ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి ..బెళగెరె జానకమ్మ

రాజేశ్వరి దివాకర్ల

బెళగెరె జానకమ్మ ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి. ఆమె అతి సాధారణమైన గృహిణిగా జీవితం గడిపింది. అంతంత మాత్రమే అయిన ఆర్థిక పరిస్థితుల్లో సంసారాన్ని సాగించింది.

 తన 36 ఏండ్ల ప్రాయంలోనే, 1948లో అనారోగ్యం వల్ల అసువులు బాసిన జానకమ్మ జీవితంలోని ఆఖరు క్షణం వరకు కవిత్వం రాయాలని తహతహలాడింది. ఆమె కవిత్వాన్ని బతుకులోని సహజ కళగా పండించుకుంది.

కవితలు రాసే జానకమ్మగా ఆనాడు గుర్తింపు తెచ్చుకున్న జానకమ్మ బడిమెట్లు నాల్గైనా సరిగా ఎక్కలేదు. ఆమెకు ఆనాటి ఆచారాన్ననుసరించి పదవ ఏటనే పెళ్ళి అయింది. 17 ఏళ్ళకు పెద్దవాడు, 20 ఏళ్ళకు చిన్నకొడుకు జన్మించారు. ఆమె భర్త మల్లరు కృష్ణశాస్త్రి. కుటుంబ ప్రీతిని కలిగిన సాధారణ వ్యక్తి. ఆయనకు జానకమ్మ కవిత్వం రాయగలదని తెలుసు. కాని ఆమె రాసిన కవితల ప్రాముఖ్యాన్ని ఆయన గుర్తించలేదు.

జానకమ్మ కవిత్వం రాయగలదని, ఆమెలోని కవిత్వ శక్తిని మొట్టమొదట గుర్తించిన వారు ఆమె తండ్రి చంద్రశేఖర్‌ శాస్త్రి. ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడే అయినా, కాశీకి వెళ్ళి శాస్త్రాధ్యయనం చేసి వచ్చినా, పౌరోహిత్యాన్ని అవలంబించలేదు. మెళ్ళో జంధ్యాన్ని తీసేసి ఊళ్ళోని వాడలన్నింటిలోన తిరుగుతూమంచి కంఠంతో జానపద శైలిలో పాటలు కట్టి పాడుత అందరితో కలిసి మెలిసి ఉండేవారు. జానకమ్మ తల్లి అన్నపూర్ణమ్మ, ఆమె మేనత్త భూదేవి కూడా ఎంతో చక్కగా పాటలు పాడేవారు. ఇలాంటి సంగీత సాహిత్య మయమైన వాతావరణంలో పెరిగిన జానకమ్మకు సహజ కవిత్వ గంధం జన్మత: పరిణమించింది.
చిన్నప్పటినుంచి పాటలంటే అధికమైన ఆసక్తిని కలిగిన జానకమ్మ మనసులోని భావాలను తనకు తెలియకనే రాగయుక్తంగా ఆలపించేది. ఆమెె హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే స్వరం తారాస్థాయికి చేరుకునేది. పెళ్ళిళ్ళల్లోనూ పిల్లల్ని తొట్లో వేసే సమయంలోనూ తల్లి, మేనత్తల పాటలు పాడుకుంటూ జానకమ్మ స్వంతంగా కట్టిన పాటలను చేర్చి తాను కూడా పాడేది. ఆమెకు ఎనిమిదేళ్ళున్నప్పుడు ఆమె అన్న క్షీరసాగరునికి పెళ్ళయింది. అప్పుడు ఆమె వియ్యాలవారి పాటను కట్టి పాడి ప్రతిభ చూపించింది. శుభ సందర్భాలలో సమయోచితంగా పాడిన పాటలే ఆమె ఆరంభ కవిత్వ రచనలు.
జానకమ్మ, జీవితంలోనూ, కవిత్వంలోనూ కూడా తండ్రి స్వభావం, ఆయన నడవడిక ప్రభావాన్ని చూపాయి.

