సి. సుజాతామూర్తి
భూమిక ప్రధాన సంపాదకురాలు, రచయిత్రుల సామాజిక ఉద్యమాల స్పూర్తిదాత శ్రీమతి కె. సత్యవతి గారి ఆధ్వర్యంలో నలభై మంది రచయిత్రుల సామాజిక యాత్రలో పాల్గొన్న నేను కూడా నా స్పందన తెలియచేయటమే ఈ నా ప్రయత్నం. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయించి ఎక్కడా ఎవరికీ కష్టం కలుగకుండా ఎంతో ఆత్మీయంగా ఏర్పాటుచేసిన యత్ర ఇది. అందరం ఒకే కంపార్టుమెంట్లో ప్రయాణించి తెల్లవారుఝామునే విశాఖ చేరుకున్నాము. అక్కడనుంచి గెస్టుహౌసుకు వెళ్ళి తయారై మొదలు గంగవరం పోర్టు బాధితుల వద్దకు వెళ్ళాము. ఒక పాఠశాల వరండాలో అందరం సమావేశమయ్యా౦. పలకరింపులతో మొదలైన సమావేశం, చివరిదాకా ఆ మహిళలు ఏ విధంగా చిత్రహింసలకు గురి అయ్యరో వివరించడంతో సరిపోయింది. సముద్రాన్నే నమ్ముకుని అదే వాళ్ళ జీవనం, ఆధారం అనుకున్న కుటుంబాలను ఒక్కసారిగా పోర్టు పేరుతో బయటకు నిర్దాక్షిణ్యంగా గెంటేసే ప్రక్రియలో పాలకుల నిరంకుశత్వాన్ని కన్నీరు మున్నీరై మహిళలు చెపుతుంటే మా అందరి మనసులూ బాధతో నిస్సహాయంగా రోదించాయి. ఇంత ఘోరం జరుగుతున్నా, కూకటివేళ్ళతో పెకిలించాలని చూసినా భయపడకుండా ఎదుర్కొని సాగించిన ఆ పోర్టు మహిళల ఉద్యమం మమ్మల్నందర్నీ కుదిపేసింది. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా అధైర్యపడక ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఆత్మీయంగా ఓదార్చి, వారి ధైర్యానికి జోహార్లు చెప్పి వారి ఉద్యమస్పూర్తికి ఇంకింత ఊపిరినిచ్చి, జరిగిన సంఘటన తాలూకు విషయలు మా అక్షరాల ద్వారా అందరికీ తెలియజేస్తామని హామీ ఇచ్చి అక్కడ నుండి పక్కనే ఉన్న దిబ్బపాలెంకు వెళ్ళాము. ఆ ఊరు చేరే లోపలే కూలగొట్టిన ఇళ్ళు గుట్టలు గుట్టలుగా దోవపొడుగునా కనిపిస్తుంటే, ఒక చిన్న గల్ఫ్ యుద్ధభమిలాగా తోచింది. పోర్టుకు సంబంధించిన కట్టడాల కోసం ఆ సముద్రతీరవాసులను వెళ్ళగొట్టడానికి చేసిన ప్రయత్నాలని తరువాత తెలిసింది. బెదిరించి ఖాళీ చేయించిన అధికారుల ఒత్తిడికి తలఒగ్గి, వాళ్ళ ఇళ్ళు వాళ్ళే కూలగొట్టుకుంటూ అందులో కట్టడానికి అనువైన ఇటుకలూ, చెక్కతలుపులూ వగైరా వేరే ప్రదేశానికి తరలించుకుంటున్నారు. అలా కూలగొట్టుకుంటున్న వాళ్ళను చూస్తుంటే గుండె పగిలింది. ఇల్లు కట్టడం మాటలు కాదు. జీవితకాలం ఉంటుందని ఒక నమ్మకం, సముద్రముందని ఒక