ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్‌ గారితో ఓ ఆత్మీయ సంభాషణ- కొండవీటి సత్యవతి

ఆదివారం ఉదయం… పేపర్లన్నీ ముందేసుకుని బద్ధకంగా చదువుతున్న వేళ… నా సంచారవాణి ఈలేసింది. ఏదో పొట్టి మెసేజ్‌ వచ్చింది. చదివి వెంటనే నేనూ ఓ చిట్టి సందేశం పంపా. పొట్టి సందేశం అమృత నుండి … ఆదివారం కదా ఏం చేస్తున్నావ్‌ అని… పేపర్లు నెమరేస్తున్నా.. ఖాళీగానే ఉన్నానని నా చిట్టి సందేశం… ఆ తర్వాత మా ఇద్దరి మధ్య సంభాషణ… అపురూప అవార్డు ఫంక్షన్‌కి కె.విశ్వనాథ్‌ గారిని పిలవడానికి వెళదాం వస్తావా? అలాగే చెల్లి విజయని చూడ్డానికి వెళదాం (విజయకి ఆరోగ్యం బాగాలేదు) సరే వస్తానని చెప్పాను.

అమృత, నెల్లుట్ల రమాదేవి, కిరణ్‌బాలలు కొంపల్లి నుండి నేను మా పల్లి నుండి బయలు దేరి మధ్యలో (PARADISE) స్వర్గం చౌరాస్తాలో కలిసాం. అమృత కారులోనే నలుగురం సర్దుకుని విశ్వనాథ్‌ గారింటికి, జూబ్లీహిల్స్‌ బయలుదేరాం. ఆయనిచ్చిన సమయం 10.30 ఉండాల్సింది బహుశా అరగంట.

కరెక్టుగా 10.30కి ఆయనింటి ముందున్నాం. మా కోసం ఎదురుచూస్తూ ఒకబ్బాయి గేట్‌ తీసాడు. పచ్చగా చెట్లతో చల్లగా వుంది ఆవరణ. ఆ అబ్బాయే మమ్మల్ని ఓ రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. విశ్వనాథ్‌ గారు అప్పటికే ఆ రూమ్‌లో కూర్చుని వున్నారు. నవ్వుతూ రండి… రండి అంటూ ఆహ్వానించారు. తెల్లటి బట్టల్లో వొళ్ళంతా విభూదిపూసుకుని, నుదిటి మీద అడ్డంగా విభూది నామాలతో అచ్చమైన శివభక్తుడిలా అగుపించారు.

”చెప్పండి… ఏమిటి విశేషం” అంటూ ఆయన అడిగారు. రమాదేవి, అమృతలత ఏర్పాటు చేసిన ‘అపురూప అవార్డు’ల గురించి, అమృతలత గురించి, ఇంతకు ముందు జరిగిన రెండు అవార్డుల సమావేశాల గురించి వివరిస్తూ… వచ్చే నెల పదిన జరిగే అవార్డుల ప్రదానం మీటింగుకి మిమ్మల్ని గెస్టుగా పిలుద్దామని వచ్చాం. మీరు తప్పక రావాలి అని చెప్పింది. మీ కోసం మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం. మీరు తప్పక రావాలి… రావు బాల సరస్వతి గారు కూడా వస్తున్నారు అంది అమృత.

”చాలా సంతోషం… కానీ నేను రాలేననుకుంటా… మే నెలలో మా అబ్బాయి వాళ్ళ టూర్‌ వెళుతున్నారు. మేము ఎక్కడ వుంటామో మాకు తెలియదు. హైదరాబాద్‌లో వుంటే తప్పక వస్తాను” అన్నారు. దానిమీద చాలాసేపు మాటలు, అర్ధింపులు నడిచి చివరకి ఆయనని వొప్పించారు అమృత, రమాదేవి.

వచ్చిన పని అయిపోయింది. ఇంక శెలవు తీసుకోవచ్చు. కానీ అప్పుడు సంభాషణ ఆయన సినిమాల మీదికి మళ్ళింది. రమాదేవికి సినిమా పరిజ్ఞానం చాలా ఎక్కువ. ఆయన తీసిన పాత సినిమాలని గుర్తు చేసింది. ప్రేమబంధం, మాంగల్యానికి మరో ముడి, కాలం మారింది సినిమాల మీదికి చర్చ మళ్ళింది. మాంగల్యానికి మరో ముడి సినిమా చాలా విప్లవాత్మకంగా తీసానని ఆయన చెప్పారు. దానిని నేను చూడలేదు.

