Satyavati,
Your piece of Vipasyana in Bhudha Bhoomi is one of the best journalistic items I read in Telugu field. It is elaborate, detailed filled with personal insights and first hand experiences that simulate reality in a powerful way. One almost feels the intensity and realistic feelings of the power of meditation. It also reveals the physical discomfiture that is a part of this unique experience which reveals to one of the inner world of the body as well as the outer universe in which it exists. The cosmic relationship and the transitory nature of everything – the ever-changing flux in which all of us are caught in, but never realize it is brought out in a very subtle and revealing way. So many hours of silent meditation without ordinary human communication and in almost utter silence must have revealed to you the absolute power of silence. This is where we understand the human condition and its place in the universe. Hearty Congratulations on an excellent essay which must have affected more people whoever read this article. Publish it again in Bhumika so that others can read it too.
In fact, I read your article three times. I think you can try a little on this. From your writing, I feel that there is some spirituality in your attitude towards nature and self. Very strong indeed. Explore this possibility.
– K. Sadasiva Rao, Hyderabad
***
సత్యవతి గారికి నమస్తే,
జనవరి నెల భూమికలో తలమానికమైనది మీ వ్యాసం. నాకెంతగానో నచ్చింది. నా ఆలోచనా సరళిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జీవితం పట్ల మరింత ప్రేమ, నిబద్ధత, నాపై మరింత గౌరవం, నమ్మిక పెరిగాయి. విపశ్యన నాకు దారి చూపింది. శ్వాసమీద ధ్యాసపెడుతూ మనో వికారాల్ని ఎలా అధిగమించవచ్చో, సానుకూల దృక్ఫథాన్ని ఎలా సాధించుకోవచ్చో కళ్ళకు కట్టినట్లు తెలియజేసిన పురాతన ధ్యాన విపశ్యనకు హాట్సాఫ్! జమీల్యా పుస్తక సమీక్ష చదువుతుంటే టాల్‌స్టాయ్ మలిచిన అన్నాకెరీనా పాత్ర ధీరత్వం మనసులో కదలాడింది. ఉమనూతక్కి గారికి అభినందనలు. పోనీతిను కథను రెండుమార్లు చదువుకున్నాను. శిలాలోలిత గారి వర్తమాన లేఖలు పరుగులు పెడుతూ చదివింపజేస్తూ ఆలోచింపజేస్తున్నాయి. మేడమ్ గారికి అభినందనలు. చాసో శతజయంతి సంచికగా జనవరి భూమిక దాచుకోదగిన నెమలీక. – బి.కళాగోపాల్, నిజామాబాద్.
***
జనవరి 2015 భూమిక సంచిక బాగుంది, అనేక రకాల అంశాలతో. ఒక్కటే ఫిర్యాదు, అక్షర దోషాలు. ‘బహుశా’ అన్న మాటను ‘బహుషా’ చేశారు – గొల్లపూడి మారుతీరావుగారి ‘చాసో స్ఫూర్తి’ వ్యాసంలో, హైమా శ్రీనివాస్ ‘ముక్తి’ కథలో. గొల్లపూడిగారి చక్కని వ్యాసం అక్షర దోషాల కారణాన చాలా చోట్ల తికమక కలిగించింది. సరే, ఫిర్యాదుని పక్కనపెడితే, మహా రచయిత చాసోగారి ‘పోనీ తిను’ కథను మరోసారి చదవడం మా గొప్పగా అనిపించింది. ‘వాయులీనం’, ‘కుంకుడాకు’ కథలకు ‘పోని తిను’ ఏ మాత్రం తగ్గదు. గుండెల్ని పిండేసే చిత్రణ అంటే ఏమిటో ఈ కథ చదివితే తెలుస్తుంది. అరవైయేళ్ల వయసులోనూ వ్యభిచారం చేసి, పొట్ట గడుపుకునేదైనా, గుడిసేటి గున్నమ్మ అందరికీ తలలో నాలుకలా ఉపకార బుద్ధితో ఉండేది. ‘మొజాయిక్కు మెట్టు మీద, మొజాయిక్కు పోర్టికో కింద’ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్ద ఆమె ఆఖరి శ్వాస ఎందుకు విడిచిందో రచయిత చెప్పిన విధానం ఎవర్ని కదలించదు? కథ చెప్పడం ఒక కళ. కానీ కేవలం పాత్రకే కాకుండా కథ మొత్తానికీ యాసనిచ్చి, వాస్తవిక సంఘటనలతో, వాస్తవిక పాత్రలతో కళాత్మకంగా కథని చెప్పిన మొదటి గొప్ప కథకుడు చాసో అంటే ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను.
