(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)
ప్రభాత వేళల అమ్మ మేల్కొలుపులకి గారాలు పోతూ లేస్తారు
ఎంతకీ తెమలరు…
అమ్మో నాన్నో మందలిస్తే అలకలు పోతారు
కమ్మని ముద్దలు నోటికందిస్తే
విసుక్కుంటూ తిని బడికి పరుగులు తీస్తారు
పంతులమ్మ తిట్టిందనో, నేస్తాలతో తగవైందనో
బుంగమూతితో ఇల్లు చేరే పుత్తడిబొమ్మలకి
అమ్మ కొంగు వెనకా నాన్న హంగు వెనకా
లోకం ఒక ఆట స్థలంలా కనిపిస్తుంది!
ఇల్లొక జైలనిపిస్తుంది!
నాలుగ్గోడల మధ్య గడిపే భద్ర జీవనం విసుగనిపిస్తుంది!
అమ్మ కోప్పడినా నాన్న మందలించినా చెక్కిళ్లపై జారిపడే చుక్కలన్నీ
ఓదార్చే గోముఖ వ్యాఘ్రాల తాయిలాలకి నక్షత్రాలై నవ్వుతాయి!
అలిగిన వేళ అందాలొలికితే ఆవురావురంటూ వచ్చే ఆపద్భాంధవులు
‘చుకు చుకు రైలూ వస్తోంది…. దూరం దూరం జరగండి..
ఆగీనాక ఎక్కండి.. జోజో పాపాయ్ ఏడవకు’ అంటూ లడ్డు మిఠాయి తినిపిస్తారు!
అందర్నీ గమ్య స్థానాలకు చేర్చే ఆ చుకు చుకు రైళ్లు
వీళ్ళని మాత్రం దూరం దూరం తీసుకుపోతాయి
తిరిగి రాలేని తీరికెరగని పాతాళ లోకాల్లో పారేస్తాయి
అక్కడ పగలూ రాత్రీ తారుమారవుతాయి!
అక్కడ సుకుమార హృదయ మందిరాలు విధ్వంసానికి గురౌతాయి
పవిత్ర జన్మస్థానాలు పాశవికత పాలబడతాయి!
పట్టుకుంటే వదలని రోగాలు పాక్కుంటూ పైనబడతాయి!
అక్కడ ప్రభాతాలు కనిపించవు!
గారాలూ బుజ్జగింపులూ మందలింపులుగా వినిపించవు!
పారిపోనీని పశువలయాల మధ్య చిక్కుకుపోయాక
ఇల్లెంత చల్లనిదో, అమ్మ చివాట్లెంత కమ్మనివో అర్థమవుతుంది
భద్ర వలయాన్ని వదిలించుకుని
క్షుద్ర మానవ మృగాల వలల్లో చేరే
చిట్టి చిలకమ్మల రెక్కలు కత్తిరించబడతాయని తెలుస్తుంది
ప్రేమంటే తెర మీద కదిలే కథ కాదని, రాత్రికి రాత్రి సర్దుకునే సూట్కేసు కాదని తెలుస్తుంది
అప్పటికి చాలా ఆలస్యమవుతుంది…
గులాబి బాలల్లారా! అందాల ప్రేమ మాలల్లారా!
మీవారెవరో తెలుసుకోండి!
బతుకుతెరువునిచ్చే చదువునీ, విజ్ఞతనిచ్చే సాహిత్యాన్నీ గుండెకు హత్తుకోండి!
మీ రక్షణ కవచం సిద్ధమవుతుంది, మీరు స్వయంసిద్ధలౌతారు!
(ఎయిడ్స్ నివారణ సంస్థ నిర్వహించిన ‘సాహితీ సమారోహణం’ లో సెక్స్ వర్కర్స్ స్వానుభావాలు విన్నాక రాసిన కవిత)
సుమబాలలపై చక్కని సున్నితమైన కవిత! అభినందనలు నాగలక్ష్మి గారూ!!
నిజమె నాగలక్ష్మి గారూ, చిన్న చిన్న కారణాలకె ఇళ్ళలొంచి పారిపొయెపిల్లలకి బయటి ప్రపంచము ఎంతకౄరంగా ఉంటూందొ తెలియదు. తెలుసుకునె పాటికి ఆలస్యము అవుతుంది. మంచి కవిత.