జోలెపాళెం మంగమ్మగారితో ఇంటర్వ్యూ – పుస్తకం, నెట్ బృందం

జోలెపాళెం మంగమ్మగారి పేరు వింటే ఒక తరం వారు ”ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌ రీడర్‌”గా గుర్తుపడతారు. అరవైలలో రేడియోలో పనిచేసి, తర్వాత కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖల్లో పలు కీలక పదవులను చేపట్టారు. రిటైరైన తర్వాత కూడా మదనపల్లెలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అయితే, చాలామందికి తెలియని విషయం ఆవిడ చరిత్ర పరిశోధకురాలిగా సుప్రసిద్ధులనీ, అనేక చరిత్ర పుస్తకాలు రచించారనీ. భారతదేశంలో పుస్తక ప్రచురణల చరిత్రపై ఆవిడ చేసిన పరిశోధన చాలా ప్రసిద్ధమైనది.

2010లో మదనపల్లెలోని ఆవిడ స్వగృహంలో ఆవిడను కలిసాము. ఆ మాటా, ఈ మాటా అంటూ మొత్తంగా మాతో రెండు గంటలకు పైగా కబుర్లు చెప్పారు. ఆవిడ చేసిన పనులు, రాసిన పుస్తకాలు, ఆవిడ ఆలోచనలూ అన్నీ మాతో పంచుకున్నారు. ఆ మాట మూటల్లోని కొన్ని ముచ్చట్లను మీతో ఇక్కడ పంచుకుంటున్నాము. ఆవిడ 01-02-2017న మరణించారు. ఆవిడ రచించిన పుస్తకాలు, చేసిన పని ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. కానీ, వాటికన్నా స్ఫూర్తినిచ్చింది ఆవిడ నిండైన వ్యక్తిత్వం. ఆవిడకు బాగా ఇష్టమైన క్రికెట్‌ పరిభాషలోనే – We at pustakam, give her a standing ovation to the well played innings! Take a bow!

(మేము మంగమ్మగారిని కలవడానికి సహాయపడిన శ్రీనివాస్‌ పరుచూరి గారికి, సత్యవతి కొండవీటి గారికి, మా స్నేహితుడు వంశీకి ప్రత్యేక ధన్యవాదాలు!)

ప్ర: రీసెర్చిలో మిమ్మల్ని బాగా inspire చేసిన వ్యక్తులు, మీరు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా?

జ: నా అంతట నేనే చేశాను. ఇప్పుడు మొట్టమొదట ఈ Rate schools అనేది రాసాను కదా, ఇది కూడా ఎందుకు రాయవలసి వచ్చిందంటే, థామస్‌ మన్రో మనకు మద్రాస్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు, సెకండరీ ఎడ్యుకేషన్‌ ఇక్కడ మొదలుపెట్టారు. వాళ్ళు స్కూల్లో ఏ పుస్తకాలను వాడారని చూస్తే అప్పటికే కొన్ని ప్రింటెడ్‌ పుస్తకాలు వాడారు. ఆ ప్రింటెడ్‌ పుస్తకాలు ఎప్పుడు మొదలయ్యాయని నా క్యూరియాసిటితో to find out the books, నేను రిసెర్చ్‌ చేసి, ఆ ‘బుక్‌ ప్రిటింగ్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకం తయారుచేశాను. నాకు ఎవ్వరూ ఇన్స్పిరేషన్‌ కాదు. సెల్ఫ్‌ ఇన్స్పిరేషన్‌తో చేశాను. అదే, నాకు ఉద్యోగంలో ప్రమోషన్‌ అదంతా లేదు. నా పిహెచ్‌డి కూడా నా ఆసక్తి వల్లే చేశాను.

ప్ర: చరిత్ర పుస్తకాలు బాగా విరివిగా చదివుంటారు కదా…

జ: పుస్తకాలు చదవను నేను. పుస్తకాల్లో నాకు కావలసినవి ఉన్నాయా లేదా అని చూసుకుంటాను. పుస్తకంగా చదవను ఎప్పుడూ. నా రీసెర్చ్‌ అంతా రికార్డ్స్‌ నుండే. ఒరిజినల్‌.

ప్ర: మీతోపాటు ఎవరెవరు చేస్తూ ఉండేవారు? అసిస్టెంట్స్‌ కానీ, టీం మెంబర్స్‌ కానీ?

జ: ఎవ్వరి హెల్ప్‌ లేదు. నా అంతట నేనే చేశాను. నేను చెయ్యగలిగినంత వరకు చేశాను. అంతేగాని ఇంకొకరి హెల్ప్‌ కానీ, అసిస్టెన్స్‌ కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మా బులెటిన్‌ పొద్దున్న ఏడింటికి. అందుకని పొద్దున్న ఐదింటికల్లా వెళ్ళాలి. ఐదుకు వెళ్ళాలంటే, ఏ నాలుక్కో లేచి, తయారై బయలుదేరేదాన్ని. కారు వచ్చేది, మా కోసం. వెళ్ళగానే మెటీరియల్‌ ఇచ్చేవారు. దాన్ని చూసుకుని వార్తలు రాసుకోవాలి. ఇలా రాసుకోవడానికి రెండు గంటలు పడుతుంది. ఏడింటికి స్టూడియోకి వెళ్ళి, వార్తలు చదవటం. 7.15కల్లా అయిపోతుంది. మళ్ళీ పన్నెండింటివరకూ పనిలేదు. అంటే, ఏడున్నర నుండి పన్నెండున్నర లేక ఒంటిగంట వరకు నేను ఖాళీయే.