సంచికకు కొసమెరుపులాగా ఉంది ‘ముక్తి’ కథ. ‘అపరశురాముడు’ లాంటి పరుశురాంతో పెళ్లయిన దగ్గర్నుంచీ నోరెత్తకుండా కాపురం చేస్తూ వచ్చిన ఓ పల్లెటూరి స్త్రీ అంతరంగాన్ని చిన్న కథలో ప్రతిభావంతంగా చెప్పారు. పరశురాం చనిపోయాకే ఆమెకు శాశ్వత విముక్తి కలిగిందని చెప్పడం చూస్తే, భర్త ప్రవర్తనతో ఆమె ఎంతగా విసిగిపోయిందో అర్థం చేసుకోవాల్సిందే. నిజానికి చాలా మంది వివాహితల స్థితి అదే. చింగీజ్ ఐత్మాతోవ్ రాసిన ప్రపంచంలో బహు సుందరమైన ప్రేమకథ ‘జమీల్యా’ను ఉమామహేశ్వరి నూతక్కి చక్కగా సమీక్షించారు. ‘మహిళల్లేని మగ పాలనలు’ వ్యాసంలో ఒక్కటంటే ఒక్క మహిళా మంత్రి లేకపోవడం కొత్త తెలంగాణ దౌర్భాగ్యం, అన్న జుపాక సుభద్ర మాటలు నిష్ఠుర సత్యమే కదా.
-బుద్ధి యజ్ఞమూర్తి, హైదరాబాద్.
***
భూమిక సంపాదకులకు నమస్కారాలు.
జనవరి భూమికలో ప్రచురించిన ‘విశ్వప్రేమను నేర్పే విపశ్యన’ కొండవీటి సత్యవతి గారి వ్యాసం చదివాను. ఆమెతోపాటు నేను పదిరోజులు విపశ్యన చేస్తున్నట్లే అనిపించింది. తెలుగుభాషలో ఇంత చక్కని అభివ్యక్తి, ప్రవాహశీలతా! చాలా బాగుంది. వారి మాటల్లో నిజాయితీ వుంది. స్వచ్ఛత, స్పష్టత, శ్రావ్యత పెనవేసుకొని అక్షరాలు ప్రవహించాయి.
సత్యవతిగారు ఆమె జీవిత చరిత్ర రాస్తే ఇంకా అనేక అనుభవాలు అక్షరాల్లోకి వస్తాయని ఆశిస్తున్నాను. నిశ్శబ్దంలో ఎంతో జ్ఞానం వుంది. నిశ్శబ్దంలో ఎంతో వివేచన వుంది. నిశ్శబ్దం నుండి మేలుకొని ఇలా విపశ్యన గురించి రాసినందుకు అభినందనలు. ధనవ్యామోహం, కీర్తి వ్యామోహం వున్నవారు బౌద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం.
ఇంత క్లిష్టమైన రోజుల్లో – సంక్లిష్టమైన జీవిత ఘర్షణల్లో మనిషి జీవిస్తున్న సందర్భంలో విపశ్యన అంటే మార్పు. ఆ మార్పు ఈ విశ్వంలో, ప్రపంచంలో, జీవితంలో అన్నింటా వస్తూ వుంది. దాన్ని గమనించడానికి కూసింత నిశ్శబ్దం కావాలి మరి… ఈ ప్రవాహశీలమైన రచనకు అభినందనలు.