”మీరు సినిమాలు దర్శకత్వం వహించడం మానేసారేంటి సార్‌!” అని కిరణ్‌ బాల అడిగింది.

”పిల్లలు వొప్పుకోవడంలేదు. ఇంకెన్నాళ్ళు శ్రమపడతారు అంటున్నారు. సినిమా తీయడం చాలా శ్రమతోకూడికున్న పని. నెలల తరబడి బయట వుండాలి. ‘స్వాతి ముత్యం’ సినిమా తీసినపుడు అమరావతిలోఎన్నో రోజులుండాల్సి వచ్చింది. ఏ సినిమా తీసినా ఆ లోకేషన్స్‌లో ఎన్నో రోజులుండాలి. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగా లేదు. మీకు తెలుసా?నా పిల్లల చదువులు, వారి ఆలనా పాలన నేనేనాడు పట్టించుకోలేదు. వాళ్ళని పెంచింది…. చదువుల విషయం చూసుకున్నది నా భార్యే… అందుకే చెబుతాను. ఆడవాళ్ళు అన్నింటా గొప్పవాళ్ళు… వారిపట్ల నాకు అంతులేని గౌరవం. స్త్రీలు స్వతహాగానే నాయకులు. అందుకే నా సినిమాల్లో స్త్రీలని గౌరవంగా చూపించాను.” అన్నారు.

నా మనసులో ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. అడగాలా వద్దా? అడిగితే ఎలా తీసుకుంటారు. ఆయన్ని ప్రశ్నిస్తే నొచ్చుకుంటారని ఇంతకు ముందెవరో చెప్పారు. అయినా సరే అడుగుదాం అనుకున్నాను. కిరణ్‌ బాల ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతోంది. సమాధానాలు చెపుతూ చక్కగా నవ్వుతున్నారు.ఆయన ఫోటో తీసుకోవాలన్పించింది.

”మీ ఫోటో తీసుకోవచ్చా” అడిగాను నేను.

”ఎందుకు నా ఫోటో” అన్నారు.

”ఊరికే.. నాకోసం”

”ఊరికే ఎందుకు? తీసుకోండి… అడిగి తీసుకోవడం మీ సంస్కారం… (అప్పటికే కిరణ్‌బాల ఆయన ఫోటోలు తీసింది) అడగకపోయినా ఫర్వాలేదు” అన్నారు. అప్పటి నుండి ఆయన ఫోటోలు చాలా తీసాను.

మీ సినిమాల్లో సాహిత్యం, సంగీతం అద్భుతంగా వుంటాయి. మీరు చాలా మంచి పాటలు రాయించుకుంటారు” అంది అమృత.

”అవును… మహానుభావులు… సీతారామశాస్త్రి… వేటూరి సుందరరామమూర్తి చాలా గొప్పవారు. వేటూరిగారి కలం రెండు వైపులా పదునుంటుంది”. ఆరేసుకోబోయి… పారేసుకున్నాను” రాయగలడు ‘శంకరా’ అంటూ రాయగలడు… మహానుభావుడు అంటూ రెండు చేతులూ ఎత్తి ఆకాశంవేపు నమస్కరించారు.

నా ప్రశ్నలు తరుముకొస్తున్నాయి. మేము వచ్చి అప్పటికి గంటపైనే అయిపోయింది. ఆయన తొంందరేమీ లేకుండా మాట్లాడుతున్నారు. మధ్యలో జోకులేస్తున్నారు. మేము బాగా నవ్వుతున్నాం. ఆయన చాలా ఆత్మీయంగా, స్నేహంగా మాట్లాడుతున్నారు.

”మీకు కోసం రాకుండా వుంటే… నొచ్చుకోనంటే మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతానండి. మీరెక్కడైనా కలిస్తే ఈ ప్రశ్నలడగాలని నాకు చాలా కాలంగా వుంది. అడగమంటారా” అన్నాను నేను సూటిగానే.

”కోపమెందుకొస్తుంది? సమాధానం చెపుతాగా అడగండి…” అన్నారు.