ఆ లీజరు టైమ్‌లో నేను నేషనల్‌ ఆర్కైవ్స్‌కు వెళ్ళేదాన్ని. అది దారిలోనే ఉండేది. అందుకే నడిచే వెళ్ళేదాన్ని. ఢిల్లీలో అంతా వీథుల్లో నడిచేది ఎవరూ అంటే నన్ను చూపిస్తారు (నవ్వుతూ). ప్రతిరోజూ ఉదయం 8.45కల్లా ఆర్కైవ్స్‌కు వెళ్ళేదాన్ని. అప్పటికి అక్కడ వాళ్ళు తుడుస్తూ, ఊడుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు. నేను ముందే వచ్చేస్తాననీ, నా రిసెర్చి వర్క్‌ మొదలుపెడతాననీ! కనుక రిసెర్చ్‌ రూం తెరిచి పెట్టేవారు. నేను వెళ్ళి కూర్చుంటాను. రికార్డ్స్‌ అన్నీ ఉంటాయి. టేబుల్‌ మీద, ఆ పక్కన కొన్ని రికార్డ్స్‌ పెట్టేస్తాను, ఈ సైడ్‌ నేను వర్క్‌ చేస్తూ ఉంటాను. అక్కడెందుకు పెడతానంటే, ఇంకొకరు వచ్చి కూర్చుంటారు కదా? ఇంకెవ్వరూ రాకూడదు. ఎందుకంటే డిస్టర్బెన్స్‌ ”హలో, హౌ ఆర్యూ?” అని ఏమో మాట్లాడాలి, అందుకని నా పుస్తకాలు, ఆ రికార్డ్స్‌ కొన్ని ఆ పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఎవరో ఉన్నారనుకుని ఆ టేబుల్‌ దగ్గరకు ఎవరూ రారు. సో, అలా ఒంటిగంట వరకూ పనిచేసి, మళ్ళీ అక్కడనుండి హాస్టల్‌కు… హాస్టల్‌ దగ్గరే. అదే వుమన్‌ హూ వాక్స్‌ కదా? మళ్ళీ అక్కడినుండి నడిచివెళ్ళి భోజనం చేసేసి, మళ్ళీ మూడున్నరకు రెడీ అయ్యి, మళ్ళీ రేడియో స్టేషన్‌కు ఈవెనింగ్‌ బులెటిన్‌ కోసం వెళ్ళేదాన్ని.

అలా ఆర్కైవ్స్‌లో చాలా సమయం గడిపేదాన్ని. మధ్యాహ్నాలు వెళ్ళేది లేదు. కానీ ఉదయాలు మాత్రం తొమ్మిదింటి నుండి ఒంటిగంట వరకూ కంటిన్యూస్‌గా. లేచేదే లేదు. అందరూ టీ కనీ, దీనికనీ, దానికనీ లేస్తారు. నేను ఎక్కడికీ లేచేది లేదు. అతుక్కుపోవడమే. గమ్‌ వేసుకుని, ఫెవికాల్‌ అంటించుకున్నట్లు కూర్చొని ఈ రికార్డ్స్‌ అన్నీ చూసేదాన్ని.

ఈ రికార్డ్స్‌ అన్నీ చూడడం కూడా సబ్జెక్ట్‌ ప్రకారం సెలెక్ట్‌ చేసుకున్నాను. అన్ని రికార్డ్స్‌ చూసేదాన్ని, నోట్సులు రాసుకునేదాన్ని. ఆ రాసుకున్న నోట్స్‌, అన్ని ఫైల్స్‌ ఆ రూంలో పడున్నాయి (గది చూపిస్తూ). దెన్‌ ఐ యూజ్డ్‌ టు డు ద వర్క్‌ అట్లా చేశానన్నమాట నా రిసెర్చ్‌ వర్క్‌. నేనెవరో ఒకరిని ఆదర్శంగా పెట్టుకుని చేయలేదు. ఆన్‌ మై ఓన్‌, సెల్ఫ్‌ మేడ్‌…

ఒక రాత్రి యూనివర్శిటీ వాళ్ళు ఫోన్‌ చేసి, ”రేప్రొద్దున్న మీకు వైవా ఉంటుంది. మీరిక్కడికి రావాలి” అన్నారు. మార్నింగ్‌ అంటే 3.30కి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. ఐ ర్యాంగ్‌ అప్‌ మై సూపర్‌వైజర్‌… ఇలా రేపు రమ్మన్నారు, టైం ఏమీ ఇవ్వలేదు అని చెప్తే, ”ఆప్టర్‌ ఆన్‌ ఇట్స్‌ యువర్‌ ఓన్‌ థీసిస్‌ పేపర్‌, సొ వాటీస్‌ దేర్‌ టు బి ఆఫ్రైడ్‌ ఆఫ్‌, యు కమ్‌” అన్నారు. నా అలవాటు ఏంటంటే, చిన్న పాకెట్‌ నోట్‌ బుక్‌లో, ఛాప్టర్‌ బై ఛాప్టర్‌ అన్ని పాయింట్స్‌ రాసి పెట్టుకుని ఉంటాను. అది ఎప్పుడూ నా పర్సులోనే ఉంటుంది. సరే. రేడియో స్టేషన్‌ నుంచి నన్ను డి.ఎ.వి.పి.కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. డి.ఎ.వి.పి. అంటే ప్రభుత్వ ప్రకటనలన్నీ అక్కడే రూపొందుతాయి. సో, ఒక వారమయింది అక్కడ చేరి.. మొదటి వారంలోనే వెళ్ళి ”నేను ఇంటర్వ్యూకు వెళ్ళాలి” అంటే ఒప్పుకుంటారా? అని భయమేసింది. లంచ్‌ టైంలో మెల్లిగా డిప్యూటీ డైరెక్టర్‌ రూంలోకి వెళ్ళాను. శ్రీనివాసన్‌ అని, చాలా మంచి మనిషి. అక్కడికి వెళ్ళాక ఏంటని అడిగారు. ”పి.హెచ్‌.డి.కండి, వైవా ఉంది, యూనివర్శిటీకి వెళ్ళాలండి” అంటే ”వై డిడ్‌ యు కమ్‌ టు ద ఆఫీస్‌?” అని అరిచారు. అంటే ”నువ్వసలు వచ్చుండకూడదు కద, ఎందుకొచ్చావు” అని కోప్పడి వెంటనే వెళ్ళమన్నారు. సరే, ఆటో చేసుకుని వెళ్లాను ఎనిమిది మైళ్ళు ఆఫీసు నుండి యూనివర్శిటీకి. ఆ ఎనిమిది మైళ్ళ దూరంలో ఆ చిన్న పాకెట్‌ బుక్‌లో ఉన్న ఈ నోట్స్‌ రివిజన్‌ చేసేశాను. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ ఒక రూంలో కూర్చున్నారు. నన్ను యాంటి రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆ రూంలో కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, శాండ్‌విచ్‌లు తింటూ టీ తాగుతున్నారు. So, at 3’o clock they invited me. వెళ్ళాను రూమ్‌లోకి. ప్లీజ్‌ సిడౌన్‌ అన్నారు. జె.పి.నాయక్‌ అని, సెంట్రల్‌ గవర్నమెంట్‌లో ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీలో సెక్రెటరీ. ఆయనే నాకు వైవా తీసుకునేది. Please have this sandwich…అంటే, ”నో థాంక్యుఁ అన్నాను. అప్పుడు మా సూపర్‌వైజర్‌ ”ఆమె చాలా స్ట్రిక్ట్‌, షి ఈజె సీరియస్‌ వుమన్‌, అలా అంతా తినరామె” అన్నారు. అప్పుడు నాయక్‌ ఏమన్నారంటే, దానే దానే పర్‌ ఖానే వాలేకా నామ్‌ లిఖా హోతా హై… So, she’ll not take, her name is not on this … and moreover, God gives ration to everybody. ఆ రేషన్‌ తిన్నన్ని రోజులే వాళ్ళు బతుకుతారు. రేషన్‌ అయిపోగానే చచ్చిపోతారు. అంటే, నూకలు చెల్లిపోవడం అంటాం కదా, అలాగ. ూShe wants to love long … So, she’s not taking this sandwich. ఇలాగే తమాషాగా ఏదేదో మాట్లాడేస్తూనే… వైవా అయిపోయింది.

