”స్త్రీల సమస్యల గురించి ఎవరు రాసినా మాట్లాడినా వెంటనే వాళ్ళు చూపిన పరిష్కారం ఏమిటి అని అడగడం మామూలే. అంటే అట్లా రాసిన వాళ్ళందరూ తప్పకుండా అన్ని సమాధానాలూ ఇవ్వగలగాలి. లేకపోతే పనికిరారు. అంతేగాక ప్రతి విషయంలోనూ మనకు సంపూర్ణమైన సిద్ధాంతం అందివ్వాలి. ఒక వ్యవస్థగా సమస్యల్ని పరిశీలించి. విశ్లేషించి మనకు ఒక మూసలో ఇవ్వాలి అని ఆశిస్తారు.”
పదిహేడో శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో మొదటిసారిగా సెక్సువాలిటీ గురించి, సెక్సు సంబంధాల గురించీ బాహాటంగా మాట్లాడటం, చర్చించడం మొదలైంది. ఇక్కడ అది20వ శతాబ్దంలో మొదలైందనుకుందాం. ఆ విషయాల పట్ల అప్పటి అవగాహనలెట్లా ఉన్నా చారిత్రక దశల దృష్ట్యా అప్పటికవి చాలా రాడికల్ ఆలోచనలనవచ్చు. అట్లా మాట్లాడటం అవసరం కూడా. కాని ఆ విషయం గురించి ఎవరైనా మాట్లాడిన పద్దతీ, ఆప్రోచ్ అయిన తీరులో విషయం పట్ల వాళ్ల అవగాహన రూపం మనకర్ధమవుతుంది. చలం ఆలోచనల్లో చాలా వరకు స్త్రీ పురుష సంబంధాలే ఉన్నట్లు మిగతా విషయాలెన్నింటిని ప్రస్తావించినా ఆయన ఆలోచనల కేంద్రం ప్రధానంగా ఇదే ఉండటం మనక్కనిపిస్తుంది. ఎవరో డి.హెచ్.లారెన్స్‌తో చలాన్ని పోల్చారు. లారెన్స్ రచనల్లో స్త్రీ పురుష సంబంధాల్నిచాలా బాహాటంగా రాశాడు. చలం నవలల్లో మనకది ఎ్కడా కనిపించదు. చలం రాసిన దానిలో సెక్స్ శారీరకం కంటే ఎక్కువ ఆధ్యాత్మికం. ఆయన వర్ణనలన్నీ కూడా ఆట్లాగే ఉంటాయి. అట్లాగే తన జీవితంలో కూడా ఒక ఆదర్శ స్త్రీ గురించి ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉన్నానని చలమే చెప్పుకున్నాడు.ఆ ఆదర్శ స్త్రీ ఎవరు? ఆమెలో ఆయన కోరుకున్న లక్షణాలేమిటి? సెక్స్ సంబంధాలూ, ఆకర్షణా అనే విషయాలపట్ల ‘సహజ స్వభావం’ కలిగిన వ్యక్తా? ‘సహజ’ స్వభావం అంటే ఏమిటి,స్త్రీలో ఎటువంటి భావాలు సహజంగా ఉంటాయి? అవి సమాజ పరిస్థితులనెంత వరకు ప్రతిబింబిస్తాయి అన్న ప్రశ్నలన్నీ చలం సమాధానం చెప్పలేకపోయిన చిక్కు ప్రశ్నలు. సెక్స్ ఆకర్షణ, కోర్కె, పిల్లల మీది ప్రేమా, ”ఇవన్నీ భూమిలోంచి చెట్లకి కాయనిచ్చే భూమి సారానికి చాలా దగ్గర అవి” అంటూ వాటిని ప్రకృతి సామీప్యానికి దగ్గరగా తీసుకెళ్తాడు. సహజమైన ఆకర్షణను బలవంతంగా అణచుకోవడం వ్యక్తిత్వాన్ని అణిచేసుకోవడమే అని ఆయన అభిప్రాయం. కాని ఈ ఆకర్షణే ఆయన దృష్టిలో శరీర వాంఛకా, అంటే మళ్ళీ అందులోనూ సందేహం. శరీర ఆకర్షణ, శృంగారం లాంటిపదాల్ని