”నాకు 1985లో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయింది. మర్నాడు ఆపరేషన్‌ అనగా ఆ ముందు రోజు ఆదివారం. దూరదర్శన్‌లో ‘సాగర సంగమం’ సినిమా వస్తుందని మా అమ్మ చెప్పింది. డాక్టర్లను వొప్పించి ఇంటి కొచ్చి ఆ సినిమా చూసాను. మర్నాడు ఆసుపత్రి కెళ్ళి ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఇదంతాఎందుకు చెబుతున్నానంటే ఆ సినిమా పట్ల నా కంత ఇష్టం వుండింది. అయితే మీరు జయప్రద పాత్రని సినిమాలో చాలా అన్యాయం చేసారు.” ఆయన భృకుటి ముడేసి నేను చెప్పింది విన్నారు. ”అలాగే స్వర్ణకమలంలో భానుప్రియ పాత్ర…”

”ఆగండాగండి… జయప్రద పాత్ర చాలా గొప్పపాత్ర. నేను అన్యాయం చేయడమేమిటి? ఎలాంటి అన్యాయం?” అన్నారు.

”స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఇండిపెండెంట్‌ గా వున్న పాత్రని సడన్‌గా రైలెక్కించి మొగుడితో పంపేసారు? ఆమె చాయిస్‌ ఏమిటి? ఆమె ఆలోచన లేమిటి? కమల్‌ పట్ల ఆమె ప్రేమ ఎలాంటిది? కట్నం కోసం ముఖం చాటేసి, ఆమెని పుట్టింట్లోనే వదిలేసిన భర్త గురించి ఆమె ఏమనుకుంటుంది? ఇవేవీ లేవు” అన్నాను. ఈ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానాలు లేవు. అందుకే ”ఇవా మీ ప్రశ్నలు… సాగరసంగమంలో జయప్రద పాత్ర గురించి నన్ను అందరూ ఓ మాట అడుగుతారు. విశ్వనాథ కూడా బాత్‌రూమ్‌ సీనులు పెడతాడా? స్నానం చేస్తూ ప్రేమ గురించి పరవశించి పాడుకోవడం ఏమిటి? అంటూ అడుగుతారు. మీరు కూడా అదే ప్రశ్న వేస్తారనుకున్నాను.”

”నాకు ఆ సీను గురించి అభ్యంతర మేమీ లేదండి. మీరు సంప్రదాయ ధోరణిలో ఆలోచించి జయప్రద పాత్రని, పాత్రానుగుణంగా కాక, దర్శకుడి ఆదేశానుసారం మలిచినట్లు వుంది. ఆ పాత్రని స్వతంత్రంగా వదలలేదు మీరు.”

”అవునమ్మా! ఆమెకి పెళ్ళయింది. కారణాంతరాల వల్ల భర్త దూరంగా వున్నాడు. మళ్ళీ తప్పు తెలుసుకుని వచ్చాడు. ఆమె ఇంత కాలం భర్తరాక కోసం ఎదురుచూస్తూ తండ్రి దగ్గరేవుంది. అతనొచ్చాడు. వెళ్ళిపోయింది…ఇందులో అన్యాయం ఏముంది.” అన్నారు.

”అదేంటండి… ఆమెకి కమల్‌ మీద ప్రేమ వుంది. నిర్లక్ష్యంగా వదిలేసిన భర్తతో వెళ్ళాలా? లేదా? అని ఆమె తేల్చుకోవాలి. అలాగే స్వర్ణకమలంలో భానుప్రియది చాలా సహజమైన పాత్ర. ఆమెకి డాన్స్‌ నేర్చుకోవడం ఇష్టం లేదు. తండ్రి గొప్ప కళాకారుడే. అయితే ఆమెకి ఇష్టం లేనిది ఎలా నేర్చుకుంటుంది? ఆడవాళ్ళకి ఇష్టాయిష్టాలు వుండొద్దా”?

ఆయన కాసేపు ఆలోచనలో పడ్డారు. సినిమాలో జయప్రద పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చెప్పారు. చివరికి తేలిందేమిటంటే సంప్రదాయాన్ని గౌరవించాలి కదా! అన్నట్టు తేల్చేసారు. ఇక స్వర్ణ కమలంలో భానుప్రియ గురించి చెబుతూ… …తండ్రి అంత గొప్ప విద్వాంసుడు… ఆమెకి లెక్కలేదు. అంటూ నిన్ననే ఒక మీటింగ్‌కి వెళ్ళాను. ఇద్దరు సిస్టర్స్‌ గొప్ప నాట్యకారిణులు… వాళ్ళ నాన్న గొప్ప నాట్య కారుడు. ఆయన బతికుండగా ఆయన విలువ వీళ్ళకి తెలియలేదట. ఆయన చనిపోయాక అది గుర్తించి వీళ్ళు నాట్యం నేర్చుకున్నారట. స్వర్ణకమలంలో కూడా అంతే భానుప్రియ చివరికి అర్ధం చేసుకుంది.” అన్నారు.