తండ్రికున్న వేదాంతమయ స్వభావం, జాతిమత ధర్మాలకు అతీతమైన మనోధర్మం ఆమెకు మంచి అభిరుచులను, అభ్యుదయ భావాలను కలిగించాయి. జానకమ్మ తండ్రి కూతురు రాసిన కవితలను రాగయుక్తంగా పాడి, ఇది మా జానకి రాసిన పాట అంటూ అందరికీ వినిపించేవారు. ఆనాడు బళ్ళారికి వచ్చి పోతుండే సుప్రసిద్ధ రచయితలనందరిని, జానకమ్మ ఇంటికి తీసుకుని వచ్చి ఆమెకు పరిచయం కావించేవారు. అలా తండ్రి చూపిన చొరవ వల్ల జానకమ్మకు అనేకమంది గొప్ప రచయితలతో పరిచయం అయింది. ఆమె వారిముందు తన పాటలను పాడి వినిపించేది. వారు కూడా ఆమెకు తమ కవిత్వాన్ని వినిపించేవారు. ఆమెను ప్రశంసించిన వారిలో కన్నడ తెలుగు సుప్రసిద్ధ కవులెంతోమంది ఉన్నారు. జానకమ్మది చదివి నేర్చిన పాండిత్యంకాదు, కూచోపెట్టి దిద్దించిన రచన కాదు. ఆమె బతుకులోని ఇతర సహజ క్రియల లాగానే కవిత్వరచన కావించింది. ఇంటి పనులు చేసుకుంటున్నపుడో, పిల్లల్ని లాలించేటపుడో ఏదైనా భావం తట్టిన వెంటనే కవిత్వం అల్లేది. ఆ భావం తోచినప్పుడు పెన్ను, కాగితం లాంటివి లభ్యం కానప్పుడు బొగ్గు ముక్కను తీసుకుని గోడ మీద రాసుకునేది. జానకమ్మ తండ్రి ఆమెను, ”జానకీ నీవు పాడే పాటలన్నీ ఒకచోట రాసి పెట్టుకో” అని హెచ్చరించేవారు. జానకమ్మ 1940 నుంచి తన కవిత్వాన్ని రాసి పెట్టుకోవడం ఆరంభించింది. ఆమెకు ఈ రాతలో చెల్లెలు పార్వతమ్మ తదుపరి దినాల్లో తోడుగా వచ్చి సహకరించింది.
     జానకమ్మ భర్త గృహపరంగా ఆమెకు చేదోడు వాదోడుగా మెలిగినా, ఆమె కవిత్వ విషయంలో కొంత వైమనస్యాన్ని చూపారు.  ఆయనకు తన భార్య, ఇంటికి వచ్చిన వారిముందు పాటలు పాడడం అంతగా రుచించేది కాదు.  పైగా ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఆమె తమలా ఇంటిపనులు చూసుకుంటూ ఉండిపోక కవిత్వమంటూ పాటలు పాడడాన్ని చూసి చెవి కొరుక్కునేవారు.  అలా ఇతరులు గుస గుస లాడడం ఆయనకు ఇబ్బందిగా ఉండేది.  భర్త తన కవిత్వ రచనపట్ల సుముఖత చూపక పోవడం జానకమ్మ మనసును బాధించింది.  ఆమె తన ఇంట్లో జన్మించిన కవితా శిశువును గురించి…
సంకుచితమైన ఈ గృహాన్ని
నీ వెందుకని మెచ్చావు?
ఇలాంటి మందమతుల గృహంలో ఎందుకు జనించావు?
రా… అంటూ దరికి పిలిచే వాళ్ళెవ్వరూ లేరు
వినిపించు… అంటూ చెవి పెట్టి వినే వాళ్ళు లేరు
హీనుల ఒడిని నీ వాసన నెందుకు నిలిపావు
ఏ ముని శాపాన నీవిచ్చటికి వచ్చావు – అంటూ వగచింది.
 కవితను మరలి పొమ్మని వేడుకుంటుంది.  జానకమ్మ భర్త ఆమె కవిత్వ విషయంలో భిన్నతను తెలిపినా, కొన్ని సందర్భాల్లో తమ ఇంటికి వచ్చిన కవిపండితులకు ఆతిథ్యాన్నివ్వడానికి కార్యాలయానికి సెలవు పెట్టి ఇంటనే ఉండి కావలసినవన్నీ అమర్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.
