకున్నారు. కారంపొడి, వడిసేలలు, రోకళ్ళు వాళ్ళకు ఆయుధాలయినై. పోరాటంలో పాల్గొన్న వాళ్ళల్లో మెజారిటీ సంఖ్య వీళ్ళదే. వీళ్ళ పేర్లూ, ముఖాలూ, చివరికి వీళ్ళు బతికున్నది లేనిదీ కూడా ఇప్పుడు మనలో చాలామందికి తెలియదు. నాయకత్వపు స్థాయిలో ఉన్న కొద్దిమంది పేర్లూ అందరికీ తెలిసినవే కాని వీళ్ళ గురించి కనుక్కోవడం, వీళ్ళని కలవటం కూడా చాలా కష్టమైనపనయ్యింది. చరిత్రని సృష్టించినా అందులో స్థానంలేని పేరులేని మెజారిటీ వీళ్ళు. ఈ విషయం గుర్తించటానికి మాకూ కొంతకాలం పట్టింది. వాళ్ళ అనుభవాల్ని ఏం ప్రత్యేకతలేదన్నట్టుగా చాలా మామూలుగా చెప్తున్నారని మొదట్లో అనిపించింది. పెసర సత్తెమ్మ అంటుంది. ”ఉగాది పండుగరోజు అన్నం తింటుండగనే వచ్చిరి పోలీసులొచ్చిరి అన్నరు … అంతే అన్నాలూ అన్నీ ఇడిసిపెట్టి ఊరంత బైటికెల్లిన్రు” అని. ”మాకుండలన్నీ గట్లనే పడేసి అడివిలకి పరిగెత్తేది”, అని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళు చెప్పినదంతా ఒకటే ధోరణిలో ఉన్నదా అనిపించేది. కాని, వాళ్ళనుభవించిన కష్టాలు వాళ్ళగొంతుల్లో వినిపించే నిరాశ, బాధ ఎవ్వరికీ మర్చిపోవటం సాధ్యంకాదనిపించింది. వాళ్ళ కుటుంబాలెట్లా నాశనం అయిందీ, ఇళ్ళెట్లా తగలబెట్టబడిందీ, రజాకార్ల హింసలకెట్లా గురయ్యిందీ, ఏ విధంగా గొడ్డూ, గోదా, ధాన్యం నాశనం అయ్యిందీ, అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చిత్రించారు. చిట్యాల అయిలమ్మ అంటుంది. ”కొడవండ్లెత్తుకపోయేదమ్మ, గొడ్డండ్లెత్తుక పోయేది….. నా బిడ్డను దొర్కిచ్చుకున్నరు….. కరాబుజేసిన్రు….. ఓ ఆగం గాదు….. ఒక్క కుండ లేకుంట ఒక్కగాబులేకుంట, ఒక్క గొళ్ళెంలేకుంట అన్ని పల్లగ్గొట్టిండ్రు. పల్లగ్గొట్టి ఇంటికి నిప్పువెట్టిండ్రు.” ఈ సంఘటనలన్నీ నిన్నో మొన్న జరిగినట్టు ఏడుస్తూ చెప్తుంటే, మళ్లీ అప్పటిరోజుల జ్ఞాపకాల్ని తవ్వి తీసి ఆమె మాట్లాడుతుంటే ఆ ఉద్యమం అప్పుడు వాళ్ళ జీవితాల మీద ఎట్లాంటి ముద్రవేసిందీ అర్థమవుతుంది. ప్రతిఘటనా ఉద్యమం నిర్మించటంలోఉన్న ఉత్సాహం, హుషారు, దానితో వాళ్ళు పొందిన ప్రోత్సాహం, అన్నీ వాళ్ళ గొంతుల్లో మనకు వినిపిస్తాయి. అప్పటికాల ప్రభావం, ఒక కొత్త సమాజం రానున్నదన్న ఆశ మూలంగానేమో పోరాటంలో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు లేకుండా ఆ సమాజం రావటం కష్టమని, దానికి స్వేచ్ఛాయుతులైన నూత్న స్త్రీలు అవసరమని భావించారు.
పోరాటంలోకి స్త్రీలు రావటానికి రెండు కారణాలున్నాయి. సమాజంలో సగభాగంగా వాళ్ళకీ బాధ్యత ఉందనేది ఒకటి. రెండవది ఉద్యమానికి వాళ్ళతో ఉన్న అవసరం. నిర్బంధం ఎక్కువైనప్పుడు రహస్యంగా ఉన్న పార్టీలో స్త్రీలుండటం మూలంగా పార్టీకి ఒక మామూలు రూపం ఉండే అవకాశం ఏర్పడింది. డెన్స్‌లో (డెన్స్ – రహస్యంగా ఉన్న పార్టీ సభ్యుల ఇళ్ళు, ఏదో ఒక కల్పితమైన కథతో కుటుంబాల రూపంతో ఉండేస్థలాలు) కుటుంబాలపేరుతో ఆడవాళ్ళ ఉనికి ఉపయోగపడింది. పోలీసుల దృష్టిలో పడకుండా ఉండటానికి ప్రధానంగా గెరిల్లా దళాల్లో వాళ్ళుపయోగపడ్డారు. గ్రామాల్లో ఉద్యమ కార్యకర్తలకు ఆశ్రయానికీ, భోజనంలాంటి సదుపాయాలు చూడటానికీ ఆడవాళ్లు లేకుండా సాధ్యపడేదికాదు. ఇవన్నీ కాకుండా, ఆడవాళ్ళు కూడా పోరాటంలోకొచ్చారంటే మగవాళ్ళకడ్డు పడకుండా ఉంటారనే నమ్మకం ఇంకొక కారణం. మొత్తానికివన్నీ వాళ్ళు ఉద్యమంలోకి రావటానికి దోహదం చేసినై. కోటేశ్వరమ్మ అంటుంది, ”ఒక డెన్ ఉందనుకోండి, ఆ డెన్‌లో నలుగురు మగవాళ్లుంటే అనుమానం కదూ ఫామిలీతో పిల్లా పాపల్తో ఉంటే అనుమానం ఉండదు కదా, ఇల్లు అనే దాంతో తీసుకెళ్ళారు….”
(మనకు తెలియని మన చరిత్ర నుండి.)