వానంటే
తడిసిన మనసు పుట్టలోంచి
జ్ఞాపకాల ఉసిళ్ళు
రెక్కలు రాల్చుకుంటాయి.
వానంటే నేను
కాగితపు పడవ కట్టుకుని
బాల్యపు చెరువులో మునకలేస్తాను
ఈ వానని చూస్తే
డేగిశాలలో బుడుంగు బుడుంగుమంటూ
అర్థరాత్రి నిద్రలేపే
చెమ్మగిల్లిన మా పూరిల్లు గుర్తుకొస్తుంది.
రాత్రంతా మేల్కొని
వాన నీటితో పాటు
మా అసౌకర్యాలను కూడా
బేసిన్లతో ఎత్తిపోసే అమ్మ.
ఏమీ పాలుపోక
మాపై దుప్పటి సరిచేస్తూ
మంచం కుందికట్ట దగ్గర కూచ్చుని
బీడీ ఎలిగించే నాన్న
నా జ్ఞాపకాలతో తచ్చాడుతారు.
వానంటే
మా తడికలబడి మూతేనని
ఆ చిన్ని మనసులో కుశాల కురిసేది.
మంగలంలో ఏయించిన సెనగలు,
దాడీలు, తొండి తగూలాటలు
మా వాన పూటల్ని మోతపుట్టించేవి.
ముసురు పట్టిందంటే
పొయ్యి మీద పిల్లిని లేపటమెట్లా అని
అమ్మ ఓ దిగులు మేఘమైపోయేది.
పనుల్లేని వానాకాలంలో
అమ్మ పుట్టింటోళ్ళు ఇచ్చిన
ఇత్తడి బిందెలు మాయమై
చల్లటి వాన రాత్రి
వేడి వేడి అన్నంలో ఎండు చేపల పులుసుగానో
వేరుసెనగ పచ్చడిగానో మారేవి
అప్పట్లో వాన చినుకులు
ఇంటి తాటాకు సందుల్లోంచి
టప టపా రాలిపడేవి.
ఇప్పుడు వాన
జ్ఞాపకాల చూరు నుంచి
అక్షరాల బొట్లు రాలుస్తుంది