– డా|| కత్తి పద్మారావు, పొన్నూరు.
***
భూమిక సంపాదకులకు
కొండవీటి సత్యవతి గారు రాసిన ‘విశ్వప్రేమను నేర్పే విపశ్యన’ వ్యాసం ఊహించనంత గొప్పగా వుంది.
నాస్తికురాలిగా, దేవుని నమ్మని వ్యక్తినని తెలిపి, విపశ్యన నేర్చుకున్న తన అనుభవాల్ని చక్కగా ఆవిష్కరించారు. నాస్తికునిగా , భౌతికవాదిగా కారల్‌మార్క్స్-బుద్ధుడు-అంబేద్కర్ల భావజాలం కలిగిన వ్యక్తిగా సత్యవతిగారు రాసిన విషయాలు నన్ను ఎంతో ఆలోచింపచేశాయి.
హైదరాబాద్‌కు సమీపంలో గుర్రంగూడ గ్రామంలో 10 రోజుల విపశ్యన కోర్సులో సత్యవతిగారు పాల్గొన్నారు. తన 10 రోజుల విపశ్యన కోర్సులో మార్పు మాత్రమే శాశ్వతమని చెబుతూ అక్కడ బోధించిన విషయాలను, ఆ విషయాలు తన మీద కలిగించిన ప్రభావాలు; వాటిని తన అనుభవాలు, అభిప్రాయాలతో సరిపోల్చుకోవడం చక్కగా చేశారు.
”ఎలాంటి మతపరమైన బోధనలు, కీర్తనలు లేకపోవడం కేవలం ప్రకృతితో సంబంధం వుండడం, మనతో మనకి మాత్రమే సంబంధం వుండడం గుడ్ ఫీలింగ్” అని చెప్పారు.
”ఏ అతీతశక్తిని నమ్మనిదాన్ని కాబట్టే నాకు విపశ్యన సెంటర్ వాతావరణం బాగా నచ్చింది. మతపరమైన కర్మకాండ, సంప్రదాయాలు లేని లౌకిక పద్ధతులు అక్కడ నెలకొనడం, బుద్ధుడి విగ్రహం కూడా లేకపోవడం బావుంది. బుద్ధుడిని భగవానుడు అని పిలవడం వెనుక ఇప్పటి భగవానుడు కాదని, విపశ్యన ద్వారా సమతను సాధించిన వారిని భగవాన్ అని పిలుస్తారని, బుద్ధుడు మతం ఆధారంగా సృష్టించబడిన స్వర్గ నరకాలను నిరసించాడని, మతపరమైన కర్మకాండల వల్ల మనిషి పొందే జ్ఞానమేమీ వుండదని, ఆ కర్మకాండలో కూరుకుపోవడమే వుంటుంది తప్ప దాన్నుండి బయటపడలేరని బుద్ధుడు చెప్పాడని అలా అనేక విషయాలు తనకి నచ్చినవి, తెలుసుకున్నవి చక్కగా వివరించారు.
విపశ్యన 10 రోజులలో తనలోని మానసిక సంవేదనల్ని తాను స్వంతంగా ఎలా గమనించిందీ రాశారు. మనలోని చీకటి కోణాల్ని, మనో వికారాల్ని మనకు మనమే అర్థం చేసుకోగలుగుతామని, ద్వేషం, క్రూరత్వం, అహంకారం, ఆధిపత్యం వంటి గుణాలు మనకు దు:ఖాన్నివ్వడంతో పాటు మన చుట్టూ వున్న వాళ్ళకు మానసిక వేదనని, మనశ్శాంతిని లేకుండా చేస్తాయని తదితర అనేక విషయాలు రాశారు. ముఖ్యంగా విపశ్యన అంటే విశాలమైన ప్రేమ అని, విశ్వప్రేమను అది కోరుతుందని తెలిపిన తీరు ఆలోచింపజేసింది.