ప్ర: మీకు ఒక టాపిక్‌ తీసుకున్నాక, రీసెర్చి మొత్తం పూర్తికావడానికి ఎంత కాలం పడుతుంది?

జ: నాలుగైదు ఏళ్ళు పడుతుంది.

ప్ర: ఒక టాపిక్‌ తీసుకున్నాక, దానిమీద ఒక పుస్తకం రాయాలనుకుంటే..

జ: అది రాయాలనుకుంటే, అన్ని లైబ్రరీలు వెతకాలి. ఇప్పుడూ ఢిల్లీలో ఉండే లైబ్రరీ చూశాను, నెహ్రు మ్యూజియం చూశాను, హైదరాబాద్‌ లైబ్రరీ చూశాను, హైదరాబాద్‌ ఆర్కైవ్స్‌ చూశాను. తర్వాత మద్రాస్‌లో మద్రాస్‌ ఆర్కైవ్స్‌ చూశాను. మద్రాస్‌లో మాన్యుస్క్రిప్ట్స్‌ లైబ్రరీ ఉంది. అక్కడ చూశాను. ఆ తర్వాత పాండిచ్చేరి వెళ్ళాను అక్కడ ఒక నెల ఉన్నాను. ఇలా అన్ని చోట్లకూ, ఎక్కడెక్కడ మనకు మెటీరియల్‌ దొరుకుతుందనుకుంటే అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, పనులు చేసుకోవాలి.

ప్ర: మరి అంతంత దూరాలు ప్రయాణించడమంటే ఆర్థికంగాను, మానసికంగాను శ్రమ అధికం కదా…!

జ: ఏం లేదు. నాకది హాబీ. ఎవ్వరూ నాకు ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఒక టికెట్‌ కొనిచ్చింది లేదు. నేను సొంతంగానే చేశానన్నమాట. ఒకసారి క్రిస్టియానిటీ మీద రాసిన ఒక పుస్తకంలో “The work of missionaries in Andhra Area” వాళ్ళ గురించి రాశాను. దానికి బెంగుళూరులో 17, మిల్లర్‌ రోడ్‌ అనేదో ఉంది. అక్కడ వాళ్ళ హాస్టల్‌లో ఒక నెలపాటు ఉన్నాను. అది థియోలాజికల్‌ కాలేజ్‌ (United Theological College). అక్కడ ఫాదర్స్‌కి ట్రెయినింగ్‌ ఇస్తారు. నేను హాస్టల్లో ఉండి, అక్కడే భోజనం చేస్తూ, అత్యధిక సమయం వాళ్ళ గ్రంథాలయంలో గడిపాను. అక్కడ ఒకావిడ ఉండేవారు. ఎమ్మా అని, జర్మన్‌. ఆవిడ ఒక ఇండియన్‌ని పెళ్ళాడారు. షి వాజ్‌ వెరీ హెల్ప్‌ఫుల్‌. నాకు రూమ్‌లోకి పుస్తకాలు కావాలంటే ఇచ్చేది. నేను రాత్రి పుస్తకాలు తీసుకుని, పొద్దున్న ఐదింటి నుండి రాస్తూ ఉండడాన్ని చూసి వాళ్ళ స్టూడెంట్స్‌ని తిట్టేవారు.

‘ఆవిడ చూడండి, ఎంత పని చేస్తోందో!” అని. వాళ్ళకి తిట్లు పడేవన్నమాట. బట్‌ ఐ హడ్‌ ఎ నైస్‌ టైమ్‌! ఒక నెల వాళ్ళ లైబ్రరీలో ఉన్నాను. అలా వెళ్ళిన చోటల్లా ఒక్కో నెల ఉండేదాన్ని. ఎందుకంటే గవర్నమెంట్‌ సర్వెంట్‌లకు ఒక నెల ఎర్డ్న్‌ లీవ్‌ ఉంటుంది. నేను ఆ సెలవలన్నింటినీ వీటికి ఉపయోగించేదాన్ని.

ప్ర: మీరు చేయాలనుకొని చేయలేకపోయినవి ఏమైనా ఉన్నాయా?

జ: నేను చెయ్యాలనుకున్నది చెయ్యకుండా ఉండను. చెయ్యాలనుకున్నది చేసి తీరుతాను. అంటే చెయ్యాలనుకుని పోస్ట్‌పోన్‌ చేసి… ఇలా చేసేందుకు వయసు ఉండదు కద, we’ii become old and then we’ll not be able to move about. కాబట్టి, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. When you are able to move about, then you must be able to finish off your work. ”నేను చెయ్యాలి, చెయ్యాలి” అనుకుంటే చెయ్యలేము. ”నేను చేసేస్తాను” అనుకొని వెళ్ళినట్లయితే చేసేస్తాం. అదే, ఇంకొకరి మీద ఆధారపడకూడదు. We must be able to do our work by ourselves.

