ప(మ)గవాడు
పుట్టిన వెంటనే చక్కగా ఉన్నానని,
చెక్కిలి నొక్కి ముద్దు పెట్టుకున్నాడు వాడు.
కొంత పెరిగాక బొద్దుగా ఉన్నానని,
బుగ్గలు కొరికి బులబాటం
తీర్చుకున్నాడు వాడు.
బాల్యాన్ని వీడాక వికసిస్తున్నానని,
వీపు నిమిరి తన వంకర బుద్ధిని
ప్రకటించాడు వాడు.
యవ్వనమొచ్చాక జివ్వుమనిపిస్తున్నానని,
ఆధారాల నందుకొని ఆవేశాన్ని
తీర్చుకొన్నాడు వాడు.
వివాహమయ్యాక, పిల్లలను కన్నాక కూడా,
ఆకర్షణ తగ్గలేదని కోరికతో తాకాడు వాడు.
ప్రౌడత్వం వచ్చాక కూడా,
పక్వానికొచ్చిన పండులాంటి దాన్నని,
నా వైపు దొంగచూపులు,
చొంగ కార్పులూ మానలేదు వాడు.
లాల్యం చూపాల్సిన బాల్యంలో కూడా
చాపల్యంతో చూసినవాడు,
అనుబంధం పెంచుకోవలసిన వయసులో
ఆవేశంతో నన్ను తాకిన వాడు,
వాత్సల్యంతో వెన్ను నిమరాల్సిన వయసులో
వెధవ్యేషాలతో నన్ను వాటేసుకున్న వాడు,
సంసార వైతరణిని దాటించే తరుణిగా
గుర్తించాల్సిన మనసులో
నీచ సంస్కారాలు నింపుకొని
నన్ను చూసినవాడు,
నా పాలిటి పగవాడు, ఆరని సెగ వాడు,
వాడే… మగవాడు…
పరాయి వాడు… రాయి వాడు!