కోపం, అసూయ, ద్వేషం వంటి అవలక్షణాలు ఇతరుల్ని తీవ్రంగా బాధించడంతో పాటు అవి కలిగివున్న వ్యక్తుల్ని కూడా నాశనం చేస్తాయి. అందుకే సుమతీ శతకకారుడు కోపం గురించి ఇలా చెప్పాడు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దు:ఖమె నరకమంద్రు తధ్యము సుమతీ
అంతేకాదు ద్వేషం నిండి వుండే మనిషి కక్ష్య, కార్పణ్యాలకు చాలా తేలికగా లొంగిపోతాడు. తన ప్రవర్తన ద్వారా అవతలివారిని కూడా అలాగే మారేలా చేస్తాడు. దాని ఫలితంగా హత్యలు, అమానుషాలు, చివరిగా యుద్ధాలు – రక్తపాతాలు-బీభత్సాలుగా మారతాయి. పై అవలక్షణాల్ని నిగ్రహించుకుని, తొలగించుకోవటానికి బుద్ధుని బోధనలు ఎంతో ఉపయోగపడతాయి. మనుషుల్ని ప్రశాంత చిత్తులుగా మార్చటానికి విపశ్యన ఉపయోగపడగలదని సత్యవతిగారి అనుభవాల వివరణ ద్వారా అర్థం అయింది.
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం విపశ్యనకు వెళ్ళానని సత్యవతి గారు వ్యాసం మొదట్లో చెప్పారు. కానీ విపశ్యన నేర్చుకునే క్రమంలో అనేక పాజిటివ్ అనుభవాలు పొందినట్లుగా చెప్పి, వాటిని వివరించిన తీరు చాలా బావుంది. స్వీయ అనుభవాలతో కూడిన చక్కటి వ్యాసం బుద్ధభూమికి అందించినందుకు వారికి అభినందనలు.
మనుషుల్లో వుండే కోపం, నిర్లిప్తత, చికాకు, విసుగు, అసహనం, బాధపడటం, చింతించటం మొదలైన ఉద్వేగాలను నిగ్రహించుకుని, నియంత్రించుకుని తగ్గించుకోవడానికి; అతి సంతోషం – తీవ్ర నిరాశ మొదలైన వాటిని సమతుల్యతలో వుంచడానికి మరియు మానసిక అలజడుల్ని తగ్గించి, మానసికంగా ప్రశాంతతను కలిగించడానికి విపశ్యన ఉపయోగపడుతుందని చాలా కాలంగా కృష్ణార్జునబోధి సమావేశాలలోనూ, విడిగాను చెబుతూ వస్తున్నారు.
నా స్వంత అనుభవాల ద్వారా విపశ్యనను అవగాహన చేసుకుని అందులోని మంచిని స్వీకరించాలని అనుకొని గత సంవత్సరం నుంచి విపశ్యన కోర్సుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. వరుసగా 10 రోజులు ఖాళీ దొరకని కుటుంబ సమస్యలు- వత్తిడుల ఫలితంగా వెళ్ళలేకపోయాను. సత్యవతిగారి వ్యాసం చదివిన తర్వాత విపశ్యన తరగతులకు ఒకసారి వెళ్ళిరావడం అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటిగా నిర్ణయించుకున్నాను. అందుకు త్వరలో అవకాశం కుదురుతుందని ఆశిస్తున్నాను.
– రేకా చంద్రశేఖరరావు, హైద్రాబాద్.
(బుద్ధభూమి నుండి)
***
భూమిక సంపాదకులకు నమస్కారాలు.
