వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే
జీతం -గీతం, బరువు – బాధ్యత
పరుగు – పందెం అంతా సమానం
పెళ్ళినాటి వారి ప్రమాణం –
ఏ పనైనా, ఇంటయినా – బయటయినా
సగం – సగం : చెరి సగం
రేపు ఆఫీసు లేదు
ఆయనతో, పిల్లలతో
సరదాగా, హాయిగా…
ప్రతి శనివారం ఆమెకొచ్చే
అందమైన ఆలోచన
ఉదయం నిద్రలేస్తూనే
వెలిగిస్తుందావిడ గేస్‌స్టవ్
అతడూ వెలిగిస్తాడో గోల్డ్ ఫిల్టర్!
”గిన్నెలు, బట్టలు, వూడ్పులు, వంట…”
మనసులో చదువుకుంటోందావిడ
అతగాడూ చదువుతున్నాడు
ఫిలిమ్ రివ్యూలు, క్రైమ్ కార్నర్‌లు !
ఆటోలు, హాట్‌పేక్‌లు లేవుకనుక
ఫలహారాల పని కానిచ్చి తీరిగ్గా
టీవీ ఆన్ చేశారు పిల్లలు త్రేనుస్తూ
అతిథుల కోసం స్పెషల్ ఆర్డర్ చేసి
మంత్రాంగం మొదలెట్టాడాయన మిత్రులతో
సెల్లూ, బీఎస్సెన్నెల్లూ
చెరో చేత్తో మేనేజ్ (చికెన్‌లు, మటన్‌లు) చేసేస్తూ
కలలు కనడం మాని
కుక్కర్‌లో కుదుటపడ్డాయి
ఇల్లంతా మిలమిలలాడి
అంట్లన్ని తళతళలాడి
వంట ఘుమఘుమలాడే సరికి
విచ్చేసిన అతిథుల కోసం
భూగోళమై పరిభ్రమించిందామె
డైనింగ్ టేబుల్ చుట్టూ
అందరికీ వీడ్కోలిచ్చాక
చేత్తో తీసిన తన కంచం
మళ్ళీ గూట్లో పెట్టింది
అప్పుడాకలనిపించినా
ఇప్పుడవసరం లేదనిపించింది
మళ్ళీ పేరుకున్న అంట్లు చూశాక
ఓ కునుకు తీసి లేచి
ట్రాక్ జీన్సు, టీషర్టు తగిలించి
టెన్నిస్ ప్రాక్టీసట వెళ్ళాడాయన
రాకెట్ ఊపుకుంటూ
సినిమాలు, సీడీలు చూసిచూసి
విసుగెత్తి వంటింట్లోకొచ్చారు
పిల్లలు బుర్రలు బరుక్కుంటూ
”వాట్ స్పెషల్ టునైట్ మమ్మీ”
అడుగుతున్నారు-
చేగోడీలు, చెక్కలు
పళ్ళాల్లో పోసుకుంటూ
జుట్టుముడి, కట్టుముడి
మరోసారి బిగుసుకున్నాయి
రాత్రి స్పెషల్‌కోసం
”నెక్స్ట్ సండే బెటర్‌లక్”
అరిగిపోయిన రికార్డే అయినా
మళ్ళీ గుసగుసలాడాడు సూరీడు
ఇంటికెళ్ళిపోతూ
”ఇంతటి సమానత్వం
ఇంకెక్కడైనా ఎరుగుదుమా!?
విరగబడి నవ్వుతోంది వంటిల్లు.