వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియమైన చల్లపల్లి స్వరూపారాణికి, ఎలా ఉన్నావ్‌? ఈ మధ్య చాలాసార్లు గుర్తొచ్చావు. వచ్చి నా లాభమేంటి? నీనుంచి నిశ్శబ్దమే కదా! కనీసం ఫోనన్నా చెయ్యవు. కలిసినప్పుడు మాత్రం, మనిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకు ఎంత ప్రేమ, స్నేహం ఉన్నాయో తెలుస్తుంది. నిజం స్వరూపా! నువ్వు సెంట్రల్‌ యూనివర్సిటీలో పిహెచ్‌.డి. చేస్తున్న విద్యార్థి దశ అప్పటి నుంచీ నాకు పరిచయం. స్వచ్ఛమైన తెల్లని నీ చిరునవ్వంటే ఇష్టం ఏర్పడింది. చరిత్రంటే నాకు చాలా ఇష్టం. అసలు డిగ్రీలో నా గ్రూప్‌, హిస్టరి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్సు, గుప్తరాజుల స్వర్ణయుగాన్ని గురించి ఎగ్జామ్‌లో 20 పేజీలు రాసినట్లు గుర్తు. హిస్టరీలో నువ్వు పరిశోధనకు ఎన్నుకున్న అంశం, నీ పరిశోధనా సామర్థ్యం నన్నెంతగానో ఆకర్షించింది. నువ్వు రాస్తున్న కవిత్వం కూడా అద్భుతమైంది కావడంతో నీపై ఆత్మీయత మరింతగా పెరగడానికి ఆస్కారమైంది. సెమినార్లలో నువ్వు ప్రజంట్‌ చేసిన పేపర్లు, నీ ప్రతిభకు నిదర్శనాలు. నాగార్జున యూనివర్సిటీలో నీకు ఉద్యోగం వచ్చాక మనం కలవడం మరింత పలచబడింది. స్వరూపా! గుర్తుందా నీకు, యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటుచేసిన సెమినార్‌కి మిత్రులందరం వచ్చాం. అప్పుడే నిన్ను నీ సీట్లో, డిపార్ట్‌మెంట్‌లో చూసి చాలా తృప్తిగా అన్పించింది. బుద్ధుడి విగ్రహం, ఎంత పెద్దగా ప్రశాంతంగా ఉందో, ఆ చెట్టూ చేమల మధ్య. నీ గది ఎదురుగా ఉన్న బుద్దుడు మర్చిపోలేని విషయమది. అవునూ, స్వరూపా మీ పాప ‘మైత్రి’ ఏ క్లాస్‌కి వచ్చిందిప్పుడు. బహుశః 7, 8 తరగతుల్లో ఉండుంటుంది కదూ!

చల్లపల్లి స్వరూపారాణి అనగానే ‘మంకెనపువ్వు’ గుర్తొస్తుంది! 2006లో అనుకుంటా పబ్లిష్‌ ఐంది అది. నీ కవిత్వ ప్రవాహానికి అక్షరరూపం తొడుక్కొని నీకొక గణనీయమైన గుర్తింపును తెచ్చిన సంపుటి అది. నువ్వొక దీపశిఖవి. చాలా నెమ్మదిగా, ముభావంగా, బిడియంగా కన్పించే నువ్వు, రచనాస్రష్టవవగానే అంతర్గత శక్తంతా ఉప్పెనై ఉరికొస్తుంది. దళితవాద సాహిత్యంపై నువ్వు రాసిన ఆర్టికల్స్‌ గానీ, కవిత్వం గానీ, ఉపన్యాసాలు గానీ, సెమినార్‌ పేపర్లు గానీ సాహిత్యంలో ఎప్పటికీ నిలబడిపోయేవే. చర్చనీయాంశాలే అవన్నీ. నీ అబ్జర్వేషన్స్‌, సునిశితమైన నీ దృష్టి, కత్తి కంటే పదునైన వాదనాపఠిమ, చరిత్రలో దళితులకు జరిగిన, జరుగుతున్న అనేకానేక అన్యాయాల పట్ల నీ ధర్మాగ్రహం, ఇవన్నీ నీకు నన్ను అత్యంత సమీపంగా తీసుకెళ్ళాయి. చల్లటి పల్లెలో స్వంత వ్యక్తిత్వం రూపంతో భాసించిన రాణివి నువ్వు. పరుషంగా మాట్లాడినట్లు, ఎదుటివాళ్ళు ఉలిక్కిపడినా, సహేతుకంగా వివరించే నీతీరువల్ల అవతలివాళ్ళు ఒప్పుకోక తప్పని స్థితిని కల్పించే నీ ప్రతిభ అసామాన్యం. నీ ఆగ్రహం వెనుక, నిజాయితీ వెనుక ఉన్న విషాదం వాళ్ళను ఆలోచించేట్లు చేస్తుంది. ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం – దళితుల చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం’ అనే వాస్తవాన్ని వివరణాత్మకంగా విశ్లేషించావు చాలా సందర్భాల్లో.

