మగ మదహంకారం క. శాంతారావు

అవునన్నా, కాదన్నా మనం పురుషాధిక్య సమాజంలో జీవిస్తున్నాం. ‘వాడు మగాడురా’ అని సంబోధించడంలోనే వానికి లేనిపోని మగ లైంగిక ఆధిపత్యాన్ని అంటగడుతున్నాము. ఇక అతగానికి అది జన్మతః సంక్రమించిన ఓ అహంకార స్వభావంగానే జీర్ణించుకుంటున్నాడు.

అహంభావం తలకెక్కినవానికి సమభావం అర్థం కాదు. దానికి తోడు వయసు మదం, ఆరోగ్య మదం చేరిన తరువాత యుక్తవయసులో పెడపోకడలకు పోయి బాలికలపై, స్త్రీలపై లైంగిక వేధింపులకు హింసకు పాల్పడుతున్నారు కొందరు.

ఈ మగమదహంకారానికి ఊతం ఇచ్చే విధంగా ధనమదం, అధికారమదం తోడైతే ఇక చెప్పేది ఏముంది? తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనే దుగ్దతో లజ్జాహీనుడై ప్రవర్తిస్తాడు.

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనా పట్ల ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు బానోత్‌ శంకర్‌ నాయక్‌ నిర్వహించిన అనుచిత, అసభ్య ప్రవర్తనా నిర్వాకం ఈ కోవలోకే వస్తుంది.

జూన్‌ 12వ తేదీ స్థానిక ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమం ‘హరితహారం’లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అవసరం లేకపోయినా శంకర్‌ నాయక్‌ అధికారిణి ప్రీతి మీనా చేయిపట్టుకున్నాడు. ఆమె నిర్ఘాంతపోయి ‘బీ ఇన్‌ యువర్‌ లిమిట్‌’ అని తీవ్ర హెచ్చరిక చేసింది.

జిల్లా కలెక్టర్‌ను, గౌరవనీయ మహిళను, తనను చేయితో తాకాల్సిన అవసరం ఏమిటి? అంటూ ఆమె ఆక్రోశించారు. తనకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌కు ఫిర్యాదు చేశారు.

ఐ.ఎ.ఎస్‌. అధికారుల సంఘం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. అధికారులంతా ముక్తకంఠంతో ఆ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.ను కూడా కోరారు.

జరిగిన తీరును నిరసిస్తూ ఉద్యోగులంతా వెన్వెంటనే నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రీతి మీనాకు సంఘీభావంగా నిలిచారు. మహిళా సిబ్బంది పట్ల, అధికారుల పట్ల శంకర్‌నాయక్‌ ఇలా దురుసుగా వ్యవహరించడం, దుర్భాషలాడడం చేస్తుంటాడని పలువురు ఉద్యోగులు ఈ సందర్భంగా తెలిపినట్లు పత్రికలలో కూడా వచ్చింది.

ముఖ్యమంత్రి ఆగ్రహించి ఆదేశించడంతో శంకర్‌నాయక్‌ ఎట్టకేలకు కలెక్టర్‌ను కలిసి క్షమాపణలు కోరారు. ఆ క్షమాపణలు కోరిన విధం గమనిస్తే ఆ ఎమ్మెల్యేకు రవ్వంతైనా పశ్చాత్తాపం కలిగినట్లు కనిపించదు.

‘జిల్లా కలెక్టర్‌ నా సోదరి లాంటిది. కలెక్టర్‌ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి చెందినవాడిని. ఆమె కూడా ఎస్టీ వర్గానికి చెందినదే. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఒకవేళ జనంలో పొరపాటున చేయి తగిలి ఉంటే…’ అని చెప్పడం క్షమాపణ అవుతుందా? అని అధికారులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు నేనూ, ఆమె ఒకే సామాజిక తరగతి (ఎస్టీ) చెందినవారమని చెప్పుకోవడం ఎందుకు? ఒకే సామాజిక తరగతి అయితే అసభ్య ప్రవర్తనకు లైసెన్స్‌ ఉంటుందా అని వారు నిగ్గదీస్తున్నారు. సిగ్గుమాలిన చేష్టలు, సమర్ధింపులుగా వీటిని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, జిల్లా ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ అయిన ఆమె, సదరు ఎమ్మెల్యేపై తగు చర్యలు తీసుకోమని ఆదేశిస్తే, పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయడానికి ఆరు గంటల సమయం పట్టిందని, కానీ ఎమ్మెల్యే మాత్రం నిమిషాల్లోనే బెయిల్‌ తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూక్ష్మంగా పరిశీలిస్తే పాలకపక్షం రాజకీయ స్వార్థంతో ఎమ్మెల్యే వైపు కొమ్ముకాస్తూ బాధితురాలు ప్రీతి మీనాకు న్యాయం చేయడానికి తటపటాయిస్తున్నట్లు ద్యోతకమవుతోంది.

బరితెగించిన పురుషాధిక్యతే మగమదహంకారంగా బయటపడుతుంది. ఇటీవల సినిమా రంగంలో ఇదే విషయం స్పష్టమయింది కూడా. ‘ఆడవాళ్ళు మానసిక ఆరోగ్యానికి హానికరమా?’ – ఈ ప్రశ్నను సంధించడంలోనే చాలా దుర్మార్గం ఉంది. మగవాళ్ళు మాత్రమే మానసిక ప్రశాంతత కోరుకునే పవిత్ర మానవులని, స్త్రీలు మాత్రం మగవారి ప్రశాంతతను ఆరోగ్యాన్ని చెడగొట్టే వ్యసన వస్తువులుగా చెలామణి చెయ్యడాన్ని చూస్తాం. కొనసాగింపుగా నటుడు చలపతిరావు

‘ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరమో లేదో తెలియదు గాని పక్కలోకి పనికొస్తారు’ అంటూ ఆ విధంగా ఆ ధోరణిలో పూరించారు.

