ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని ప్రముఖ స్త్రీవాద సృజనకారిణి ఓల్గా… కొత్త పరికరాలతో స్త్రీవాద సాహిత్య అధ్యయనానికీ, ప్రస్థానానికి బాటలు పరిచిన తొలి అడుగు ఓల్గా.
మనందరికీ తెలుసు, స్త్రీల జీవితాలని అణిచివేస్తోన్న పితృస్వామ్య రాజకీయాలని బహిర్గతం చేసి తెలుగు సాహిత్యంలో స్త్రీవాదాన్ని ఒక బలమైన తాత్త్విక శక్తిగా నిలబెట్టిన సాహిత్యోద్యమకారిణి ఆమె. కేవలం స్త్రీవాద రాజకీయ చైతన్యాన్ని పాఠకులయిన స్త్రీ, పురుషులకు అందించడం కోసమే సాహిత్యాన్ని ఒక వాహికగా ఎంచుకున్నారామె.
అది సాహిత్యంలోని ఒక ప్రక్రియకి మాత్రమే పరిమితం కాక, కవిత్వంతో మొదలయి, తన రాజకీయ కార్యాచరణకు విస్తృతమైన పరిధి కావాలన్పించి కథ, నవల, విమర్శ, నాటకం, నృత్యరూపకం, పాటలు, సినిమాలు, టివి రచనలు, అనువాదాలు యిలా ఏది రాసినా, సంపాదకత్వం వహించినా సరే స్త్రీవాదమే ఆమెకు ప్రధాన వస్తువయింది. స్త్రీలకు సంబంధించి ఎన్నో అపురూపమైన జీవిత సత్యాలను వివిధ రూపాలలో ఆవిష్కరించిన ఓల్గా గొప్ప పరిశోధకురాలు కూడ అనుకుంటే ఎంతో స్ఫూర్తివంతంగా వుంటుంది. ఆ కోణం నుండి ఓల్గాను చూడవల్సిన, చెప్పవలసిన అవసరముందని ఆమె వ్యాసాలు చదువుతున్నప్పుడు బలంగా అన్పించింది.
అకడమిగ్గానో, వ్యక్తిగతమైన ఆసక్తితోనో ఓల్గా చేసిన అనేకానేక పరిశోధనల్లో వ్యాస పరిమితికి లోబడి, లేదా నా పఠన పరిమితికి లోబడి కొన్నింటిని మాత్రమే యిక్కడ ప్రస్తావించుకుందాం.
పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, తవ్వుకుంటూ ఓల్గా ఎంతదూరం వెళ్తారంటే క్రీ.పూ. ఆరో శతాబ్దంలోని బౌద్ధ సన్యాసినుల స్థితిగతుల గురించి ప్రస్తావిస్తారో చోట. అందులో సుమంగళీ మాత అన్న బౌద్ధ సన్యాసిని పాళీ భాషలో పాడుకున్న పాటని అనువదించి, మన ముందుంచుతారు ఓల్గా.
”ఒక స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది, నేనెంత స్వేచ్ఛగా వున్నాను.
వంటింటి చాకిరీ నుంచి ఎంత అద్భుతమైన స్వేచ్ఛ
కఠోరమైన ఆకలి గుప్పిటి నుండి
ఖాళీ అన్నం కుండల నుంచీ స్వేచ్ఛ
వెలుగు నీడలను పడుగుపేకలు చేసే
ఆ కర్కశమైన మగవాడి నుండి కూడా స్వేచ్ఛ
ఇప్పుడెంత శాంతి…..” యిలా సాగుతుందన్నమాట ఆ పాట.
స్త్రీల అణిచివేత అన్నది ఎంత ప్రాచీనమైనదో, ఆ అణిచివేత నుండి స్త్రీలు ఎంతగా వేదన పడి స్వేచ్ఛ కోసం ఆరాటపడ్డారో, దానికెంత సుదీర్ఘ చరిత్ర వుందో మనకి అర్థమవుతుంది… అట్లాగే క్రీ||శ 650లో ‘విజ్ఞిక’ అన్న కర్ణాటక కవయిత్రి రాసిన శ్లోకాలని తెలుగులో ఓల్గా వినిపిస్తే విస్తుపోతాం.
