మరాఠీ నుండి అనువాదం : సునీల్ సర్దార్, విక్టర్ పాల్
సావిత్రీ బాయి ఆధునిక భారతదేశంలోని తొలినాటి కవుల్లో ఒకరని చాలా మందికి తెలియదు. ఆమె కవితా సంపుటి, ‘కావ్యఫూలే’ 1854లో ప్రచురితమయింది. బ్రిటిష్ ఇండియాలో భారతీయ రచయితలు ప్రచురించిన కవితా సంపుటాల్లో అదే మొదటిదై ఉండవచ్చు.
సావిత్రీ బాయి ఫూలే ఉద్యమ కవిత్వానికి వైతాళికురాలు పీడిత ప్రజల్లో ఆత్మాభిమానాన్నీ, స్వేచ్ఛా – సమానత్వ కాంక్షలనూ మేల్కొల్పటానికే ఆమె కలం పట్టింది. ఇంగ్లీష్ భాషను భారతదేశంలోని అట్టడుగు ప్రజల విముక్తికి ఒక సాధనంగా గుర్తించి, ప్రచారం చేసిన తొలి తరంలో ఆమె కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి, ఇక్కడ మీకు అందిస్తున్న సావిత్రీ బాయి కవితలు ఎం.జి.మాలీ సంకలనం చేసిన ‘సావిత్రీ బాయి ఫూలే సంగ్రహ వాంగ్మయ’ అనే గ్రంథంలోనివి. విద్య గురించి, సామాజిక సమస్యల గురించీ ఆమె భావనలను ఈ కవితలు వ్యక్తం చేస్తాయి.
విద్యార్థివై కదలిరా
ఆత్మగౌరవంతో, కఠిన దీక్షతో
జ్ఞాన సంపదలు సేకరించుకో
విద్యలేనిదే జీవితం వృధా
అజ్ఞానుల మంతా పశువులమే కాదా.
సోమరిగా గడపవద్దు, విద్యకొరకు కదులుముందు
బాధితులూ బహిష్కృతుల కడగండ్లను రూపుమాపు.
సువర్ణావకాశమొకటి నీ ముందున్నది తెలుసుకో
కులవ్యవస్థ సంకెళ్ళను తెంచి విద్యనందుకో
బ్రాహ్మణీయ శాసనాల ధిక్కరించు వెంటనే.
అధ్యయనంతో ఆచరణతో
బలహీనులారా బాధితులారా! సోదరులారా లేవండి
బానిసత్వ బంధనాలు తెంచుకుని కదలండి.
మనువాదులూ, పీష్వాలూ కాలగర్భంలో కలిశారు
ఆ మనువే మనల్ని విద్యకు దూరం చేశాడు.
జ్ఞానప్రదాతలై ఆంగ్లేయులు అరుదెంచారు
శతాబ్దాల అనంతరం చదువు చేతికందింది.
చదువుదాం, మన బిడ్డల చదివిద్దాం
విజ్ఞానంతో వివేకంతో బతుకు చక్కదిద్దుకుందాం.
బాధతో నా హృదయం బద్దలయి పోతోంది
జ్ఞానదాహార్తితో ఆక్రోశిస్తూ ఉంది.
కులం చేసిన ఈ గాయం
నా ప్రాణాలనే హరించి వేస్తోంది.
”కష్టాలు తొలిగాయి, మన రాజ్యం వచ్చింది!” అని నినదిద్దాం గొంతెత్తి
నిదురనుండి మేలుకో విద్యకొరకు కదలిరా
సంప్రదాయ బంధాలను తెంచుకొని విముక్తి చెందు!
విధానాలూ – హక్కులూ, నూతన మత ధర్మాలూ
నిర్మిద్దాం ఐక్యంగా ఒక్కతాటిమీద నిలిచి,
నిద్రలోంచి మేల్కొన్నాం భేరీలను మోగిద్దాం
ఓ బ్రాహ్మణుడా, మమ్మల్నిక ఆపలేవు.
యుద్ధారావం చేస్తూ, వడివడిగా కదలండి
అధ్యయనం, ఆచరణల మార్గంలో నడవండి.
(‘సామాజిక విప్లవకారిణి – సావిత్రిబాయి’ పుస్తకం నుంచి)
చదువు కోసం చైతన్యులు కండి
లేవండి అతి శూద్ర సోదరులారా!
మేల్కొనండి, లేచి నిలబడండి!
సంప్రదాయ బానిసత్వాన్ని రూపుమాపండి
సోదరులారా, చదువు కోసం చైతన్యులు కండి
పేష్వాలు అంతరించారు, ఆంగ్లేయులు వచ్చి స్థిరపడ్డారు
చదువొద్దని మనువు చెప్పాడు
దానికి కాలం చెల్లింది
జ్ఞాన దాతలు ఆంగ్లేయులు వచ్చారు
గ్రహించండి విద్యను
వేల సంవత్సరాల నుంచి లభించలేదు
ఇంత మంచి అవకాశం మనకు
బాల బాలికలను చదివిద్దాం
మనం కూడ చదువుదాం
విద్యను పొంది జ్ఞానాన్ని పెంచుదాం
నీతి ధర్మాలను నేర్చుకుందాం
జ్ఞానం పొందడం కోసం
విద్యను అర్జించడం కోసం
శూద్రులమనే కళంకాన్ని
జీవితం నుంచి తొలగించడం కోసం
ప్రతిన పూనుదాం మన మందరం
ఈ బలి రాజ్యంలో విద్య లభించాలి
మన కీర్తి ప్రతిష్టల గురించి చర్చలు జరగాలి
మన సమృద్ధి నగారాలు నలువైపుల మ్రోగాలి
బాధలు సంహరించబడాలి
భట్టులు, బ్రాహ్మణులు
కారాదు ఎప్పుడు
మన అభివృద్ధికి ఆటంకం
అలాంటి ప్రకటన చేద్దాం
విద్యను పొందే సంకల్పం చేద్దాం
సాంప్రదాయ సంకెళ్ళను త్రెంచుదాం
పదండి, చదువు కోసం చైతన్యుల మవుదాం
(సావిత్రిబాయి ఫూలే కవితలు ‘కావ్య పూలు’ కవితల పుస్తకం నుంచి)