ఆ తర్వాత మహిళాలోకం గగ్గోలు పెడితే కోరిన క్షమాపణ సైతం అలానే ఉంది. ‘మహిళలంటే నాకు చాలా గౌరవం ఉంది, నా మాటలు ఎవర్నైనా బాధపెడితే క్షమించండి, నేను మాత్రం ఇక దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశాను, వారు (మహిళా సంఘాలవారు) రోడ్లమీదకు వస్తే నేను చేసేది ఏం లేదు’ అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. ఇందులో నిజాయితీ శాతం ఎంతో అనేది చూసినవారికి ఇట్టే అర్థమవుతుంది.

మగమదహంకారం తెలిపే మరో ఘటన పంజాబ్‌లో 1988లో జరిగింది. అప్పటి డి.జి.పి. కె.ఎస్‌.గిల్‌ ఒక సమావేశంలో ఐ.పి.ఎస్‌.అధికారి రూపన్‌బజాజ్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. నేను మగవాడిని, పై అధికారిని, ఏదైనా చేయవచ్చు అన్న అహంభావంతో వ్యవహరించాడు. అదేదో రాయల్‌ (అధికారి) హోదా ప్రవర్తన అన్నట్లు వీపు క్రింది భాగంపై చరిచాడు. ఆమె నొచ్చుకుని న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. గిల్‌ వృత్తి సాహసాలకు గాను అప్పటికే ‘పద్మశ్రీ’ అవార్డు కూడా అందుకున్నారు. ఆ అవార్డును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి నాడు చెలరేగింది. చివరకు కోర్టు ఆయనను పిలిపించి అక్షింతలు వేసింది.

మరో కోణంలో నుంచి పరిశీలిద్దాం. రౌడీషీటర్‌ నయీమ్‌ అటు పోలీసులను, ఇటు రాజకీయ నాయకులను లొంగదీసుకుని మాఫియా డాన్‌గా అంచెలంచెలు ఎదిగి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన తీరు గురించి మీడియా ద్వారా మనం తెలుసుకున్నాం. నయీమ్‌ జీవిత కథ ఆధారంగా ఖయీం సినిమా కూడా ఇటీవల విడుదలయింది.

నయీమ్‌ ఒక దశలో ఎం.ఎల్‌.పార్టీ (నక్సలైట్‌) దళంలో చేరతాడు. ఆ దళ నాయకుడు ఒకానొక సందర్భంలో నయీం సోదరిపై అత్యాచారం చేస్తాడు. దళ నాయకుని అక్రమాలపై నయీమ్‌ పైవారికి ఫిర్యాదు చేస్తాడు. పై నాయకులు తమ ‘విశాల’ రాజకీయ ప్రయోజనాలు ఆశించి దళ నాయకునిపై తగు చర్యలు తీసుకోక తాత్సారం చేస్తారు. సహించలేక నయీం, అతని సోదరునితో కలిసి ఆ దళ నాయకుడిని హత్య చేయడమే కాక, పోలీసులకు కోవర్టుగా మారి ఎందరో నాయకుల చావుకు కారణమవుతాడు (సినిమాలో ఉన్నది)

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే…

స్త్రీలపై లైంగిక వేధింపో, అత్యాచారమో జరుగుతుంది. పాతుకుపోయిన మగమదహంకారం ప్రేరణ కావచ్చు. తప్పు చేసిన వారిలో పశ్చాత్తాపం, నిజాయితీ మార్పు (అంగీకారం) తగు స్థాయిలో లేకపోవడం ఒక ఎత్తైతే, క్షమాపణలు అంటూనే తప్పులు కప్పిపుచ్చుకునే వక్రభాషణలను వల్లించడం మరో ఎత్తు.

కాగా వివిధ శాఖల్లో, సంస్థల్లో లేదా రాజకీయ పార్టీల్లో బాధితురాలు న్యాయం కోరినపుడు, ఆ నాయకత్వం (ఎక్కువ మంది పురుషులే ఉంటారు) వారి వారి స్వార్థపూరిత (విశాల) రాజకీయ ప్రయోజనాలను ఆశించి, మగమదహంకారులను శిక్షించడానికి సంకోచిస్తారు లేదా శిక్షంచడంలో వెనకబడతారు. ఆయా రంగాల్లో పనిచేసేవారికి ఇది స్వీయానుభవమే.

కానీ బాధితురాలైన మహిళ ఆమె ఏ స్థాయిలో ఉన్నా (అధికారి/ఉద్యోగి/కార్యకర్త) దక్కవలసిన న్యాయానికి సుదూరంగానే ఉంటుందన్న సత్యాన్ని కాదనలేము.

ఆరోగ్యకరమైన సామాజిక జీవన సంస్కృతిలో రాజకీయాలు భాగమే తప్ప రాజకీయ ప్రయోజనాలను ఆశించి మహిళల హక్కులను కాలరాయడం, వేధించడం, జీవితాలను బలికొనడం చూసీ చూడనట్లు, తప్పు చేసిన మగపుంగవుల పక్షంవైపే నాయకత్వం వ్యవహరించడం ఏ రకమైన ప్రజాస్వామ్య ధర్మం? అనేది సదా అప్రమత్తంగా ఉంటూ మనం గమనిస్తూనే ఉండాలి.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.