ఆ వర్క్‌కి సామాగ్రి ఎక్కడ దొరుకుతుందో మనం ఆలోచించుకోవాలిThen we must correspond with them about the material. ఆ మెటీరియల్‌ దొరుకుతుందా? మనం ఉండడానికి స్థలం అదీ ఉంటుందా అని కూడా చూసుకోవాలి. మనం హోటళ్ళలో ఉండలేం కద. అవన్నీ కూడా చూసుకోవాలి. Being a lady, that is also important. మనం ఉండడానికి స్థలం చూసుకుని, ఆ ఆర్కైవ్స్‌, ఆ లైబ్రరీలలో మనకి కావలసింది చూడగలగాలి. సో దటీజ్‌ ద మెయిన్‌ థింగ్‌. టాపిక్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. టాపిక్‌కి కొంచెం గైడెన్స్‌ ఇచ్చేవాళ్ళో, అఫిషియల్‌గా ఎవరో ఉండాలి కద, సూపర్‌వైజర్‌ అని, వాళ్ళని ఒకళ్ళని సెలక్ట్‌ చేసుకోవాలి.

ప్ర: ఇప్పటి తరం చేస్తున్న పరిశోధనలను మీరు ఫాలో అవుతున్నారా?

జ: ఇప్పటి తరం వాళ్ళు నా దగ్గరికి వస్తే కద.

ప్ర: మీరు హిస్టరీ కాంగ్రెస్‌కి వెళ్తారు కదా, అక్కడికి ప్రస్తుత తరంవాళ్ళు ఎవరూ రారా?

జ: వస్తారు. కానీ ఇప్పటి జనరేషన్‌ వాళ్ళు ఈ ముసలామెతో ఏం పని అని… వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళంతా గ్రూప్‌ వేరే ఉంటారు.

ప్ర: ఇప్పుడు మీకు లైబ్రరీస్‌, వాటికి వెళ్ళడం కష్టం కదా! మరి మీరిప్పుడు ఏమైనా చేయాలని అనుకుంటే ఎలా?

జ: నా దగ్గర కలెక్ట్‌ చేసిన మెటీరియల్‌ అంతా అలాగే ఉంది కదా. ఇక రెండు పుస్తకాలు చేయాలని

ఉంది. చేస్తానో లేదో చూడాలి.

పీహెచ్‌డీ

ప్ర: పీహెచ్‌డీ అడ్మిషన్‌ ఎలా దొరికింది?

జ: పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నానని నేను ఢిల్లీ యూనివర్శిటీకి 63లో అప్లయ్‌ చేశాను. నువ్వు ఒకచోట ఉద్యోగం చేస్తున్నావు, you’re already employed. One must give full time for research. నువ్వు ఫుల్‌ టైం కేటాయించలేవు కాబట్టి అడ్మిట్‌ చేసుకోలేము అని వాళ్ళు రిప్లయ్‌ ఇచ్చారు. అప్పుడు అర్కైవ్స్‌ డైరెక్టర్‌ దగ్గరకు వెళ్ళాను. నా సమస్యేమిటో చెప్పాను. హి వజ్‌ ఆల్సో ఎ వెరీ గుడ్‌ మాన్‌. నేను మీట్‌ అయిన వాళ్ళంతా వెరీ గుడ్‌ పీపుల్‌ (నవ్వుతూ). ఆయన వెంటనే రిసెర్చ్‌ రూంకి లేడీ ఇన్‌ఛార్జి అయిన మిస్‌ డేవిడ్‌ను పిలిచారు. ఆమె రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందినామె. ఆమెతో ”ఈమెకు ఏమేం కావాలో అన్నీ ఇచ్చేయమ్మా” అని చెప్పారు. ఆమె నాకు ఏమీ ఇవ్వకుండా నన్ను నేరుగా ఆ ఎడ్యుకేషనల్‌ రికార్డ్స్‌ ఉన్న స్టోర్‌లోకి తీసుకువెళ్ళి ”నీ ఇష్టం” అని చెప్పి వదిలేసింది.

అక్కడ రికార్డ్స్‌ ఎలా ఉంటాయంటే ప్రతి బాక్సులోనూ, ప్రతి సంవత్సరంవీ రికార్డ్స్‌ ఉంటాయి. ఇలా చాలా బాక్సులు ఉంటాయి. 1850 నుండీ ప్రతి సంవత్సరంది బాక్స్‌ ఓపెన్‌ చేయడం, నాకే రికార్డ్స్‌ పనికొస్తాయో లిస్ట్‌ రాయడం, దానిమీద ఆ నెంబర్‌ రాసుకోవడం, బాక్స్‌ పక్కకు పెట్టి ఇంకోటి తీసుకోవడం… అలా 1850 నుండి 1947 వరకు దాదాపు వందేళ్ళ రికార్డ్స్‌లో నాకు పనికివచ్చే నంబర్లన్నీ రాసుకొచ్చేశాను. ఒక నెల పట్టింది. అప్పుడు రీసెర్చ్‌ రూంకి వచ్చి, రోజూ పది రికార్డ్స్‌కు రిక్విజిషన్‌ ఇచ్చేదాన్ని. వాళ్ళు నాట్‌ ట్రాన్స్‌ఫర్డ్‌ అని కానీ, బ్రిట్టిల్‌ అని కానీ అనడానికి వీల్లేదు, నేను చూశాను కదా వాటిని. అందుకని వాళ్ళు నిరాకరించడానికి లేదు. అలా ప్రతిరోజూ ఒక పది రికార్డులు చూసుకుని, నాకు కావలసిన పాయింట్స్‌ ఏమున్నాయో చూసుకుని, ఎడ్యుకేషన్‌కి సంబంధించినవి రాసుకుని, వాళ్ళకు తిరిగి ఇవ్వడం… ఇలా ఒక ఏడాది కాలంలో నేను యాభై పేజీల ఒక వ్యాసం తయారుచేశాను. దాన్ని అటాచ్‌ చేస్తూ, మరుసటి ఏడాది మళ్ళీ అప్లికేషన్‌ పంపించాను. వాళ్ళు ఈసారి తిరస్కరించడానికి వీలే లేదు. నేను అక్కడే రాసి ఉంచా ”ఒక ఏడాదిలో నేనింత పని చేయగలిగితే, ఇంకా పని చేయగలను అన్న నమ్మకం నాకుంది” అని. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడే కూర్చున్నాను. రోమిలా థాపర్‌ అప్పటికి ఢిల్లీ యూనివర్శిటీలో రీడర్‌గా పనిచేస్తున్నారు, హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌. ”మనకి ఫ్యాకల్టీ లేదు. ఆ ఎడ్యుకేషన్‌ శాఖ శుక్లా సూపర్‌వైజర్‌గా ఉండేందుకు ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఈవిడ్ని తీసుకోవచ్చు” అని చర్చిస్తున్నారు.