భరోసా… అన్నీ పోగొట్టుకున్నవాళ్ళకు ఎలా ఏం చెప్పాలి? పాలకులకు సామాజిక స్పృహ అంటే ఏమిటో తెలియదా! ఒక్క కాయితం మీద సంతకాలతో ఇన్ని బతుకులు నాశనమౌతున్నయని వాళ్ళు అనుకోరా? ఎవరిచ్చారీ హక్కు వాళ్ళకు? ఎవరి లాభాలకు, ఎవరి కోసం, ఎవరి ప్రమేయంతో ఈ ఘోరానికి పాల్పడ్డారు? ఇవే మా అందరినీ వేధించిన ప్రశ్నలు. ఆ శిథిలాలలోనే ఒక చిన్నగదిలో ఆఫీసు, అందులో ఈ తతంగానికి సంబంధమున్న ఉద్యోగులు ఉన్నట్లు చూసి సత్యవతి గారు కొంతమంది రచయిత్రులు గదిలోకి వెళ్ళి వాదించారు. చెవిటివాడి చెవులో శంఖం ఊదినట్లే ఉంది – సామాజిక స్పృహకూ, న్యాయనికీ అతీతులైన బడాబాబుల తలకెక్కని నిస్సహాయ దుస్థితి. బయటనుంచున్న మా దగ్గరకు మెల్లమెల్లగా ఒకరి తరువాత మరొకరుగా చుట్టూ చేరి వారి బాధలు చెప్పుకున్నారు. అవునమ్మా, జరిగిన అన్యాయనికి మేమూ చాలా చింతిస్తున్నాము, అన్నీ కోల్పోయి మీరంతా బాధలో ఉన్నారు. మా వల్ల ఏం చేయగలిగితే అది చేసి చూపిస్తామని ఊరటపలుకులు చెప్పాం. ఆ అమాయక ప్రజలు దానికే దండాలు పెడుతూ వెంటవెంటనే తిరిగారు. మందీ మార్బలంతో వచ్చి చేసిన కబ్జాలే బ్రహ్మాండం అనుకుంటే అది పగిలేరోజు కూడా దగ్గరలోనే ఉంటుంది. ఎప్పటికైనా ధర్మం గెలిచి తీరుతుందని వేదాలు ఘోషిస్తూనే ఉన్నాయి. సాటిమనిషి బాధలు అర్థం చేసుకోలేని స్వార్థం మత్తులో ఉన్న పాలకుల కళ్ళు తెరిపించేదాకా ఉద్యమాలు సాగాల్సిందే.
ఇలా బరువెక్కిన గుండెలతో యారాడ జైలుకు మహిళా జీవిత ఖైదీలను కలుసుకునేందుకు వెళ్ళాం. ఏదో క్షణికోద్రేకంలో తప్పుచేసి శిక్ష అనుభవిస్తున్న మహిళలు, కొంతమంది వారి చిన్నపిల్లలతో ఒక్కొక్కరు ఒక్కోగాధ వినిపించారు. చుట్టూ ఉన్న రక్షకవలయం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోయిన వాళ్ళు క్లుప్తంగా చెప్పినదాన్నిబట్టి కొంత అర్థమైంది. కానీ వాళ్ళకూ మేము ఇది చేయగలమని నిర్ధారణగా చెప్పలేని నిస్సహాయత. రక్షకుల సూచనల మేరకు మమ్మల్ని బయటకు పంపే సమయం ఆసన్నమవటంతో లేచి అక్కడ మాట్లాడుకోలేని విషయలు మాలో మేమే చర్చించుకుంటూ బయటకు వచ్చాం. ప్రయాణ బడలిక, అంతకన్నా మించిన మానసిక ఒత్తిడి, అయ్యె వీళ్ళకు ఏమీ చేయలేకపోయమే అన్న బెంగతో తిరుగుప్రయణంలో అందరూ నిశ్శబ్దంగా అయిపోయరు. ఎన్నో ఆలోచనలు ఏవేవో పరిష్కారమార్గాలు తమకు తామే సూచించుకుంటూ బహుశా కూర్చుని ఉంటారు నాలాగే అనుకున్నా.
