ఇటీవల తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ రాసిన ఒక నవలపై వివాదం సాగుతున్నది. ఆ వివాదంలో అనేక కోణాలున్నాయి. అందులో సంప్రదాయ కోణాన్ని చర్చించటం ఈ వ్యాస లక్ష్యం.
సంతానం లేని దంపతులను చిన్న చూపు చూడటం లోకంలో ఉంది. అది ఇప్పటిది కాదు. మహాభారత, రామాయణ కాలాల నుంచీ ఉన్నది. ఆదిమ సమాజం ఈ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు చూపింది. యజ్ఞాలు చెయ్యటమూ, పాయసాలు తాగటమూ అనేవి పైకి కనబడుతున్నా వాటి వెనక శారీరక ధర్మం ఉన్నది. ఆ సంతాన మార్గాలు ప్రకృతి ధర్మానికి అతీతమైనవి కావు; అలా చిత్రీకరించారు అంతే. పురుషస్వామ్య సమాజం పుత్ర సంతానం వైపే మొగ్గు చూపింది. పుత్ర కామేష్టి లాంటివి అలా ప్రచారమయ్యాయి.
సంతానం పొందే అన్ని ఉపాయాలూ విఫలమయ్యాక ఫలానా ఊరిలో జరిగే ఫలానా ఉత్సవానికి వెళ్తే పిల్లలు కలుగుతారని లోకులు చెప్పటమూ ఆ విధంగా కలిగిన సంతానం దేవుడు ఇచ్చిన సంతానంగా సమాజపు ఆమోదాన్ని పొందటమూ మురుగన్ నవలలో సూచించారు. మహా భారతంలో పాండవులు అలా దేవుళ్ల వల్ల కలిగిన వారే అనే సంగతి గుర్తువచ్చి చేసిన పరిశీలన ఇది.
మహాభారత కథ ప్రకారం పాండురాజు భార్యలు భర్త వల్ల సంతానం పొందలేని స్థితిలో దేవుళ్ళ వల్ల సంతానం పొందారు. కొన్ని కొన్ని పరిస్థితులలో అలా సంతానం పొందటాన్ని అప్పటి సమాజం అనుమతించింది.
స్త్రీ అంటే పునరుత్పత్తి శక్తికీ, సృష్టి విస్తరణకూ కారకురాలిగా భావిస్తారు. వాస్తవం కూడా అదే. సంతానం లేని స్త్రీనీ పురుషుడినీ చిన్న చూపు చూడటం అదిమ సమాజాలలోనే కాదు, ఈనాడూ ఉన్నది. సంతానం ఎన్ని విధాలుగా పొందవచ్చునో పురాణ కథలలో ఉంది. శాస్త్రాలూ వాటిని సమ్మతించాయి. మహాభారతం ఆది పర్వం పంచమాశ్వాసం పాండురాజు వివాహం గురించీ దిగ్విజయాల గురించీ సత్కర్యాల గురించీ అతడు శాపం పొందటం గురించీ విపులంగా చెప్పింది. ఆ కథ తెలుసుకోదగ్గదే.
ఒకప్పుడు పాండురాజు వేటకు వెళ్ళి ఏ మృగమూ దొరకక విసుగ్గా ఉన్నాడట. ఒకచోట ఒక లేడి ఒక ఇట్టి క్రీడిస్తూ
ఉండటం చూశాడు. రెండు బాణాలతో రెండింటినీ కొట్టాడు. కొన ప్రాణాలతో ఉన్న లేడి మనుష్య వచనాలతో పాండురాజును శపించింది. కిందముడు అనే ముని అతని భార్యా మృగాల శృంగార క్రీడలు చూసి మృగాల రూపాలతో క్రీడిస్తూ ఉన్నారట.
పాండురాజు కొట్టినది వారినే. ఆ సంగతి చెప్పి రాజులు వేటాడ్డంలో తప్పులేదు. కాని రతిక్రీడలో ఉన్న వాటిని చంపటం భావ్యం కాదు. ఎంతటి క్రూరులైనా ఇంత అధర్మానికి పూనుకోరు అని ముని నిందించాడు. పాండురాజు తనతప్పుకు క్షమాపణ చెప్పలేదు. ”రాజులు మృగాలను చంపకుండా వదిలిపెట్టరు” అంటూ, అగస్త్యుని వచనం గురించి చెప్పాడు. ”అగస్త్య మహాముని మృగ మాంసంతో నిత్యశ్రార్ధం చేసేవాడు (శ్రద్ధగా పెట్టేది శ్రార్ధం) ఆయన రాజులకు మృగవధ దోషం లేదని చెప్పాడు. అందువల్ల నేను చేసింది దోషం కాదు. నీవు ఇలా నిందించటం తగదు” అన్నాడు. కాని ఆ ముని ఊరుకోలేదు. ”సర్వప్రాణులకు సాధారణమైన – ఇష్టమైన సుఖం – రతి సుఖం – ఆ సుఖావస్థలో ఉన్న మమ్మల్ని, నిరపరాధులను చంపావు. నీవు కూడా ప్రియా సంగమ సమయంలోనే మరణిస్తావు”. అని శపించి మరణించాడు.
అప్పటి నుండీ పాండురాజూ అతని భార్యలు కుంతి, మాద్రి తపోవృత్తిలో ఉన్నారు. ఒకప్పుడు శతశృంగం దగ్గర మునులంతా బ్రహ్మ లోకానికి వెళ్తున్నారట. పాండురాజూ అతని భార్యలూ వారిననుసరించి వెళ్ళారు. కొంతదూరం వెళ్ళాక, అక్కడి దారులు అనపత్యులకు (సంతానం లేనివారికి) సరిగా కనపడవనీ, బ్రహ్మలోకానికి వారు రాలేరనీ మునులు చెప్పారు.
అప్పటి నుండి పాండురాజుకు సంతాన వంతుడు కావాలనే కోరిక మొదలయింది, ”నీకు సంతానం కలుగుతుంది ప్రయత్నించు” అని కూడా మునులు చెప్పారట. పాండురాజు కుంతితో ఈ విషయం ప్రస్తావించాడు
”అపుత్రస్య గతిర్నాస్తి” అంటారు. పుత్రులు ఆరు విధాలు. ఔరస, క్షేత్రజ, వత్తక, కృత్రిమ, గూఢోత్పన్న, అపవిద్ధ అనే ఆరు రకాల పుత్రులు బంధువులూ దాయాదులూ అవుతారు. కానీన, సహోఢ, క్రీత, పౌదర్భవ, స్వయందత్త జ్ఞాతులు (జ్ఞాతిరేతులు దౌహిత్రులు) ఈ ఆరుగురూ బంధువులు అవుతారు. గాని దాయాదులు కారు. ఈ అందరిలోనూ ఔరసుని తర్వాత క్షేత్రజుడు ఉత్కవిష్టుడు అంటూ చెప్పుకొచ్చాడు.
కుంతి చెల్లెలు శ్రుతసేన కేశయరాజు శారదంకాయని భార్య: అతనికీ సంతానార్హత లేకపోతే భర్త ఆజ్ఞ ప్రకారం ఋత్విజుల వల్ల ఆమె (పుంసనవ హోమం చేయించి) ముగ్గురు కొడుకులను పొందింది. పాండురాజు ఆ విషయమూ కుంతికి గుర్తు చేశాడు. ”పుత్ర లాభం అనంత పుణ్యఫలం” అనీ చెప్పాడు. పితృస్వామ్య సమాజపు లక్షణాలు ఇవి. ఈ విషయంలో కుంతికి పాండురాజుకు జరిగిన సంభాషణ మహాభారతం ఆదిపర్వం పంచమాశ్వాసంలో ఉంది.
పౌరవ వంశంలోని వ్యుషితాశ్వుడనే రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు – కాని, నిత్యకామాసక్తితో క్షయ వ్యాధిగ్రస్తుడై మరణించాడు – అతనికి సంతానం లేదు. భార్య భద్ర, అతని శవాన్ని కౌగలించుకొని ”భర్తలేని స్త్రీకి జీవితం కంటే మరణమే మంచిది. నేనూ నీతోనే వస్తాను – లేదా నాకు నీ ప్రతిమూర్తులుగా పుత్రులను ప్రసాదించు” అంటూ విలపించింది. అప్పుడు అతని శరీరంలోంచి కొన్ని మాటలు వినబడ్డాయి. ”ఏడవకు, నీకు వరం ఇస్తాను” అంటూ పుత్రులు కలగటానికి ఒక మార్గం సూచించాయి.
”ఋతుస్నానం చేసిన ఎనిమిదో రోజుగాని పధ్నాలుగోరోజు గాని శుచిగా పడుకొని నన్ను తలచుకో” అని భర్త అన్నట్టుగానే ఆమెకు మాటలు వినబడ్డాయి. చుట్టూ ఉన్నవారికీ వినబడి
ఉండాలి. ఆ విధంగా ఆమె ముగ్గురు సాల్వులను నలుగురు మద్రులను మొత్తం ఏడుగురు కొడుకులను పొందింది.” అంటూ ఈ కధ కుంతి పాండురాజుకు చెప్పింది. అప్పటికి ఆమె సూర్యుని వల్ల సంతానవతి అయింది. అయినా పెళ్ళి నాటికి కన్యగానే
ఉన్నదన్నారు – వర ప్రభావం వల్ల?
”నీవు తలచుకుంటే మేము సంతానవతులము కాగలము” అంటూ ఈ కథ చెప్పిందీ అంటే అప్పటి సమాజ స్వభావాన్ని అంచనావేయవచ్చు.
పూర్వం స్త్రీలు ఋతు సమయం తప్పకుండా తమ తమ వర్ణాల పురుషులతో కలుస్తుండే వారట. ఇది అఖిల ప్రాణి సాధారణమైన ధర్మం అంటున్నది మహాభారతం (ఆది-5-84). ఆదిమ సమాజంలో దీనిని తప్పు పట్టేవారు కాదు. గుంపులుగా నివసించే సమాజాలలో ఒక గుంపులోని మగవారికి ఆ గుంపుతో సమన్వయంతో ఉండే మరో గుంపులోని ఆడవారితో లైంగిక సంబంధాలకు ఆంక్షలు ఉండేవి కావు. కొన్ని సమాజాలలో అతిధులకు చేసే మర్యాదలలో ఇంటి స్త్రీలను శయ్యా సౌఖ్యానికి కూడా నియోగించేవారు. కాలక్రమంలో దీనిపై నియమాలు పెట్టారు.
ఈ పద్దతికి శ్వేతకేతువు అనే ముని అభ్యంతరం చెప్పాడు. శ్వేతకేతువు ఉద్దాలకుని కొడుకు. ఉద్దాలకుని ఇంటికి ఒక వృద్ధ విప్రుడు అతిధిగా వచ్చాడట. అప్పటికి శ్వేతకేతు తల్లికి ఋతుసమయం. ఆ విప్రుడు ఈమె ద్వారా సంతానం కావాలనుకున్నాడు. అప్పటి సమాజానికి అది తప్పుకాదు – ధర్మం కూడాను. శ్వేతకేతువుకు ఇది అధర్మంగా కనిపించింది. అప్పుడే ఆయన ఒక నియమం పెట్టాడు. ”వివాహిత స్త్రీలు పర పురుషులతో సంగమించకూడదు. అలాచేస్తే సకల పాతకాలూ చుట్టుకుంటాయి” అని. ఇదే శిష్ట సంప్రదాయం అన్నాడు. (భార.ఆది.5-85.)
శ్వేతకేతు పెట్టిన నియమం మనుష్యలోకానికి వర్తిస్తూ
ఉంది, కాని ఉత్తర కురుభూములలో వెనకటి ధర్మమే నడుస్తూ ఉన్నదట. ఈ కథంతా పాండురాజు కుంతికి చెప్పాడు. భర్తచేత నియోగింపబడి భార్య పరపురుష సంగమం చేయవచ్చు; కాకపోతే భర్తను సేవించటమే భార్య ధర్మం. భర్త నియోగిస్తే భార్య చేసి తీరాలి. ‘పూర్వం కల్మాషపాదుడనే రాజు భార్య (మదయంతి) భర్త ఆజ్ఞతో వసిష్ఠుని వల్ల అశ్మకుడు అనే కొడుకుని కన్నది. నా జన్మ కూడా ఇలాంటిదే. కృష్ణ ధ్యైపాయనుని వల్ల మా వంశం వృద్ధి పొందింది” అన్నాడు పాండురాజు. ”నా ఆజ్ఞతో సంతానం పొంది నన్ను పుత్రవంతుడిని చెయ్యి” అని కుంతిని కోరాడు. అప్పుడు కుంతి తనకు పూర్వం దుర్వాసుడు ఇచ్చిన మంత్రం గురించి భర్తకు చెప్పింది. ఏ దేవుడిని ఆరాధిస్తే ఆ దేవుడు వచ్చి సంతానం ఇస్తాడన్నది. (పూర్వం సూర్యుని వల్ల తాను సంతానం పొందిన విషయం అతనికి చెప్పలేదు.) అన్ని లోకాలూ ధర్మం మీద నిలుస్తాయి గనక ధర్ముని తలచుకోమని పాండురాజు చెప్పాడు. ధర్ముడు, ” యోగమూర్తి ధరుండై వచ్చి వరం బిచ్చినం” అని భారతం చెప్పింది. ఆమె గర్భాన్ని సంవత్సర కాలం భరించి ధర్మరాజును కన్నది.