నేనది విన్నాను. రేడియో స్టేషన్‌కు వచ్చి ”చూడు వాళ్ళిలా అన్నారు, ఎవరో శుక్లా అంట, ఆయన ఒప్పుకున్నట్లయితే నాకు అడ్మిషన్‌ ఇస్తారంట” అన్నాను. అప్పుడు జి.ఆర్‌.రావు అని ఒకాయన ఉన్నారు. ఆయనిప్పుడు రిటైరై హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన అన్నారు, ”విజయవాడ నుండి ఒక రావు ఉన్నాడు. ఆయనా, శుక్లా ఫ్రెండ్స్‌. ఆయనకి చెప్పి శుక్లాకు చెప్పమని చెప్తాను” అని. బహుశా, ఆ రావు, శుక్లాకి చెప్పినట్లున్నారు. ఇంతవరకూ నేనా రావును చూసింది లేదు. తర్వాత శుక్లాకి ఫోన్‌ చేస్తే, మర్నాడు రమ్మన్నారు. వెళ్తే మాట్లాడారు. ుThen, he was selected for asian institute of education in UN. వాళ్ళ ఆఫీసు ఇంద్రప్రస్థ ఎస్టేట్‌లోకి మారింది. మా ఆఫీసునుండి దగ్గరే. వాకింగ్‌ డిస్టెన్స్‌. ‘గాడ్‌ సెంట్‌’ అనుకున్నాను. యూనివర్శిటీకి ప్రతిసారీ వెళ్ళనక్కరలేకుండా ఇది దగ్గరగా వచ్చింది అనుకున్నాను. ప్రతి బుధవారం అక్కడికి వెళ్ళేదాన్ని. ఒక ఛాప్టర్‌ రాసుకుని, పేపర్లు ఆయనకు ఇస్తే బ్యాగ్‌లో పెట్టేసేవారు. మళ్ళీ వచ్చే వారం వెళ్ళేదాన్ని కదా, అప్పుడు తీసి, ”ఓహ్‌! ఈ పేపర్‌ ఇక్కడే ఉంది కదా…” అని దాన్ని అలా అలా తిప్పి, ”ఇక్కడ కొంచెం మార్చొచ్చు, అక్కడ కొంచెం మార్చొచ్చు” అని చెప్పేవారు. అలా ఆయన నన్ను గైడ్‌ చేస్తూ ఉండేవారు.

నాకేంటంటే, నా జీవితంలో బుధవారం చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే, నేను రిషి వ్యాలీలో 1948లో వర్క్‌ చేశాను. అక్కడే ఉన్నాను. అప్పుడు బుధవారాలన్నీ హాఫ్‌ డే. శనివారం, బుధవారం హాఫ్‌ డే. గర్ల్స్‌ హౌస్‌ ఇంఛార్జ్‌ నేను. గర్ల్స్‌ను అలా వాకింగ్‌కి కొండలమీదకు తీసుకెళ్ళేదాన్ని. కొండలమీదకి ఎక్కితే మళ్ళీ అంతా చూస్తూ చివరకు సాయంత్రం ఆరుగంటలకు దిగేవాళ్ళం. కొండమీద నాగదాళి (??) అంటే బ్రహ్మజెముడు… చెట్లుంటాయి. వాటిలో ఎర్రగా ఒక కాయ ఉంటుంది. తమిళనాడు నుంచి వచ్చిన పిల్లలు ఆ ఎర్రకాయలు తీసుకుని, పిన్నుతో ఆ ముళ్ళు తీసిపడేసి.. ”ఊ..ఫ్‌” అని పీల్చి తినేస్తారు. దానిలో జ్యూస్‌ బాగా ఉంటుంది. అలాగని పండ్లన్నీ తినీ తినీ మూతులంతా ఎర్రగా మారి, వాళ్ళు దిగివచ్చిన తర్వాత చూస్తే మూతులన్నీ ఎర్రగా కోతి పిల్లలు ఉన్నట్లు ఉంటారన్నమాట. సో లైక్‌ దట్‌, ఐ హావ్‌ ఎంజాయ్డ్‌ ఇన్‌ దట్‌ రిషి వ్యాలీ. అందుకని Wednesday is an important day నాకు.

రేడియో స్టేషన్‌కి వెళ్తే, వారంలో Wednesday was my off day. పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రతి బుధవారం ఢిల్లీ యూనివర్శిటీలో సెమినార్‌ ఉండేది. సో, నేను వెళ్ళి అటెండయ్యేదాన్ని. నేను వేరే ఉద్యోగం చేస్తున్నానని ఎవరికీ తెలీదు. ఏమంటే, బుధవారం నా ఆఫ్‌ డే. So, like that I’ve enjoyed my Wednesday. ఇలా నా పీహెచ్‌డీ పూర్తి చేశానమ్మా..

రచించిన పుస్తకాల గురించి

(భారత పార్లమెంటు పుస్తకాన్ని చూపిస్తూ) ఇది మొదటి అనువాదం. భారత పార్లమెంటు.. అప్పుడు అన్నీ తక్కువ ధరలకు అందించేవారు. ఇప్పుడెక్కడ? అన్నీ వందల్లో ఉంటున్నాయి. అది ఐ అండ్‌ బి మంత్రిత్వ శాఖలోని డి.పి.డి. అంటే పబ్లికేషన్స్‌ డివిజన్‌ విభాగం వారు వేశారు.

ప్ర: ఇది మీరు ఇంగ్లీషు నుండి అనువదించారా?

జ: ఎస్‌.. (Inde అన్న పుస్తకాన్ని చూపిస్తూ..)

