వాళ్ళు మనల్నింకా జనజీవన స్రవంతిలో కలుపుకోనేలేదు!
మానవమాత్రులుగా గుర్తించనేలేదు!
అయితే దేవతలం! లేకుంటే దెయ్యాలం!
మాతృత్వానికి దైవత్వాన్ని ఆపాదించి
త్యాగం, సహనం వంటివి అంటగట్టి
దిగలేనంత ఎత్తున్న అందలం ఎక్కించారు!
మానవ సహజ గుణాలైన స్వార్థం, అసూయ
వగైరాలు మాత్రం మనకే ప్రత్యేకమన్నారు!
శీలం అనే బ్రహ్మ పదార్ధం ఒకటి సృష్టించి
సంసారులు, బజారు స్త్రీలు, సౌభాగ్యవతులు, వితంతువులు
అంటూ విడగొట్టి, విభజించి పాలించారు!
సహనంలో ధరిత్రులమే కానీ భూమి మీద నిలవనిచ్చింది లేదు!
త్యాగ ధనులమే కానీ చేసిన శ్రమకి దమ్మిడి సంపాయించింది లేదు!
మానవ జాతికి సహజ ప్రతినిధి పురుషుడే అయినట్లు
పక్కటెముక నుండి పుట్టుకొచ్చిన ప్రత్యేక జాతేదో మనదైనట్లు
లెక్కల్లో, వార్తల్లో విడిగా పేర్కొంటుంటారు!
జంతు జాలాదుల్లో ఎక్కడా కనరాని స్వజాతి వైరం,
ఒక్క మానవుడికే చెల్లిందేమో!
తోడేళ్ళ గుంపులో చిక్కిన మేకపిల్లను తరిమినట్టు
తరిమి సామూహికంగా దాడులు చేస్తున్నారు!
కని ఇవ్వడానికే కానీ, కని పెంచుకోవడానికి పనికిరాదని,
వంశాన్ని వృద్ధి చేయడానికే కానీ, వంశంలో ఆమె భాగం కాదని
మానవ జాతి మనుగడని సానుకూలపరిచే సహాయకారే కానీ
జాతి ప్రగతి ఆమెది కాదని, ఆమెకంటూ మనుగడ లేదని
అతడు అనుకోవడం చూస్తే నాకనిపిస్తుంది
పరిణామ క్రమంలో అతని మేధ ఇంకా వృద్ధి చెందాలని
ఆమెను సహచరిగా, సహమానవిగా గుర్తించే తెలివేదో రావాలని!