ఆంగ్ల సాహిత్యంలో ఓల్గా – ఎం. శ్రీధర్‌, అల్లాడి ఉమ

ఓల్గా గారితో మా పరిచయం 1994లో తెలుగు ఇండియా టుడే సాంవత్సరిక సంచికలో ఆమె ‘ప్రయోగం’ కథను చదివి దాన్ని తెలుగు సాహిత్యంలో ఆ దశాబ్దంలో వచ్చిన గొప్ప రచనగా తెలుగేతరులకు మైసూరులోని ధ్వన్యాలోక అనే సంస్థ నిర్వహించిన సదస్సులో పరిచయం చేయడంతో మొదలైంది. వివాహంతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులు ప్రేమ, స్నేహం ప్రాతిపదికలుగా కలసి జీవించే అవకాశాన్ని ప్రవేశపెట్టే ఈ కథ చాలా సంచలనం రేకెత్తించింది. ఇలాంటి ఇతివృత్తం దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన సదస్యులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ పరిశోధనా పత్రంలో భాగంగా ”ప్రయోగం” కథలోని కొన్ని భాగాలను అనువాదం చేయడం జరిగింది. అప్పటినుంచి మొదలైన మా ఓల్గా సాహిత్య ప్రయాణం అనువాదాల ద్వారా తన రచనలను ఆంగ్ల సాహిత్యలోకానికి పరిచయం చేయాలనే నిర్ణయానికి దారితీసింది. అలా వచ్చిందే The woman Unbound (1997) అనే కథల సంపుటి.

The woman Unbound లో ఓల్గా గారి ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం : రాజకీయ కథలు-2’ అనే రెండు సంపుటాల్నుంచి మేము ఎంచుకున్న కథల ఏడు ఆంగ్లానువాదాలున్నాయి. అవి ”ప్రయోగం”, ”అయోని”, ”శత్రువులెవరు”, ”తోడు”, ”వెలుతురులోకి”, ”అన్వేషి”, ”ఒక రాజకీయ కథ”. ఇందులోని కథలు స్త్రీ, పురుష వ్యక్తిగత సంబంధాల్లో ఒక కొత్త కోణాన్ని ప్రతిపాదించిన ”ప్రయోగం”తో మొదలై, కుటుంబాల్లో,  సమాజంలో స్త్రీలు సంఘటితంగా తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కలిసి పనిజేయాల్సిన అవసరాన్ని గుర్తించే ”ఒక రాజకీయ కథ”తో ముగుస్తాయి. ఈ కథల ఎంపికలో, వాటిని ఈ క్రమంలో అమర్చడంలో, ఈ సంపుటికి The woman Unbound అనే శీర్షికను ఎంచుకోవడంలో మేము చాలా స్వతంత్రంగా వ్యవహరించాము. నిజానికి ఈ ఎంపిక ఓల్గా గారి ఇష్టానికి భిన్నంగా జరిగింది. తన కథల్ని అనువదిస్తామని మేము ప్రతిపాదించినపుడు ఆమె తన కథల్లో స్త్రీ శరీరంలోని కళ్ళు, ముక్కు ఇలా వివిధ అంగాలపై పితృస్వామిక భావజాలపు పట్టును ప్రశ్నించే కథల్ని ఇంగ్లీషులోకి అనువదించాలని సలహా ఇచ్చారు. కానీ మా కోరికను మన్నించి చాలా ప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఇలా కాకుండా తాను ప్రతిపాదించినట్టు స్త్రీ శరీరంపై నియంత్రణ ఆధారంగా ఎంపిక జరిగి ఆ కథల ఆంగ్లానువాదం జరిగి ఉంటే అప్పటికి (1995)లో ఎంతో విప్లవాత్మకంగా (revolutionary) ఉండేదేమోననిపిస్తుంది. 2007లో వచ్చిన ఆరి సీతారామయ్య, మధు కాజా గార్ల రాజకీయకథల అనువాదం కొంతవరకు ఈ లోటను పూరించింది. రెండు సంపుటాల్లో ఉండే కథ ”ఒక రాజకీయ కథ”. వ్యక్తిగతమైంది రాజకీయమైంది కూడా (personal is political) అనే ఆలోచన రెండు సంపుటాలకూ పునాది కావడమే ఇందుకు కారణం. ఈ సంపుటానికి ఓల్గాగారు రాసిన ముందుమాటలో ఇలా అంటారు :”Due to the decent literary criticism, it is even harder to find critics capable of analysing overwriting from a feminist perspective. In view of this i wanted to use this opportunity, offered by the publication of these stories, to talk briefly about the politics of the web of myths and deceits wrapped around the female body. I wanted to emphasize that these are serious stories about the politics” (vii-viii) స్త్రీల శరీరంచుట్టూ అల్లుకున్న మిత్‌ల, మోసాల వెనుక ఉండే రాజకీయం గురించి వస్తున్న సాహిత్యాన్ని గురించి తగిన సాహిత్య విమర్శ రాకపోవడంవల్లనే తన ముందుమాటలో ఓల్గా ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని అంటారు. ఈ సంకలనంలో వచ్చినవి ”సీతజడ”, ”కళ్ళు”, ”ముక్కుపుడక”, ”నోర్ముయ్‌”, ”రాతిగుండెలు”, ”ఒక రాజకీయ కథ”, ”ఆర్తి”, ”భద్రత”, ”గోడలు”, ”ఎన్నికలలో”, ”ఏం చెయ్యాలి” కథల ఆంగ్లానువాదాలు. ఈ కథలన్నీ 1998-90ల మధ్య వచ్చినవి. స్త్రీ శరీరం గురించి రాసిన ఈ కథలలో అన్నీ మేమనువదించక పోయినా ”కళ్ళు”, ”అయోని”, ”ఒక రాజకీయ కథ” లను విడివిడిగా అనువదించి ప్రచురించాము.