ఇది ఫ్రెంచ్‌ బుక్‌. అంటే 1982లోNAM అంటే నాగాలాండ్‌ మూవ్‌మెంట్‌. దేశాలన్నీ ఢిల్లీలో మీటయ్యాయి. అప్పుడు 137 దేశాల నుండి డెలిగేట్స్‌ వచ్చారు. వాళ్ళు ఫ్రెంచ్‌, స్పానిష్‌, హిందీ, అరబిక్‌… ఇవన్నీ మాట్లాడేవారు. నేనప్పుడు ఐ.సి.సి.ఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌)లో ఉన్నాను. అక్కడ నేను చీఫ్‌ ఎడిటర్‌. వచ్చిన డెలిగేట్స్‌కు ఇండియా గురించి మెటీరియల్‌ ఇవ్వవలసి వచ్చింది. అప్పుడు ఇంగ్లీషులో ఒక పది పుస్తకాలు రాయించి, ఆ పుస్తకాలను అరబిక్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, హిందీలలో తర్జుమా చేయించి, అవన్నీ ప్రింట్‌ చేయించాను. వాటిని వచ్చిన డెలిగేట్స్‌ అందరికీ ఒక్కొక్క ప్యాక్‌ చేయించి, అన్ని భాషల కాపీలు పెట్టి అందరికీ ఇచ్చాను. ప్యాక్‌ చేయడానికి నా దగ్గర వాణి అనే ఒక అసిస్టెంట్‌ ఉండేది. ఆ అమ్మాయికి స్పానిష్‌ వచ్చు. నేను ఫ్రెంచ్‌ చేశాను. ఇద్దరం కలిసి ఇరవై మైళ్ళ దూరంలోని మాయాపూర్‌ ఉన్న ప్రెస్‌కు వెళ్ళి అర్థరాత్రిదాకా కూర్చుని, ఫైనల్‌ ప్రూఫ్‌ చూసుకుని, బుక్స్‌ తయారు చేసుకుని ఆఫీసుకు తిరిగి వచ్చాము. ఆ అమ్మాయి వెళ్ళి కన్నాట్‌ప్లేస్‌లో ధర కనుక్కుని వచ్చింది. 1982లో అతను ఒక్కో ప్యాక్‌కు ఇరవై రూపాయలు తీసుకున్నాడు. సరేనని అన్నీ ప్యాక్‌ చేయించింది. తీసుకొచ్చాము. కాన్ఫరెన్స్‌ హాల్‌లో పెద్ద టేబులుంటుంది కదా, బండిల్స్‌ అన్నీ దానిమీద పెట్టాం. మార్గరెట్‌ అల్వా మినిస్టర్‌గా ఉన్నారప్పుడు. ఆవిడ తమ్ముడు నాజరత్‌ ఐ.సి.సి.ఆర్‌.లో మాకు డైరెక్టర్‌. ఆయన కిందకు వచ్చి, “All these packets are here. The delegates are going away, what is the use?” అని అరుస్తున్నారు. సరే, మూడు కార్లున్నాయి అక్కడ. ఆ మూడూ బుక్‌ చేసుకున్నాను. డెలిగేట్స్‌లో కొందరు కనిష్కాలో, మరికొందరు అశోకాలో… అలా ఉన్నారు.

అందరికీ ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్పి పాస్‌లు నేనే తీసుకొచ్చి ఇచ్చాను. విజ్ఞాన్‌ భవన్‌కు వెళ్ళి, ఫారిన్‌ అఫైర్స్‌లోని ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లకు, నాకూ, అందరికీ పాస్‌లు తెచ్చాను. ఒక్కో కార్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఒక్కో చోటకు పంపించేశాను. నేనేమో అశోకా హోటల్‌కు వెళ్ళి, ”ఇది ఫారిన్‌ అఫైర్స్‌ వ్యవహారం, వాళ్ళకు ఇవ్వాల్సి ఉంది, ఇచ్చి వస్తాను” అంటే అక్కడున్నతను లోపలికి పంపించాడు.

లోపల మన ఫారిన్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) కార్యాలయముంది. వాళ్ళు ”ఇవన్నీ స్కాన్‌ చేస్తే కానీ లోపలికి పంపించడానికి వీల్లేదని” చెప్పారు. ఐదవ అంతస్థులో వాళ్ళతో వాదించుకుంటూ ఉన్నాను నేను. మా డైరెక్టర్‌ అక్కడ ఆఫీసులో “Who will allow her? Why has she gone there?” అని అరుస్తున్నారు. అలాగే అశోకా హోటల్‌కు వచ్చేశారు. అక్కడ చూస్తే, నేను కింద ఎక్కడా లేను. వాళ్ళు ఒక ప్యూన్‌ని పంపడంతో అన్నీ స్కాన్‌ చేయించి ఇచ్చేసి వచ్చాను. అదన్నమాట. నన్ను చూస్తే ఎవ్వరయినా ”ఈమె ఏమైనా చేయగలదు” అని అనుకోరు. ఎందుకంటే మోడ్రన్‌గా ఉండను కదా!

అలా వచ్చిన పుస్తకం ఇది. Every month I used to bring magazines in all the five languages (for the external affairs). It meant a lot of work. ట్రాన్స్‌లేటర్స్‌ని పట్టుకోవడం, ప్రెస్‌కి ఇవ్వడం, ప్రింట్‌ చేయడం అంతా కూడా ట్రెమెండస్‌ వర్క్‌.

(The Historical papers గురించి చెబుతూ)

ఇందులో ఉన్న 20 ఎస్సెేలు నేను హిస్టరీ కాంగ్రెస్‌లో ప్రజెంట్‌ చేసినవి. నేను ప్రతిసారీ ఆ హిస్టరీ కాంగ్రెస్‌లో ఒక పేపర్‌ చదివి తీరతాను. సాధారణంగా సౌతిండియా హిస్టరీ గురించి ఎక్కువ రాయరు. నేనేంటంటే మైసూరు, టిప్పు సుల్తాన్‌, హైదర్‌ ఆలీ, టిప్పు సుల్తాన్‌ యుద్ధాలూ, పాలెగార్సూ… ఇలా సౌతిండియన్‌ హిస్టరీలో పేపర్స్‌ రాస్తాను.

(ప్రింటింగ్‌ హిస్టరీ పుస్తకం గురించి చెబుతూ…)

1719లో డచ్‌వాళ్ళు వచ్చినపుడు ”తరంగ మలై” అని తమిళనాడులోని మద్రాస్‌ దగ్గర… అక్కడికి వచ్చిన మొట్టమొదటి ఫాదర్‌, హిడన్‌బర్గ్‌ బైబిల్‌ను తమిళంలోకి అనువాదం చేశారు. అనువాదంపై జర్మనీలో ట్రెయినింగ్‌ అయ్యారు. వాళ్ళని అడిగి పేపర్‌, తర్వాత టైప్స్‌ తెప్పించుకుని ప్రింట్‌ చేయడం మొదలుపెట్టారు. సగం ప్రింట్‌ అయ్యేసరికి పేపర్‌ అయిపోయింది. ఇంకేం చేస్తారు? ఆయన ఇక్కడే పేపర్‌ తయారుచేసి, ఇక్కడే చిన్నగా ఉన్న తమిళ ఫాంటును తయారుచేసి, మిగిలిన సగం పుస్తకాన్ని అచ్చు వేశారు. నాకేమో ఆ పుస్తకం చూడాలని. దాన్ని ఎస్‌.పి.సి.కె. (Society for Propagation of Christian Knowledge) వాళ్ళు ప్రింట్‌ చేశారు.