వాడటంలో ఆయన మనసులోనే ఉన్న ఎన్నో కన్ఫ్యూజన్లు బయటపడతాయి. ఆయన తన అనుభవాల గురించి వ్యక్తం చేసిన భావాల్ని పరిశీలిస్తే ఇది మనకు బోధపడుతుంది. బ్రహ్మసమాజంలో ఉన్నప్పుడు రత్నమ్మతో పరిచయం సంబంధంగా మారి ఆమె కోసం బ్రహ్మసమాజాన్ని వదిలేశాడు చలం. తన ఆత్మకథలో (ఆత్మకథ పేజి-40) దీని గురించి రాశాడు. ”పరస్త్రీతో సంగమమే కాదు. ఆ విధమైన మనోవాంఛ సహితం పాపం (గీతలు నావి) నా రొమాన్స్ అన్నది నా రక్తంలోనే పుట్టింది. ఎంత ప్రయత్నించీ శృంగార వాంఛని ఈ రోజు వరకు జయించలేకపోయాను…” కొద్ది రోజుల్లో ”ఆ శృంగార భావం పాతబడి కొత్త సంబంధం కోసం కొట్టుకునే వాణ్ణి. ఇది గొప్ప ప్రేమ కాదు. ఉత్తకామము కాదు” అట్లా లోకాతీతమైన స్వప్నచారిణి కోసం ఆశపడే వాడు కాని ఆమె ఎన్నడూ తటస్థపడలేదు. కాని ”ఈ శృంగారమంతాకామంతో ముడిపడి ఉండడం వల్ల పాపం అనిపించేది… ఈ శృంగార వాంఛ నుంచి తప్పించుకోవాలి జయించాలి అని ఎంత గట్టిగా ప్రయత్నించినా అది లేనిదినేను బతకలేనని” తన స్ట్రగుల్ గురించి చాలా ఓపెన్‌గా రాశాడు. ప్రతీసారీ రత్నమ్మని కలిసిన తరువాత ఇంటికి వెళ్లేముందు తామిద్దరూ కలిసి ఎట్లానైనా తమ సంబంధాన్ని పవిత్రం చెయ్యమని ఈశ్వరుణ్ణి ప్రార్ధించే వాళ్లు. (ఆత్మకథ పేజి-78) ”తాను నిర్వీర్యుణ్ణి దైవద్రోహినీ అవుతున్నాననే పాప భారం తనలోహెచ్చుతోంద”ని బాధపడ్డాడు. ”నా బుద్ధి చంచలం” (ఆత్మకథ పేజి-87) అని ఇంకోచోట రాశాడు. ఈ పరస్పర విరుద్ధ బావాలతో చివరి వరకూ అవస్థపడటమే కాని ఆయన ఎన్నడూ రాజీకి రాలేదు. అందువల్లే ఆదర్శ స్త్రీ దొరకలేదనే తపన, ఉన్న సంబంధాలన్నిటి పట్లా అసంతృప్తి ఆయనలో కనపడతాయి. ఆయన శృంగార దృష్టి కూడా ఒక ఆదర్శానికి సంబంధించినదే కానీ వాస్తవానికి సంబంధించినది కాదు. శృంగారం, వాంఛ, కోర్కె వీటన్నింటినీ భావకల్పనలుగా ఒక మిథాలజీగా తయారు చేశాడు చలం. ఆయన దృష్టిలో స్త్రీ సౌందర్యానికీ, ప్రకృతి సౌందర్యానికీ తేడా లేదు. ఆయనకు కాలం గడిచే కొద్దీ అవీ రెండూ ఒకటిగానే కనపడ్డాయి. ఆదంతా తన దృష్టి కల్పించుకుంటున్న ఇంద్రజాలమని అన్నాడాయన. ఆయన మాటల్లో అది ”చాలా సుకుమారమైన వాంఛీయమైన ఇంద్రజాలం…” స్త్రీనించి పొందే ఆనందాన్ని ”ఆకాశపు నీలత్వంలోంచి.