అంబేద్కర్ ఒక సమర భేరి
అణగారిన జాతి కోసం
పిడికిలెత్తిన ఒక ధిక్కార స్వరం
మన సంకెళ్ళు మనమే
ఛేదించుకోవాలని చాటిన
ఒక రణ నినాదం.
తరతరాల వివక్షను తరిమికొట్టడానికి
ఒంటిచేత్తో పోరాడిన యోధుడు
అక్షరాల విలువను లోకానికి బోధించిన బుద్ధుడు
కుల వ్యవస్థలోని కుళ్ళును కడిగేసిన అసమాన్యుడు
రాజ్యాంగమనే కవచాన్ని అందించిన దార్శనికుడు
బడుగుల బతుకు దీపం వెలిగించనీకి
అహర్నిశలు శ్రమించిన శ్రమజీవి
మూతికి ముంత, ముడ్డికి చీపురు
ఊరిచివర గుడిసెల రాతను
మార్చిన సమతావాది
అతను-
వేలమంది జనం
చేసిన పోరాటంలో ఒక్కడు కాదు
కోట్లమంది కోసం
ఒంటరిగా పోరాడిన ఒకే ఒక్కడు.
మనువాదుల ఎదిరించి…
మానవ వాదం వైపు
అడుగువేసిన మానవతావాది.
ఆ నిలువెత్తు ధైర్యం
బహుజనులకు కొండంత అండ.
ఏ అండ లేని కాలంలో
సింహంలా పోరాడిన
ఆ తెగువకు
ఆ మేథస్సుకు
ఆ పోరాట స్ఫూర్తికి
ఆ ముందు చూపుకి
ఆ సంకల్ప బలానికి
సలాములు… వందనాలు
జై భీంలు.