ఒకసారి ఒక పేపర్‌ చదవడానికి కేంబ్రిడ్స్‌ వెళ్ళాను. పేపర్‌ అయిపోయాక ఈ పుస్తకాన్ని చూడాలని లండన్‌లో వాళ్ళ ఆఫీసు వెతుక్కుంటూ వెళ్ళాను. (ఎక్కడికి వెళ్ళినా నేనొక్కదాన్నే వెళ్ళేదాన్ని). వెతుక్కుంటూ వెళ్ళగా, రసల్స్‌ స్క్వేర్‌లో

ఉంది. రసల్స్‌ స్క్వేర్‌ను మూడుసార్లు చుట్టి వచ్చాను. వాళ్ళ ఆఫీసు కనిపించింది. లోపలికి వెళ్ళాను. వాళ్ళు ”ఎవరీమె?” అనుకున్నారు. చీరకట్టు చూసి నేను భారతీయురాలినని తెలిసిపోయింది. ”ఏం కావాలి?” అని అడిగారు. నేను ”1791లో హిడన్‌బర్గ్‌ ప్రింట్‌ చేసిన బైబిల్‌ను చూడాలి” అన్నాను. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని, పట్టుచీర కట్టుకుని ఒక సౌతిండియన్‌ వచ్చి హిడన్‌బర్గ్‌ 1791లో ప్రింట్‌ చేసిన బైబిల్‌ అడుగుతుందేమిటబ్బా అని వాళ్ళు నన్ను ఎగాదిగా చూశారు. వాళ్ళు దాన్ని ఎక్కడో పైన పెట్టేశారు. పాపం, నిచ్చెనలు వేసి ఎక్కి తీశారు. ఆ పుస్తకంలో సగం ప్రింట్‌ పెద్ద అక్షరాలు. సగం ప్రింట్‌ చిన్న అక్షరాలు. అలా చూసి వచ్చానన్నమాట. ఇలా ఉంటాయి నా పనులన్నీ.

(1857 గురించి చెబుతూ…)

ఈ పుస్తకానికీ చరిత్ర ఉందమ్మా. అంటే… ఇంగ్లీషులో ఐదొందల పేజీలుందది. ఇంగ్లీషులో 1857 అని ఉంటుంది. దాన్ని వాళ్ళు తెలుగులో పదునెనిమిది వందల ఏబది ఏడు అని తర్జుమా చేసేశారు. వాళ్ళు తర్జుమా చేయమన్నారు. నేను ఐదు వందల పేజీలను నెలరోజుల్లో చేసిచ్చాను. ఐ అండ్‌ బి మినిస్ట్రీ వాళ్ళు ఆరునెలల్లో ప్రింట్‌ వేసి, నాకు ఒక కాపీ ఇచ్చారు.

ప్ర: నెలరోజుల్లో ఎలా అనువదించగలిగారు?

జ: అప్పట్లో యూనిట్‌లో బులెటిన్‌లు ట్రాన్స్‌లేట్‌ చేస్తుంటే, ఆ ఉర్దూ యూనిట్‌ వాళ్ళు దగ్గరే ఉండేవారు. వాళ్ళు  “Mangamma ji has taught her pen how to translate” అనేవారు. అందుకని ఇక్కడ ఇంగ్లీష్‌ చూడగానే అక్కడ పెన్‌ రాసేస్తూ పోతుంది.

ప్ర: మీరు పాలెగాళ్ళ మీద రాసిన పుస్తకం?

జ: అది తెలుగు అకాడమీ వద్ద ఉంది. ఇంకా ప్రింటు కాలేదు.

ప్ర: More than 60 articles in leading papers and journals అని ఉంది ఒకచోట. ఈ ఆర్టికల్స్‌ మీ దగ్గర ఉన్నాయా?

జ: ఉన్నాయి. ఎక్కడో ఉండాలి. కొన్ని ఇక్కడ ఉన్నాయిగా.

ప్ర: తెలుగులో కూడా మీరు చాలా రాసినట్టున్నారు?

జ: అవును.

ప్ర: అవి ఎక్కడ వచ్చేవి?

జ: ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక… వాటిల్లో వచ్చేవి. వీక్లీలో వచ్చేవి ఎక్కువగా.

ప్ర: దేనిగురించి రాసేవారు?

జ: అంటే… ఈ హిస్టరీ కాంగ్రెస్‌ అలీగఢ్‌ చండీగఢ్‌, కాశ్మీర్‌.. అన్నిచోట్లా తిరిగేది. ప్రతి సంవత్సరం హాజరయ్యేదాన్ని. ఆ ఊరిని గురించి, దాని ప్రాముఖ్యత గురించి రాసేదాన్ని. నేను బద్రీనాథ్‌, హిమాలయాలకూ వెళ్ళాను. దాని గురించి కూడా రాశాను.

ప్ర: (ఒక పుస్తకాన్ని చూపిస్తూ మేము అడిగాము) దీనిమీద కాపీరైట్స్‌ ఏమీ లేవేంటి?

జ: ఏం కాపీరైట్లు, ఎవరికైనా కావాల్సి వస్తే తీసుకుంటారు.

ప్ర: మీరు కథలు, అవీ ఎన్ని రాశారు?

జ: ఏవో కొన్ని రాశాను. (మదనపల్లె రచయితల సంఘం సంకలనంలో ఉన్న మంగమ్మ గారి కథ-‘స్టేషనుకు రండి’ కథ చెప్పారు). మా చెల్లి భాగ్యలక్ష్మి కథ కూడా ఉంది ఇందులో. తను యూపీఎస్సీ చేసి అక్కడంతా పని చేసింది. వివిధ దేశాలు తిరిగింది. వాళ్ళు ఢిల్లీలో స్థిరపడ్డారు. తను దాదాపు పాతిక పుస్తకాలు రాసింది.

తెలుగులో అచ్చయిన తొట్ట తొలి పుస్తకం కథ

ప్ర: తెలుగులో అచ్చయిన తొట్టతొలి పుస్తకం గురించి చెబుతారా?