 జానకమ్మ కవితలు ఈ నాటికి నూటికి పైగా లభించాయి.  వీటిల్లో అధిక భాగం 1940-48 లలో రచించింది.  జానకమ్మ కవితలు కేవలం ఆమె రాసినవిగా మాత్రమేకాదు, ఆనాటి స్త్రీలందరి భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి.  ఆనాటి స్త్రీల మనోవేదనలను తెలుపుతాయి.  జానకమ్మ కవితలను చదవడం అంటే ఆనాటి స్త్రీల చరిత్రను అధ్యయనం చేయడం లాంటిది.  ఆనాడు తన కుటుంబంలో ఉన్న బొటాబొటీ ఆర్థికపరిస్థితులకు సర్దుకుని పోతూ, తనకున్న చిన్న కోరికలు కూడా తీరక పోయినా బైట పడకుండా సంసారాన్ని నడుపుకుంటూ వచ్చిన స్త్రీల మనోగతాన్ని జానకమ్మ
బొటా బొటీ సంసారం ఇది
అతుకుల బొంత సంసారం
నాటకం నడిపించాలి
పైకి ఎంతో తళుకు బెళుకు
పదనుగా నడవాలి
తూలిపడితే నవ్వుతూ సాగాలి…. అని కొంత హాస్యాన్ని మేళవించి చెప్తుంది. 

జానకమ్మ బళ్ళారిలోనే ఉన్నా తాను చూడాలనుకున్న హంపిని ఏ ఒక్కసారో రెండుసార్లో తప్ప చూడలేకపోయింది.  అందుకు వెనుకబడిన ఆమె ఆర్థిక పరిస్థితి కారణం.  తండ్రితో ఒకసారి హంపిని చూసి వచ్చిన జానకమ్మ ఆ శిథిలాలను ఎంతో ఆత్మీయంగా తన్మయత్వంతో వర్ణించింది.  ఎప్పుడైనా ఏదైనా కావాలని ఆమె మనసు కోరుకుంటే ఆమె తనకు తానే దానిని గద్దించి హద్దులో పెట్టుకునేది.  ఈ కవితలో జానకమ్మ తన ఇంట్లో పనిపిల్లను మందలించినట్టుగా తన భావాలను ఇలా చెప్పుకుంటుంది.
పదే పదే బట్టలిమ్మని అడిగితే చూడు!
నిన్ను ఏం చేస్తానో…
పొట్టగడవని నీకు మళ్ళీ బట్టలెందుకు చెప్పు! అంటుంది.
 జానకమ్మను తాను చదువుకోలేదన్న బాధ ఆఖరిక్షణం వరకు వెంటాడింది.  ఆమె తనకు కలిగిన కొద్దిపాటి అక్షర జ్ఞానంతోనే రచనా వ్యాసంగం సాగించింది.  ఆమెకు కొన్ని ఒత్తక్షరాలు రాయడం వచ్చేది కాదు.  అలాంటప్పుడు సోదరుడు కృష్ణశాస్త్రి కిచ్చి దిద్దించుకునేది.  ఆమె తన భర్త అనుమతి లేనిదే ఏ పనినీ చేసేది కాదు.  కానీ ఆయన రచనపట్ల వ్యతిరేకత చూపినప్పుడు ఆయనకు ఎదురు తిరిగి సమాధానం చెప్పకపోయినా, రచనను మాత్రం నిలుపలేదు.  తన బాధను, మనోవేదనను, కష్టసుఖాలను అన్నింటినీ ఎంతో అమాయకంగా, ధైర్యంగా కవిత్వంలో వెల్లడించింది.  భర్త ప్రవర్తనకు నొచ్చుకున్న జానకమ్మ భార్యాభర్తల సంసార సంబంధాన్ని గురించి ఎంతో నిర్మొహవటంగా (గండ) భర్త అన్న కవితలో ఇలా వెల్లడించింది.
గండ (భర్త) అంటే ప్రాణగండం
ఓ స్త్రీ నీవు భర్తను కూడావు
చూడు మండకం సర్పం నీడకు వెళ్ళినట్టు
బండికి కట్టిన బసవడు తలనపినట్టు
చెప్పుకునేందుకు ఎంతో బాగుంటుంది
అది నీ సర్వస్వమే మరి!
చూడు మంచివాడు దొరికితే ఆనందం!
అది నీ అదృష్టం
లేదా! ఇక అంతే నీ కథ హుళక్కి గోవింద!
మల్లెదండలా నీవు – కులుకుతు ఉల్లాసం కలిగిస్తే
భళిరా – వహవా నీ సరిసమానమెవ్వరు లేరంటాడు
…………
..శిక్షకుడు, రక్షకుడు, నీదైవం, నీభర్త,
కళ్ళు తెరుచుకుని మసలాలి. ఇది బ్రహ్మ రాసినరాత
స్త్రీ పురుషుల ఆట-ఆడక తప్పదు మరి
ఇది లీలా మానుష భక్త వత్సలుని ఆట..