”నేను విజ్ఞికను, నల్లకలువరేకుల వంటి శరీరం కలదాన్ని
నన్నెరుగని దంది, జ్ఞానదేవత అయిన సరస్వతి తెల్లగా వుంటుందని రాశాను” అంటుంది…. ఏడో శతాబ్దంలో విజ్ఞిక రాసిన ఈ రెండు వాక్యాలతో మనతలదిమ్మెక్కిపోతుంది. ఆమె ఆత్మవిశ్వాసానికీ, తిరుగుబాటు తత్త్వానికీ అచ్చెరువొందుతాం. ”ఈనాటి స్త్రీవాద, దళితవాద నేపథ్యం లోనుండి ఈ కవితను ఎంతయినా విశ్లేషించుకోవచ్చు”నంటారు ఓల్గా…. ఇలా చాలా వెనక్కి వెళ్ళి ఆయా కులాల స్త్రీ ప్రశ్నించే తీరునీ, తిరుగుబాటు తత్త్వాన్నీ, చైతన్యాన్నీ యివ్వాల్టి స్త్రీలకు సరఫరా చేస్తూ ఆమె రాసిన ”స్త్రీల సాహిత్యచరిత్ర” ఒక గొప్ప పరిశీలన.
స్త్రీలు తాము రచనలు చేస్తున్నపుడు తమని తాము అదుపులో వుంచుకుంటూ, సెల్ఫ్ సెన్సార్షిప్ చేసుకుంటూ రాస్తారు. అంతకు మించి చైతన్యంతో తమ మీది అదుపుల గురించి మాట్లాడబోతే ఎన్నో కళ్ళు వెంటాడి తప్పు పట్టడానికి సిద్ధంగా వుంటాయి. తమ శరీర ధర్మాలను గురించి చెప్పుకుంటే నీలికవిత్వమంటూ నిరసిస్తాయి. అదీ మామూలు పురుషగొంతుకలు కాదు. ప్రగతిశీలవాదులమనుకునే రచయితల గొంతుకలు. స్త్రీల కవిత్వాలలో సామాజిక స్పృహ లేదనీ, శరీర స్పృహ మాత్రమే వుందనీ వారు విమర్శించిన నేపథ్యంలో నుండి ”అస్మిత” రెండు రోజుల సదస్సు నిర్వహించింది. భాషా రాజకీయాల గురించీ, భావ రాజకీయాల గురించీ విస్తృతంగా చర్చించి స్త్రీలతో కవిత్వం రాయించి ఆ కవితలన్నింటినీ కలిపి సంకలనంగా తీసుకురావాలని నిర్ణయించింది. అప్పుడు బయటకొచ్చిందే ”నీలిమేఘాలు” కవిత్వ సంకలనం. నిజానికి స్త్రీవాద సాహిత్య చరిత్రలో అదొక కీలక ఘట్టం.. మనందరికీ తెలుసు ఓల్గా ”అస్మిత”లో వ్యవస్థాపక భాగస్వామి.
పాటిబండ్ల రజని చెప్పినట్లుగా పదినోళ్ళతో అవాకులు ఎక్కుపెట్టిన వాళ్ళకి తొంభయిరెండు కవితాస్త్రాలతో సమాధానమిప్పించి మున్ముందు మళ్ళీ ఏ పురుషాసురుడూ కొమ్ము విసరకుండా నిరంతరం నిప్పులు వెదజల్లగలిగే ”నీలిమేఘాలు” అస్త్రాన్ని కాపలా వుంచింది ఓల్గా. అందుకామె చేసిన అధ్యయనం, భావరాజకీయాల తాలూకూ లోతయిన పరిశీలన అత్యంత విలువయినవి… అలా సమూహంగా పరస్పర సహకారంతో వున్నట్టయితే స్త్రీలు అణిచివేతల్ని తిప్పికొట్టడం తేలికవుతుందనీ, యుద్ధం చేస్తేనే తప్ప శాంతి లభించదనీ ఓల్గా ఒక లోతయిన అవగాహననిచ్చారు.
సామాజిక జీవనంలో, వ్యక్తుల ప్రాపంచిక దృక్పథాలలో అంతకు ముందు రాని అలజడి మార్పు, తిరుగుబాటూ స్త్రీలు ఒక సమూహంగా తమదైన చైతన్యంతో నాయకులుగా, కార్యకర్తలుగా ప్రవేశించిన తర్వాతనే వచ్చాయి అంటారు ఓల్గా.
ముందే చెప్పుకున్నట్లు అస్మితలో వ్యవస్థాపక భాగస్వామ్యమై ఓల్గా వసంత కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్లతో కలిసి పనిచేసి, పరిశోధించి వివిధ రంగాలలో చరిత్ర నిర్మాతలయిన మహిళల విజయగాథలను వెలికితీసి అందరికీ పరిచయం చేసిన ఒక మహాద్భుతం ”మహిళావరణం” ప్రచురణ…
కొత్త శతాబ్ది ప్రారంభంలో గడిచిపోయిన కాలాన్ని మదింపు వేస్తూ స్త్రీల భాగస్వామ్యాన్ని అంచనా వేయాలనుకున్నపుడు అనేకానేక విషయాలు తవ్వి తీసింది అస్మిత… ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా భావించి, ఆ చరిత్ర నిర్మాతలని నమోదు చేయవలసిన బలమైన అవసరంగా ”మహిళావరణం” ఆవిర్భవించింది. దీనిని సోదాహరణంగా, సాధాకారికంగా నిరూపించడానికి ఎంతో లోతయిన అధ్యయనమూ, పరిశోధనా చేయవలసి వచ్చింది… వంద సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ జరిపే విజయోత్సవ చిహ్నంగా నిలబడింది ”మహిళావరణం”… అందుకు మూలకారణమైన అస్మిత అందులో భాగమయిన ఓల్గా చేసిన పని అభినందనీయం.
