వారిని మనుషులని ఎలా అనను?
విద్య లేదు జ్ఞానం లేదు
చదువుకుని విద్యావంతులు కావాలంటే ఆలోచన లేదు
తెలివి ఉన్నా వ్యర్థంగా కోల్పోతారు
వారిని మనుషులని ఎలా అనను?
చేతులు ముడుచుకుని కూర్చుంటారు
పశువులు కూడ అలా కూర్చోవు
ఆలోచన లేదు, ఆచరణ లేదు
వారిని మనుషులని ఎలా అనను?
ఇంటి నిండా పిల్లలు
చేయరు వారిని పోషించడానికి
ఎలాంటి ప్రయత్నం
వారిని మనుషులని ఎలా అనను?
దొరకదు వారికి ఎవరి సహానుభూతి
సహాయం చేయరు వారికి ఎవరు
పట్టించుకోరు వారిని ఎవరు
వారిని మనుషులని ఎలా అనను?
జ్యోతిష్యం, పంచాంగం, హస్తరేఖల చుట్టూ తిరిగెదరు మూర్ఖులు
స్వర్గం నరకం కల్పనలో మునిగిపోయెదరు
పశువుల జీవితంలో కూడ
ఇలాంటి భ్రమలకు లేదు ఎలాంటి స్థానం
వారిని మనుషులని ఎలా అనను?
పాపం భార్య పని చేస్తూనే ఉంటుంది
ఏ కష్టం లేకుండా భర్త నిస్సిగ్గుతో ఆరగిస్తూనే ఉంటాడు
పశువులలో కూడ లేదు ఇలాంటి వింత
వారిని మనుషులని ఎలా అనను?
ఇంట్లో బయట దారిద్య్రం ఆవరించేను
లేరెవరు కనీసం పలకరించడానికి
అందరూ వారిని ధిక్కరించుదురు
వారిని మనుషులని ఎలా అనను?
చదువ లేరు రాయలేరు
మంచి మాటను చెవిన పెట్టరు
పశువులు సైతం అర్థం చేసుకుంటాయి
కానీ, ఈ మూఢులకు మాత్రం అర్థం కాదు
వారిని మనుషులని ఎలా అనను?
తమ పశుత్వం పట్ల లేదు సిగ్గు
అదే సుఖమని భావించెదరు
పశు మార్గంలో నడిచెదరు
వారిని మనుషులని ఎలా అనను?
ఎవరైతే ఇతరులకు సహాయం చేయరో
సేవ, త్యాగం, దయ, మమతలను
దరిచేయ నీయరో
ఎలాంటి సద్గుణాలను అలవర్చుకోరో
వారిని మనుషులని ఎలా అనను?
బానిసత్వం గురించి బాధపడని వారు
అభివృద్ధి సంకల్పం లేని వారు
మానవత్వాన్ని అణగద్రొక్కే వారు
వారిని మనుషులని ఎలా అనను?
పశు పక్షులు, క్రిమి కీటకాలు, వానరులు నరులు
పుట్టుక గిట్టుక సమస్త చరాచరులకు సమానం
ఈ మాత్రం జీవిత సత్యం కూడ తెలియని వారు
వారిని మనుషులని ఎలా అనను?
(సావిత్రిబాయి ఫూలే కవితలు ‘కావ్య పూలు’ కవితల పుస్తకం నుంచి)