 పై కవితలో జానకమ్మ స్త్రీ పురుషుల బాంధవ్యాన్ని ఎంతో సహజమైన సామ్యాలతో వాస్తవంగా తెలిపింది.  ఇక స్త్రీని సృష్టించిన బ్రహ్మను ‘చండశాసనుడు’ అని సంబోధిస్తూ
లంచకోరువు నీవు
వంచనను చేసావు
మృదువైన స్త్రీ జాతికి!
ఆడదొక చెట్టని అనుకున్నావా
ఆమె ఒడిలో
ఫలాలను పండించేందుకు..?
రాతిబండ నీ మనసు
ఓ దేవా – ఈ క్రమాన్ననుసరించావు… అని కఠినంగా దేవుడు చేసిన అన్యాయన్ని దూషిస్తుంది.  బుద్ధి చైతన్యం కలిగిన స్త్రీని చెట్టూ చేమగా పరిగణించరాదని తెలుపుతుంది.  ఇక ‘ఆడబొమ్మాట’ అన్న కవితలో
స్త్రీ పురుషులనే రెండు
బొమ్మలాటలో
నా మది ఉడికిపోతుంది
ఆడబొమ్మాటను చూసి…
ఆడదైన తరువాత
కాయపండుగా మారి
కన్ను తెరవక మునుపె
గూడు చేరిపోతుంది
గూటిలో ఏముంది
అడవి కాకరకాయ
రుచిలేదు పచిలేదు
మంచి పరిమళము లేదు
……….
మనస్సుండి మతిలేనిది,
కళ్ళుండి చూడలేనిది
ఈ ఆడబొమ్మాట
జనకజకు ఏమాత్రం రుచించనిది’ అంటూ స్త్రీ కేవలం ఒక బొమ్మగా మారిన స్థితిని వివరిస్తుంది.  ఈ కవితలో ఆమె స్వవిషయాన్ని కూడా సంకోచించక చెప్పుకుంది.
 జానకమ్మ తొట్టతొలుత భగవంతుని స్మరిస్తూ ‘మొర’ వంటి కవితలను రాసింది.  తదుపరి మనస్సు పరిపక్వం అయ్యాక తాను అనుభవించిన జీవితాన్ని, చూసినంత వరకు సమాజంలోని పరిస్థితులను ఎంతో అవగాహనతో కవిత్వంలో తెలిపింది….  ఆమె తన కవితలకు చివర ‘జనకజె’ అన్న తన పేరును చేర్చుకుని రాయడం అలవాటుగా మార్చుకుంది.  ఆమె ‘దుర్దైవి’ ”విధివంచిత” అన్న కవితలో భర్తకు, పిల్లలకు దూరమై, బతుకు నిరర్థకమనుకుని ఆత్మహత్యకు పూనుకున్న స్త్రీని తలచి సాటి స్త్రీకి సహాయం చేయాలన్న ఆత్మౌన్నత్యాన్ని ప్రకటిస్తూ
శూన్య హృదయిని ఈమె
మరొక క్షణాన మునక వేస్తుంది
తానేమి చేస్తోందో తెలియని స్థితిలో ఉంది
వెళ్ళి ఆమె సరసన కూచుని
తల నిమిరి కన్నీళ్ళు తుడిచి
చెల్లీ! అని పిలిచి బాధనడిగి తెలుసుకోనా!
ఓదార్పును కలిగించనా – అని తలుస్తుంది.
జానకమ్మ కుల విద్వేషాలను ఈసడించి సమానతను గురించి తలపోయడం గృహిణిగా నాలుగు గోడల నడుమ ఉంటూనే, విస్తరించుకున్న అభ్యుదయ భావాలకు తార్కాణం.  ఆమె ‘కులం’ అన్న కవితలో
కులం, కులం అంటూ ఎగురుతున్నావా?
కపట మోస వేషాలను చూపుతున్నావా?
ఎక్కడుంది కులం, దాని రూప మేమిటి?
మంచి మనస్సు లేనప్పుడు కులమెందుకు?
మడిని కట్టి, వ్రతం చేసి పూజలనారంభిస్తే
పాపమంతా పోతుందా…. అని కులం పేరిట వ్యత్యాసాలను చూపే వాళ్ళను నిలదీస్తుంది.

