(ప్రముఖ హిందీ అనువాదకురాలు శ్రీమతి శాంతసుందరి గారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు)
అక్షరాల దారుల వెంట
పరుగెత్తీ పరుగెత్తీ
అలసిపోయిన కళ్లు,
బయటికీ లోపలికీ
బొక్కెనలు వేస్తూ
భావ లహరులను చేదిపోసేకళ్లు
కళ్లంటే కళ్లు కాదు
విభిన్న లిపులను కరిగించి
ఒకే సారాంశాన్ని
పున:సృష్టి గావించే
సరికొత్త వాకిళ్లు.
ఓ అధ్యయనం
పెదవుల్ని చీల్చుకొని వచ్చే
ఒక చిరునవ్వు,
బొమ ముడిని చిత్రించే
ఒక మానసిక సంక్షోభం,
ఒక మథనం,
ఒక వ్యధలోంచి
పొడిచే సూర్యోదయం
ఒక ఆవేశం
ఒక పరకాయ ప్రవేశం
ఒక రోష్‌ణీ
ఒక నవరాగిణి
ఆకళ్ళ నిండా
అక్షర వర్షాలు కురిసి
చినుకులను
బాష్పాలుగా మార్చే రసవాదం
ఒకేసారి
రెండు భాషల్లో స్పందించే
బహుజనీన రాగం
ఆ కళ్లకు
కీర్తి కన్నా
ఆర్తి ప్రధానం
ఎంత తవ్వినా తరగని
విజ్ఞాన గనులు
త్యాగధనులీ కళ్లు.
నిఘంటువులు చేతులెత్తేసే
గవేషణ
మట్టిలో దొరికే
మాటలను
మాణిక్యాలుగా మార్చే రసవీణ
రండి!
అలసిపోయిన ఆ కళ్లను
ఒక్కసారి కళ్లకద్దుకుందాం.