సాధారణంగా స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా గుర్తించరెవరూ. అందుకే ఈ సామాన్యల అసామాన్య సాహసాలనూ, పోరాటాలనూ, సాధించిన విజయాలనూ, చేసిన త్యాగాలనూ, చెప్పిన సమాధానలనూ, ప్రేరణలనూ ‘మహిళావరణం’గా చరిత్రలో నమోదు చేయడం అనన్య సామాన్యం… ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు సాధించిన ఈ విజయాలను లోతుగా విశ్లేషిస్తూ మహిళావరణానికి చాలా విస్తృతమైన ముందు మాట రాశారు వసంతకన్నాభిరాన్, ఓల్గా, కల్పనా కన్నాభిరాన్.
‘మహిళావరణం’ వంటి బరువైన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ ప్రచురించడం సాధ్యం కాదని ఎంచి, ఈ ముందు మాటని, ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిర్మాతలయిన స్త్రీలని అందరూ పరిచయం చేసుకోవడానికి వీలుగా ‘సామాన్యుల సాహసం’గా ప్రచురించి పాఠకుల కందించడం మరో ముఖ్యమైన విజయవిశేషం.
ఆ క్రమంలో స్త్రీలుగా మనని కదిలించి, లోతయిన ఆలోచనని కలిగించి చైతన్యాన్ని నింపే మరో అద్భుతమైన పరిశోధన స్త్రీలరచనా వ్యాసంగం మీద యింటా, బయటా అమలువుతోన్న ఆంక్షలు, సెన్సార్షిప్. రచయిత్రులకు కుటుంబం నుండీ, సాంఘిక నిర్మాణాల నుండీ, సాహిత్య కుటుంబాల నుండీ, యింకా స్టేట్ నుండీ ఎదురయ్యే సెన్సార్‌షిప్‌ని గుర్తించి ఆమె చాలా కాలం ముందే వ్యాసం రాసి పాఠకులకు తెలియజెప్పినప్పటికీ ఆమెకి తృప్తి కలగలేదు. సెన్సార్షిప్ అమలయ్యే ప్రాంతాలను తరచి చూసి లోతుగా ఆలోచించాల్సిన పెద్ద సమస్య యిది అని అర్థమైంది ఓల్గాకి. అందుకే రచయిత్రులుగా స్త్రీలు చేస్తోన్న పోరాటాలనూ, చెల్లించాల్సిన మూల్యాలనూ, చేసిన ప్రతిఘటనలనూ, పడవలసిన రాజీలనూ తెలుసుకుని విపులంగా చర్చించాల్సిన అవసరాన్ని గుర్తించారామె. సరిగ్గా అప్పుడే ”విమెన్స్ వరల్డ్” అన్న సంస్థ ప్రచురించిన ”దిపవరాఫ్ ది వరల్డ్” అన్న పుస్తకం చదవడం యాదృచ్ఛికం కాదు. ఆ పుస్తకాన్ని పంపిన రీతూ మీనన్ (కాళీ ఫర్ విమన్), వసంత కన్నాభిరాన్, అమ్మూ జోసెఫ్‌లతో కలిసి ఓల్గా జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను రెండున్నర సంవత్సరాల పాటు నిర్వహించారు.
పది భారతీయ భాషలలోని రచయిత్రులను కలిసి, పది వర్క్‌షాపులు నిర్వహించి, వారి వారి అసహాయ సందర్భాలను వెలికి తీసి బయట పెట్టిందీ ప్రాజెక్టు. అందరికీ గుర్తుండే వుంటుంది తొంభయి తొమ్మిదిలో రచయిత్రులంతా బంగాళాఖాతం తీరాన కలిసి ఒకరి మనసులొకరు పంచుకుంటూ ఈ ప్రాజెక్ట్ లోతులకెళ్లి చర్చించిన సందర్భం.. అది ఈ పరిశోధనలో భాగమే.
ఎందుకు రాస్తున్నావని ప్రశ్నించుకుంటే, ఒంటరి తనాన్నుండి తప్పించుకునేందుకూ, తమ జీవితాలకు, శ్రమకూ తాము పరాయివారమవుతున్నామనే భావనను భరించలేనప్పుడు, కనీసం వినడానికెవరూ లేనపుడు, తమ జీవితాలను తాము అర్థం చేసుకునేందుకు, ప్రేమించుకునేందుకు రాయటమొక్కటే మార్గం అని నమ్మి రాస్తున్నామన్న ఒకే విధమైన సమాధానం అందరి నుండీ. వాళ్ళు బయట పెట్టిన ఒక్కొక్క జీవిత సత్యాన్నీ చదువుతుంటే ఒక వూపిరాడనితనంతో, నిలవనీని వేదనతో కిందుమీదులవుతాం మనం.