జానకమ్మ కవిత నిసర్గమైంది.  ఎటువంటి బాహ్యాడంబరాలకు లోను కాని ఆమె రచన ఎంతో సరళంగా ఉంటుంది.  ఆమె జీవితంలోని గంభీర విషయాలనే కాక తన చుట్టూ ఉన్న, తనకు తెలిసిన వ్యక్తులను గురించి రాసిన కవితలు, ఆమెకు మాత్రమే కాక, నిత్యజీవనంలో మనకు తెలిసిన పాత్రలను పరిచయం చేస్తాయి.  ఆమె తన ఇంటికి అంట్లు తోమడానికి వచ్చే నరసి అనే బాలికను గురించి ‘నరసియ పరసు’ నరసి జాతర అన్న కవితలో ఇంకా పధ్నాలుగేళ్ళు నిండని నరసి సరస జీవితాన్ని ఎంతో హృద్యంగా తెలుపుతుంది.  ఆ పిల్ల జాతర కెళ్ళడానికి చూపిన ఉత్సాహాన్ని మన కళ్ళకు కట్టిస్తుంది.  అలాగే పాటలు పాడే ‘లిల్లి’ ని గురించి రాసిన కవిత ‘లిల్లి’ గాన మాధుర్యాన్ని ప్రశంసిస్తుంది.
 జానకమ్మ తన సౌమ్య జీవితంలో కలిగిన సంతోషాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా వర్ణించింది.  ఆమె ‘జీవనయాత్ర’ అన్న కవితలో కష్టాలన్నవి లేని తమ ఊరికి పయనమై రమ్మని ఒక పల్లె సుందర చిత్రాన్ని గీస్తుంది.
పాలన్నం మూట కట్టి
సొంపైన చల్లని నీడలో నడచి
కనులకు కట్టే దృశ్యాలను చూసి పరవశిస్తూ
మా ఊరిని చేరండి
ముళ్ళను తొక్కక జాగ్రత్త పడుతూ
రాళ్ళ ధాటికి జంకక పరుగులిడుతూ
చీకటిలో తడుముకోక పయనిస్తూ
మా ఊరిని చేరరండి… అని పిలుస్తుంది.  ఈ కవితలో ‘ఆడుత, పాడుత, ఓడుత, కుణియుత – హిగ్గుత, హిరియుత, లగ్గెయ మాడుత’ అన్న కన్నడ పదాల ప్రాసతో మననొక పాటతో ఊరికి నడిపిస్తుంది జానకమ్మగారి అల్పసంతోషానికి జీవనోత్సాహానికి పతాక ‘గుబ్బి’ అన్న కవిత, గుబ్బి అంటే పిచ్చుక.  పిచ్చుక ఆమె ఇంటివాసం జల్లెడలో గడు కట్టింది.  ఆమె బియ్యం ఏరుకునేటప్పుడు మాటిమాటికి ‘చిలిపిలి’ గా ‘కిరికిరి’ చేసింది.  ఆమె పక్షి చలన శీలత్వం అనే అమూర్త రూపానికి అక్షరాకారం కట్టి మనను కూడా చంచలంగా ఆడేటట్టు భ్రాంతిని కలిగిస్తుంది.
బుడు బుడుమని ముందుకు నడవకు/గుటు గుటుమని నీటి చుక్కను తాగకు!/పటక్కని వెనక్కి తిరగకు!/చప్పుడు చేయక నిలుచుని చూడు అంటూ/ పిచ్చుక అల్లరిని మాయ చేస్తూ మందలిస్తుంది.
 జానకమ్మ స్వాతంత్య్ర పోరాటంలో ప్రత్యక్షంగా భాగం వహించి, కనులారా ఆ పరిస్థితిని చూడకపోయినా ఆనాటి భావావేశంతో గాంధీ గారిని గురించి, దేశ భాషా విషయాలను గురించి కూడా కవితలను రాసింది.  జానకమ్మ కవిత్వ రచన చేయలన్న ఉత్సాహంతో అనేక విషయాలను గురించి రాసినా, ఆమె స్త్రీ స్థితిగతులను గురించి తెలిపిన వాస్తవ రూప కవితల వల్లనే ఆమె కన్నడ అభ్యుదయ కవయిత్రులలో అగ్రగణ్యురాలయింది.  ఆమె ‘కల్యాణం’ వంటి కవితలలో సంప్రదాయికమైన వివాహ బంధాన్ని హర్షించినా ఆమె కవిత స్త్రీని, బుద్ధి చాతుర్యం కలిగి తెలివిగా అడుగు వేయాలని హెచ్చరిస్తుంది.  ఎవ్వరినీ ఎదిరించ కుండానే ఎదురులేని కవితలు రాసిన జానకమ్మ మరణించి ఈనాటికి దాదాపు 58 ఏండ్లయింది.  అయినా ఆమె రచనల వల్ల ఈనాటికీ సన్నిహితంగా మిగిలింది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.