ఇంక నేను వాదించదలుచుకో లేదు… వాదిస్తే అది ఎలాంటి రూపం తీసుకుంటుందో… అప్పటికే అమృతలో ఆందోళన కనిపిస్తోంది.ఆయనని గెస్ట్‌గా ఆహ్వానించడానికి వచ్చి ఆయనతో పొట్లాడ్డం ఎలా? అనినేను అనుకుని; ”మీరు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. చాలా సినిమాల్లో నటించారు. శుభ సంకల్పంలో మొదటి సారి నటించారు కదా! నటనవేపు ఎందుకొచ్చారు…” రమ అనుకుంటా అడిగింది.

”అదా… దానికి పెద్ద కథ వుంది. శుభ సంకల్పం కథ తయారయ్యాక నాయికానే నాయకుల ఎంపిక జరిగింది. అందులో ప్రధాన పాత్ర రాయుడు (నాయుడు) ఎవరిచేత వేయించాలని చాలా చర్చ జరిగింది. శివాశీ గణేశన్‌ అనుకున్నాం. ఇంకెవరో అనుకున్నాం. కుదర లేదు. సినిమా షూటింగ్‌ మొదలైంది. ఈ పాత్ర ఎంపిక జరగలేదు. బాలసుబ్రహ్మణ్యం మా కజినే. అతనే కమల్‌హాసన్‌ని ఈ సినిమాకి వొప్పించాడు. ఒకరోజు వీళ్ళిద్దరితోను అన్నాను. తొందరగా ఎవరో వొకరిని తేల్చండి. వాళ్ళ డేట్స్‌ దొరకడం చాలా కష్టం అన్నాను. మేం తేల్చుకున్నాం… అన్నారు వాళ్ళు ఎవరిని అంటే ‘మిమ్మల్నే’ అన్నారు. నేనా? కష్టం… రచయిత డైరక్టరు నేనే.. వద్దు వద్దు అన్నాను. వినలేదు. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం వెనక వున్నది ఒక డైలాగ్‌. ఆమని చనిపోయిందని తొలిసారి తెలిసాక రాయుడు అన్న డైలాగ్‌ ”ఎలా జరిగింది?” కథ చెప్పేటపుడు నేను అన్న డైలాగ్‌ ఆ పాత్రని నేనే చేసేలా చేసింది. అలాగే కమల్‌ గొప్ప నటుడు.. రాయుడు ముందు వొదిగి వుండాల్సిన పాత్ర. కమల్‌ కన్నా గొప్పవాడు. ఒక లెజెండ్‌ ఆపాత్రవెయ్యాలి. అందుకే ఆ పాత్ర నేను వేసాను.” అంటూ గట్టిగా నవ్వారు.

”ఆ తర్వాత మీరు చాలా సినిమాల్లో చేసారు.”

”కాస్త డిగ్నిఫైడ్‌, పోలిష్‌డ్‌ తండ్రి పాత్రలన్నీ నా చేతనే చేయించారు.” ”మీరు సినిమా తీసేటప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా వుంటారట… చాలా టేక్‌లు వుంటాయట..”

”సినిమా తీయడం చాలాకష్టం. నటీనటుల్ని ఆయా పాత్రలకనుగుణంగా నటింపచేయడం చాలా కష్టం. ఒక

ఉదాహరణ చెబుతాను వినండి. స్వాతి ముత్యం హిందీలో కూడా తీసాం. అనిల్‌ కపూర్‌, విజయశాంతి. ఒక సన్నివేశంలో రాధిక ఒక బకెట్‌ను పైకెత్తే సన్నివేశం వుంటుంది. తన మనసులోని వేదన, దు:ఖం అన్నీ కూడా ఆ బకెట్‌నుఎత్తి కింద పెట్టడంలో వ్యక్తం చేయాలి. రాధిక ఆ సీను అద్భుతంగా చేసింది. హిందీలో విజయశాంతి ఆ బకెట్‌ను దబ్బున పెట్టేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అదేపద్ధతి. బరువుగా బాధగా ఆ బకెట్‌ను పెట్టించడానికి పదో, పదిహేనో టేకులు చేయాల్చొచ్చింది. రాధిక గొప్పనటి”. అన్నారు.