2015 జనవరి నెల పత్రికలో కొండవీటి సత్యవతి గారు రాసిన వ్యాసం అత్యంత ప్రశంసనీయం. ఈ వ్యాసం విపశ్యన ధాన్యం చేసినవారికి పునశ్చరణ, కొత్తవారికి మార్గదర్శి. వ్యాసం చదుదుతున్నంతసేపు ధ్యానకేంద్రంలో వున్నట్లుగా అనుభూతి కలిగింది. విపశ్యన ధ్యానం అనుక్షణం ‘ఎరుక’ (గమనిక)తో వర్తమానంలో జీవించడం నేర్పుతుంది. సత్యవతిగారు మొదటిరోజు నుండి చివరిరోజు వరకు నూటికి నూరుపాళ్ళు వర్తమానంలో శిక్షణా తరగతులను ఔపోసన పట్టి ఏరోజుకారోజు జరిగిన శిక్షణ వివరాల పూర్తి సారాంశాన్ని ఈ వ్యాసంలో వివరించడం కొత్తగా ఈ కోర్సు చేయబోవు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కోర్సు జరిగే పదిరోజులు ధ్యానశిబిరంలో కాగితం గాని, కలంగాని, ఏదైనా రాయటం గాని అనుమతించరు. సత్యవతి గారు పదిరోజుల కోర్సు తరువాత జరిగింది జరిగినట్లుగా వివరించడం ఆమె ఏకాగ్రతకు నిదర్శనం. ఈ శిక్షణ ముఖ్యంగా మనసుపై పట్టు సాధించి ప్రకృతిపరంగా అనుక్షణం జరిగే మార్పును గమనిస్తూ ప్రకృతి ధర్మాన్ని ఎవరికి వారు అనుభవంలోకి తెచ్చుకునే జీవనకళే విపశ్యన అని చక్కని వివరణ ఇచ్చారు.
మార్పు ప్రకృతి ధర్మం. శరీరంలో కాని, ప్రకృతిలో కాని ఏదీ శాశ్వతం కాదు. ప్రతిక్షణం జరిగే మార్పును ఎరుకతో అర్థం చేసుకోవడమే విపశ్యన. పుట్టినక్షణం నుంచి ఈ మార్పు శరీరంలో జరుగుతుంటుంది. ఒక రోజు గడవడం అంటే ఒకరోజు మరణానికి దగ్గరవ్వడం అన్న వాస్తవాల వివరణ చాలా బాగుంది. మనం ఈ విషయాన్ని ప్రతిక్షణం ఎరుక (గమనిక) కలిగి జరిగేదంతా అనిత్య అని భావిస్తే అహంకారం అంతమౌతుంది. రాగద్వేషాలు దరికిరావు. పదిరోజుల ధ్యానశిక్షణ అనుభవ సారాంశాన్ని సవివరంగా తెలిపిన సత్యవతి గారు అభినందనీయురాలు.
– కొల్లా భాస్కరరావు, హైదరాబాదు
భూమిక సంపాదకులకు నమస్కారాలు.
కొండవీటి సత్యవతి గారి విశ్వప్రేమను నేర్పే విపశ్యన వ్యాసం చాలా బాగుంది. విపశ్యనా ధ్యానానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి జీవనకళగా విపశ్యనను పరిచయం చేశారు. శరీర సంవేదనలు, రాగద్వేషాలను సమన్వయం చేసుకోవడానికి విపశ్యన ఒక జీవన సాధనం. విపశ్యన పదిరోజుల ధ్యానశిక్షణలో సూక్ష్మమైన అంశాలను గ్రహించి ఓపిగ్గా గుర్తుపెట్టుకొని వ్యాసం ద్వారా అందించిన సత్యవతిగారికి ధమ్మవందనాలు.
– ధమ్మమిత్ర జి.గోవిందస్వామి, తిరుపతి.
***
”ధైర్యంతో కర్తవ్యాన్ని నిర్వహించు
ఓర్పు, స్థిరత్వాలతో పనిచేయి..
ఓర్మి, పవిత్రత, ధైర్యం, నైతికతలతో జీవించు”
‘స్వామి వివేకానంద’
ఎందుకో తెలియదు? ఎప్పుడు ‘సత్యవతి’ గారిని చూసినా నాకు పైన చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి.