నీళ్ల చల్లదనంలోంచీ, గడ్డి మెత్తదనంలోంచీ, పువ్వుల మెరుగులోంచి పొందాలి… ఈ సౌందర్యానికంతా వెనుకబడే శక్తి అంతా ఒక్కటే. అది మన పెదిమలకి అందదు. అధికారానికీ లోబడదు…” దీన్ని బట్టి ఆయన వాంఛించే అనుభూతిఎంత అందుకోవాలని ప్రయత్నిస్తే అంత దూరంపోయి కవ్వించే ఎండమావుల లాంటి ‘మిత్’ అని అర్థమవుతుంది. చలం శరీర సౌందర్యం చూస్తే బాధపడ్డాడు. ప్రకృతిసౌందర్యం చూస్తే దిగులు పడ్డాడు. ‘చాలా తృప్తితో ప్రేమించే స్త్రీ హస్తాల్లో కూడా చెప్పలేని దిగులుకలుగుతుంది’ అని రాశాడు. అంటే వట్టి శరీర వాంఛ ఆనిమల్ ఇన్స్టింక్ట్స్కి దగ్గరగా ఉంటుంది. దాన్ని మించి ఉన్నతాలకి వెళ్లటమే ఆయనకి ఆదర్శం – అని అర్థమవుతుంది. ఇందులో ఆయన ఎప్పటికీ సమాధానం చెప్పలేకపోయిన పెద్ద వైరుధ్యం ఒకటి ఉంది. తనలో ఉన్న బుద్ధి చాంచల్యం వల్ల తన ఆదర్శ ప్రేమకెన్నడూ భంగం కలగలేదని చెప్పాడు. తనకెంతో రోత పుట్టించే ఈ చాపల్యంతో జీవితమంతా యుద్ధం చేశాడు. అయినా అది ఆయన్ని వదలలేదు.”దాని మూలంగా ఎన్ని చిక్కుల్లోకి దిగానో? అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నానని”రాశాడు. తన రచనల మూలంగా, తన జీవితం మూలంగా, వేరే స్త్రీలతో తన సంబంధాల మూలంగా రంగనాయకమ్మ (భార్య) ఎన్ని బాధలు పడిందీ, ఆమెని తనెట్లా నమ్మకద్రోహం చేసిందీ బాధపడుతూ రాశాడు ఆత్మకథలో. (ఆత్మకథ పేజి-242) ఆమెకి మతిస్థిమితం తప్పిన తర్వాత రమణాశ్రమం వెళ్లిపోయి అక్కడ నుంచి కట్టలు కట్టలుగా ఉత్తరాలు రాసేది. అవన్నీ చూసి ఉత్త నాన్సెన్స్ అని కొట్టిపారేశానని చెప్పాడు ఆత్మకథలో. కానీ మళ్లీ తర్వాత అప్పట్లో అవి అతనికి అర్థం కాలేదని కూడా చెప్పాడు. అంటే అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదన్నమాట. అట్లాగే చనిపోకముందు నాలుగేళ్లు ఎంత ఆథమంగా ప్రవర్తించిందీ తలచుకుంటే చాలా దుర్భరంగా సిగ్గుగా ఉంటుందని రాశాడు. అంతేకాదు అంత సన్నిహితంగాఉండే వ్యక్తితో మనసు విప్పి ఎన్నడూ మాట్లాడలేదు. ఆమె బాధపడడం చూసిన తర్వాతనైనా, ఆమైనా అతనిని దగ్గరకు తీసుకుని మాట్లాడడానికి తను అవకాశం కల్పించలేదేమోనని అనుమానం వెలిబుచ్చాడు. అంటే చలం తన స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికీ అవే సాంప్రదాయక ధోరణులు (కన్వెన్షనల్ రెస్పాన్సెస్) చూపించాడా అనిపిస్తుంది. ‘వాస్తవాల్లో కంటే కలల్లో ఎక్కువ బతికే వాణ్ణి’ అని తనే స్వయంగా చెప్పాడు. సంతోషాలు తన దగ్గరికి రావాలే కాని తాము వాటిని వెతుక్కుంటూ పోడు. ‘నా ప్రియురాళ్లు అంతే’. వాళ్లు వచ్చి తనతో ఉండిపోవాలి. దీనికి ఆయన చెప్పిన వ్యక్తిస్వాతంత్య్రానికి పొత్తు కుదరదనిపిస్తుంది.