”స్వాతి ముత్యంలో రాధిక చాలా బాగా చేసిందండి.. మీ సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం” అంది కిరణ్‌బాల.

”అవునండీ.. నా సినిమాలు అందరికీ ఇష్టమే అందులో ఆశ్చర్యం ఏమీలేదు”.

”సార్‌… నేను కొంచం ఎక్కువ మాట్లాడుతున్నాను. ఏమీ అనుకోకండి” అంది. కిరణ్‌బాల.

”అయ్యో! ఫర్వాలేదమ్మా అడగండి” అన్నారు.

”సార్‌.. మాఅబ్బాయికి మీరంటే చాలా ఇష్టం… అమెరికాలో వుంటాడు. మొన్ననే వచ్చాడు. వాడిపుడు వస్తానంటున్నాడు. మేము ఇంకొంచం సేపు వుంటాం.” అంది రమాదేవి.

”అవునా.. రమ్మనండి… ఎంతసేపైనా కూర్చొండి. నేను లోపలికెళ్ళి వస్తాను” అని లేచి ఇంట్లో కెళ్ళారు.

నేను ఆ రూమ్‌లో వున్న పుస్తకాలమీద పడ్డాను. అమృత ఆయన అవార్డులు చూస్తోంది. అక్కడ బీరువాలో ‘తుమ్మపూడి’పేరుతో సంజీవ్‌దేవ్‌ ఆత్మకథ… పెద్ద బేండ్‌ పుస్తకం కనబడింది. చొరవగా బీరువాతీసి పుస్తకాన్ని చూస్తుంటే విశ్వనాధ్‌ గారొచ్చారు లోపలికి. ”సంజీవ్‌దేవ్‌ గారి ఈ పుస్తకం నేను చూళ్ళేదు” అంటుంటే

”ఆ పుస్తకాలన్నీ నేను చదువుతాననుకోకండి పిల్లల కోసం కొన్నాను. నేను చాలా తక్కువ చదువుతాను” అన్నారు.

”ఇంకో పది నిముషాల్లో వస్తాడు సార్‌ మా వాడు” రమ

ఈలోపు టీ, బిస్కెట్లు వచ్చాయి.

”రానివ్వండి పర్వాలేదు. మీ వాడు అమెరికాలో ఎక్కడుంటాడు. నాకు బోలెడు మంది అభిమానులున్నారు. రమ్మని పిలుస్తుంటారు. అన్నేసి గంటలు ప్రయాణం చేయ్యలేం కదా! రోజుకొకరింట్లో తిన్నా మూడేళ్ళపాటు గడిచిపోతుంది వారాలబ్బాయిలా” అంటూ గట్టిగా నవ్వారు.

ఓ పదినిమిషాలు మా సంభాషణ వివిధ అంశాల మీద నడిచింది. ఆయన చక్కగా హాయిగా నవ్వుతూ మాట్లాడతారు. రమా కొడుకు మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చాడు. ముగ్గురూ చాలా ఎగ్జైటెడ్‌గా వున్నారు.

”మీ సినిమాలంటే చాలా ఇష్టం ఎప్పటి నుండో మిమ్మల్ని కలవాలని.” అన్నాడు తేజా … రమాదేవికొడుకు.

”యూత్‌కి కూడా నా సినిమాలు నచ్చుతాయా? ఇపుడొస్తున్న సినిమాలు కదా మీరిష్టపడతారు.” అన్నారు ఆశ్చర్యపడుతూ….

చాలా సేపు వాళ్ళు మాట్లాడుకున్నారు. పిల్లలతో చక్కగానవ్వుకుంటూ మాట్లాడారు. గంట అనుకుని ఓ పూటంతా ఆయనతో వుండిపోయాం. విశ్వనాథ గారు ఎన్నో విషయాలు.. సినిమాల గురించి, దర్శకత్వం గురించి నటన గురించి మాట్లాడారు. హృద్యంగా నవ్వుతుంటే ముందు ఒక పన్ను మాత్రమే కనబడుతూ.. బోసినవ్వు బాపూజిలా అన్పించారు.

ఆయన దగ్గర శెలవు తీసుకుంటూ అందరూ ఆయనకి పాదా భివందనం చేసారు, నేను తప్ప. నేను నమస్కారం చేసి బయట కొచ్చాను. అందరం అమృత చెల్లెలు విజయ ఇంటికి బయలు దేరాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.