తన కథ వల్ల తన భర్త ముఖం మీద కదిలిన నీలినీడను చూసి పద్దెనిమిది సంవత్సరాల పాటు రాయడం మానేశానంటుంది ఒక రచయిత్రి. అతని మరణం తర్వాతే మళ్ళీ ఆమె సాహిత్య వ్యాసంగం మొదలయింది. తల్లితో యిక మీదెప్పుడూ రచనలు చేయనని ప్రమాణం చేయించుకుంటాడో కొడుకు. రచనల కంటే ముందు, ప్రాజెక్టుల కంటే ముందు కుటుంబాన్ని గురించి ఆలోచించాలి కదా అంటాడు మరో పుంగవుడు…. ఒకానొక పత్రికలో తన సీరియల్ రాబోతోందన్న ప్రముఖ ప్రకటన చూసి తండ్రి తనను బెల్ట్‌తో కొట్టాడని అంటుందో యువ రచయిత్రి… రాసే ప్రతిదీ భర్తో, తండ్రో, మరొకరో చదివి అనుమతించాల్సిన నేపథ్యంలో చాలాసార్లు రాయొద్దని నిర్ణయించుకుని, రాయకుండా వుండలేక నలిగిపోయిన వాళ్ళెందరో.
”వ్యవసాయాన్ని గురించి రాస్తే నా తండ్రి రాశాడని అంటారు. వైద్యం గురించి రాస్తే నా భర్త రాశాడంటారు. ఈ రెండిటితోనూ నాకు స్వయంగా సంబంధం వుండి వుండొచ్చునని అనుకోరు. ఏది రాయాలన్నా భయంగా వుంది” అంటుందో తెలుగు రచయిత్రి. ఒక కవి భార్య కవి కాకూడదా? ఆమె ఏది రాసినా ఆమె భర్తే రాశాడని నిర్ధారించేస్తారు, వెక్కిరిస్తారు. దాంతో తాను కవిత్వం రాయడం మానేసి కథలు రాయడం మొదలు పెట్టానంటుందో కవయిత్రి.
ఏమిటదంతా? ప్రశాంతంగా రాసుకోడానికో చోటూ, సమయమూ లేని పరిస్థితిలోనే వున్నారింకా అనేకమంది రచయిత్రులు. కమలాదాస్కి దొరికినట్లుగా కనీసం తుడిచేసిన భోజనాల బల్ల దొరికే పరిస్థితి కూడ లేదు. భర్త, చదువుకునే పిల్లలూ వీళ్ళందరికీ చోటు సరిపోయిన తర్వాతే తనకి చోటు. ఎక్కువ శాతం మంది రచయిత్రులు రాత్రివేళ ఇల్లంతా నిద్రించిన తర్వాతే రాసుకుంటామని అంటారు. అలా కొద్దిపాటి నిద్రనీ, విశ్రాంతినీ త్యాగం చేసి, ఆరోగ్యాలను పణంగా పెట్టి రాసుకుందామనుకున్నా కూడా ”నువ్వు నిద్రపోతేనేగానీ నేనూ నిద్రపోనని భీష్మించుక్కూచున్నాడు నా భర్త” అంటుందో మళయాళ రచయిత్రి… మనకి నోటినుండి మాటలు రావు. చల్లబడి పోయిన గుండెల్లో నుండి నీళ్ళు తప్ప.
తమంతట తాముగా లోలోపల అణిచిపెట్టుకున్న చైతన్యతా,ఉత్సాహాలూ భర్తల మరణం తర్వాత అదుపు లేకుండా, ఎట్లా వెల్లివిరిసి ఉన్నత స్థాయిలోకి ఎదిగి ఋజువు పరుచుకుంటాయో పరిశోధించి ఓల్గా చెప్తుంటే తెరలు తెరలుగా దిగులు మనని కమ్మేస్తుంది.
మనకి తెలీకుండానే మన జీవితాలు ఎట్లా పురుషుడి ప్రాధాన్యతతో పెనవేసుకుపోయి వుంటాయో, ఆ అధికారాలను ఎదుర్కొని మన మీది అధికారాన్ని మనమే చేతుల్లోకి తీసుకుని ఎట్లా మన జీవరసాలను కాపాడుకోవాలో, శాంతిని పొందాలో అర్థం చేయిస్తూ అనేక ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చిందీ పరిశోధన.
ఈ పరిశోధన తాలూకూ వాస్తవాలని చదువుతూ నేను చాలా సార్లు వెక్కి వెక్కి ఏడ్చాను. చాలా రాత్రులు వీళ్ళంతా, ఈ రచయిత్రులంతా నా చుట్టూ చేరి ప్రశ్నిస్తున్నట్టే, నిలదీస్తున్నట్టే అన్పించేది. ఇదంతా చదువుతూ ఎట్లా నన్ను నేను పోగొట్టుకున్నానో, రచన నా ప్రాణావసరమన్న విషయాన్ని నా జీవరసాన్ని ఎక్కడ జారవిదుచుకున్నానో గుర్తురాక, గుర్తొచ్చీ, అర్థమయ్యీకాక చాలా రాత్రులు నిద్రపట్టేది కాదు… నిజానికి నన్ను నియంత్రించే వాళ్ళెవరూ లేకపోయినప్పటికీ కుటుంబం పట్ల ప్రేమ, నిర్దేశింపబడిన బాధ్యత పెద్ద సెన్సార్ ఏజంట్లుగా పని చేశాయని నాకీ పరిశోధనని పరికించాక లోతుగా అర్థమయింది… తమని తాను అర్థం చేసుకోవడానికి ప్రతీ రచయిత్రీ కూడా పరికించాల్సిన పరిశోధన యిది…
కుటుంబం లోపల, బయట సాహిత్య కుటుంబం నుండీ, యింకా సాహిత్య పీఠాలూ, ప్రభుత్వ అకాడెమీలు, పత్రికాధిపతులూ, మార్కెట్ శక్తులూ స్త్రీల రచనలను ఏమాత్రం పరిగణించని పురుష విమర్శకులూ యిట్లా మొత్తం సాహిత్య ప్రపంచం నుండి అన్ని భాషల్లోనూ రచయిత్రులు ఎంతెంత సెన్సారషిప్కి గురయ్యారో… యింకా స్టేట్ సెన్సార్షిప్, విద్యఛాయలు ప్రసరించని దళిత వాడల్లో నుంచి స్త్రీ రచయితలు ఎదగకపోవడాన్ని గురించీ అనేక కోణాలని వెలికి తీసి చర్చకు పరిశోధన… చాలా కదిలించి, వేదనపెట్టి అశాంతికి గురి చేస్తుంది.
పలకని మౌన మృదంగాలను పలికించి, సుప్త భుజంగాలను కదిలించి గుండెలు చెదిరే బీభత్సవిషాదం లోకి మనని నెట్టివేసిన ఈ పరిశోధక వాస్తవాన్నీ, కారణమైన ఓల్గానీ శపించక తప్పదు. అయితే ఈ శాపగ్రస్త రాసిన ‘స్వేచ్ఛ’ నవల మీద జరిగిన దాడి, రేగిన దుమారం, ఆమె వ్యక్తిగత జీవితాన్ని చర్చలోకి లాగి, నవల బట్టి జీవితాన్నీ, జీవితాన్ని బట్టి నవలనూ అంచనా వేసే వరకూ వెళ్ళింది చిన్న విషయమేమీ కాదు. ఆ సంఘర్షణలో నుంచి బయటపడి, లోలోపలి మధనని అధిగమించి రాయడం మాత్రమే సమాధానంగా వేల పేజీల సాహిత్యాన్ని పాఠకులకందించారామె. దటీజ్ ఓల్గా.
రచయితలుగా స్త్రీలను ఎన్నెన్ని రకాలుగా అణిచివేస్తారో ఒక్కొక్క కోణమూ అర్థమయి, ఎన్నో ప్రశ్నలు మన హృదయాలను చురుకున తాకి గాయాలు చేసి, అందుకు మనమేం చేయాలో మార్గం వెతకమని నొప్పి చేస్తూనే వుంటాయి. గుచ్చుతూనే వుంటాయి.
చాలా చిన్న వయసులోనే ఈ సమాజంలోని అన్ని రకాల అసమానతలనూ, స్త్రీల అణిచివేతనూ అర్థం చేసుకుని ఆ కోణం నుండి సమాజపు చరిత్రను పరిశీలిస్తూ వచ్చిన ఓల్గా సాహిత్య ప్రయాణం నిబద్ధతతో సాగిందనడానికి విస్తృతమైన, లోతయిన ఆమె పరిశోధనలు పట్టి చూస్తే చాలు.
మహాకవి గురజాడకి మూడు యాభయిలు నిండుతున్న మంచి సందర్భంలో ఎంతో గౌరవంతో, ప్రేమతో, మరెన్నో ముద్దులతో ఓల్గా సమర్పించిన ”అడుగుజాడ గురజాడ” ఆమె మరో అభినందనీయ పరిశోధన. ఇది ఎవరో అడిగితేనో, ఏదో ప్రాజెక్టు కోసమో, అకడమిగ్గానో చేసిన పరిశోధన కాదు. ఓల్గా తాను స్వయంగా గురజాడని, మధురవాణిని భిన్నంగా గుర్తించి లోతుల్లో నుండి పాఠకులకు అర్థం చేయించడం కోసం చేసిన పరిశోధన…. వ్యక్తిగతమయిన ఆసక్తితో చేసిన పరిశోధన… ఇందుకోసం ఆమె పడిన శ్రమ అంతా యింతా కాదు. అందుకు సంబంధించిన ఎన్నెన్నో రకాల పాత పుస్తకాలను కూడ తవ్వి తీసి, తాను స్వయంగా వివిధ కోణాల నుండి అధ్యయనం చేసి అర్థం చేసుకుని మనకి అర్థం చేయిస్తారు.
ఎందుకంటే సమాజాన్ని అంతగా అర్థం చేసుకుని, కటువైన విమర్శని హాస్యంగా చేసి, మనుషులను ఎంతగానో ప్రేమించి, ప్రేమ తత్త్వాన్ని కొత్తగా తొలిసారిగా, ఆధునికంగా పరిచయం చేసిన గురజాడ అంటే ఓల్గాకి పిచ్చి ప్రేమ… స్త్రీల పట్ల గురజాడకున్న గౌరవం, వారితో సహానుభూతి చెందగల సున్నిత హృదయం, భవిష్యత్తు వారి చేతిలో వుందన్న ఆయన ఆశ యివన్నీ ఓల్గాని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.. ఆ తనివి తీరని ప్రేమే ఆమెని గురజాడ ఆలోచనల లోతుల్లోకి వెళ్ళి చూడమని ప్రేరేపించింది, పరిశోధించమంది. తాను తెలుసుకుని వెలికి తీసిన వెలుతురు రేకల్ని అందరికీ ప్రసరింప చేయతలపెట్టింది.
”ఆధునిక స్త్రీ చరిత్రని పునర్లిఖిస్తుంది” అన్న ఆలోచన దిశగా మహా రచయిత కొంత దర్శనం చేస్తోన్న సమయంలో సద్యోయవ్వనంతో పుట్టిన మధురవాణి అత్యద్భుత మానవత్వంతో చిరునవ్వులు విరజిమ్ముకుంటూ, కపట సమాజాన్ని పరిహసిస్తూ, ఆ ద్వంద్వ విలువలను చూసి పగలబడి నవ్వుతూ, అందరినీ ఆడిస్తూ, అందరితో ఆడుకుంటూ, రసాల సాలమై ఎదిగిన మధురవాణి పరిణితి చూసి తండ్రి గురజాడే ఆశ్చర్యపోతాడట.
”వర్ణింపరాని హేయమైన నడవడిక కలిగిన మధురవాణి పాత్రకు ఎటువంటి వన్నెలూ, చిన్నెలూ లేవు. నాటకం రచిస్తున్న కొద్దీ మధురవాణి మీద నాకున్న దృక్పథం మారుతూ వచ్చింది. మధురవాణి పాత్రంటే నేను ముచ్చటపడ్డాను” అంటారు గురజాడ.. ఆ నేపథ్యంలో నుండి.
మధురవాణి పాత్రని కుటుంబాలలో స్త్రీలమీది నియంత్రణలని ధిక్కరించే కోణంలో పరిశీలించారు ఓల్గా. ఆనాటికే మధురవాణికి మన ఇళ్ళలో కుటుంబాలలో స్త్రీల యింటి చాకిరీని గుర్తించి ప్రశ్నించగలిగిన ఆధునికత వున్నట్లుగా ఓల్గా గమనించారు. ఆ విధంగా మధురవాణి మాటలకింద, మృదువైన ఆమె చెమక్కులు, విసుర్ల కింద అంతర్లీనంగా ప్రవహిస్తోన్న ఆధునిక తత్త్వాన్ని తొలిసారిగా పట్టుకున్నది బహుశా ఓల్గాయే. మధురవాణిని అంత భిన్నంగా గుర్తించిందామె.
చరిత్ర నిర్మాణ క్రమంలో మనకి పాత పరికరాలు పనికిరావనీ, అవన్నీ తఫ్పుల తడకలనీ, కొత్త పరికరాల కోసం అన్వేషణ ప్రారంభించిన ఓల్గా ఆ పరికరాల వెలుగులో నుండి సాహిత్యాన్ని పరిశీలించడం, విశ్లేషించడం అభినందనీయం.