‘ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఎవరి విలువలు వాళ్లవి’ అని నమ్మిన చలమే ఇదికూడా అన్నాడు. అంటే తను ఏర్పరచుకున్న సంబంధాలు, స్నేహితులూ అన్నీ తనకనుకూలంగానే, ఆ స్త్రీలవి కావు. ఇవే వైరుధ్యాలు, చలం తన భావాల్ని చాలా సహజంగా వ్యక్తం చేసిన నవలల్లోనూ మనకు కనిపిస్తాయి. నా ఉద్దేశ్యంలో చలం నవలల్లో స్త్రీలంతా స్త్రీలు కారు. స్త్రీల ఆకారంలో ఉన్న చలం ప్రతిబింబాలే. ‘మైదానం’లోనిరాజేశ్వరిని తీసుకున్నా ‘అరుణ’లోని అరుణని తీసుకున్నా, ‘బ్రాహ్మణికం’ లో సుందరమ్మను తీసుకున్నా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయం. ఈ నవలల్లో స్త్రీల వర్ణనలు కూడా మొత్తం ప్రపంచాన్నే ఒక శృంగార దృస్టితో చేసిన చలం వర్ణనే కాని మరొకటి కాదు. సుందరమ్మ గురించి రాసిన ప్రతీసారీ తనలో ఉన్న గిల్టీఫీలింగ్స్ని వ్యక్తం చేశాడు చలం.మనసు ‘వాంఛ’ తప్పు పాపం అంటుంటే శరీరం తిరగబడటం అనే విషయాన్ని పదేపదే చెప్పాడు. ‘అరుణ’ నవల మొత్తంలో మగవాళ్లందరూ అరుణని వర్ణించడమే ఉందికాని, అసలు ఆమె ఏమిటి, ఆమె ఆలోచనలు ఏమిటి అనేది మనకు అంతుబట్టదు. స్త్రీ అంటే ఒక మిస్టరీ అని అనాదిగా ఉన్న అభిప్రాయం ఇందులోనూ కనిపిస్తుంది. ఎవరికీ అర్ధం కాకుండా అందర్నీ కవ్విస్తూ రెచ్చగొడుతూ ఎవరికీ అందకుండాపోతూ ఉంటుంది అరుణ… (దైవమిచ్చిన భార్య పేజి-33) చలం నవలలన్నింటిలోనూ స్త్రీ ఒక ప్రేరకశక్తి, శృంగారం మూర్తీభవించిన లోకాతీతమైన వ్యక్తి. ఒక మానసిక శక్తి ఒకళ్లు ఆరాధించ తగిన వ్యక్తే కాని, కామించదగ్గది కాదు. (అంటే కామం’ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఎవరి విలువలు వాళ్లవి’ అని నమ్మిన చలమే ఇదికూడా అన్నాడు. అంటే తను ఏర్పరచుకున్న సంబంధాలు, స్నేహితులూ అన్నీ తనకనుకూలంగానే, ఆ స్త్రీలవి కావు. ఇవే వైరుధ్యాలు, చలం తన భావాల్ని చాలా సహజంగా వ్యక్తం చేసిన నవలల్లోనూ మనకు కనిపిస్తాయి. నా ఉద్దేశ్యంలో చలం నవలల్లో స్త్రీలంతా స్త్రీలు కారు. స్త్రీల ఆకారంలో ఉన్న చలం ప్రతిబింబాలే. ‘మైదానం’లోనిరాజేశ్వరిని తీసుకున్నా ‘అరుణ’లోని అరుణని తీసుకున్నా, ‘బ్రాహ్మణికం’ లో సుందరమ్మను తీసుకున్నా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయం. ఈ నవలల్లో స్త్రీల వర్ణనలు కూడా మొత్తం ప్రపంచాన్నే ఒక శృంగార దృస్టితో చేసిన చలం వర్ణనే కాని మరొకటి కాదు. సుందరమ్మ గురించి రాసిన ప్రతీసారీ తనలో ఉన్న గిల్టీఫీలింగ్స్ని వ్యక్తం చేశాడు చలం.