జ: The first book printed in Telugu was in Germany. అప్పుడు మన ఫాంటు కూడా వేరే ఉంది. అంటే… ఇది తెలుగు, కన్నడలకు కలిపి ఉన్న ఫాంటు.

ప్ర: జర్మనీలో తెలుగు పుస్తకాలు ఎలా ప్రింట్‌ చేశారు?

జ: ఎందుకంటే, ఇక్కడికి వచ్చిన మిషనరీస్‌ వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు. అది నేర్చుకొని కొన్ని ట్రాన్స్‌లేషన్స్‌ తీసుకువెళ్ళి, 1746లో అక్కడ ప్రింట్‌ చేశారు. అదెంత, మన అరచేయంత పుస్తకమే. అలా ఆరు పుస్తకాలు ప్రింట్‌ చేశారక్కడ.

ప్ర: ఇప్పుడా పుస్తకాలు ఎక్కడన్నా ఉన్నాయా మరి?

జ: ఉన్నాయి. లేనిదే ఈ ఫోటోలు ఎలా వచ్చాయి?

ప్ర: అంటే, అప్పుడున్నాయేమో, మీరు చేసినప్పుడు ఉన్నాయా అని.

జ: నేను చేసినప్పుడే ఉన్నాయి. కాపీలను కోపెన్‌హగ్‌ నుండి, బ్రిటిష్‌ మ్యూజియం నుండి తెప్పించుకున్నాను.

ప్ర: మన లైబ్రరీస్‌లో మనకు సంబంధించినవి జాగ్రత్తగా భద్రపరుస్తారా?

జ: నేషనల్‌ ఆర్కైవ్స్‌ లాంటి వాటిలో ఉంటాయి. కేటలాగులు ఉంటాయి. ఇండెక్స్‌లు ఉంటాయి. వాటిని చూసి తీసుకోవాలి.

ప్ర: మీరేదైనా టాపిక్‌ అనుకున్నాక, దానికి తగ్గ మెటీరియల్‌ దొరక్క ఇబ్బందిపడిన సందర్భాలున్నాయా?

జ: లేకపోవడం ఏముంది? ఉన్నవాటిలోనే మనకు ఏది బాగా పనికొస్తుందో చూస్తాం కానీ, లేని దాని గురించి ఆలోచిస్తామా. మనం గెస్‌ చేయగలగాలి. ఫలానా దానికి మెటీరియల్‌ ఫలానా చోట ఉండాలి అని. అలా వాళ్ళకి రాస్తాం. అలాగే జర్మనీ వాళ్ళకు లెటర్‌ రాశాను. ఈ మొదట ప్రింట్‌ చేసిన ఆ అక్షరాలు, ఆ టైప్స్‌ మీరు మీ మ్యూజియంలో భద్రపరచారా అని రాశాను. ఆరునెలల తర్వాత, your letter in English, Please send in German అని నాకు జవాబు వచ్చింది.

ప్ర: మీదింకా అన్‌పబ్లిష్డ్‌ వర్క్‌ ఏమైనా ఉందా? మీ రీసెర్చ్‌ పూర్తయినా ఇంకా వెలుగు చూడనిది?

జ: మెటీరియల్‌ ఉంది, ఇంకా రాయాలి అన్నమాట. ఇంక రెండు ప్రాజెక్ట్స్‌ అనుకున్నాను. ఒకటేమో ‘వుమెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’. బెంగాల్లో మొదట ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ మొదలయింది. ఇంకోటి ‘రివల్యూషనరీ మూవ్‌మెంట్స్‌ ఇన్‌ ఇండియా.

ప్ర: మన దేశంలో చరిత్రకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువనీ, ఉన్నవారిలో కూడా ఎవ్వరూ పరిశోధన వైపునకు పోవడం లేదనీ ఒక అభిప్రాయం. దానిపై మీ అభిప్రాయం.

జ: దాంట్లో ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్ళు చేస్తారు.

ప్ర: చరిత్ర విద్యార్థులే తగ్గిపోతున్నారు కదా…

జ: అంటే మీలాంటి వాళ్ళంతా ఇంజనీర్లు అయిపోతా ఉంటే, హిస్టరీ ఎవరు చదువుతారు? (నవ్వుతూ). స్వతహాగా ఇంటరెస్ట్‌ ఉంటే చేయవచ్చు. అంటే నాక్కూడా ఇంటరెస్ట్‌ ఉండి కాదు. నేను రేడియోలో సెలక్ట్‌ అయినప్పుడు, నా ఉద్దేశ్యం ఏమిటంటే దేశంలో ఉన్న డిగ్రీల్లో హయ్యెస్ట్‌ డిగ్రీ తీసుకోవాలని. అప్పట్లో పీహెచ్‌డీనే హయ్యెస్ట్‌ అనేకునేదాన్ని. కాబట్టి పీహెచ్‌డీ చేయాలన్న ఉద్దేశ్యంతో…

నడుపుతున్న పాఠశాల గురించి..

ప్ర: ఈ జ్ఞానోదయ పాఠశాలను ఎప్పుడు మొదలుపెట్టారు?

జ: 1989. Sec., I came back in 1984. 84 నుండి 89 వరకు రిషి వ్యాలీకి వెళ్ళేదాన్ని. రోజూ వెళ్ళేదాన్ని. అక్కడ పన్నెండో తరగతికి హిస్టరీ చెప్పేదాన్ని. వాళ్ళది ఐ.సి.ఎస్‌.సి. సిలబస్‌. 89లో మా స్కూల్‌లోనే స్టార్ట్‌ చేశాం. అప్పుడు ఇంగ్లీష్‌ చెప్పడం మొదలుపెట్టాను. అప్పటినుంచి ఇప్పటివరకూ ఇంగ్లీష్‌ టీచర్‌నే.

ప్ర: స్కూల్‌ పదో తరగతి వరకూ ఉందా?

జ: అవును. కొన్ని ఇబ్బందుల వల్ల పన్నెండో తరగతి పెట్టదలచుకోలేదు. ఇక్కడ హాస్టల్‌ కూడా ఉంది. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు. స్కూలు బస్సులు చుట్టుపక్కల ఊర్ల నుంచి విద్యార్థుల్ని తీసుకొస్తాయి. (పుస్తకం.నెట్‌ నుండి..)

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.