గురివింద గీతలు
– తాటిశెట్టి రాజు
మహిళా దినోత్సవ
కవితకేముందిలే సారూ…!
పది నిముషాలు కూర్చుని
ఓ నాలుగు కవితలు తిని
రెండు వ్యాసాలు తాగి
మూతికంటుకున్న ఎంగిలిని
ఓ పోస్ట్‌తో
తుడుచుకుంటే అదే కవితైపోద్ది…!
స్త్రీవాదందేముందిలే గురూ…!
చరిత్రలో చించేసి,
చరిత్రని చీల్చేసిన
ఓ నలుగురు నారీమణుల్ని
నెమరేస్తూ స్వేచ్ఛ, అణచివేత,
సమానత్వం, పురుషహంకారం
అనే పడికట్టు పదాల్ని
పలవరిస్తే చాలు!
శుభాకాంక్షలంటావా?
ఏముందిలే మిత్రమా…!
అందమైందో
అందవిహీనమైనదో
కష్టపడుతున్నదో – కవ్విస్తున్నదో
ఓ స్త్రీమూర్తి ఫోటోని
కాపీ పేస్ట్ చేసి
అమ్మవి నీవే, అమ్మలగన్న అమ్మవి నీవే…
అని ఒంటిపూట మహిళా దీక్ష
చేస్తే సరిపోద్ది…!
కానీ
సిటీబస్సుల్లో నీ రుద్దుడు పైత్యాలు…
పై పోర్షన్లో ఆంటీని ఫోన్లో వేధించడాలు…
చనువిచ్చిన అమ్మాయి దగ్గర చనువు
తీసుకోవాలని తెగబడ్డాలు…
అవసరాల్లో ఉందని తెలిసి
ఆమె అవసరానికి – నీ నీచత్వానికి
ముడిపెట్టిన నీ అత్యవసర దగుల్బాజీతనాలు…
ఓ పసుపుతాడుతో పెళ్ళాన్ని
నీ సంసార గానుగకి కట్టి
కోరికైనా – కోపమైనా …
ప్రేమైనా – పాశమైనా
నీకొచ్చినప్పుడే తనకీ వచ్చేలా
రిమోట్ ఆపరేటింగులు…
మోసి, కనీ,
నీలాంటివాణ్ణి భరిస్తూ పెంచిన
తల్లిని చీదరించుకొంటూ
మదర్స్ డేలకి
అమ్మని ముద్దాడే ఫోటోలతో
ఫేసుబుక్కెక్కడాలు…
చక్కని రాతల వెనక చిక్కని వాంఛల్ని దాచి
స్త్రీ పాఠకుల్ని మచ్చిక చేసుకుని…
చాటింగుల్లో – చీటింగు మెంటాలిటీ బైటపెట్టడాలు…
వయోబేధాలు కూడా వదిలేసి
రకరకాల కన్నింగు వేషాలేసి
కూతురు వయసున్న అమ్మాయిల్తో
ప్రణయ ప్రేలాపనలు పేలడాలు
(అరే నిన్నే ఇంటన్నావా?)
మరి ఈ గబ్బునంత ఎక్కడ దాస్తావ్…!
ఇయన్ని ముడ్డికిందెట్టుకుని
ఇంత దగుల్బాజి నోటితో
గురువింద గీతలు
బోధించే – నత్తగుల్ల గాళ్ళకి…
ఆళ్ళ చెంపల్ని ఎప్పటికప్పుడు
చెప్పులతో నిమురుతున్న
నా సోదరీమణులకీ
ఆడోళ్ళరోజు అభినందనలు…!
స్త్రీని
హృదయమంతటితోనూ
గౌరవించడమంటే
ఆమె మానాన
ఆమెని విడిచిపెట్టడం…!