మధురవాణి పాత్రని సృష్టించే క్రమంలో, ఆమె తల్లి గురించి ప్రస్తావించే సందర్భంలో గురజాడకి మంచిచెడ్డల గురించి లోతుగా ఆలోచించే అవకాశం కలిగింది అంటారు ఓల్గా. కులం వల్ల, వృత్తి వల్ల మనుషులను అంచనా వేయరాదనే సంగతి మధురవాణితో పరోక్షంగా చెప్పించిన గురజాడ, ఆ తర్వాత ఎప్పుడో రాసిన కవితలో చాల స్పష్టంగా తన అభిప్రాయాన్ని ప్రకటించా డంటారామె. అదే
”మంచి చెడ్డలు ఎంచి చూడగ
రెండు కులములు మనుజులందున
మంచి అన్నది మాల అయితే, మాల నేనగుదునే” అని.
అట్లాగే స్త్రీలంతా ఒక సమూహంగా పనిచేయడం వల్ల పితృస్వామిక వ్యవస్థ అణిచివేతని తిప్పికొట్టగలమన్న సంగతి మనమంతా యిప్పుడు మాట్లాడుకుంటున్నాం గానీ తొలి ఆధునిక తెలుగు కావ్యమైన ‘కన్యాశుల్కం’లో మొదటి అంకంలోనే మధురవాణి ఈ విషయాన్ని నిరూపిస్తుంది. స్త్రీల యొక్క పరస్పర సహకారం మగవాళ్ళ దుష్టత్వాన్ని దెబ్బగొట్టగలదన్న మధురవాణి మాటల్లో… స్త్రీలంతా ఐక్యంగా వుండడం వల్ల పురుషుల పెత్తనాలను ఎదుర్కోవచ్చు అన్న కోణాన్ని శోధించి మన ముందుంచుతారు ఓల్గా.
చివర్లో సౌజన్యారావు పంతులు, మధురవాణికి భగవద్గీతను యిచ్చి చెడ్డవారిని మంచివారుగా చేసే పుస్తకం అంటాడామెతో.. మనందరికీ తెలుసు స్వజనమైనా సరే అధర్మ నిధనం కోసం అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేయడమే గీత యొక్క ముఖ్యోద్దేశం… అయితే చెడ్డవారిని మంచివారుగా మార్చే మరెన్నో యితర ఆధ్యాత్మిక గ్రంథాలుండగా గురజాడ భగవద్గీతనే మధురవాణి కిప్పించడంలోని అంతరార్థం మధురవాణికి కార్యాచరణకి అంటే యుద్ధానికి సిద్ధం కమ్మని మహాకవి పరోక్షంగా సూచించి వుండువచ్చునని ఓల్గా శోధించి చెప్తుంటే సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరవుతాం మనం…
ఇక్కడ మధురవాణికి భగవద్గీతనిప్పించిన గురజాడ పూర్ణమ్మ, కన్యకలిరువురినీ దుర్గలోనే ఐక్యం చేయించడంలో సూచన స్త్రీలు దుర్గలవనిదే, యుద్ధం చేయనిదే పితృస్వామ్యం, రాజ్యం కూలిపోవనే సందేశాన్ని కవితా ప్రతీక ద్వారా గురజాడ యిప్పించాడా? దుర్గ, శక్తి అనే మాటలు పూర్ణమ్మ నోటి నుండి వినడం, సాంఘిక, సాంస్కృతిక బంధాల అల్లిక అయిన పితృస్వామ్యంపై యుద్ధం, గురజాడ మధురవాణి ద్వారా యిప్పించాడన్న సందేశాన్ని ఎంతో ఒడుపుగా పట్టుకుని మన ముందుంచిన ఓల్గా పరిశీలన ఎంత అమూల్యమైనదో కదా అన్పిస్తుంది.
‘అడుగుజాడ గురజాడ’లో వున్న ఈ ఏడు వ్యాసాలూ కూడ గురజాడనీ, మధురవాణినీ యింకా ఆయన యితర పాత్రల్నీ వివిధ కోణాల్లో నుండి మనకి అర్థం చేయించే ఏడు ఆణిముత్యాలు. ”అడుగుజాడ గురజాడది, అది భావికి బాట మనలో వెధవాయిత్యం మరిపించే పాట’ అన్నీ శ్రీశ్రీ మాటలని మరింత బాగా అర్థమయ్యేలా ఋజువు పరుస్తారు ఓల్గా ఈ పరిశోధక గ్రంథంలో.
ఓల్గా ఏది రాసినా అదొక పరిశోధనే.. ఏదయినా బాగా కూలకంషంగా పరిశీలించి, శోధించి లోతులు తెలుసుకోనిదే ఆమె రాయదు.
ఇటీవలి కాలంలో ఓల్గా చేసిన మరో పఠనీయమైన పరిశోధన రాజ్యాంగ వాదపు వెలుగులో, రాజ్యాంగ నైతికతా దృష్టితో సాహిత్యాన్ని పరిశీలించి ”రాజ్యాంగ నైతికత – అక్కినేని కుటుంబరావు నవలలు” అన్న పుస్తకాన్ని ప్రచురించడం.