ఒక వ్యక్తికి అన్నింటికన్నా ముఖ్యమైనది ‘వ్యక్తిత్వం’, నమ్మిన దాన్ని చెప్పగలగడం, చెప్పిన దాన్ని ఆచరించగలగడం వ్యక్తిత్వానికి మొదటిమెటు.్ట పాపాయి బోసిన నవ్వులు, స్థిత ప్రజ్ఞత కలిగిన ధీరత్వం, స్వచ్ఛమైన స్నేహం… ఇంకా ఎన్నని చెప్పను? అవి అన్నీ కలగలిపితే ,… ‘సత్యవతి’ గారు.
‘విపశ్యన ఎంత చక్కని పేరు ! నేను ఒక రైలు ప్రయాణంలో సత్యవతిగారి ‘విపశ్యన’ చదివాను. ఒక్కదాన్ని ప్రయాణిస్తున్నప్పుడు కావల్సినంత ‘ఏకాంతం’ , ఏకాంతంగా ఉన్నప్పుడు మనం అంతర్ముఖులమవుతాము. మనల్ని మనం విశ్లేషించుకుంటాము. అలాంటి పరిస్థితితులలో ‘విపశ్యన’ చదవడం మొదలు పెట్టాను. చదివాను అనడం కన్నా ఒక అనుభూతిని అనుభవించాను అనాలి. నా బాల్యంలోకి, కౌమారంలోకి, యవ్వనంలోకి, వృద్దాప్యంలోనికి వెళ్లాను. ఇలా ఒకేసారి అన్ని దశలలోనికి, ఆ భావనలకి, నేను ఎలా వెళ్లగలిగాను? ఒక స్థ్థిితిలో నేను భూత, వర్తమాన, భవిష్యత్తును ఎలా వీక్షించగలిగాను? బాల్యంలో ఏం పొందాను? యవ్వనంలో ఎంత ఆరాట పడ్డాను! వృద్దాప్యంలో ఏం పొందబోతున్నాను.? మనసారా…. మనోనేత్రంతో చూడగలిగాను.
ఏ మనిషికయినా ఎప్పుడో ఒకప్పుడు తన జన్మకు ‘సార్దకత’ ఏంటి? అనే తలంపు తప్పకుండా వస్తుంది. నాకు ‘విపశ్యన’ చదువుతున్నంతసేపు, చదివిన తరువాత నేను ఏంటి? ఎలా ఉన్నాను? అన్నది తెలిసింది.
మన గమ్యమేమిటో, ఆగమ్యం చేరుకున్న తరువాత ఎలా ఆనందంగా ఉండాలో.. ఎంత అనుభూతిని పొందాలో తెలుసుకోవడం, మనలో మనంగా, ప్రకృతితో మనంగా జీవించడం తెలుసుకున్నాను.
జీవిత గమ్యం చివరికి మరణం అయినా … ఎన్నో భయాలు, ‘విపశ్యన’ చదువుతున్నప్పుడు ఒక ‘తన్మయయావస్థ’, సకలేంద్రియాలు ఒకే పనిలోలీనమవడం.
‘విపశ్యన’ ఒక జ్ఞాన సముపార్జన! జ్ఞాన సముపార్జన కన్నా గొప్ప ఆహ్లాదం ఏముంటుంది? పుస్తకాలు చదవడం, తెలివైన వారితో సంభాషించడం, స్వచ్చమైన, అమాయకమైన మనుసున్న పిల్లలతో జీవించడం మొదలైనవన్నీ దీనికి మార్గాలు. ప్రాణమున్న వ్యక్తులుకన్నా ప్రకృతి ప్రేమించడంలో ఒక ఆహ్లాదం ఉంది. వ్యక్తుల్నీ, బంధాల్ని ప్రేమించే కొద్దీ వాటి నుంచి దూరమైతే బాధ. బాధలేని స్వేచ్ఛ గొప్పది. దాని విలువ ‘విపశ్యన’ ద్వారా తెలుసుకున్నాను.