‘స్వేచ్ఛ’ నవలకు ఆరి సీతారామయ్య గారి ఆంగ్లానువాదం పై రెండు సంకలనాల మధ్యకాలంలో, 2000వ సంవత్సరంలో వచ్చింది. నిజానికి స్వేచ్ఛ నవల తెలుగులో చతురలో 1987లోనే వచ్చింది. ‘రాజకీయ కథలు’ లో సంకలనం చేసిన కథలు 1985-94  సంవత్సరాల మధ్య రాసినవి. స్వేచ్ఛ నవలలో అరుణ చదువుకుని, ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడగలిగిన మధ్య తరగతి స్త్రీ. తన అస్తిత్వం గురించి, తాను పెరిగిన సాంప్రదాయ వాతావరణం, కుటుంబం, పితృస్వామ్య వ్యవస్థ భావజాలాల్నుంచి బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో తన స్వాతంత్య్రాన్ని, సమానత్వాన్ని వెతుక్కుంటూ వచ్చే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలకు, సంఘర్షణలకు సంబంధించినది. ఈ నవలలోని ఇంకో పాత్ర ఉమ పెళ్ళి చేసుకోకూడదని, తన అభిప్రాయాలతో సామీప్యం ఉండే ఒకతనితో వైవాహిక వ్యవస్థకు వెలుపల సంబంధం పెట్టుకుంటుంది. అయితే పిల్లల సంగతేంటి అనే ప్రశ్న వస్తుంది. ఇదే ఇతివృత్తం, పిల్లల సమస్య 1994లో వచ్చిన ”ప్రయోగం” కథలోనూ ఉంది. స్వేచ్ఛ నవల ఆంగ్లానువాదానికి రాసిన ముందుమాటలో ఓల్గాగారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, వివాహ వ్యవస్థతో సంబంధంలేకుండా స్త్రీ, పురుషులు కలసి జీవించే అంశం కొడవటిగంటి కుటుంబరావు ”నీకేం కావాలి”, ”ఎండ మావులు” కథల్లో ఉన్నప్పటికీ అవి కుటుంబ వ్యవస్థకు బయట ఉండే స్త్రీలకు సంబంధించినవిగా చెపుతారు

(xii) ఐతే కుటుంబరావు గారి ”చెడిపోయిన మనిషి” లో డా|| (మిస్‌) స్నేహలతారావు ఇందుకు మినహాయింపు అయినప్పటికీ ఓల్గాగారు ఆమె పాత్రను ఎందుకు ప్రస్తావించలేదోననిపిస్తుంది. నిజానికి ”ప్రయోగం” లోని సునందను స్నేహలతారావు పాత్రకు కొనసాగింపుగా చూడవచ్చు (మా ఆంగ్ల వ్యాసం “Volga’s prayogam: an experiment?”లో ఈ విషయాన్ని చర్చించాం).