తెలుగు సాహిత్యంలో యిదివరలో రాజ్యాంగ నైతికతను పెంపొందించే రచనలు వచ్చినప్పటికీ వాటిని రాజ్యాంగ వాదపు వెలుగులో ఆ దృష్టిలో పరిశీలించబడమనేది యింత వరకూ జరగలేదు – ఇది కూడ మొదటగా చేసింది బహుశా ఓల్గానే…
ప్రస్తుతం అమలవుతోన్న విద్యావిధానం మీద ఓల్గాకి చాలా అసంతృప్తి వుంది… మామూలుగా మనం ఏదయినా ఒక రచయిత కవితో, కథో పాఠ్యాంశాలలో చేర్చబడితే చంకలు గుద్దుకుంటాం కానీ ఆ పాఠాన్ని సరిగ్గా రచయిత యొక్క నాడి పట్టుకుని, రచనలోని ఆత్మని పట్టుకుని విద్యార్థులకు విశ్లేషించి, వివరించగలిగే శక్తి, అంత సామాజిక అవగాహన పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు ఉన్నదా? లేదా అన్న సంగతి పట్టించుకోం… మిగిలిన అన్ని పాఠాలూ చదివినట్లే సాహిత్యపు పాఠాలను కూడ ఒక ఒరవడిలో చదువుకుంటూ వెళ్ళిపోతారే తప్ప విద్యార్థులకు వాటిని గురించిన సరయిన అవగాహన, సమాజం పట్ల బాధ్యత కలగదు. దేశం, చరిత్ర వీడని ఆధునికంగా, లోచూపుతో చెప్పాలంటే అధ్యాపకులకు సామాజిక శాస్త్రాల అవగాహన కావాలి.
దురదృష్టవశాత్తూ తెలుగులో సామాజిక శాస్త్రాలు అంతగా లభ్యంకావు… ఈ విషయాలని లోతుగా గుర్తించిన ఓల్గా సరిగ్గా అదే సమయంలో కల్పనా కన్నాభిరాన్ రాసిన ”టూల్స్ ఆఫ్ జస్టిస్” అన్న పుస్తకం చదవడంతో రాజ్యాంగ వాదపు వెలుగులో, రాజ్యాంగ నైతికతా దృష్టితో సాహిత్యాన్ని పరిశీలించాలన్న ఆలోచన కలిగి అక్కినేని కుటుంబరావు నవలల్ని ఆ దృష్టితో పరిశీలించి విశ్లేషించారు ఓల్గా.
”కుల, మత, లింగ వివక్షలూ, హింస, ఆదివాసీల సంస్కృతీ విధ్వంసం జరుగుతోన్న ఈ రోజుల్లో రాజ్యాంగవాదం, రాజ్యాంగ నైతికత దృష్టి ప్రజా ఉద్యమాలకు మేలు చేస్తాయి. సాహిత్యాన్ని ఆ దృష్టితో చదవడం, ఆ దృష్టితో విశ్లేషించుకోవడం వల్ల చదువరులు రాజ్యాంగ నైతికత భావజాలాన్ని అర్థం చేసుకోగలుగుతారు… అందువల్ల సాహిత్యం, సాహిత్య విమర్శ, సాహిత్య చర్చలు రాజ్యాంగంలో అతి ప్రధానమైన సమానత్వం, స్వేచ్ఛ, జీవించే హక్కు అన్న భావనలు ఎలా వెదజల్లుకుంటూ వెళ్ళాయో పరిశీలించడం సాహిత్యానికీ, సమాజానికీ కూడ మేలు చేస్తుంది” అన్న ఓల్గా మాటలు అవశ్యం అంగీకరింపదగిన అక్షర సత్యాలు.. ఇదే ఈ పరిశోధన తాలుకూ సారాంశ సత్యం.
స్త్రీ, పురుష సంబంధాలను ఆర్థిక కోణం కంటే లింగ దృష్టితో విశ్లేషించే ఓల్గా అబ్బురపరిచే పరిశోధనలు చేసిన విద్యున్మణి.
స్త్రీలకు కేవలం ఆర్థిక స్వేచ్ఛ మాత్రమే కాదు పూర్తి మానసిక స్వేచ్ఛ వుండాలని అభిలషిస్తూ స్వేచ్ఛకు సంబంధించిన విభిన్న భావాలను చర్చకు పెడుతూ సాహిత్య సృజన చేసిన ఓల్గా, సమాజానికి సంబంధించిన ఇతరేతర రాజకీయ కోణాలను కూడ సాహిత్య వస్తువులుగా చేసుకుని వ్యక్తిగతమైన ఆసక్తితో అనేక రకాల పరిశోధనలు చేసి ఆ సారాంశపు సత్యఫలాలను పాఠకులకు అందించిన ఓల్గా స్త్రీల సమూహాలకు ప్రాతఃస్మరణీయురాలు.