మర్నాడు ఉదయన్నే లేచి పాడేరు మీదుగా వాకపల్లి గిరిజనవాడకు బయలుదేరాం. అక్కడ పదకొండు మంది గిరిజన యువతులను పోలీసులు గుట్టలలోకి తీసుకుపోయి అత్యాచారం చేశారన్న వార్తలు, టీవీ ఛానెళ్ళ ప్రసారాలలో చూసీ వినీ వారిని కలుసుకోవాలని వెళ్ళాం. అదొక సాహసయాత్రే అనాలి. సత్యవతి గారు ముందు నడుస్తుంటే వాళ్ళను అనుసరిస్తూ గుంపు గుంపులుగా నలభైమందీ వెళ్ళాం. కొండలు, గుట్టలు దాటుకుంటూ సుమారు 3-4 కిలోమీటర్ల నడక సాగించాక గిరిజనుల ఇళ్ళు కనబడ్డాయి. దారిపొడవునా గులకరాళ్ళుండటంతో చాలా అప్రమత్తంగా నడవాల్సొచ్చింది. ఏ రాయి మీదో కాలుజారి లోయలో పడతామేమొ అన్న భయంతో ఆచితచి అడుగువేసుకుంటూ వెళ్ళాం. మాతోపాటు ఆహ్వానించి దోవచూపిన రామారావుగారితో పాటు మిగిలిన యువకులు కూడా మాకు చేయూత నిచ్చి ప్రోత్సాహపరుస్తూ తీసికెళ్ళారు.
అందరం దొరికిన జాగాల్లో కూర్చున్నాం. మా మధ్యలో బాధిత గిరిజన యువతులు కూర్చున్నారు. సత్యవతి గారు వాళ్ళ దగ్గర కూర్చుని అభయమిచ్చాక మెల్లగా వాళ్ళు బిక్కుబిక్కుమంటూ నోరువిప్పారు. జరిగిన అత్యాచారం, దానిని ఖండించడానికి బదులు వాళ్ళ నోళ్ళు డబ్బుతో కట్టేయలని చూశారు పాలకులు. రక్షకులే భక్షకులుగా మారితే ఎవరికి చెప్పుకోవాలి? అటు సంతకు పోతే పోలీసుల భార్యలంటారు. ఇటు బంధువులు మైలపడ్డారంటున్నారు – మా మాటలు, మాకు జరిగిన అన్యాయం ఎవరూ నమ్మట్లేదని వాపోయరు. కళ్ళల్లో జారుతున్న నీళ్ళను అదుపులోకి తెచ్చుకుంటూ మాకు అన్యాయం జరిగిందంటే ఎవరూ నమ్మట్లేదని మళ్ళీమళ్ళీ చెప్పారు. డబ్బు తీసుకుని నష్టపరిహారంగా సంఘటన మర్చిపొమ్మ న్నారు. మాకు నష్టపరిహారం కాదు మాకు జరిగిన మానభంగానికి కారకులైనవారికి శిక్ష పడాలి అదే మా కోరిక అని ఆ డబ్బు తీసుకోలేదనీ, అప్పటినుంచీ మాకు న్యాయం చేయమని కోరుకుంటూనే ఉన్నామనీ రోదించారు. మీ కాలు మొక్కుతాం మాకు న్యాయం జరిగేలా చూడండి అంటూ సత్యవతి గారి వద్ద ఏడుస్తున్నపుడు మా అందరి హృదయాల దుఃఖంతో నిండి కళ్ళమ్మట నీరు కారడం మొదలయ్యయి. ఆ సందర్భంలో ఎంతో సముచితంగా సత్యవతిగారి మాటలు నా చెవుల్లో ఇంకా రింగ్మంటున్నాయి. నష్టపరిహారం తీసుకుని నోరుమూసుకోమన్న పాలకులను కాదని న్యాయం కావాలి డబ్బు కాదని ఎదిరించిన మీ నిజాయితీకి, ధైర్యానికీ మేమే మీ కాళ్ళకు మొక్కాలమ్మా అంటుంటే ఇంట్లో అయితే తనివితీరా ఏడ్చేదాన్నేమొ అనుకున్నాను. నిజమే, నగరవాసుల్లో మితిమీరిన స్వార్ధంతో పదిరూపాయలు శవాలమీద కూడా ఏరుకుంటున్న పాలకులను రోజూ టీవీ ఛానెళ్ళలో చూస్తూనే ఉన్నాం. నష్టపరిహారం కాదు మాకు న్యాయం చేయలని కోరుకునే ఈ ధీరవనితల ముందు మన బస్తీ బతుకులు వెలవెలపోయయి. నిజంగా ఆకాశాన్నంటుకుని ఉన్న కొండలలో ఉన్న ఈ గిరిపుత్రికలు మనకన్నా ఎంతో ఉన్నతంగా కనపడ్డారు. రక్షకులే భక్షకులై రాజ్యమేలుతున్న ఈ తరంలో ఇంతకన్నా న్యాయం జరుగుతుందనుకోడం కలగానే ఉండిపోతుందేమొ!