ఆ మధ్యన నీ కవిత ‘ప్రవాహం’ చదివి కన్నీళ్ళొచ్చాయి. అమ్మను కోల్పోయిన బాధ ఎంత పచ్చిగా ఉంటుందో మంకెనపువ్వయిన హృదయంతో రాసావది.

‘కాస్ట్‌ రివిజన్‌ అండ్‌ స్టేట్‌’ (థియరీ) అనే నీ సిద్ధాంతవ్యాసం కూడా రిసెర్చ్‌ పబ్లికేషన్‌ వాళ్ళు పబ్లిష్‌ చేసారంటేనే దాని విలువ తెలుస్తోంది కదా!

‘అస్తిత్వవాదం’పై ‘అస్తిత్వగానం’ అనే మంచి వ్యాసాల పుస్తకము వేశావు. ‘ఫాక్ట్స్‌ ఆఫ్‌ జెండర్‌ డిస్క్రిమినేషన్‌ అండ్‌ వైలెన్స్‌’ (థియరీ) కూడా మంచి రిసెర్చ్‌ బుక్‌ ‘ట్రైబ్‌ పెసెంట్‌ అండ్‌ ఎలైట్‌ డైనమిక్స్‌’ కూడా విలువైన ప్రతిపాదనలతో వచ్చిన పుస్తకమది.

అక్కడక్కడా అప్పుడప్పుడూ కవిత్వమే మనని కలుపుతూ ఉండేది. ‘నీలిమేఘాలు’ వచ్చిన తర్వాతే మనం ఒకరికొకరం స్నేహంగా చాలామంది నిలబడ్డాం అనిపిస్తుంది. స్త్రీల సమస్యలతో ఆరంభమై సామాజిక స్థితిగతుల పరిశీలనతో వస్తువిస్తృతిని, జీవితావగాహన వల్ల నీ సాహిత్య కృషంతా చిక్కనైంది. సమాజంలో స్త్రీలపట్ల ఉన్న వివక్షను ప్రశ్నించడమే కాదు, వాస్తవాల్ని వెల్లడించడంలో కుండబద్దలు కొట్టినట్లుగా ఉండే వైఖరే నిజాల బాటలో నిన్ను నిలబెట్టింది. నువ్వు గుర్తొస్తే ఒకింత గర్వం కూడా వస్తుంది నాకు. ‘ఉమెన్స్‌ స్టడీస్‌ డైరెక్టర్‌’గా నువ్వు నిరంతరం చేస్తున్న కృషి అభినందించదగ్గ విషయమే కదా! బుద్ధికి సంబంధించినవి రిసెర్చ్‌ ఆర్టికల్స్‌ ఐతే, హృదయానికి సంబంధించింది కవిత్వం. ఎవరూ ఊహించని, ఊహకందని ఉపమానాలతో, కొత్తకొత్త పోలికలతో కవిత్వమై పలుకుతావు నువ్వు. పదచిత్రాలు తన శిల్పనైపుణ్యంతో జీవాన్ని నింపుకుంటాయి. తుపాకి గుండులాగా దూసుకుపోయే కవితాక్షరాలు చదువరుల మనస్సును ఉద్వేగంతో నింపుతాయి. ‘మంకెనపువ్వు’ తర్వాత మళ్ళీ కవిత్వ పుస్తకం రాలేదు. మన ‘మైత్రి’లో నీ మంచి కవిత్వాన్ని ఆశించడం నేరమేమీ కాదు. హక్కు కూడా వుంది. ఆ తర్వాత వివిధ పత్రికల్లో వచ్చినవి కూడా చాలానే ఉన్నాయి కదా! నాకోసం తొందర్లో వేస్తావు కదూ! స్వరూపా! ‘సారిక’, పిల్లల విషయంలో జరిగిన దుర్మార్గం ‘న్యూస్‌’లో చూసే వుంటావు కదా! ఇలాంటివి చూసినప్పుడు మనసంతా వికలమైపోతుంది. స్త్రీల జీవితాలు మారేదింకెన్నాళ్ళకు అని వేదన కలుగుతుంది. నీ రాక కోసం చూస్తూ… నీ…

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.