మనసు ‘వాంఛ’ తప్పు పాపం అంటుంటే శరీరం తిరగబడటం అనే విషయాన్ని పదేపదే చెప్పాడు. ‘అరుణ’ నవల మొత్తంలో మగవాళ్లందరూ అరుణని వర్ణించడమే ఉందికాని, అసలు ఆమె ఏమిటి, ఆమె ఆలోచనలు ఏమిటి అనేది మనకు అంతుబట్టదు. స్త్రీ అంటే ఒక మిస్టరీ అని అనాదిగా ఉన్న అభిప్రాయం ఇందులోనూ కనిపిస్తుంది. ఎవరికీ అర్ధం కాకుండా అందర్నీ కవ్విస్తూ రెచ్చగొడుతూ ఎవరికీ అందకుండాపోతూ ఉంటుంది అరుణ… (దైవమిచ్చిన భార్య పేజి-33) చలం నవలలన్నింటిలోనూ స్త్రీ ఒక ప్రేరకశక్తి, శృంగారం మూర్తీభవించిన లోకాతీతమైన వ్యక్తి. ఒక మానసిక శక్తి ఒకళ్లు ఆరాధించ తగిన వ్యక్తే కాని, కామించదగ్గది కాదు. (అంటే కామం తప్పాఅనే ప్రశ్న వస్తుంది. ఏమోఈ విషయం చలంరచనల్లో ఎక్కడా అంతు పట్టదు) ఆయన స్త్రీలందరూ జీవితంలో ఏ ఆదర్శం కోసం తను వేదన చెంది తపించి విసిగి వేసారి, ఒంటరి తనం, బాధ అనుభవించాడో, ఆ ఆదర్శం కోసం అంతే బాధపడి ఆఖరవుతాడు. చలం ఒకసారి తన కొక కథ రాయాలనుందని మనకు ప్లాటు చెపుతాడు. ‘నా వంటి సౌందర్యోన్మత్తుడొకడు తపస్సు చేస్తాడు. వరాన్ని పొందుతాడు. తను కోరిన స్త్రీ, ప్రతి ఆవిడా తన్ను మోహించాలని, నా వలెనే ప్రతీ స్త్రీలో ఏదో ఒక విధమైనా అందాన్ని చేస్తాడు. వాంఛిస్తాడు, ప్రతి వారూ గోపికల్లాగు అతన్నిఅనుసరించి వెంటబడతారు. ఏమౌతాడతను (మ్యూజింగ్స్పే.109). ఇది చదివితే మనకర్థమవుతుంది. చలం నవలల్లో స్త్రీలందరూఈ లక్షణాన్ని కలిగి ఉండేవాళ్లు.నవలల్లో పురుషులు మాత్రం చాలా వరకూ స్త్రీని తన స్వంతం చేసుకోవాలని (దైవమిచ్చిన భార్యలో రాధాకృష్ణ)
ఉపయోగించుకోవా లని (‘బ్రాహ్మణికం’లో చంద్రశేఖర్, ‘అనసూయ’లో ప్రకాశరావు)చూస్తారు. అంటే చలం ఏవగించుకుంటున్న లక్షణాలు మగవాళ్లలోనూ ఆదర్శమనుకున్న లక్షణాలు ఆడవాళ్లలోను కనపడతాయన్న మాట. అంటే స్త్రీ మీదెంత బాధ్యత, బరువు పెట్టాడో చలం అనిపిస్తుంది. చలం స్త్రీ ఒక ప్రేరణ శక్తిగా మానసిక శక్తిగా (సైకిక్ ఫోర్సు) శృంగార దేవతగా ఉండలేకపోతే అది తనలో ఉన్న లోపం అనుకుంటానని చలం చాలాసార్లు చెప్పాడు.
”నేను ఆదర్శ పురుషుణ్ణయితే తప్ప నాకు ఆదర్శ స్త్రీ ఎక్కడ నుంచి వస్తుంది.”అని చెప్పడంలో కూడా లాజిక్ తిరిగి, ‘నన్ను ఆరద్శ పురుషుణ్ణి చెయ్యలేకపోయిన లోపం నీదే’ అనే వరకు వెళ్తుంది. ఇది ఆ స్త్రీ మీదెంత బాధ్యతను పెడుతుందీ అనిపిస్తుంది ఆలోచిస్తే. తను ఇదేనా కాదా అని చెప్పగలిగే పరిస్థితులు, అవకాశం, చైతన్యం చలం స్త్రీలకూ లేవు. నవలల్లో నాయికలకూ లేవు. ‘మీ ఆలోచనల స్వరూపం ఇది. మీ అనుభవాల స్వరూపం ఇది. మీ వ్యక్తిత్వం ఇట్లాంటిది. మీ శరీరం ఇట్లాంటిది’ అని చలం స్త్రీలకు చెప్పటమే కనిపిస్తుంది కాని ఆ స్వరూపాన్నించి తప్పించుకోవడానికి గానీ, మేం ఇట్లా లేం అని చెప్పటానికి కానీ, అట్లా ఉన్నదీ లేనిదీ నిర్ణయించుకోవడానికి కానీ, స్త్రీలకి ఆనాడు అవకాశం లేదు. నిజానికి అప్పటి కాలంలో స్త్రీలు సెక్స్ విషయాల పట్ల ఎటువంటి అభిప్రాయాలతో ఉన్నారు? చలాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? ఆయన మీద ఆరాధనా భావమేనా, విమర్శ కూడా ఉందా? అనే ప్రశ్నలకి జవాబులు దొరకడంకష్టం. ఆయన మ్యూజింగ్సులో కానీ ఆత్మకథలో కానీ ఎక్కడా వాళ్లతో జరిగిన సంభాషణల గురించి ప్రస్తావించడు.