దేవగణాలకూ ఆర్యరాజులకూ ఉన్న ఒక ఒప్పందం గురించి డా.అంబేద్కర్ చెప్పిన ఒక విషయం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. స్థానిక క్షత్రియులను (అసుర, దానవ, దైత్య, నాగ, యక్ష గణాలను) గెలిచి రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ఆర్యులకు ”దేవ” అనే గణం ప్రజలు సహాయ పడ్డారట. అందుకు ప్రతిఫలంగా ఆర్యులు తమ మొదటి పంటనూ, తమ స్త్రీల మొదటిరాత్రినీ దేవగణాలకు సమర్పించుకునే వారట. వివాహ మంత్రాలలో ఈ విషయం ఉన్నదన్నారు, అంబేద్కర్. దేవగణాలలోని వారి వల్ల తమ స్త్రీలు గర్భం ధరించటానికి ఆర్యులకు అభ్యంతరం ఉండేదికాదు. ప్రత్యేక సందర్భాలలో పుణ్యక్షేత్రాలకు, రధోత్సవాలకూ దేవతలు దిగి వస్తారనే నమ్మకం ప్రజలలో ఇప్పటికీ ఉంది. పెరుమాళ్ మురుగన్ ప్రస్తావించినట్టుగా, తిరుచెంగాడిలోని అర్థనారీశ్వరుని దేవాలయ ఉత్సవాలలో రధోత్సవం నాడు అక్కడ చేరే మగవాళ్ళంతా దేవుళ్ళే అనే నమ్మకం ప్రజలలో ఉండటానికి అవకాశం ఉంది. దైవాంశంలో పుట్టటాన్నీ, అవతారాలనూ మతం ఒప్పుకుంటున్నది. పూర్వం కొన్ని కొన్ని క్షేత్రాలలో ప్రత్యేక ఉత్సవాలలో స్త్రీల పురుషుల లైంగిక స్వేచ్ఛను అనుమతించేవారు. కోణార్క-ఖజురహో తదితర ఆలయాలూ శక్తి పీఠాలూ సంతాన సాఫల్య కేంద్రాలుగా పూర్వం ఉండేవి. కాముని పున్నమలూ, మదనోత్సవాలూ స్వేచ్ఛా ప్రణయాన్నీ శృంగారాన్నీ అనుమతించినట్టే కనిపిస్తుంది.
వాటికి నిర్దిష్ట లక్ష్యం కూడా ఉండి ఉండవచ్చు. కుల క్షయం కాకుండానూ, వంశవృద్ధికి దోహదం చేసేవిగానూ ఈ ఉత్సవాలను సమాజం ఆమోదించింది.
ఇక్కడ ఇంకో విషయమూ ప్రస్తావించుకోవాలి. ‘అపుత్రస్యగతిర్నాస్తి’ అంటూ పురుష ప్రపంచాన్ని భయపెట్టి, ఔరసుని (తన కుమారుని) వలెనే, క్షేత్రజుడు (భార్యకు కలిగిన కుమారుడు) కూడా ప్రశస్తమైన సంతానం అంటూ నిర్ణయించి పెట్టిన ధర్మ శాస్త్రకారుల ఔదార్యాన్నీ గుర్తుంచుకోవాలి.
సంతానంలేని స్త్రీ గొడ్రాలిగా ఎన్ని అవమానాలు పొందుతున్నదో గమనించి వారు ఇలాంటి ఏర్పాట్లూ నిర్ణయాలూ చేసి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో పెరుమాల్ మురుగన్ నవలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.