విముక్త కథల సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంకలనానికీ సి. విజయశ్రీ, టి. విజయకుమార్ల ఆంగ్లానువాదం హార్పర్‌ కాలిన్స్‌ వాళ్ళు తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఈ కథలన్నీ రామాయణ కథలను స్త్రీవాద దృష్టికోణంతో ఓల్గాగారు తిరగరాసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులోని ”మృణ్మయనాదం” కథకు ఆంగ్లానువాదాన్ని విడిగా మేము సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన తెలుగు సాహిత్య సంకలనం విభిన్న లో 2015లో ప్రచురించాము.

”అయోని” కథ గురించి ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కథకు మా అనువాదాన్ని, 2001లో స్త్రీ ప్రధాన వస్తువుగా రాసిన స్త్రీ, పురుష రచయితల కథల ఆంగ్లానువాద సంకలనం అయోని అండ్‌ అదర్‌ స్టోరీస్‌ (Ayoni and other stories) లో ప్రచురించాం. గురజాడ ”మెటిల్డా” తో మొదలుపెట్టి, కుప్పిలి పద్మ ”మసిగుడ్డ” తో ముగించిన పదహారు ప్రాతినిధ్య కథల్లో ”అయోని” ఒక ప్రధానమైన కథ. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఁూవఅఱర జుఅఙవఁ సిద్ధాంతానికి ”అయోని” కథ ఒక ఫెమినిస్ట్‌గా ఓల్గా సమాధానమని కె. సునీతారాణి గారు చెబుతారు. పురుషాంగం గురించి ఆ కథలోని ప్రధాన పాత్ర ఐన అమ్మాయికి కలిగిన జుగుప్సను వ్యక్తీకరించిన ఈ కథ ఓల్గా గారి రచనల్లో హృదయాన్ని తీవ్రంగా కలచివేసే కథగా ప్రపంచ సాహిత్యంలో మిగిలిపోతుం దనడం అతిశయోక్తి కాదేమో! ఆంగ్లానువాదాలు ఈ విధంగా మన సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంతో పోల్చుకోవడానికి తోడ్పడతాయి. విముక్త లోని ”సమాగమం” కథకు కృష్ణారావు మద్దిపాటి ఆంగ్లానువాదాన్ని 2008 లోనే పాలా రిచ్‌మన్‌ రామాయణా స్టోరీస్‌ ఇన్‌ మాడర్న్‌ సౌత్‌ ఇండియా : ఎన్‌ ఏంథాలజీ (Ramayana Story in Modern South India : An Anthology) లో చేర్చారు. ఈ సంకలనం పాలా రిచ్‌మన్‌ అమెరికాలోని డిగ్రీ స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంటుందని ఊహించి తయారు చేసిన విషయం గమనార్హం. ”అయోని” కథ ఆంగ్లానువాదం డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎం.ఏ. ఆంగ్ల విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక కావడం మరొక విశేషం. ఈ పాఠ్యాంశానికి సునీతా రాణి గారు చేసిన పరిచయంలోనే ఇంతకుముందు చెప్పిన  Penis Envy కు ”అయోని” ఓల్గాగారి సమాధానమని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలోని పాఠకులకు ఫ్రాయిడ్‌ సిద్ధాంతానికి దీటైన సమాధానం ఈ విధంగా లభించడం స్త్రీవాద సాహిత్య విమర్శ విస్తృతికి తోడ్పడుతుంది.

(అజో-విభొ-కందాళం ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం సందర్భంగా సమర్పించినది).

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.