ఒక్క లీలగారి గురించి ఆమె అభిప్రాయాల గురించి కొన్ని వివరాలున్నాయి. ఆమె మొదటి నుంచీ చివరి వరకూ చలాన్ని తన స్వంతం కావాలనుకున్నదనీ, ఎన్నో విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయనీ, ఆమె తన స్వభావాన్ని ఏ మాత్రం మార్చుకోలేక పోయిందని చలం రాస్తాడు. అంతేకాని వాళ్ల మధ్య జరిగిన సంభాషణ మనకు సరిగా ఎక్కడా దొరకదు. నా కనిపిస్తుంది చలం స్త్రీలంతా (లీలగారికి కూడాఏదో మానసిక వ్యాధన్నాడు డాక్టర్లు) ఆయన్ని ఆరాధించి దేవుడిగా చూడటమే కాని ఎదురుపడి వాళ్ల అభిప్రాయాల్ని, ఆయనతో వాళ్లుపడ్డ ఇబ్బందులని, తిరస్కారాన్ని ఆయనకి బహిరంగంగా చెప్పలేకపోయారేమోనని. అట్లా చెప్పే ఆడవాళ్ళుండి ఉంటే ఆయనలో ఇంత అసంతృప్తి, బాధా వుండకుండా వుండేదేమో. మనకి కూడా పాఠకులుగా మగవాళ్ల దృష్టితో స్త్రీని అర్ధం చేసుకోవటం, గుర్తించటం తెలుసు కానీ దాన్ని ప్రశ్నించే సాంప్రదాయం లేదు. తనలో వైరుధ్యాల్ని అర్ధం చేసుకోగలిగే సాధనాలు చలానికి ఎట్లా లేకుండాపోయినయ్యో వాళ్ల అభిప్రాయాల్ని కచ్ఛితంగా చెప్పగలిగే శక్తినిచ్చే సాధనాలు చలం స్త్రీలకి అప్పటికీ లేవేమో. మరిచలాన్ని అర్ధం చేసుకోవటానికి సాధనాలు యిప్పుడున్నయ్యా అనే ప్రశ్న వస్తుంది. నా వుద్దేశ్యంలో ఒక కొత్త దృక్పథంతో చలాన్ని అర్థం చేసుకోవటానికి ఎటువంటి ప్రశ్నలు వేయాలనే దానికి సాధనాలు ఈ రోజు ఫెమినిస్టులుగా మనకున్నయ్యి. వాటిని రూపొందించుకునే ప్రయత్నంలోనే ఉన్నాం.
అందులో కొన్ని ముఖ్య విషయాల గురించి ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావించదల్చుకున్నాను.
మొదటిది స్త్రీల ఉద్యమం స్త్రీవాద దృక్పథంతో చేసిన సాహిత్య విమర్శ. అంటే సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ ఎట్లా
ఉందనేదే కాకుండా, అది స్త్రీల అనుభవాలకు ఎంత దగ్గరగా ఉందనీ, ఆ అనుభవాలను రాజకీయ సాధ్యాలుగా మలచటానికి ఎంతవరకు దోహదం చేస్తుందని కూడా పరిశీలించటం. అదే విధంగా ఆ సాహిత్యాన్ని సమాజం, ముఖ్యంగా స్త్రీలు ఏ విధంగా అందుకున్నారనేది మరొక ముఖ్య అంశం. చలం రచనలను ఎక్కువగా చదివింది వాటి పట్ల ఆకర్షితు లయింది పురుషులా, స్త్రీలా ఎవరి మీద ఎటువంటి ప్రభావాన్ని రచయిత కలిగించాడనే విషయాల గురించి ఇంత వరకు ఎవరూ రాయలేదనే చెప్పాలి. దీని గురించి కృషి జరగాల్సిన అవసరం ఉంది.
రెండవది-స్త్రీల ఉద్యమం రూపొందించిన అవగాహనలో ఒకటి సిద్దాంతానికున్న ”విశ్వజనీనత’ను ప్రశ్నించటం. విశ్వజనీన విలువలూ, సిద్దాంతాలూ రూపొందించే క్రమంలో ఎన్నో ఇతర అంశాలు మరుగున పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకి ”ప్రజాసా హిత్యం”లో స్త్రీలు కనిపించరనే స్పృహ మొదటిసారి స్త్రీ ఉద్యమం కలిగించింది. అదే విధంగా దళితులు, మైనారిటీలు గురించిన చర్చలకు కూడా స్త్రీఉద్యమం దోహదం చేసింది. ఈ అవగాహనతో చలాన్ని అర్థంచేసుకుంటే ఒక (సరైన) విశ్వజనీన సిద్దాంతం, దృక్పథంతో కాకపోయినా, ఆయన రాసిన ఎన్నో విషయాలు స్త్రీలు-సాంఘిక వ్యవస్థపట్ల కొత్త ఆలోచనల్ని రేకెత్తించేవిగా ఉంటాయని అర్థమవుతుంది.
మూడవది – సాంఘిక వ్యవస్థ. దీని ప్రాముఖ్యత గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, మార్కి ్సస్టు అవగాహన ప్రకారం ప్రభుత్వ అధికారం ఏ విధంగానైనా (ఎన్నికల ద్వారా, సాయుధ విప్లవం ద్వారా) చేజిక్కించుకుంటే, సమాజంలో విప్లవాత్మక మార్పును సాధించవచ్చు. కాని, ఆ విధంగా ప్రభుత్వాధికారం చేజిక్కించుకున్నంత మాత్రాన సోషలిస్ట్ సమాజం స్థాపన జరగదనీ, కుటుంబం, మత సంస్థలు, విద్యా విధానం, ప్రచార సాధనాలు, సాహిత్యం వంటిసాంఘిక వ్యవస్థలన్నింటిలోనూ అధికారం అనే అంశాన్ని వ్యతిరేకించకపోతే, అధికార రాజకీయాలు ఎప్పటికి కొనసాగుతూనే ఉంటాయనే అవగాహన సాంఘిక వ్యవస్థ (సివిల్ సొసైటీ) అనే సిద్ధాంతం మన ముందుకు తీసుకువచ్చింది. దైనందిన జీవితాల్లో అనుక్షణం స్త్రీ ఎదుర్కొనే అధికార రాజకీయాల్ని ప్రశ్నిస్తూ ఎదిగిన ఉద్యమంగా స్త్రీ ఉద్యమం – కుటుంబ వ్యవస్థ సాంఘిక వ్యవస్థలన్నింటికీ ఒక ఇరుసుగా ఎట్లా పని చేస్తుందో విశ్లేషించగలిగింది. అదే అంశాలను తన రచనలలో ప్రధానంగా తీసుకున్న చలాన్ని అర్థం చేసుకోవటానికి విశ్లేషణ చాలా అవసరం అని తిరిగి చెప్పాల్సిన అవసరం ఉండదు. చలం వంటి రచయితల గురించీ, సాహిత్య చరిత్రలో మలుపులు సృష్టించిన ఇతర స్త్రీ పురుష రచయితలందరి గురించీ నిశితమైన స్త్రీవాద విమర్శ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ లోటు తీర్చే ప్రయత్నాలు ప్రారంభమవుతాయని ఆశిద్దాం.
సంప్రదించిన పుస్తకాలు: 1. చలం రచనలు – మ్యూజింగ్స్ – అరుణ పబ్లిషింగ్ హౌస్, విజయవాడ-1983, బిడ్డల శిక్షణ – స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, విజయవాడ – 1976, స్త్రీ – స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, విజయవాడ-1979, మాన్ అండ్ ఉమన్ – వేక్ ఆఫ్ మందనపల్లి – 1986, 2. రంగనాయకమ్మ – చలం సాహిత్యం-స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, విజయవాడ, 1982, 3. పురాణం సుబ్రమణ్యశర్మ- ఆంధ్రలో చలం, 3. జూడిత్ పెట్టర్లీ – ది రెసిస్టింగ్ రీడర్ – ఫెమినిస్ట్ అప్రోచ్ టు అమెరికన్ ఫిక్షన్
భూమిక జూలై-సెప్టెంబరు, అక్టోబరు – డిసెంబరు 1994 నుండి పునఃముద్రణ)