డబ్బు, కీర్తి, అధికారం మనసుకి సంతోషం కలిగించేవిగా వుండాలే….. తప్ప ‘మనశ్శాంతి’ని దూరం చేసేవిగా ఉండకూడదు. తననీ, తన పరిసరాల్నీ, అలవాట్లని, అభిరుచుల్నీ, ప్రేమిస్తే వచ్చే ఆత్మానందం మరెందులోను రాదు. ‘విపశ్యన’ వివరించేదీ…. అదే!
ప్రతి మనిషి జీవితానికీ ఒక ప్రయోజనం వుంటుంది. తన జీవన ప్రయోజనం ఏమిటో ప్రతి మనిషీ తప్పని సరిగా తెలుసుకోవాలి. ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క విచారమూ, ఒకొక్క శత్రువూ దూరమవుతారు. తన నిజమైన విలువ ఏమిటో తనకి తెలుస్తుంది. మనల్ని మనం ప్రేమించుకుంటాం. విశ్వజనీనమైన ప్రేమని ఆస్వాదించడం ఏమిటో తెలిపింది ‘విపశ్యన’
‘ఆర్ద్రత’ అనే పదానికి అర్దాన్ని మరచిన ఈ నవీన కాలంలో మనసంతా ఆర్ద్రతతో తనువంతా తన్మయత్వంతో నిండింది ‘విపశ్యన’తో….
-శాంతి వెంకట్, శ్రీవిద్య స్కూల్, ఫర్ స్పెషల్ చిల్డ్రన్. హైదరాబాద్.
***
ఉమామహేశ్వరి గారు జమీల్యా – సమీక్ష చాలా బాగా రాశారు. నాకు బాగా నచ్చింది. ఆనాటి కాలమాన పరిస్థితుల్ని వివరించిన తీరు చాలా బాగుంది… మరిన్ని సోవియట్ పుస్తకాల గురించి రాస్తారని ఆశిస్తూ…. సోవియట్ పుస్తక అభిమాని…
– అనిల్ బత్తులు (ఇ-మెయిల్ ద్వారా)
***
హైమా శ్రీనివాస్ గారి ‘ముక్తి’ కథ చాలా బాగుంది. ఇప్పుడేమో కానీ అక్కడక్కడా ఉండవచ్చును కూడానూ, ఇలాంటి మగవారి నుంచీ (భర్తల నుంచీ) ముక్తి అప్పుడే కలుగుతుంది. భార్యలకు, మేల్ ఈగో చచ్చే వరకూ వదలదు వారిని.
– దేవి (ఇ-మెయిల్ ద్వారా)
***
రమాసుందరి గారూ!
మనసుకు హత్తుకునేలా మీరు చెప్పగలరని తెలుసు కానీ, ప్రస్తుత పరిస్థితిని, మధ్యతరగతి జీవి కలలు కల్లలయ్యే వాస్తవికతను బాగా చెప్పారు. ఏ చరిత్ర చదివినా, పాలకులంతా సగటు మనిషి కలల సమాదుల మీద తాజ్ మహల్ నిర్మించుకున్న వాల్లే. చేతులు
కాళ్ళు చువ్వలు చేసుకొని భూమితో సావాసం చేస్తూ…. వాళ్ళు కంటూన్న కలలు కల్లలు గానె మిగిలి పోవాలా? జీవించే హక్కు అందరిదీ అని యెలుగెత్తిన ఆ గొంతులన్ని ఎక్కడ పోయాయి? కుల, వర్గ, స్వార్థ సమాదుల్లో చేరి మొద్దు రాచ్చిప్పలుగా శాస్వత నిద్రలో… ఏ ఒక్క సమాధిలో కదలిక వచ్చి ….. ఒక్క గొంతు వినపడదా అని మీరు చేసిన ఈ ప్రయత్నానికి నా అభినందనలు.
– ఎస్ ఆర్ బత్తుల (ఇ-మెయిల్ ద్వారా)