అక్కడనుండి మర్నాడు అరకు వాలీకి వెళ్ళాం. చక్కటి ఎత్తైన కొండలు, పచ్చదనం కనబడుతుంటే ఆనందిస్తూ చాపరాయి జలపాతం దగ్గరకు చేరుకున్నాం. అనహ్యంగా ఆ చాపరాళ్ళ మీద కూర్చుని చుట్టూ నీటి ప్రవాహాలు గలగలమని శబ్దం చేస్తుంటే ఆ సందడిలో ప్రతిమగారి పుస్తకావిష్కరణ పి. సత్యవతి గారి చేతులమీదుగా జరిగింది. అందరం ఎంతో సంతోషంగా హర్షధ్వానాలు చేసి శుభాకాంక్షలు తెలిపాం. అక్కడ నుంచి బయలుదేరి ‘జిందాల్’ కోస్తా కారిడార్ మీదుగా విజయనగరం వైపు సాగిపోయం. గంగవరం, దిబ్బపాలెం లాంటి భకబ్జాకు గురి అయిన కుటుంబాల దీనస్థితులే మళ్ళీ జిందాల్లో కూడా కనబడ్డాయి. వారికి రాత్రికి కాంక్రీటు వేసి నిలువెత్తు గోడలు కట్టి ఆ భూమి హక్కుదారులను గెంటివేసే కార్యక్రమం జరుగుతున్న తీరు కళ్ళారా చూసి అవాక్కయ్యము. రైతులన్నా, అమాయక ప్రజలన్నా, బీద జనాలన్నా ఎందుకింత చులకనా? వాళ్ళు మనుషులు కారా? తోటిమనిషిని అర్థం చేసుకోలేని మానవమృగాలా వాళ్ళు. అక్కడున్న నవనవలాడే పచ్చని పంటలభూములు కబ్జాచేసి రైతులను భయభ్రాంతులను చేసి వెళ్ళగొడుతున్న తీరు ఆ మహిళలు చెపుతుంటే కడుపు తరుక్కుపోయింది. మహిళలు ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఆ భూమిపై వాళ్ళకున్న హక్కుల కోసం.
విజయనగరం చేరుతూనే రచయిత్రుల సభకు తయరై వెళ్ళాము. శ్రీమతి చాగంటి తులసిగారి ఆధ్వర్యాన కొంతమంది రచయిత్రుల కథలు, కవితల సంపుటుల హిందీ అనువాద పుస్తకాలు శ్రీమతి అబ్బూరి ఛాయదేవి గారు, శ్రీమతి కె. సత్యవతి గార్లచే ఆవిష్కరించబడ్డాయి. ఆ సభలో కూడా రచయితలు, రచయిత్రులు ముక్తకంఠంతో, అభివృద్ధి పేరుతో జరిగే హింసాత్మక భకబ్జాలను, మహిళల ఉపాధి, బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న ప్రణాళికలను ఖండించారు. వాకపల్లి బాధితులతో యత్రకు రాలేకపోయినా అందరం సంఘీభావం తెలుపుతున్నామంటూ స్పందించారు.
ఒక గంగవరం, దిబ్బపాలెం, కోస్తా కారిడార్, ఎస్.కోట (జిందాల్) ఇవీ మేము తిరిగిన యాత్రాస్థలాలు. ఎక్కడ చూసినా ఒకటే బాధ. న్యాయం చేయమని అర్థిస్తున్న అమాయకప్రజలు. ధైర్యంగా ఉద్యమం చేస్తామనే మరికొందరు. వీళ్ళంతా ఎవరు? మనవాళ్ళు కాదా? ఏదో ఒకనాడు ఈ కథనాలన్నిటికీ మూతపడే రోజు రాక మానదు. కానీ రక్షకులే భక్షకులైన ఈ తరంలో న్యాయం అన్నది కలగానే మిగిలిపోతుందేమొ అని బాధ. ఇటువంటి కీచకుల పాలబడకుండా మంచి అవగాహనతో మనల్ని మనమే కాపాడుకో గలిగే వ్యవస్థగా మారాలి. అది ఈ సామాజిక యత్రలాంటి ఉద్యమాల ద్వారానే మనిషిని మనిషిగా అర్థం చేసుకోగలిగే భావజాలాన్ని అందరికీ విస్తరింపచేయగలమేమొ!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags