1975వ సంవత్సరం నుండి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినంను ఒక పోరాట దినంగా పాటిస్తూ, జరుపుకొంటూ వస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినం అంటేనే స్త్రీలకు సంబంధించి, స్త్రీల అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైన రోజుగా గుర్తింపు వచ్చింది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతరాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కలగలిసి మార్చి 8 ని స్త్రీల హక్కుల పరంగా ఒక ముఖ్యమైన మైలురాయిగా మలుచుకున్నాయి. ప్రస్తుతం పోరాట దినం కాస్తా పండగ సొబగును అద్దుకుని సెలబ్రేషన్ స్థాయికి దిగజారిపోయినా మార్చి 8 అనేది స్త్రీలపరంగా చాలా ముఖ్యమైన దినం.
2012 నుండి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఓ కొత్త ప్రయత్నం మొదలైంది. One Billion Rising అనే పేరుతో శతకోటి మంది ప్రజలు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా గళం విప్పే గొప్ప ప్రయత్నమది. భిన్నమైన కార్యక్రమాలతో, భిన్నమైన ఆచరణతో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు One Billion Rising పేరుతో రోడ్లమీదకొచ్చి కదం తొక్కే కార్యక్రమం శతకోటి ప్రజాగళం. One Billion Rising రూపకర్త ఈవ్ ఎన్‌స్లర్. ”మన సమస్యలపై పోరాడదాం – వీథుల్లోకి వచ్చి నృత్యాలు చేస్తూ గళమెత్తుదాం” అనే పిలుపునిస్తూ ఫిబ్రవరి 14, 2011 సంవత్సరంలో ప్రేమికుల దినంరోజునే ప్రతిపాదించింది.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని స్త్రీల సంఘాలు ఫిబ్రవరి 14న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో కూడా ‘ప్రేమికుల దినం’గా పేరుపడ్డ ఫిబ్రవరి 14న శతకోటి ప్రజాగళం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2013లో అస్మిత ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు, స్త్రీల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఏకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
2015, 2016 సంవత్సరాలలో భూమిక ఆధ్వర్యంలో శతకోటి ప్రజాగళం కార్యక్రమం జరిగింది. 2016లో దేశమంతా కమ్ముకున్న అప్రజాస్వామిక, మతతత్వ అణచివేతలు, మత అసహన హత్యల నేపథ్యంలో ”ప్రజాస్వామ్యమూ – అసమ్మతి” ”ఏది జాతీయత” అనే అంశాలపై సదస్సు నిర్వహించి, సాయంత్రం One Billion Rising కార్యక్రమాన్ని సుందరయ్య పార్కులో పెద్ద ఎత్తున జరిపాం.
అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ 2017లో ఫిబ్రవరి 14న శతకోటి ప్రజాగళం గర్జన ఎంతో ఉత్తేజపూరితంగా జరిగింది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో అందరం సమావేశమై పిల్లల నృత్యాలు, పెద్దల పాటలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతుండగా, కొవ్వొత్తులను వెలిగించుకుని చిరుచీకట్ల వేళ దాదాపు 500 మంది స్త్రీలు, పురుషులు, ట్రాన్స్‌జెండర్లు, పిల్లలు నెక్లెస్ రోడ్‌లో నినాదాలతో కదం తొక్కారు. కమలాబాసిన్ రూపొందించిన ‘ఆజాదీ’…’అన్ని వివక్షతలనుండి ఆజాదీ’ కావాలంటూ యువత ఉద్రేకంగా నినాదాలిస్తూ జలవిహార్‌వైపు నడిచారు. ”మా జీవితాలపై మీ పెత్తనమేంటి” అంటూ పితృస్వామ్యం మీద విరుచుకుపడ్డారు. మా దుస్తులపై, మా మాటలపై, మా నడకలపై, మా తిండిపై మీ పెత్తనమేంటనే ప్రశ్నల్ని సంధిస్తూ సాగిన కొవ్వొత్తుల ర్యాలీ జలవిహార్ దగ్గర ముగిసింది. పితృస్వామ్య అణిచివేతపై పోరాడుతున్న నాగాలాండ్ స్త్రీలకు సంఘీభావం ప్రకటించే ప్లకార్టులను ఈ ర్యాలీలో ప్రదర్శించి ”మేము మీతో ఉన్నామనే” సంకేతాన్ని నాగా స్త్రీలకు పంపించడం జరిగింది. అక్కడందరూ సమావేశమై ముగింపు ఉపన్యాసాలతో వచ్చే సంవత్సరం మరింత వైవిధ్యంగా చేసుకుందామంటూ మాట్లాడుకుని ఎవరి గమ్యం వైపు వారు మళ్ళిపోయారు. అందరికీ ఉపాహారం, మంచినీళ్ళు అందించారు భూమిక టీం. మీడియా నుంచి వచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఉత్సహంగా, ఉల్లాసంగా జరిగిన ర్యాలీ గురించి అందరూ చర్చించుకుంటూ ఇళ్ళ దారి పట్టారు.
ఈ కార్యక్రమంలో పలు సంస్థలు, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఏడీపీ వాలంటీర్లు, రెయిన్‌బో హోమ్స్ పిల్లలు, జమున, రుక్మిణి, మంజుల, కళామణి, అనూరాధ, అంబిక, కల్పన, దేవి, సుధ, విమల మొదలైన ముఖ్య వక్తలు పాల్గొన్నారు. అడ్వకేట్లు శేషవేణి, షకీల్ కూడా పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో భూమిక టీమ్ విశేషమైన కృషి అన్ని స్థాయిల్లోను ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. అదేరోజు ఉదయం జరిగిన ‘డిస్సెమినేషన్ వర్క్‌షాప్’ నుండి నేరుగా వచ్చి శతకోటి ప్రజాగళం కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన భూమిక టీమ్‌కి అభినందనలు. టీమ్‌ని అద్వితీయంగా నడిపించిన ప్రశాంతికి ప్రత్యేక అభినందనలు.